ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు

క్రిస్మసు ఈవి



యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన కుమారుని అనుగ్రహించెనని గలదు. ఈ లోకములో ఎవరివల్లను, ఎవరికి అనుగ్రహింపబడని మహా గొప్ప ఈవిని దేవుడు లోకమునకు అనుగ్రహించెను. ఈ ఈవి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు.


ఇది దైవ గ్రంధములో గొప్ప ముత్యము. అది ప్రశస్త్రమైన మొదటి నక్షత్రమని పిలువబడుచున్నది. సంఖ్యా 24:17. ఇదే క్రైస్తవ మతమునకు పునాది. లోకములోని మనుష్యులకు ఇంతకన్న ప్రశస్తమైన వర్తమానము ఎన్నడును వినిపించబడలేదు. దాదాపు 2000 సంవత్సరముల క్రిందట లోకములో రక్షకుడు నికోదేము అను యూదుల అధికారితో ఈ మాటలు చెప్పెను. అప్పటినుండి నేటివరకు లోకమందంతట ఇది ప్రచురింపబడుచున్నది. ఇది ఘనమైన సత్యము.


ఆయాసముగల హృదయమును బాగుచేయు ఔషదము వంటిది. అధైర్యముగల హృదయమును ఉత్సాహపరచునది వాక్యములోని “దేవుడు తన కుమారుని పంపెను” అను మాటను గూర్చి ముఖ్యముగా ఆలోచించము. దీనిని మనము పూర్తిగా గ్రహించ గలిగినయెడల అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు చెప్ప శక్యముగాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు (||కొరింథీ 9:15) అని బిగ్గరగా సంతోషముతో కేకలు వేయగలము. దేవుడు మనకు ఈవులు (బహుమానములు) అనుగ్రహించుచున్నాడు గాని వాటన్నిటిలో విలువైనది, వర్ణింపలేనిది గొప్ప ఈవి క్రీస్తుయేసే.


స్పర్జన్ దొరగారు ఈలాగు చెప్పెను. ఇతర ఈవులు మనలను ఆశ్చర్యమగ్నులనుగా చేయునుగాని, ఈ ఈవి మనలను దానిలో ముంచివేయుచున్నది. ఈ ఈవిని దేవుడు మనకు అరువుగా గాని, అమ్మివేసిగాని, తిరిగి తీసికొనుటకుగాని ఇవ్వలేదు. మనకు పూర్తిగా ఇచ్చివేసెను. మనకొరకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ క్రిష్ట్మసు దినములలో సాధారణముగా ఒకరికి ఒకరు కానుకలు, బహుమానములు ఇచ్చుట మామూలుగదా? ఇట్టి తరుణములో దేవుడు మనకు ఇచ్చిన బహుమతి లేక ఈవి ఎట్టిదో ఆలోచింతము

చెప్పశక్యముగాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆమెన్.