ప్రభువు తల్లులు

ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు



"ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును" (యెషయా 7:14).

ప్రియులారా! ఇది క్రిష్ట్మసు నెల కనుక పై వాక్యమును ధ్యాన వాక్యముగ గైకొనండి.


వరుస:- తమ్ముడును అన్నయును చాలా కాలమునకు ఒకచోట సమావేశమైనప్పుడు "వీరు నీకేమి కావలెను"? అని అన్న అడిగెను. (=వీరు నీకు ఏమగుదురు?) "వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే" అని యాకోబు ఏశావునకు జవాబు చెప్పెను (ఆది 33:5) తల్లిదండ్రులు దూర ప్రదేశమునుండి ఒక యవ్వనస్తురాలిని తీసికొనివచ్చి కుమారునికి పెండ్లిచేసినయెడల, వారి బంధువులు ఈ అమ్మాయి నాకు ఏమగును? నీకు ఏమగును? అని మాటలాడుకొందురు గదా! ఈమె నాకు చెల్లెలు అని ఒకరు, నాకు అక్క అని మరియొకరు, నాకు చిన్నమ్మ అని ఇంకొకరు చెప్పుకొందురు. అట్లే పెండ్లి కుమారుడు నాకు ఏమగును, అని పెండ్లికుమార్తె స్వజనులు ప్రశ్నించుకొందురు గదా దేవుడు నరుడై పుట్టి క్రీస్తుగా ప్రసిద్ధిలోనికి వచ్చినపుడు ఈయన నాకు ఏమగునని అందురు.అన్ని విధములుగా ప్రశ్నించుకొని యుందురు. ఇట్లు కొత్తవరుసలు కట్టుకొను వాడుక అందరిలోను గలదు. బంధుత్వమును బట్టి ఒక వరుస, పిలుపునుబట్టి మరియొక వరుస. పిలుపునుబట్టి వరుస కట్టుకొనువారు స్నేహభావము గలవారే గాని బంధువులు కారు.అయినను ఆ పిలుపు వరుస స్థిరమైన వరుసయే.


1. తల్లులు:- ప్రభువు తల్లియైన మరియమ్మకు పూర్వమందున్న భక్తురాండ్రు ప్రభువు జన్మించిన వరుసలోనివారే కాబట్టి వారు ప్రభువునకు ఏమగుదురు? పెత్తల్లులగుదురని చెప్పుచున్నాను. యేసుప్రభువు దావీదునకు సొంతకుమారుడు కాకపోయినను, వంశమును బట్టి కుమారుడని బైబిలులో నున్నది (మత్తయి 22:42). కాబట్టి దావీదు ప్రభువునకు తండ్రి వరుసగదా. అట్లే ఆ వరుసలోని భక్తురాండ్రు యేసు ప్రభువునకు తల్లులగుదురు అనుట సరియేగదా! వారెవరో? ఏమగుదురో? కొద్దిగా ఆలోచించవలెను.

2. మరియొక విధమైన వరుసలు:-

3. చదువరులారా! మీరు మీ ఆత్మీయ స్థితినిబట్టి క్రీస్తునకు ఏమగుదురు? క్రీస్తు మీకు ఏమగును? ఇది క్రిష్ట్మసు కాలమందు ఆలోచించవలసిన ఒక ముఖ్యాంశము. ఈ ప్రశ్నకు సరియైన జవాబు చెప్పగలవారే క్రిష్ట్మసు పండుగ సరియైన రీతిగా ఆచరింపగలవారు. కాపరులకు క్రీస్తు రక్షకుడు. కాపరులు క్రీస్తునకు రక్షణ పొందిన రక్షితులు. మీ మాట ఏమి? భక్తురాండ్రు ప్రభువునకు తల్లులు ప్రభువు వారికి కుమారుడు. నిరీక్షణ రక్షకుడు. చదువుచున్న వారలారా! మీ వరుస ఎట్లున్నది?


4. ఆ మొదటనున్న హవ్వ అను స్త్రీ వలన లోకమునకు పాపము వచ్చెను. ఇది గొప్ప అపకీర్తి. ఈ కడనున్న మరియమ్మ అను మరియొక స్త్రీ వలన పాపము పరిహరింపగల రక్షకుడు వచ్చెను. ఇది గొప్పకీర్తి. చదువరులారా! మీ ప్రవర్తన వలన మీకు కీర్తి రాగలదా? ప్రభువునకు ఘనత రాగలదా? ఇతరులకు మంచి మాదిరి కనబడగలదా? ఆలోచించండి.


5. గతకాలమందు రక్షకుని కొరకు ఎదురుచూచిన తల్లులను, జన్మకాలమందు పరిశుద్ధ శిశువును దర్శించిన కాపరులను, దూరమునుండి వచ్చి బాలుని పూజించిన జ్ఞానులను తలంచుకొని మీరెట్లు క్రిష్ట్మస్ ఆచరింతురో! మీ అందరకు క్రీస్తు చరిత్ర భాగ్యము కలుగునుగాక! ధ్యానము వలన మీకు క్రొత్త విషయములు అగుపడునట్లు మీ జ్ఞానమునకు క్రిష్ట్మసు వెలుగు కలుగునుగాక!