Overview

అధ్యాయము 1

ప్రకటన పుస్తకములోని మొదటి అధ్యాయము పుస్తక మంతటికి ప్రవేశ అధ్యాయమై యున్నది. ఈ అధ్యాయములోని సంగతి ఇదివరకే మొదటి శతాబ్ధములోనే జరిగియున్నది. ఈ అధ్యాయము ప్రభువుయొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను కనబరచునది (ప్రకటన 1:13-20). 2,3,అధ్యాయములలోని సంఘములకు కూడ ప్రభువు ప్రత్యక్షము కానై యున్న ప్రత్యక్షతయైయున్నది.

  1. ఎఫెసు సంఘ ప్రత్యక్షత:- ప్రకటన 1:13-16.
  2. స్ముర్ణ ప్రక 1:18
  3. పెర్గెము 1:16
  4. తుయతైర 1:14,15,
  5. సార్ధిస్ 1:20.
  6. ఫిలదెల్పియ 1:18
  7. లవొదికయ 1: 5.

ప్రకటన 2,3 అధ్యాయములు

  1. సంఘములను గూర్చి ఉన్నది. అవి మన కాలములోనివి కావు. అనగా ఆ 7సంఘములు చిన్న ఆసియాలోని 7 పట్టణములు. ప్రకటన 1:11.
  2. వాటిని పోల్చి ప్రకటనలోని 7 సంఘములలోని అనుభవాంతస్థును ప్రభువు యోహానుకు బయలు పరచిరి.

4వ అధ్యాయము

1వ అధ్యాయమునందు పత్మాస్ ద్వీపములో పరవాసియైన యోహాను ఆత్మవశమై ప్రభువుయొక్క మహిమ ప్రత్యక్షతను చూచెను. 2, 3 అధ్యాయములలోని 7 సంఘములయొక్క పరిపూర్ణ వధువు రూపమును చూచెను.

4వ అధ్యాయమునందు పైకి యెక్కి రమ్ము ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనబరచెదనని స్వరము వినబడెను. వెంటనే యోహాను ఆత్మవశుడై పత్మాస్ ద్వీపమునందుంచి పరమునకెక్కిపోయి ప్రభువు కనబరచిన వన్నియు చూచెను. ఇదే ఆత్మసంచారస్థితి.

ప్రకటన 3,4 అధ్యాయములకు మధ్య రేప్చర్ ఇమిడి యున్నది. ఇది బహు మరుగుగా 12వ అధ్యాయ ములో వున్నది. 2,3 అ. ములలో ప్రభువు భూమి మీద సంఘముల మధ్య తిరుగుచున్నట్లున్నది. ( ప్రకటన 1:13) 4వ అధ్యాయములో యేసు ప్రభువు సంఘములతోపాటు పైకి వెళ్ళిపోయెను. అక్కడ ధనస్సువలె కనబడెను. తండ్రి మహిమ సింహాసనమును ఆవరించియున్న ధనస్సు ప్రభువునకు గుర్తు (ప్రకటన 4:3)..

ఆ సింహాసనము యెదుట 7ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు, ఆ సింహాసనము యెదుట గాజు సముద్రముండెను, తరువాత 24 గురుపెద్దలున్నారు. (ప్రకటన4:10) పా. ని. భక్తులు 12 మంది, క్రొ. ని. భక్తులు 12 మంది; మొత్తము 24 గురు. అక్కడ వారికి "24 గురు పెద్దలు" అను క్రొత్త పేరుండును. పా. ని. భక్తులలో ఒక పెద్ద యూదా. ఈ యూదా వరుసలలో తయారైనవారు కోట్ల కొలదిగా నుందురు. అట్లే క్రొ. ని. భక్తులలో పేతురు ఒక పెద్ద. ఈ పేతురు వరుసలో తయారైన కోట్ల కొలదిగా పరమందు వుందురు; ఈ 24 భాగములు కలిసి ఒక సంఘమే. ఆది మొదలు రేప్చర్ వరకు ఉండువారు 2 భాగములు, పా. ని. వారు. క్రొ. ని. వారు (ప్రకటన 1:20) 7 దీప స్తంభములు 7 సంఘములు.

నేను లోకమునకు వెలుగైయున్నాను. మీరును వెలుగై యున్నారని ప్రభువు పలికెను. ప్రభువు లోకమునకు వెలుగై యున్నట్టు ప్రభువుయొక్క సంఘము కూడ లోకమునకు వెలుగై యున్నది. అందుకని సంఘమునకు దీప స్తంభమని పేరు కలిగినది. 24గురు పెద్దలును, 4 జీవులను, సృష్టికర్తయైన దేవుని కీర్తించిన స్థితి యీ అధ్యాయములో చూడగలము.

Home


5వ అధ్యాయము

క్రైస్తవ దేవాలయములలో పక్షి రాజు ఆకారము గల పీఠము ఉండును. దానిపై తెరవబడిన పెద్ద బైబిలు ఉండును. దానిని యెవరును చదువరు ఇంటివద్దనే అందరు చదువుకొందురు. అది గుడిలో గౌరవార్ధమై తెరచి ఉంచెదరు. అలాగుననే పరలోక సింహాసనమునందు తండ్రి కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనము యెదుట ఒక పెద్ద బల్ల ఉన్నది. దాని మీద పెద్దయెత్తున పుస్తక మొకటి ఉన్నది. ఆ పెద్ద సింహాసనమునొద్ద 24గురు పెద్దలు. 4 జీవులు, కోట్లకొలది దూతలు ఉన్నారు. అక్కడ ఉన్న దూత లైనను, భక్తులైనను యీ పుస్తకమును విప్పలేరు. ఈ పుస్తకము పేరు శ్రమల గ్రంథము. దానిలో 21 గదుల వివరమున్నది. మొదటి 7గదులలో ముద్రల శ్రమలు, మరొక 7గదులలో బూరల శ్రమలు, ఇంకొక 7 గదులలో పాత్రల శ్రమలు ఉన్నవి. ఇవి ఒక శ్రమను మించి ఇంకొక శ్రమ ఉండును.

ప్రభువువచ్చిఆపుస్తకమునువిప్పెదరు. అప్పుడు 4 జీవులు, 24గురు పెద్దలు ,కోట్లకొలది ఉన్నదూతలు పరమందు భూమియందు భూమిక్రింద సముద్రములో ఉన్న ప్రతిసృష్టము యీ గొఱ్రెపిల్లకే స్తోత్రము, మహిమ ఘనత, ప్రభావము, యుగయుగములు కలుగునుగాక! అని స్తోత్రించిరి.

Home


6వ అధ్యాయము

ద్వీతీయారోహణము:- 3, 4 అధ్యాయముల మధ్య మొదటి ఆరోహణము, 6వ అ. ప్రారంభమందు ద్వీతీయారోహణమును గలదు. ప్రభువు పెండ్లి కుమార్తె సంఘమును తీసికొని వెళ్ళి నూతన యెరూషలేములోపెట్టి మిగతా వారికొరకు భూమి మీదికి వచ్చును. పరలోకమునకు పెండ్లికుమార్తెను తీసికొనివెళ్ళిన జయమును సూచించుటకు ఆయన తెల్లగుఱ్ఱము మీద వచ్చును. ఆయన చేతిలోని విల్లుకు అంబు ఉండదు. అనేకులు ఆయనను వెంబడింతురు గనుక వారి నందరిని వారికి తగిన మహిమ శరీరముతో తీసి కొనివెళ్ళి పరలోకములో ఎక్కడో ఒకచోట పెట్టును. వారికి మరణముండదు; ఇదివారికి ఆశ్రయ స్థానము . ఉదా:- మత్తయి 25:1-13 లో నున్న బుద్ది గల 5గురు కన్యకలు పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళిరి 5గురు మిగిలిపోయిరి. వీరు పైవారితో సమానమైనను కొంచెము ఆలస్యమును బట్టి బుద్ధిగలవారితో వెళ్ళలేకపోయిరి. వీరికొరకు ప్రభువు తెల్లని గుఱ్ఱముపై వచ్చినట్లున్నది. ఈ సంగతి శ్రమకాలము ఆరంభించుననగా జరుగును.

పెండ్లికుమార్తె సంఘములోనివారుమిక్కిలి మహిమస్థితిలో నుందురు. వీరెంత రక్షింపబడినను యీ గుంపువారు పెండ్లికుమార్తె అంతస్థుకు వెళ్ళలేరు. అది పక్షపాతముకాదు ఒకవేళ పెండ్లికుమార్తె ఉన్న స్థలమునకు వీరినితీసికొని వెళ్ళిననుఅక్కడి మహిమను వీరు సహింపలేరు.

ఆ మహిమను చూడలేని బాధతో తప్పించుకొని తిరిగివచ్చి వేతురు ఎంత సహింపగలరో అంత మహిమలోనే ఉంచెదరు, మహోన్నత మహిమగల స్థలములోనున్న ఆ పెండ్లి కుమార్తె సంఘము నొద్దకు త్రిత్వము తప్ప మరెవ్వరు వెళ్ళలేరు. మనమును ధాన్యములో నుండి సిద్దపడిన ఆరోహణమై అట్టి స్థలమునకు చేరగలము. పెండ్లికుమార్తె సంఘము మిగతా రక్షణ అంతస్థు గల వారియొద్దకు వచ్చునప్పుడు ముసుగు వేసికొని వచ్చును. ఎందుకుపెండ్లికుమార్తె యొక్క మహిమ యితరస్థితి గలవారు చూడలేరు. మోషే కొండమీద నున్న దైవ సన్నిధినుండి దిగివచ్చినపుడుఇశ్రాయేలీయులలో యెవరును ఆయన ముఖమును చూడలేకపోయిరి. అందువల్ల మోషే తన ముఖము మీద ముసుగు వేసికొనెను. (నిర్గమ 34:29 - 35) రాకడలో సంఘము వెళ్ళిన తరువాత మిగిలియున్న 21 గదులలోని వారికి గొప్ప శ్రమలు వచ్చును. వీరు శ్రమ పడుట పెండ్లికుమార్తెకు తెలియకుండ తండ్రి మరుగు చేసిరి. 7సం. ల పెండ్లి విందులోవారున్నారు గనుక యీ శ్రమ పెండ్లికుమార్తెకు తెలిసిన యెడల విందును ఆరగింపలేరు. గనుక తెలియనియ్యరు. మరియు వారికినెమ్మది ఉండదనియు తెలియజేయరు.

ఉదా:- ప్రపంచమునకు తల్లివంటి విక్టోరియా మహారాణిగారు ఇంగ్లాండులో మరణావస్థలో నున్నారని అయ్యగారు వార్త వినగానే ప్రార్ధించి యేమివార్త వచ్చునో అని కనిపెట్టుచుండిరి.

తీరా అయ్యగారు భోజనము చేయుచున్నప్పుడు వారి సహోదరుడు వచ్చి విక్టోరియా మహారాణిగారుచనిపోయినందున మా కాలేజీకి సెలవిచ్చిరని చెప్పెను . ఆ వార్త విని భోజనము చేయలేక అయ్యగారు భోజనము వద్దనుండి లేచిపోయిరి.

Home


7వ అధ్యాయము కృపాధ్యాయము

శ్రమలో ముద్రింపబడినవారు ఈ 6 ముద్రల కాలములో ముద్రింప బడిన వారికి దాసుని పేరు (రాకడలో వెళ్ళినవారు కుమారులు), వీరు శ్రమ కాలమందు మార్పునొంది రక్షణ నొందినవారు. వారికి కిరీటములుండవు. నూతన యెరూషలేము ఆవరణములో సేవ చేయుదురు. లోపలి మహిమను చూడలేరు, భక్తుల హృదయము లందలి దైవ మహిమ వారి నొసళ్ళ మీద ప్రకాశించును. ఇదే ముద్ర. ముద్ర హక్కునకు గుర్తు (ఎఫెసి 1:13) (అంతిక్రీస్తు కూడ తన వర్తకమునకును తన సంఘమునకును సంబంధించిన ముద్ర వేయును ) ముద్రింపబడిన యూదులు 144 వేల మంది, కోటాను కోట్ల అన్యులు రక్షణ పొందిరి. యూదులు రక్షింపబడుట యోహానుకు ఆనందము. ఈ గోత్రములును లెక్కించుట ఇక్కడజన్మమునుబట్టి కాక యోగ్యతనుబట్టి యేర్పడెను. ఈ 12 గోత్రములలోను దాని పేరులేదు. అది విగ్రహారాధన గోత్రమై యున్నది.

తెల్లని వస్త్రములు రక్షణకు గుర్తు. ఖర్జూరపు మట్టలు. వీరు అంతిక్రీస్తును గెలిచిన జయమునకు గుర్తు. వీరు శ్రమనుండి విడుదల పొందిన స్తోత్ర గీత మొకటి పాడుదురు.

Home


8వ అధ్యాయము

7వ ముద్రలో 1|2గంట నిశ్శబ్దము.

  1. ఈ నిశ్శబ్దము శిక్షను ఆపుచేసి సింహాసనముపై కూర్చుండుటకు గుర్తు.
  2. క్రొత్త శ్రమ ఆరంభించకముందు రక్షణ గలవారిని పోగు చేయుటకు
  3. మిగతా వారికై ప్రార్ధన చేయుట కొరకు
  4. స్వల్పశిక్షకు మారక కఠిన శిక్షకు వెళ్ళువాఠిని గుణపరచి మార్చుటకు యీ అరగంట నిశ్శబ్దము .
యోహాను శ్రమలన్నియు ఒక్కమారే చూడలేడు గనుక అభిప్రాయమును మార్చుటకు 7వ అధ్యాయము లోని రక్షణ జాబితను చూపించెను.

7గురు దేవదూతలు 7బూరలూదుట, వేరొకదూత బలిపీఠము నొద్దనున్నదూత. ఈ దూత క్రీస్తు ప్రభువే. ఈయనకు యెహోవాదూత అని పేరు గలదు. ఈయన ప్రజలందరి కొరకు బలియై మరణమును జయించి పరమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నిత్య విజ్ఞాపన చేయుచుండెను. అందుకే లోకాదినుండి పరిశుద్ధులు చేయు ప్రార్ధనలన్నియు యీయనే అందుకొనును. గనుకనే ధూపార్తిని చేతపట్టుకొని యుండెను.

Home


9వ అధ్యాయము

5వ దూత బూర ఊదినప్పుడు మొదటి శ్రమ అనగా పాతాళమునుండి దయ్యములు వచ్చెను. వాటికి తేళ్ళకు బలమున్నట్లు బలముండెను. ఇవి కుట్టిన 5 మాసముల వరకు బాధ ఉండును. గాని మరణముండదు. 6వ బూర రెండవ శ్రమ, బంధింపబడిన నాలుగు దయ్యములు విడిపింపబడుట. దేవునిని త్రుణీకరించి దయ్యములనే పూజించిన వారికి, సాతానును ఆనుకొన్న వారికి దయ్యములవల్ల శిక్ష (మొదటి రెండు శ్రమలు) దేవుని ముద్రగల సృష్టికిగాని, ఏ మొక్కకుగాని, గడ్డికైనను శ్రమ లేదు. దేవుని ముద్రలేని వారికే యీ శ్రమలు.

Home


10వ అధ్యాయము

బలిష్టుడైన వేరొకదూత - క్రీస్తు ప్రభువే. ముద్రల, బూరల, శ్రమలు అవిశ్వాసులకును, పాత్రల శ్రమలు అంతిక్రీస్తునకును యెప్పటికిని మారు మనసు పొందని వారికిని కలుగును. 7వ బూర చివర కృపాకాలాంతమున వచ్చును. ఈ శ్రమ చూచిన యోహాను భరించ లేడనియు, చనిపోవుననియు ప్రభువు యెరిగి యోహానుకు నెమ్మది, ధైర్యము, సంతోషము, కలుగజేయుటకు బలిష్టుడైన దూతగా క్రీస్తుప్రభువు దిగివచ్చెనని వ్రాయబడెను.

మహిమ మేఘము మీద రాజఠీవితో వచ్చెను. ఈ దూత క్రీస్తు ప్రభువే. చిన్న పుస్తకము మిగత శ్రమలున్న పుస్తకము. తినుట అర్ధము తెలిసికొనుట. ధ్యానమునకు తీపి, నెరవేర్పుకు చేదు. (యెహెజ్కేలు 2 అధ్యా. ( ప్రకటన 10:11) ప్రకటన అనేక భాషలలోనికి ప్రచురమైన వాటిని చూచుటకును, శ్రమకాలములో జరుగు సంగతులను చూచుటకును, యోహాను మరల ప్రవచించుటకును వచ్చును.

Home


11వ అధ్యాయము

11వ అధ్యాయములోని సంగతులు జరుగు వరకు యేమియు వ్రాయవద్దని యోహానుకు ఆజ్ఞ ఆయెను.

  • పరలోక ఆలయము:- (ప్రకటన 11: 1-12) పరలోక సాక్షులను పంపి సువార్త చెప్పుటలో నరులకు మరొక కృపాసమయమిచ్చు చున్నారు. సాక్షులిచ్చు వార్త ఆ చిన్న పుస్తకములో నున్నది. (ప్రకటన 9:20-21) లోని ప్రజలవంటి కఠినులకు ఇంకొక కృపాసమయమును ఇచ్చుచున్నారు.

  • ఆలయ బలిపీఠము - ఆవరణము:- ఇవి పరలోకమునుండి వచ్చినవి. యూదుల మతములోనివి కావు.

  • కొలత:- విశ్వాసమునుబట్టి అన్యులమైనను యూదులమే. విశ్వాసమునుబట్టి యూదులైనను, అన్యులైనను, విశ్వాసులే. అంతిక్రీస్తు శిష్యులు విశ్వాసులను హింసింతురు. అనేకమంది యూదులు అంతిక్రీస్తుతో ఒడంబడిక చేసికొని అతని శిష్యులైరి. క్రీస్తును నిరాకరింతురు గనుక వారు అన్యులు కారా? (గలతీ 6: 16, రోమా 11:27).

  • కొలకఱ్ఱ:- విశ్వాసుల సంఖ్యను కనుగొను శక్తికిని, అధికారమునకు గుర్తు. (యోహాను 1: 47)

  • ఆలయము :- రాళ్ళతో కట్టబడినది కాదు. విశ్వాసుల సంఘమునకు గుర్తు.

  • బలిపీఠము:- విశ్వాసుల సమర్పణకు గుర్తు. 42 నెలలు అనగా అవిశ్వాసులు యెప్పటినుండి ఎప్పటివరకు ఉందురో ఆ సమయము. (దానియేలు 2:31-45;7:3-27;లూకా 21:24)

  • అన్యులకాలము:- నెబుకద్నేజరుతో ఆరంభించి అంతిక్రీస్తుతో అంతమగును. రోమా, 11:25 లోని అన్యుల సంపూర్ణకాలము ఇదికాదు. అన్యులు క్రీస్తును అంగీకరించుకాలము 42 నెలలు, అనగా 3 1|2 సం. లు. (దానియేలు 9:27)

  • ఇద్దరు సాక్షులు:- వీరు రెండు ఒలీవచెట్లు, రెండు దీప స్తంభములు (జెకర్యా 4:3-12) మోషే పెండ్లికుమార్తె సంఘములో మృతులగుంపుకు ముంగుర్తు. ఏలియా సజీవుల గుంపుకు ముంగుర్తు. వీరు 7సం. ల శ్రమకాలములో వచ్చి క్రీస్తుపక్షముగా మట్లాడి ప్రజలను హెచ్చరింతురు. యోహాను కూడ వచ్చును. ఈ కడవరి గుంపును ప్రభువు తట్టు త్రిప్పగల సువార్త పని యెంత గొప్పపని? వీరిలో నీవు ఉందువా?

  • ఒలీవా:- యూదులు+అన్యులు. పెండ్లికుమార్తెలో మహోన్నత వాసులు సాక్షులుగా వత్తురు. తక్కినవారు భయపడుదురు. సాక్ష్యశక్తి పరిశుద్దాత్మ వలన కలుగును. ఫరో, ఆహాబు గుణములు అంతిక్రీస్తులో నుండును.

  • గోనెబట్ట:- నాటి దుస్థితికి సూచన. పాతాళమృగము చంపును. వారు చావలేదు. పరవశులైరి.

Home


12వ అధ్యాయము

క్రైస్తవ సంఘమునకు ముగ్గురు బిడ్డలు. (ప్రకటన 12వ అధ్యాయము).

  • మొదటిబిడ్డ:- యీ మగ శిశువే, అనగా రాకడలో కొనిపోబడినవారు. (ప్రక 12:5)

  • రెండవ బిడ్డ:- మిగిలినవారు అనగా ముద్రల శ్రమలకు విడిచిపెట్టబడిన నామక క్రైస్తవులు. వీరిని మిఖాయేలు చేత పడద్రోయబడిన ఘటసర్పము, దాని అనుచరులు హింసింతురు, మారు మనసు పొందిన అనేకులు ఎత్తబడి యెక్కువ మహిమలేని చోటయిన అరణ్యములో చివర కఠినమైన 3 1|2 సం. ములు పోషింపబడి శ్రమ తప్పించుకొనును. ఈ కాల మృతులగు భక్తులకు మొదటి పునరుత్థానములో పాలు కలదు. (ప్రక 12:6)

  • మూడవబిడ్డ:- బూరల శ్రమలలోను, పాత్రల శ్రమలలో నున్న మహా కఠినులు. విశ్వాసులైనను వుండిపోవుదురు. సాతాను వీరిని హింసించును. మృతులగు భక్తులకు మొదటి పునరుత్థానములో పాలు కలదు. ( యోహాను 5:29, దాని 12:21 అ. కార్య 24:15)

దాగోను- సాతాను:- (యెషయ 14:12 యెహెజ్కేలు 28 అ. అఫెసి 6:12). ప్రధాన దూతయైన లూసిఫర్ దేవుని నెదిరించి సాతానుగా మారిపోయినది. నరుడు సాతానుకు లోబడని యెడల సాతానును ఇదివరకే అగ్ని హోత్రములో పడవేసి యుండును. అతడు ఆత్మరూపి గనుక దేవునితో సంభషింప గలడు. ఎప్పుడును నరుల మీద నేరములు మోపుచుండును. అది తండ్రికి యెంతో విచారము. అతడిప్పుడు (పరలోకములో) లేడు. (ఎఫెసి 2:2: 6: 12) ప్రకారము వాయు మండల లోకములో నున్నాడు. రాకడప్పుడు భూమిమీదికి పడద్రోయబడును అని అతనికి తెలియును. ఇతడు దుష్టుల జోలికిపోడు. మనము సిలువక్రిందనున్నచో అతని బాణములు మనకు తగలవు. అతడు యెదో ఒక రూపమును ధరించుకొని లోకమునకు కనబడగోరును. అతడు కోటానుకోట్ల దయ్యములను పంపి నరులను చెడగొట్టును. (సౌలు, యూదాలలో) ఒకనిలో దయ్యములు ప్రవేశింపలేదా ? (లూకా 8:28-30) మన సహాయము నిమిత్తమై తండ్రి అంతకంటే యెక్కువమంది దూతలును పంపును. (కీర్తన 34:7) అతడు యెఱ్ఱని వాడని ఉన్నది అనగా నరహంతకుడు, అతని దూతలకు నక్షత్రములను బిరుదు కూడ కలదు. (ప్రకటన12:4) పరలోక వాస్తవ్యులు క్రీస్తు ప్రభువునకు గొప్ప జయకీర్తన పాడిరి. ప్రకటన 7:12) దాగోను రెండవ శిశువును చంపజూచెను. గాని ఆ శిశువు యెహెజ్కేలు, ఏలియా, ఫిలిప్పులవలె అరణ్యములోనికి యెగిరి వెళ్ళినది. ఆ శిశువు మీద దాగోను దూషణ శాపములు, గర్జనలు అను ప్రవాహమును వెళ్ళగ్రక్కెను గాని అవి శిశువునకు తగులలేదు. (ప్రక 12:15).

Home


13వ అధ్యాయము

క్రూరమృగము-అంతిక్రీస్తు:(ప్రకటన 13:1-10) ప్రకటన 9వ అద్యాయములో అపొల్లోను, అబద్దోను వలె ఇతడును సాతానుయొక్క గొప్ప ఉధ్యోగి. ఇతనికి సర్వత్ర అధికారముండును. సాతాను యొక్క అవతార మనుష్యుడని అనవచ్చును. ఇతడు వచ్చునప్పుడు పెండ్లికుమార్తె ఉండదు. అంతిక్రీస్తు అనగా క్రీస్తు విరోధి రాకకుముందు అనేక మంది చిన్న చిన్న అంతి క్రీస్తులు వచ్చియున్నారు. క్రీస్తును తండ్రిని నిరాకరించువారే ఆమృగము. (అంతిక్రీస్తుసముద్రములోనుండి వచ్చును) అనగా పాతాళము గొయ్యి. ఇక్కడ దురాత్మల ఖైదు. ఇక్కడనుండి అపొల్లోను, అబద్దోను వచ్చిరి.

అంతి క్రీస్తు కూడ ఇక్కడనుండే వచ్చెను. ఇతడు మృగ గుణమువంటి గుణము గలవాడు. అద్భుతకరుడు, మహాసౌందర్యవంతుడు. గొప్ప ఉపాయశాలి. గొప్ప ప్రసంగి, మంత్ర శక్తి గలవాడు. శాస్త్రము లెరిగినవాడు, కోటశ్వరుడు, బహుక్రూరుడు, రాజ్యతంత్ర ప్రవీణుడు. దయ్యములను కలుగజేయువాడు. అతడు యూదులకు అనత్య వాగ్ధానములను చేసి ఒక నిబంధన యేర్పాటుచేసి (దానియేలు 9:27) తుదకు దానిని కొట్టి వేయును. అతనికి 7 శిరస్సులు అనగా అతని పనిలో తోడ్పడునట్టి 7 సమాజములుండును. దాగోను, అబద్ధ ప్రవక్త; వీరు అతనికి సహాయకులు. అతని 10 కొమ్ములనగా 10 మంది రాజులు. అతనికి దెబ్బ తగిలి మానును, అనగా తన సహాయకులు కొంతమంది క్రీస్తుతట్టు తిరిగుదురు ఇదే దెబ్బ వీరికి బదులుగా కొంతమంది చేరుకొందురు. ఇదే గాయము మానుట.

  • అషూరు = సిం హము.
  • పారశీకము = ఎలుగుబంటు.
  • గ్రీకుదేశము = చిరుతపులి.
  • రోమా = భీకరమృగము,
వీటి గుణము లన్నియు అతనిలో నుండును (దానియేలు7అధ్యా. ) అంతిక్రీస్తు యెలుగుబంటువలె బాహాటముగా మీదపడును . అతడు పండుగ కాలములను, న్యాయపద్ధతులను నివారణ చేయబూనుకొనును. (దానియేలు7:25) ఇతడు ధర్మవిరోధి. పాపపురుషుడు, తానే దేవుడననిచెప్పుకొనువాడు, నాశనపాత్రుడు (2థెస్సలో 2: 4) అతని ముద్ర 666, అతని సంబంధికులు ఇప్పటికి చాలమంది లేచిరి.

మరియొక కౄరమృగము :- (అబద్ధ ప్రవక్త) ప్రకటన 13:11.

ఇతడు భూమిలోనుండి వచ్చును. రెండుకొమ్ములు, మహాబలము గలవాడు. అంతిక్రీస్తు పనిని వృద్ధిచేయువాడు. అంతిక్రీస్తు లోకరాజ్యాధికారి. అబద్ధ ప్రవక్త మత సంఘాధికారి. అబద్ధ సంఘమొకటి యేర్పడును. దానికే వేశ్య అని పేరు. ఇతడు గొఱ్రెపిల్లవలె కనబడును గాని లోపల తోడేలు (మత్తయి 7:15-16) మాయమాటలాడి ప్రజలకు నచ్చచెప్పుటలో వరపుత్రుడు (1 యోహాను 4:1) ఇతడు దేవుని దూషించును. అంతిక్రీస్తును పొగడుచుండును. పరిశుద్దాత్మ క్రీస్తును గూర్చి యెట్లు వివరించుచుండునో అట్లే ఇతడు అంతి క్రీస్తును గూర్చి తెలుపును. క్రైస్తవ సంఘము యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వమును నిరర్ధకము చేయుటకై చీకటి సంఘము అనగా వేశ్య; సాతాను, అంతిక్రీస్తు, అబద్ధ ప్రవక్తను కలిగి యున్నది. క్రీస్తు ప్రభువువలెనే అంతిక్రీస్తును మీ నిమిత్తమై గాయపడి శ్రమ పడినాడు గనుక ఆయనకు మ్రొక్కండి అని అతడు ప్రజలకు బోధించి నమ్మింపజేయును. అగ్ని కురిపించుట, అంతిక్రీస్తు ప్రతిమను మాట్లాడునట్లు చేయుట. యీ అద్భుతములు ఇతడు చేసి చూపును. వీనిని ఆరాధించుటకు ఒక దినమమును అతడే యేర్పాటు చేయును. క్రైస్తవులు, అన్యులు దానిని మ్రొక్కుదురు మ్రొక్కనివారు చంపబడుదురు.

హేయమైనది:- (దానియేలు 9:27; 11:3; 12:11 మత్తయి 24:15). ఈ విగ్రహారాధనయే హేయమైన వస్తువులు, మృగము అక్కడ వుండును.

Home


14వ అధ్యాయము

గొఱ్రె పిల్ల పరిశుద్ధులు:-
శ్రమ కాలములో దేవుని ముద్ర గలిగి (ప్రక 7:3) రక్షింపబడిన 144 వేలమంది యూదులు. శ్రమలనుండి విముక్తి నొందినందున

  1. సింహాసనము యెదుటను,
  2. నాలుగు జీవుల యెదుటను,
  3. పెద్దల యెదుటను, క్రొత్త విమోచన కీర్తన పాడుదురు. (ప్రక14:1-5)

(7:4-8) వీరు స్త్రీ సాంగత్యము యెరుగనివారు. (ప్రక 14:4) అనగా బబులోను అను అంతిక్రీస్తు సంఘములో చేరనివారు. కనుక హృదయస్థితిని బట్టి కన్యక అనియు, స్నేహితుడనియు, విధేయులగు సేవకులనియు పేరు గలదు.

(యోహాను 15:15) కొనబడినవారు శ్రమకాలములోని ప్రధమ ఫలము, క్రొత్తకీర్తన పాడినవారు, అబద్దము లేనివారు, అనింద్యులు, ముద్రలు ధరించినవారు. గొఱ్ఱెపిల్ల వెళ్ళుచోటికే వెళ్ళువారు.

Home


15వ అధ్యాయము

7గురు దూతలు 7పాత్రలు చేత పట్టుకొనియున్నారు. 4వ బూరలో చూచిన దూతలు అయ్యో అన్నారు గాని ఈ అధ్యాయములో సృష్టి ఇంక తిరగదు అని ఉగ్రత చూపవలెనని అనుచున్నారు. ఇది వరకు ప్రకటన 6:17 లో గొఱ్ఱెపిల్ల ఉగ్రత అని ఉన్నది. గాని యీ అధ్యాయములో దేవుని ఉగ్రత ఉన్నది. (ప్రక 15:7) పాత్రలు మృగముమీదికిని అంతి క్రీస్తు ముద్రగల వారికిని యేర్పడినవి. స్ఫటికమువంటి సముద్రము యీ అధ్యాయములో నున్నది. (ప్రక 15:2) గాజుసముద్రము (ప్రక 4:6)లో పరలోక కార్యక్రమ మంతయు కనబడును.

ఈ అధ్యాయములో అగ్నితో కలిసియున్న స్ఫటిక సముద్రమున్నదని వున్నది. సముద్రములో అగ్ని వుండదు. పరలోకములో అసలే వుండదు. ఆ సముద్రము దగ్గరనుండి తెగుళ్ళు వచ్చెను. పాత్రల కాలములో మార్పుపొంది ప్రభువునే పూజించినవారిని అంతిక్రీస్తు నరికివేసెను. వారి ఆత్మలు స్ఫటిక సముద్రమునొద్ద నిలువబడినవని వ్రాయబడినది. వీరు భూలోకములో అగ్నివంటి శ్రమలు అనుభవించి వచ్చినారు గనుక సముద్రము అగ్నితో నిండినట్లు కనబడెను. వీరు

  1. అంతిక్రీస్తును,
  2. శ్రమలను,
  3. ప్రతిమను,
  4. అంకెను (666) జయించిరి.
వీరు మోషే కీర్తన (నిర్గమ 15 అధ్యాయము) గొఱ్ఱెపిల్ల కీర్తన (ప్రక 15:4) పాడుచున్నారు. వీరు పరలోకమునకువెళ్ళి ఇట్లు ఘనపరచిరి. (ప్రక 15:3,4) వీరు నిలువబడిరి. వీరికి కూర్చుండు హక్కులేదు. వీరు సేవకులు. వీరు అగ్నిలో పుటము వేయబడిరి గనుక అగ్నికళ వచ్చును. గాజు అనగా వీరి మహిమను భూమిమీదకు ప్రకాశింపజేయుము.

Home


16వ అధ్యాయము

అంతిక్రీస్తు ముద్రగలవారికి, ప్రతిమకు నమస్కారము చేయువారికి 7గురు దూతలు పాత్రలు పట్టుకొని ఆజ్ఞరాగానే కుమ్మరించుటకు నిలువబడి యున్నారు. మొదటిదూత భూమిపై కుమ్మరించెను రెండవదూత సముద్రముపై కుమ్మరించెను. మూడవదూత నదులు, జలధారలపై కుమ్మరించెను. నాలుగవదూత సూర్యునిపై కుమ్మరించెను. ఐదవ దూత అంతిక్రీస్తు సింహాసనముపై కుమ్మరించెను. ఆరవ దూత ఫరాతు నదిపై కుమ్మరించెను. ఏడవ దూత వాయువుపై కుమ్మరించెను. సాతాను వాయుమండలాధికారి ఈ కాలములో ఎక్కువ యుద్ధములు వాయుమండలములో జరుగును.

ఇక్కడనున్న దురాత్మల సమూహము పాఠము నేర్చుకొనవలెను. మనము పాపము చేయించిన నరులకే యిన్ని శ్రమలు దేవుడు రానిచ్చిన మనకు రానిస్తారని గ్రహించుటకు, దేవుడు న్యాయస్థుడు గనుక తన శిక్షలు నరుల యెడల, సైతాను సైన్యము యెడల, క్రమముగా రానిచ్చును. గనుక యీ పాఠములను బట్టి చూడగా నరుడు దేవుని సలహాలు వినకపోతే క్రమక్రమముగా దయ్యములవలె నగుదురు. గనుక మనము జాగ్రత్తగా నుండవలెను. ప్రక(16:17) తండ్రి సమాప్తమని పలికెను. సిలువపైకి చూడండి.

  1. దుష్టత్వమునకు సమాప్తము
  2. కాలము సమాప్తము.
  3. అయ్యో అను అర్ధమునకు,
  4. సాతాను తెచ్చిన సిలువకు సమాప్తము. తండ్రి వెలుగు కలుగును గాక అని పలికిన మాట మొదలుకొని తండ్రి ఇక్కడ సమాప్తము అని పలికిన పలుకుతో కాలము సమాప్తమాయెను.

Home


17వ అధ్యాయము

మర్మమగు బాబెలు :- బాబెలు అనగా వేశ్య. దేవుని వ్యతిరేకించిన సమాజము. క్రైస్తవమతములో పెండ్లి కుమార్తె యెట్లున్నదో అట్లే అన్యమతములలోనున్న సమాజమును వేశ్య అనిరి. మృగమునకు మందు యిదే కూలిపోవును. ఈ వేశ్య జలముమీద కూర్చున్నది. మృగమునకు 7తలలు అంతిక్రీస్తు పాలనలో యేడురాజ్యములు వుండును. 7 తలలు 7 రాజ్యములకు గుర్తు. 7కొండలు 7 రాజ్యములు. అవన్నియు దేవునికి విరోధముగా ఏకీభవించి క్రీస్తును ద్వేషింతురు. ఇతర మతములలోని వారు, క్రైస్తవమతములోని భక్తి హీనులును యీ వేశ్య. వీరికే స్త్రీ అనియు, వేశ్య అనియు వేశ్యజనమనియు, వేశ్యపట్టణమనియు అందురు.

Home


18వ అధ్యాయము

బాబెలు కూలిపోయెను:- ఈ అధ్యాయములో దూత తెలియజేయు సంగతి మిక్కిలి గంభీరమైనది. గనుక గొప్ప అధికారములోనికి వచ్చెను. దూత అనగా క్రీస్తే. ఆయనకు మహిమ చేత భూమి మిక్కిలి ప్రకాశించెను. బాబెలు ఇరాక్ లోని పట్టణము కాదు, దేవుని మరచి సృష్టిలోగల వస్తువులను మన్నన చేసి పూజించు లౌకిక ఆత్మల లోకమే బాబెలు. మానవులు అపవాది మాట వినుచున్నందున భూమి దయ్యములకు కాపురస్థలమాయెను.

మారుమనసు పొందని ప్రజలను, దయ్యములను పూజించుచున్న ప్రజలను, దేవుడు నా ప్రజలారా అని పిలుచుచున్నారు. ఇది తండ్రియొక్క గాఢమైన ప్రేమను సూచించుచున్నమాట. బాబెలు పాపములు ఆకాశమున కంటుచున్నవని వ్రాయబడినది. సొదొమ పట్టణ పాపపు మొఱ్ఱ హేబేలు రక్త స్వరము మొఱ పెట్టినట్లు, మనము చదువుచున్నాముగదా! యీ మాటకూడ అట్టిదే.

Home


19వ అధ్యాయము

గొఱ్ఱెపిల్ల వివాహము:- హర్మెగెద్దోను యుద్దమునకు ముందు గొఱ్ఱెపిల్ల వివాహము జరుగును. వివాహమనగా ఆక్షేపణలేనిది. లోక సంబంధ మైనది కాదు. దేవుని ముఖాముఖిగా చూచుట. గొప్ప సహవాసము కలిగి యుండుట. అనగా ప్రభువును, సంఘమును, నిత్యయేకత్వము మరియు ప్రభువు సంపాదించిన సమస్తమును సంఘము అనుభవించుట.

  • విందు:-
    1. ప్రభువుయొక్క మహిమ లక్షణములను అనుభవించుటే పెండ్లి విందు
    2. స్తుతి విందు.
    రక్షణపొందువారు క్షణములోనే రక్షణ పొందుదురు. గాని సంపూర్ణ పరిశుద్ధత పొందుటకు చాల కాలము పట్టును. ప్రభువు వచ్చువరకు పొందుచునే వుండవలెను. రక్షింపబడిన వారందరు పెండ్లి కుమార్తెగా మారలేరు.

  • వస్త్రము:- ఆదాము హవ్వలు మహిమ స్థితిలో నున్నప్పుడు వస్త్రములు అవసరము లేకపొయెను మహిమయే వారికి వస్త్రముగా నుండెను. మన వస్త్రము శరీరమును కప్పును.అయితేమహిమవస్త్రముదేవుని పరిశుద్ధతను బయలు పరచును ఎవరి నిమిత్తము పెండ్లి కుమార్తె ప్రార్ధించెనో వారే పెండ్లి కుమార్తెవిందునకు పిలువబడుదురు. పెండ్లి వలన పెండ్లికుమారుడు క్రీస్తు ప్రభువే. (ఎఫెసి 5:25-27)

  • treatlice
  • హెర్మెగెద్దోను యుద్ధము:- (ప్రకటన16:12-16; 19:19-21)

  • యుద్ధ స్థలము:- హెర్మెగెద్ధోను అనగా మెగిద్దో. ఇది గలిలయలో మనస్సే గోత్రములోని ఒక పర్వత ప్రాంతము ఇది 12 మైళ్ళ విశాలము గల ఒక మైదానము. పాలస్తీనాలోని పూర్వకాల యుద్ధభూమి సర్వరాష్ట్రముల యుద్ధవీరులను ఇక్కడ తమడేరాలను వేసుకొనిరి. నేడు యెవరును యీ జాగా వాడుటలేదు (దైవ సంకల్పన)

  • యుద్ధము :- అంతిక్రీస్తునకును, అతని సైన్యమునకును క్రీస్తుతో జరుగును. అతని సైన్యమును చూడగానే విశ్వాసులు ఒకచోట కూడుకొని తండ్రి సహాయము నిమిత్తము ప్రార్ధింతురు. వెంటనే ఒక భూకంపము కలిగి (ప్రకటన 17:18) పట్టణము మూడు భాగములై పోవును. లోయగా యేర్పడినచోట విశ్వాసులకు ఆశ్రయమగును. (జెకర్యా 14:4) క్రీస్తు సైన్యము పరలోకము నుండి వచ్చుట అంతిక్రీస్తు సైన్యము చూడగానే గజగజ వణికిపోవును. ఆయుధములు నేలను పడిపోవును. ప్రభువు నోటనున్న ఆయుధము నరుల సర్వాయుధములకన్న యెక్కువ వాడి గలది. అంతిక్రీస్తును, అబద్ధ ప్రవక్తను వట్టి అగ్నిగుండములో పడవేసెను. సైన్యమును హతము చేసెను, దాగోనును బంధించెను. అతని తీర్పు ముందున్నది. పక్షులు వారి శవములను తినును ప్రభువు అంధకారబంధులను నాశనముచేసి ప్రభువు నాశ్రయించిన నరులను రక్షించును.

  • ప్రభువు యెదిరించు వారెవరనగా: రాజులు, సహస్రాధిపతులు, బలిష్టులు, గుఱ్ఱముల నెక్కువారు, స్వతంత్రులు, దాసులు, అల్పులు, గొప్పవారు వీరే 6వ ముద్రకాలమందు గుహలలో దాగుకొన్నవారు. (ప్రకటన 6:15-17)

Home


20వ అధ్యాయము

సైతానును:-

హర్మెగెద్దోను యుద్ధములో క్రీస్తుప్రభువు, అంతి క్రీస్తును, అబద్ధ ప్రవక్తను పట్టుకొని అగ్నిగుండములో పడవేసెను. దాని అనుచరులు హతమైరి. సాతానును పాతాళములోబంధించెను. అతడు అక్కడ వెయ్యేండ్లు ఉండును. ఇతని అనుచరులందరును పోయిరి. ఇతని ప్రదేశము నిర్జన దేశమాయెను. వాయుమండలలాధికారి, యీ యుగదేవత అను అతని పేర్లు పోయినవి. నిత్యనాశన తీర్పునకు అతడొకడే మిగిలియున్నాడు. అతడు 12వ అధ్యాయములో ఆకాశమునుండి త్రోసివేయబడెను. ప్రక 13:17లో ఒకరిలో దూరి పనిచేసినాడు. ప్రక 9:16లో తనదురాత్మల ద్వారా పని చేసి యున్నాడు. ఇప్పుడతనిని పట్టవలెను. రెండవదూతఅనగాక్రీస్తు అతనిని పాతాళములో అనగా దురాత్మల చెఱలో బంధించెను. శ్రమ కాలములో భూమిశుద్ధియైనదివెయ్యియేండ్లు చివర మిగిలిన సాతాను అనుచరులును, తీర్పు వరకు సాతానును అగ్నిగుండములో పడయేయ వీలులేదు. నరులను తాను బాధపెట్టిన బాధ అతడు చెఱలో కొంత అనుభవింపవలెను, అతడు యుద్ధఖైదీ.

మొదటి పునరుత్థానము:-

పెంతెకోస్తునాటి కుమ్మరింపు ఒక్క యూదా క్రైస్తవులకే గాని ప్రకటన 3, 4 అధ్యాయముల మధ్య రాకకు ముందు పర్వత కుమ్మరింపు వుండును. అన్ని జనాంగముల వారికిని, ఇది పొందని వారు రాకడకు యెత్తబడరు.

    పునరుత్థానములు రెండు :-
  1. విశ్వాసులకు
  2. అవిశ్వాసులకు.
    మొదటిదానిపేర్లు:
  1. మరింత శ్రేష్టమైన పురుత్థానము (హెబ్రీ 11:35).
  2. జీవపునరుత్థానము (కొరింధి 15:23) ( యోహాను 5:29)
  3. క్రీస్తు నందలి మృతుల పునరుత్థానము (1థెస్స414-17 )
  4. దేవుని కుమారుల పునరుత్థానము (లూకా 20:36)
  5. నీతిమంతుల పునరుత్థానము (లూక 14:14)
  6. దేవుని కుమారుల ప్రత్యక్షత (రోమా 8:19)

శ్రమకాలహత సాక్షులు:-

వీరును మొదటి పునరుత్థానములోని వారే (ప్రకటన 7: 13,14: 14:1-5; 15:1-4;17:6. 20: 4-6 బూరకాల విశ్వాసులును, పాత్రకాల విశ్వాసులు భూమి మీదనే నివసింతురు. శ్రమకాల విశ్వాసులకు నూతన యెరూషలేము వెళ్ళుభాగ్యము కలుగును గాని వారి స్థానము వేరై యుండును. సాతాను విడుదలకు పిమ్మట మాగోగు కలహకారులు అగ్నిచే దహింప బడుదురు.

రెండవ పునరుత్థానము:-

ఇది వెయ్యియేండ్లు అయిన తరువాత జరుగును. (ప్రకటన 20:11-15)

Home


21వ అధ్యాయము

మిలేనియం, వెయేండ్ల పరిపాలన:-

20, 21 అధ్యాయములు, ఇది పూర్ణ సువార్తయొక్క ప్రకటన కాలము. శ్రమతీరిన వెనుక కోట్లకొలది నరులు భూమి మీద ఉండి పొవుదురు. ఇదే క్రొత్త భూమి క్రొత్త ఆకాశము (1 పేతురు 3:13) వెనుకటి భూమి జ్ఞాపకముండదు. నీతి నివసించును. పాపము ప్రవేశింపక ముందు భూమికున్న శీతోష్ణస్థితి, సౌందర్యము, ఫలనైజము తిరిగి లభించును. వంకర చెట్లు ఉండవు, చెట్లు రసవంతమైన కాయలు, పండ్లు కాయును. పండ్లలో చేదుగాని, అనంగీకార రుచిగాని ఉండదు.ఏదోనుతోట వలె నరులకు పండే ఆహారము అరణ్యము పుష్పమయమై యుండును.ఇసుక బీడులుండవు. నేత్రోత్సవము కలిగించు ఊటలు ప్రవహించును. ఎండిన భూమిలో నదులు పుట్టును సృష్టిలో ప్రతిది వృద్ధిలో నుండును. నరులు ద్రాక్షలు నాటి ద్రాక్షరసము త్రాగుదురు. జీవరాసులకును, నరులకును మిక్కిలి చెలిమి కలిగియుండును. తోడేలు, గొఱ్ఱె పిల్ల కలిసి మేయు చుండును. చిరుత పులి మేకపిల్లచెంతనే పండుకొని యుండును, సిం హము గడ్డిమేయును. పిల్లలు పాముల పుట్టల వద్ద ఆడుకొందురు. ఏ మృగము హాని చేయదు. (యెషయా 11:6-9)35 అ. (యెషయ 65:17-25)

నూతన యెరూషలేము:

పౌరులు భూమిని యేలుదురు. ఇనుప దండముతో యేలుదురు పెండ్లి కుమార్తె సంఘమునకే పరిపాలించు అధికారముండును. వీరు అన్ని రాష్ట్ర్ర ముల వారికి సంపూర్ణ సువార్త ప్రకటింతురు. ఆరాధన, స్తుతి, వీరి వరమే. వీరు రాజులుగను, యాజకులుగను వత్తురు. శ్రమ విశ్వాసులకు మొదటి పునరుత్థానములో పాలుండును. ముద్రల శ్రమకాల హతసాక్షులు పరలోకములో నుందురు. శ్రమ కాలములో యెత్తబడిన వీరును పరలోకములోనే ఉందురు గాని వీరి స్థానము వేరు. వీరు మిలేనియం నందు రారు. బూర, పాత్రల సజీవ భక్తులు భూమిమీదనే ఉండి పోదురు. వీరికి తండ్రి ముద్ర ఉండును. వీరే స్త్రీ యొక్క శేషించిన సంతానము, అనగా మూడవ శిశువు. వీరే హర్మె గెద్దోను యుద్దమందు దాచబడుదురు. మరియు మిలేనియంలో సంపూర్ణ సువార్త ప్రకటింపబడును. గాన ప్రయాణములు సుళువు దేవాలయములో నుండి ఒక నది ప్రవహించును. (యెహెజ్కేలు 47:1) సువార్త ప్రకటించుటకు భక్తులకు గోత్రముల వారిగా భూలోకము పంచిపెట్టబడును (యెహెజ్కేలు 48వ అధ్యాయము) అనగా విశ్వాసమునుబట్టియే గోత్రములో నుందురో దాని ననుసరించి గోత్ర నిర్ణయము. ఈ కాలమునందే ఆత్మ సంపూర్ణముగా కుమ్మరింపబడును. (జెకర్యా 1:10) కాని పరిపూర్ణ పరిశుద్ధత పొందుటకు చాలాకాలము పట్టును ప్రభువు వచ్చువరకు పొందుచునే వుండవలెను. రక్షింపబడిన వారందరు పెండ్లి కుమార్తెగా మారలేదు.

ఆత్మ కుమ్మరింపులు:-

మొదటిసారి:- పెంతెకోస్తునాడే. ఇది సాక్షార్ధము. (అ.కార్య 2అ. ము)

రెండవసారి:- రాకడకు ముందు, రాకడ సమీపము గనుక దానిలో పాలు పొందుటకు ఆత్మను పొందండి అని సువార్తను ప్రకటించుటకు.

మూడవసారి:- మిలేనియములో పశ్చాతాపము నిమిత్తమై. (జెకర్యా 12:10) తిరుగుబాటు జనము: హర్మెగెద్దోను తరువాత భూమిమీద చాలమంది ఉండిపోదురు. వారికి అన్ని సదుపాయములు ఉండును. ఎందుకనగా వారిది మహాకఠిన హృదయము, (ప్రకటన7,8 అధ్యాయములు) వారిని వెలుపలనుండి శోధించువారు లేరు. గాని వారి నైజమే వారిని శోధించును.

మిలేనియం స్థితి గతులు: నరులు వందలాది సం. రములు జీవింతురు. యెషయా 65 అ. జెకర్యా 8:4,5. జబ్బులుండవు. వివాహములు, జన్మములు ఉండును. ఎంతనూ మారక అదే విధముగా పాపము చేయువారికి మాత్రమే మరణముండును. (జెకర్యా 14:12;14:15) హర్మెగెద్దోను యుద్దమున నశించినవారి పురుగు చావదు. అగ్ని ఆరదు. (యెషయా 66:24) గనుక అందరును చూచుచునే ఉందురు. ఇక యుద్ధములుండవు. గనుక కత్తులు నాగళ్ళుగా మార్చబడును. (మీకా 4:3) రాజు క్రీస్తే. సంఘము పెంతెకోస్తునాడే ఆరంభమైనది. రాజ్యము మిలేనియంతో ఆరంభమైనది. ఆయన రాజ్యము సర్వలోక రాజ్యము, కీర్తన 2:8.(కీర్తన 24 అ. ము, ఎఫెసి 1:10) భక్తులు సిం హాసనాసీనులై తీర్పు విందురు. (ఫిలిప్పి1:8-11;కొలస్సె 1:10)

సజీవుల తీర్పు: గొఱ్ఱెలు, మేకలు (మత్తయి 25 అ. ) క్రీస్తు రాజుగానున్న కాలమున భూమిమీద మిలేనియం కాలము యొక్క చివర అనగా రెండవ పునరుత్థానమునకు ముందు ఇది జరుగును. పునరుత్థాన మందుండు గ్రంథములు ఉండవు. తీర్పు యెవరికి? మేకలను అనగా అవిశ్వాసులకు, గొఱ్ఱెలను అనగా తనవారికి, శ్రమకాల భక్తులకు వారిలో విశ్వాసమునుబట్టికాదు. వారిలోనున్న ప్రేమనుబట్టి తీర్పు, వారు రక్షింపబడిన వారివల్ల వెయ్యియేండ్లు సువార్త విన్నారు. వారి తీర్మానము ప్రభువు వినవద్దా? వెయ్యియేండ్లు సువార్త పనిమీద సంచరించువారిని ప్రజలు ప్రేమతో సత్కరింపవద్దా? ఇట్లు ప్రేమవుండని యెడల తీర్పు వుండును. ఈ నా సహోదరులలో ఒకనికి చేసినందున నాకు చేసినట్లే అని ప్రభువు పలుకును. అన్నము పెట్టుట వస్త్రములిచ్చుట, దర్శించుట ఇవి బాహార్ధముగా మాత్రమే గాక అంతరార్ధముగా భావించవలెను. (యోహాను4:21)

సాతాను విడుదల: వెయ్యియేండ్ల చివర సాతాను దేవునితో యుద్ధము చేయుటకు చెఱలోనుండి బయటికి వచ్చును. సాతాను పక్షముగా కొందరున్నారు గనుక ప్రజలను సమకూర్చుట జరుగును. సాతానుకు ఖైదులోనైన మారుమనసు కలుగలేదు. సాతాను ప్రోగుచేసిన సైన్యమునకు గోగు, మాగోగు అని పేరు. ఇశ్రాయేలీయులకు గోగు, మాగోగు లెట్లు శత్రువులో అట్లే వీరు ఇప్పుడు విశ్వాసులకు, తండ్రికి, శత్రువులు. వీరికి పేరు తగినదే. వెయ్యియేండ్లలోనున్న సువార్త ప్రకటన కాంతిని, అద్భుతకరమైన ఆరాధన కాంతిని చూడలేనివారు మూలమూలలను దాగియుందురు. వారే సైన్యములో చేరుదురుగాని అనేకమంది చేరిన తరువాత రక్షింపబడుదురు. సాతాను ఓడిపోవును. నిత్యనరకాగ్నిలో పడవేయబడును, అతని సైన్యము శిక్షింపబడును (జెకర్య14అ. ) సాతాను విడుదల అయిన తరువాత బహుశా ఒక్కరోజు మాత్రమె ఉండును.

అంత్య తీర్పు: యోహాను 5:29. అ.కార్య 24:15. దానియేలు 12:21. మొదటి పునరుత్థానకాలము రాకడప్పుడు మొదలుపెట్టి మిలేనియం ఆరంభమున పూర్తియాయెను. అప్పుడు లేని వారు అనగా ఆదాము మొదలుకొని ఆనాటివరకుసమాధులలోమారుమనసు లేకయున్నవారు, ఈతీర్పుదినమున అనగా వెయ్యియేండ్ల చివర మృతులను సముద్రము, హేడెస్సు అప్పగించును. ఈ తీర్పు భూమి ఆకాశములలో యెక్కడను కాదు. మన ఊహకు తెలియనిచోట జరుగును. కార్యార్ధమై క్రీస్తు ప్రభువేగాని పరిశుద్ధులైనను, దూతలైనను వెళ్ళరు.

గ్రంథము:

  1. శరీరమందు వేసిన క్రియలున్న పుస్తకము
  2. జ్ఞాపకార్ధ విషయములున్న పుస్తకము (లూక 16:25)
  3. చేసిన పనులున్న పుస్తకము
  4. రక్షింపబడినవారి పేర్లున్న జీవ గ్రంథము.
ఈ గ్రంథము లన్నియు అప్పుడు విప్పబడును. నేనేమి తప్పు పనిచేసినానని నన్ను తీర్పు లోనికి తీసికొని వచ్చినారు? నీ నామమందు దయ్యములను వెళ్ళగొట్టలేదా? అని అనేకులు అడుగుదురు. గనుక ఇట్టి పుస్తకములుండుట అవసరము (మత్తయి7:22,23) నేరములనుబట్టి శిక్ష యుండదు. మారుమనసు యుండదు గనుక క్షమాపణ యుండదు.

రెండవ మరణము: నిత్య నరకమే రెండవ మరణము. ఆనందమునకు సంబంధించిన దేదియు ఉండదు గనుక దేవునికినరునికి యెడబాపు కలుగుటయే రెండవ మరణము అని అనిపించుకొనును. దానిలోనివారు మరణమైపోరు. నిత్యమరణమైపోరు, ఆయుష్కాలము అయిపోనప్పుడు శరీరమునకు, ఆత్మకు, యెడబాపు కలుగును. ఇది శరీర మరణము. మానవుడు పాపము చేయునప్పుడు దేవునికిని, తనకును యెడబాపు కలుగును ఇది ఆత్మీయ మరణము. ఈ యెడబాపు తీర్పు అయిన వెనుక నరకములో నిత్యము వుండును, ఇదే రెండవ మరణము. మిలేనియం తరువాత.

నూతన యెరూషలేము:- ఇదియు భూమివలె ఒక స్థలమే. ఇది పెండ్లి కుమార్తెను పెండ్లికుమారుడు ఉండుచోటు ఇది పరలోకములో నుండును. వీరే వెయ్యేండ్లలోని పాలకులు ఇది భూమిమీదికి కనబడును.

  1. క్రొత్తభూమి.
  2. క్రొత్త ఆకాశము
  3. క్రొత్త యెరూషలేము,
  4. క్రొత్త జనము.
  5. క్రొత్త దేవాలయము
  6. క్రొత్త వెలుగు,
  7. క్రొత్త పరదైసు.

క్రొత్తభూమి, క్రొత్త ఆకాశము యోహానుకు కనబడెను. భూమి మీద ఇక సముద్రముండదు. నరునికి దూరమనునది ఉండదు. కోట్లకొలది జనము భూమిమీద నిరంతరము జీవించుచునే యుందురు. భూమి అప్పుడు పరలోకములో ఒక భాగమై యుండును. ఈ యెరూషలేము పేరు గలది యెరూషలేము అను యీ పేరు బైబిలులో 800 సార్లు ఉన్నది. పైయెరూషలేము మనరాళ్ళతో కట్టునది కాదు. అది మహిమ గలది. యెరూషలేములు మూడు.

  1. పాలస్తీనాలో దావీదు యేలిన పట్టణము,
  2. మిలేనియం కాలములో నూతన పర్చబడిన పట్టణము.
  3. పరలోక పట్టణము

క్రీస్తు సంఘము మిలేనియం కాలములో ఇక్కడ ఉందురు. నూతన యెరూషలేము ఇక్కడ పెండ్లికుమార్తె ఆభరణములు అనగా దివ్యలక్షణములు ధరించి యుండును. దేవుని ముఖము చూచుచునే యుండును. వట్టి దర్శనము కాదు. గొప్ప సహవాసము. క్రీస్తునందు దేవుడు మనకు తన ఆత్మ నిచ్చినప్పుడే నూతన జన్మమును, నూతన స్వభావమును, నూతన శక్తిని ఇచ్చెను. ఇది లోక శరీర కాలమందు జరిగెను, మహిమ శరీర కాలములో మరింత జరుగును. ఆత్మాహార జీవముండును, క్రీస్తు జీవనమును ఇక్కడ భూమి మీద పొందకపోతే అక్కడ దొరుకదు. కలుగబోవు ఈ సంగతి నేను ఇప్పుడు నాయనుభవము లోనికి తెచ్చుకొనగలను. అది ఇప్పుడే నేను అనుభవించుటకై నా హృదయములో సమర్పణ పూర్వకముగాను, విశ్వాస పూర్వకముగాను ఓ ప్రభువా! నీకు లోబరచుకొన్నాను. నాయనుభవ చరిత్రలో ఇది ఋజువు పరచుటకై బైలు వెడలును. ఆమేన్. హల్లేలూయ. ఆయన అల్ఫయు ఓమెగయై యున్నాడు. ఆయన నాలో ఈ అనుభవము కలిగించగలడు. ఆమేన్ అని ప్రతి దినము పలుకువారు ధన్యులు, ప్రతివారు ఆపట్టణమునకు మహిమను, ఘనతను, తీసికొనివత్తురు, అనగా అత్మీయ జీవనమును భూలోకమందు సంపాదించిన మహిమ అని అర్ధము. భూరాజులు కానుకలు తెత్తురు. అనగా అర్ధము ఇదే, నూతన యెరూషలేమునకు తీసికొని వెళ్ళుటకు మనము ఇక్కడ సిద్ధపరచుకొనవలెను. క్రీస్తును మన హృదయ వాసిగా యేర్పరచుకొన్నందున మీలో యేర్పడిన రూపము? ఇతరులకు సహాయము చేయుటకు సర్వసిద్ధముగానున్న ఉపకారబుద్ధి సిలువ సహించుచు, బోధవలనను జీవము వలనను ఆత్మలను రక్షణకు తెచ్చిన ప్రయత్నము ఎన్నటికిని నిలిచిపోవు ప్రేమ.

యెరూషలేము ఎవరు వెళ్ళరు

  1. పిరికితనముగలవారు: పేతురు పిరికిగలవాడై బాలికకు జవాబు చెప్పలేకపొయెను ఇది గొప్ప తప్పు. హాని చేయువారికి భయపడకుడని ప్రభువు చెప్పెను. రహస్య విశ్వాసులు పిరికి తనము గలవారే. మనది సరియని తెలిసిన మనపక్షమున నుండనివారు పిరికివారే.
  2. అవిశ్వాసులు: నేను విశ్వాసినే అని నమ్ముకొనువారిలో విశ్వాసముండును గాని ఒక మూలను అవిశ్వాసముండదా?
  3. అసహ్యులు : దుర్భోధను అనుసరించువారు, అవినీతిపరులు.
  4. నరహంతకులు: మనుష్యులను చంపువారు మాత్రమేకాదు. పగ, ద్వేషము, సాధింపు, ఆరోగ్య విషయములో నిర్లక్ష్యము ఇవి గలవారు.
  5. వ్యభిచారులు: క్రియమాత్రమేగాక తలంపులు గలవారు, దేవుని విడచి నడచువారు.
  6. మాంత్రికులు: (ద్వితి 18:9-14) పూర్వము ఇట్టివారికి కఠిన శిక్ష ఉండేది. (1తిమోతి 4:1)
  7. విగ్రహారాధికులు: విగ్రహారాధనను వినోదముగానెంచి చూడ మనస్సు గలవారును, విగ్రహారాధనకు తోడ్పడువారును, దేనిని దేవునికంటె యెక్కువ ప్రేమింతుమో అదే విగ్రహారాధన.
  8. అబద్దము ప్రేమించి జరిగించువారిని ప్రకటన 22:5లో నున్నది అబద్దములతో మాటలాడుటయు, మంచివారమని చెప్పుకొనుచు చెడుతనముగ జీవించుటయు అబద్దమే. (ప్రవర్తన)
  9. కుక్కలు: అపవిత్రతయు, ఇతరులమీదికి వెళ్ళుటయు, చేసిన పాపముమాని మరలచేయ బూనుకొనుటయు, ఇవి కుక్క గుణములగును. (ద్వితి 28:18) దేవుని శత్రువులు కుక్కలు. ఇంటికి వెలుపలనున్నట్లు వీరు నూతన యెరూషలేము వెలుపలనుందురు.
పట్టణ వివరములు: ప్రాకారము, సంపూర్ణమై కాపుదల ఎడబాపు గలది.
  • 144 మార్లు = దూతల కొలత.
  • యోహాను చూడగలిగిన కొలత 12 గుమ్మములు = వీటికి ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లుగలవు. ఒక్కొక్క గుమ్మము ముత్యములతో నిర్మింపబడెను.
  • యూదులుకారు, క్రైస్తవులుకారు, విశ్వాసులు ప్రవేశింతురు. ముత్యములు = సమర్పణను తెల్పును.

ఇది వెలగలది గనుక దానిని సంపాదించుటలో నరులెంత కష్టపడవలెను? క్రీస్తు ఎంత కష్ట పడితే సంఘము దొరికినది? పా. ని. విశ్వాసులు కూడ పెండ్లికుమార్తెయై ఉన్నారని తెల్పును. యూదులైన విశ్వాసులు నిబంధనవల్లను బలులవల్లను ప్రవేశించిరి. ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క మంచి లక్షణమున్నది. అట్టి లక్షణము గలవారు ఆయాగోత్రములలో లెక్కకువత్తురు. యూదా గోత్రముననున్న విశ్వాసులందరు యూదా గోత్రికులనబడుదురు. అలాగే తక్కిన గోత్రములను గ్రహించుకొనవలెను. యూదా గోత్రము వివేకముగల కన్యక,(మత్తయి25) ఈమె 10 నాణెములు సంపాదించి 10 పట్టణములనేలును. 12 గోత్రములకు తీర్పు తీర్చుటకు క్రీస్తుయొక్క సింహాసనము నందు కూర్చుండును.

పట్టణనడవిడి:- కొలత సమానమనగా మానవ జ్ఞానమునకు అందనిది అదియెంతో; దాని మహిమ యెట్టిదో, శక్తి యెట్టిదో, ఎందరుందురో; ఇవి లెక్కకు మించినవియని అర్ధము. నీ శరీరమును, మనస్సును, ఆత్మను, వాటిలో ప్రతిభాగమును దైవాత్మకు లోబరచి చూడుము. ఆయన నిన్నెట్లు సిద్ధపరచునో చూడగలవు.

పునాదులు:- ఇది మహిమ విషయములో గుమ్మములకంటె ముఖ్యము. ఎందుకంటె క్రీస్తు యజ్ఞము మీద ఆనుకొని యున్నవి. అందుచేత క్రొత్తనిబంధన సంఘమునకు ఎక్కువ ప్రాముఖ్యత. 12మంది అపొస్తలుల లెక్కయిది. గోత్రికులు నిబంధనను, అపొస్తలులు సిలువను బయలు పరచిరి. సిలువ నెరుగని వారెట్లు ప్రవేశింతురు? క్రీస్తు ఈ పునాదులకు మూల రాయి, మనము రాళ్ళమైయున్నాము. మహిమ మనుష్యుల స్థితినిబట్టి వివిధ వర్ణములుగా వారిలో ప్రవేశించును. గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథములో ఎవరిపేరు ఎక్కించినారో వారే ప్రవేశింతురు.

జీవజలనది:-

  1. జీవనది వలన నిత్యమైన హాయి కలుగును.
  2. జీవవృక్షమువలన ఏదేను కాల సహవాసమును, పరిపూర్ణతయు కలుగును. దాని వలన కలుగు స్వస్థత సిలువ ద్వారా కలుగును. వాక్యముయొక్క మర్మములు, పరిచర్యలు, తెలియుచుండును.
  3. క్రీస్తు ముఖమును నిత్యము చూచుచుందురు. క్రీస్తు ముఖబింబము, నాలో ప్రవేశించునని నమ్మి ధ్యానములోనున్న యెడల అట్లు జరుగును.

ప్రకటన చివరివార్త:-

  1. కాలాంతము వరకు ఇక ప్రవచనములు లేవు గనుక ప్రవచనములకు ముద్రవేయవద్దు. అని యోహానుకు ఆజ్ఞ కలిగెను. దానియేలుకు ఏమని ఆజ్ఞ? (దానియేలు 12:9) ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా నుండునట్లు ముద్రింపబడినవి గనుక ఊరకుండుము. అప్పటికింకను క్రీస్తుకాలము, సంఘకాలము రాలేదుగదా?
  2. క్రీస్తు చివరివార్త
    • (ఎ) దావీదు వేరు = దేవుడు,
    • (బి) దావీదు చిగురు = క్రీస్తు. దేవుడు మనుష్యుడైన క్రీస్తు.
    • (సి) వేకువచుక్క= నిత్యము రాజ్యమునకు పగలే,
    • (డి) సంఘముయొక్క చివరి ప్రార్ధన = సంఘము క్రీస్తును పిలుచుచున్నది. పరిశుద్ధాత్మ కూడ క్రీస్తును పిలుచుటలో సంఘముతో ఏకీభవించును.
    • (ఇ) ప్రభువుయొక్క చివరి వాగ్దానము, త్వరగా వచ్చుచున్నాను. పరలోకము, సింహాసనము భూమి, లోకము సమాధి, ఆదాము, క్రీస్తు.

Home


22వ అధ్యాయము


జీవజలనది - జీవవృక్షము (యెహెజ్కేలు47:1-12).
నది, వృక్షము, పరలోకములో నుండునా? సింహాసనము నివాసములు, వస్త్రములు, కిరీటములు, ఉన్నవి. ఈ రెండు పేర్లు అలంకార రూపముగా నున్నవిగాని యేసుప్రభువునకు సూచన.

ఆదిలో దేవుడు నరుని కలుగజేసినప్పుడు అచ్చు ఆయన పోలికగా నున్నది. అనగా సంపూర్ణమై పోలికయున్నది. అంటే భూమి, ఆకాశము, సర్వసృష్టి, సహవాసము ఉన్నది. జీవరాసులు దేవునితో, నరులతో సహవాసము చేయునదై యున్నవి. నరుడు పాపములో ప్రవేశించగానే దేవునివలన ఆదిలో తనకు యియ్యబడిన ఆయన స్వరూప పోలిక పోయినది. ఆయన సహవాసము పోయినది. సృష్టి అంతా యెదురు తిరిగినది. సృష్టిని యేలునట్టి నరుడు దైవాజ్ఞను మీరినందున సృష్టిజాలమంతయు యెదురు తిరిగెను. ఆదిలో నరునికి చూచే శక్తి యెక్కువ. నాకు కనిపించుటలేదు అన్నమాటలేదు. అలాగే వినికిడి శక్తి, ఎంత నడచినను కాళ్ళు లాగెనను మాటలేదు. అంటే అన్ని స్థితులను, నరుడు మొదట కలిగియున్న సహవాసమును, వెయ్యియేండ్ల కాలములో వచ్చును. గాని సంపూర్తికాదు. పరలోకములో సంపూర్తి. అంతకు పూర్వము నది, వృక్షము, ఏదేను తోటలో నున్నవి. పాపము రాగానే పోయినవి. పాపము వలన భయము, సిగ్గు, వ్వాధి, మరణము తుదకు నరకము వచ్చినవి. ఇవన్నియు నరునికి వెయ్యియేండ్ల పరిపాలనా కాలము వరకు వచ్చును. వెయ్యేండ్లలో భూమి శుద్ధియైనది. కాబట్టి యీ కాలములో ఏదేను తోటస్థితి భూమివాసులకు కలుగును.

నది:- ప్రయాణికులు నీరుత్రాగి తెప్పరిల్లుదురు. అలసట తీరును. సుఖింతురు. నూతన బలము వచ్చును. యేసుప్రభువు జీవజలనదియై యున్నారు. నూతి దగ్గర సమరయ్య స్త్రీతో నేనిచ్చునీరు త్రాగువాడెప్పుడును దప్పిగొనడని ప్రభువు చెప్పెను. గనుక ప్రభువు యిచ్చు జీవజలమును త్రాగువారు తెప్పరిల్లుదురు. సుఖింతురు బలము పొందుదురు.

వృక్షము:- ప్రయాణికులు దీని క్రింద నిలుచుట వలన అలసట తీరును. బలము వచ్చును. ఈ చెట్టు ఏదేను తోటలోని చెట్టును జ్ఞాపకము చేయుచున్నది. ఆది తల్లిదండ్రులు తినరాని చెట్టు పండును తిని కుమ్మరము తెచ్చి పెట్టిరి. ఇప్పుడు ప్రభువును బట్టి ఆ కుమ్మరముపోయి శాంతి వచ్చినది.

నది - చెట్టు:- వెయ్యేండ్ల కాలములో సుఖమునకు, ఆహారమునకు, ఋజువై యుండును. అప్పుడు పంటలకు కరువుండదు. అన్నియు సమృద్ధిగా నుండును. జీవవృక్షము నెల నెలా కాపుకాయును. అనగా ఎప్పుడును ఆహారము సమృద్ధిగానుండునని అర్ధము. ఇది నూతన యెరూషలేము అనుభవము.

ఆకులు :- ఇవి స్వస్థపరచునవై యున్నవి అనగా ఇక్కడ జబ్బు లుండవని అర్ధము. నరుడు పాపము చేసినందున వ్వాధులు, మొదలైన బాధలు, వచ్చినవి. ప్రభువు వచ్చి తన రక్తమును చిందించి పాపవిమోచనము కలుగజేసెను. వెయ్యియేండ్లలో జబ్బులుండవు ప్రభువు రక్తము నూతన యెరూషలేములో అవసరములేదు.

  • కాలముసమీపమైయున్నది :- ఆదాము మొదలుకొని ప్రభువువరకు 4000 సం. ములు, ప్రభువు మొదలు మన వరకు 2000సం. లు 4వేల కంటె 2వేల తక్కువ గనుక కాలము సమీపమను మాట నిజమె.
  • అపవిత్రుడు:- అపవిత్రుడు గానే ఉండును. అనగా నిత్య నరకమని గ్రహింపవలెను.
  • ప్రభువు ఇచ్చిన కడవరివార్త:- నేను దావీదువేరు, చిగురు వేకువచుక్క.
    • నేను-దేవుడనని అర్ధము.
    • వేరు:- దావీదు.
    • చిగురు:- మనుష్యుడని అర్ధము.
    • వేకువచుక్క పరలోకములో క్రొత్త కాలము రప్పించు సాధనము.
    • సతుష్టి:- మనముభూలోకములో ఎంత తెలిసికొన్నను, యేదో ప్రశ్న ఉండును. గాని పరలోకములో సంతుష్టి.
    • కలుపకూడదు:- కలిపితే శిక్ష.(గ్రంథతెగుళ్ళు).
    • తీయకూడదు:- తీస్తే పట్టణములో పాలులేదు. (నూతన యెరూషలేము)
    • ఆఖరు ప్రార్ధన:- బైబిలంతటిలో చివరి ప్రార్ధన (ప్రభువైన యేసూ రమ్ము) ఇది మనమందరము చేయవలసిన ప్రార్ధన.
    • కడవరి దీవెన:- ప్రభువైన యేసుకృప పరిశుద్దులకు తోడై యుండునుగాక! ఆది కాండములో దీవించినప్పుడు పరిశుద్ధులే. కడవరి గ్రంథము పరిశుద్ధుల దీవెనతో ముగింపు.

షరా:- నీళ్ళ వలన ప్రాణము తెప్పరిల్లును. సుఖించును. అలసట తీరును. బలము పొందును.

గత కాలమతటిలో పడిన శ్రమలు కష్టములు, బాధలు, వ్యాధులు, మొదలైన వాటి వలన ప్రజలు నలిగిపోయి అలసి పోయిరి. ఇప్పుడు వెయ్యేండ్ల పాలనలో యేవిధమైన బాధలు ఉండవు, యేలోటు పాట్లు ఉండవు. యేసుప్రభువే ఉన్నారు. ఈ లోటు లేకపోవుటయే జీవజలమనుభవించుటకు గుర్తు. ఇదే జీవజలనది.

జీవవృక్షఫలము:- తినవద్దన్న పండు తిన్నందున మనము తెచ్చికొన్న పాపము, మరణము, మొదలిన వాటన్నిటినీ తీసివేయును ఇదే జీవ వృక్షము నూతన యెరూషలేములో నిత్యసహవాసము, నిత్య సన్నిధియందు వెలితిలేక యుందురు. ఇట్టి సంపూర్ణతనే జీవవృక్షభాగ్యమందురు. గనుక దానిని జీవవృక్షమందురు. అసలు తండ్రి ఏదేనులోనే నిత్య సహవాసము, నిత్యజీవము,సంతోషమును, యిచ్చెను. కాని ఆది తల్లిదండ్రులవలన పోగొట్టుకొన్నాము మనము పోగొట్టుకొన్న భాగ్యములను యేసు సిల్లువ, మరణ పునరుత్థానము వలన సంపాదించిపెట్టెను. దీనిని మనము ఈ లోకములో అనుభవించుట కొద్ది,వెయ్యేండ్లలో యెక్కువ నూతన యెరూషలేములో సంపూర్ణముగా అనుభవింతుము.

Home


ఫ్రకటనాది

బైబిలులో 66 పుస్తకములలో కడవరి పుస్తకమగు ప్రకటన గ్రంధము క్రీస్తు శిష్యుడైన యోహాను వ్రాసెను. ప్రకటనలోని విషయములు దేవుడు తన సేవకులకు బయలు పరచుటకై వ్రాయించెను. వారు చదువుకొని ఇతరులకు బోధింపవలెను. ప్రకటనలోని సంగతులు "త్వరలో" జరరుగునని వ్రాయబడెను. "త్వరలో" అనగా జరుగుటకు దేవునిదృష్టికి ఆటంకము లేమియు లేవని వేదాంతార్ధము. దీనిలోని సంగతులు చదువువాడను గైకొనువాడును ధన్యుడు అని వ్రాయబడియున్నది గనుక అందరును దీనిని చదువవలసినదే.

    గ్రంథాదిని యోహాను రెండు శుభవాక్యములు ఉదహరించు చున్నాడు.
  • మొదటిది దేవుని యొద్ద నుండి సంఘములకు వచ్చిన కృపాసమాధానములు కలుగునుగాక అను ఉపకార శుభవాక్యము. ఆ దేవుని సింహాసనము నొద్ద ఏడు ఆత్మలున్నట్లు వ్రాయబడిఉన్నది. ఇవి దేవుడు తన పనిని పూర్తిగా నెరవేర్చుకొనునట్టి శక్తులై యున్నవి.
  • రెండవది సంఘమువద్దనుండి దేవుని యొద్దకు వెళ్ళిన మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక! ఆమేన్ అను కృతజ్ఞతగల శుభవాక్యము.

యేసుప్రభువు మేఘారూడుడై వచ్చునని యోహాను ప్రకటించుచున్నాడు.

ఇది మనము చూచుచున్న మేఘముగాదు. ఇది మన జ్ఞానమునకు అందని మోక్షలోక మేఘము. "ఆయనను పొడిచినవారును చూచెదరు" అని యోహాను వ్రాయుచున్నాడు. వారు యూదులు, యేసుప్రభువును చంపినారు. ఇక ముందునకు వారు క్రీస్తుయొక్క అభిమానులగుదురు.తక్కిన వారిలో కూడ అనేకులు అభిమానులగుదురు. (ప్రకటన7అ. 14అ. ) యోహాను పత్మాసు లంకలో చెరసాలయందుండగా యేసు ప్రభువు ప్రత్యక్షమై అన్ని కాలములలో ఉన్నవాడను నేనే అని చెప్పెను.

ఈయన దేవుడని యోహాను ఈ మాటనుబట్టి చెప్పుచున్నాడు. క్రీస్తు ప్రభువుయొక్క ముఖ కాంతికి యోహాను భయపడెను. అప్పుడు ప్రభువు "భయపడకుము. మృతుడనైతినిగాని ఇదిగోయుగ యుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు మృతుల లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో నున్నవి" అని ధైర్యము చెప్పెను.

క్రీస్తు ప్రభువు చేతిలో ఏడు నక్షత్రములు పెట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించుచున్నట్టు కనబడెను. నీవు "చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవు వాటిని వ్రాయుము" అని ప్రభువు యోహానుతో చెప్పెను. అందుకే ఆయన భవిష్యత్ విషయములుగల ప్రకటన వ్రాసెను. కాబట్టి ప్రకటన అందరు చదివితీరవలెను.

చెరలోనుండి వెలుపలికి రా వీలులేనప్పుడును, వృద్ద దశయందుండి పనిచేయ వీలులేనప్పుడును, మరణకాలము సమీపమైనప్పుడును, క్రీస్తు ప్రభువుయోహానుకు రెండు పనులు పెట్టెను. మొదటిది మోక్షలోకమందును, ఆకాశమండలమందును,భూలోక మందును, పాతాళమందును, జరగనున్న చరిత్ర చూడగలపని. రెండవది ఈ చరిత్రలు వ్రాయగలపని.నేను సజీవుడను అని క్రీస్తు ప్రభువు చెప్పెను. గనుకనే యోహానుకు ఈ రెండు మనసులు చేయగల శక్తిననుగ్రహించెను. మృతుడై ఉండిపోయిన యెడల యెట్లు యోహానులో జీవముధారపొయగలడు. దీపస్తంభములు అనునవి యోహాను కాలమందు యేడు పట్టణములలోని క్రైస్తవమత సంఘములను సూచించుచున్నవి. నక్షత్రములు ఆ సంఘములను ఏర్పడిన బోధకులను సూచించుచున్నవి. అనేకులను ప్రభువుతట్టు త్రిప్పగలవారు మోక్షలోకములో నక్షత్రమువలె ప్రకాశింతురు. దాని 12:3.ఇక్కడ కూడ అంతరంగముగా ప్రకాశింతురు.

మనరక్షణార్ధమైన సేవలో క్రీస్తుప్రభువు మన ప్రధాన యాజకుడు గనుక ఆయన యాజకవస్త్రధారిగా యోహానుకు కనపడును. ఆయన నేత్రములు ప్రకాశముతో కనబడెను. ఆయన కన్ను కాంతి గలది గనుక సమస్తమును, నరుల హృదయము లోపలనున్న ఆలోచనలను చూడగలదు. "ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానముగా కనబడెను."

ఆయన యీ భూమిమీద నున్నప్పుడు ఎంత మన శరీరధారియైనను, మహాపరిశుద్ధమైన ప్రవర్తనగలవాడై పాదములకు పాపకళంకమేమియు అంటనీయకుండ నడిచెను గనుక యోహానుకు ప్రభువు పాదములు అపరంజిగా కనబడుట సబబుగానున్నది. క్రీస్తు వర్తమానము సర్వజనులకు వినబడునంతగా శబ్దింపవలెను. గనుక ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహములవలె యోహానుకు వినబడెను. క్రీస్తుప్రభువు "నోట నుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచున్నట్టు" యోహానుకు కనబడెను. ఖడ్గము క్రీస్తుయొక్క వాక్యమునకు గురుతై యున్నది.

    యోహానుకు క్రీస్తు ప్రభువు అనేక రూపములుగా కనబడెను:-
  • దీపస్తంభముల మధ్య సంచరించుచున్న నరపుత్రుని రూపముతో కనబడెను.
  • యాజకవస్త్రధారిగా కనబడెను.
  • అగ్నిజ్వాలవంటి నేత్రములతో కనబడెను.
  • అపరంజివంటి పాదములలో కనబడెను.
  • గొప్ప కంఠస్వరముతో కనబడెను.
  • కుడిచేతితో ఏడు నక్షత్రములు పట్టుకొని కనబడెను.
  • నోట ఖడ్గము గలవానిగా కనబడెను.
  • సూర్యకాంతిని పోలిన ముఖముతో కనబడెను.
  • తన కుడిచేయి యోహాను మీద పెట్టిన ప్రభువుగా కనబడెను.
  1. లోక విషయములను, తన విషయములను యోహాను మరచిపోయి యేసుప్రభువును మాత్రమే తలంచుకొని పరవశుడైనప్పుడు ప్రభువు ఆయనకు ప్రత్యక్షమాయెను. చదువరులారా మీరును ఏకాంతముగా దైవప్రార్ధనలో కొంతసేపు మనోనిదానముతో నుండగలరా! ఇట్లు అనుదినమును చేయగలరా! అప్పుడు మీకు ఎంత ధన్యత గల్గును.

    షరా:- తన ఆలోచనకు భిన్నముగా ఈ 6సంగతులు ప్రకటన అను పుస్తకములో ఉన్నవి. గనుక తన సంగతి అందరికి తెలిసిపోవునని మన మీ పుస్తకము చదువుట సైతాను కిష్టముండదు.

  2. ప్రకటన పుస్తకము చదువుటకు ఇంకను ఎవరి కిష్టముండదు?
    • ఈ పుస్తకములోని సంగతులు జరుగునపుడు మేముండము.
    • మిక్కిలి భయంకరమైన వృత్తంతములు జరుగనై యున్నవి.
    • అవి చదువగా భయము కలిగి రాత్రులు దుష్టస్వప్నములు వచ్చును.
    • ఒకవేళ చదివినను అనేక సంగతులు అర్ధము కావు.
    • ఏదో ఒక అర్ధము చేసికొన్నయెడల అది తప్పుడు అర్ధము కానవచ్చును. అఫ్ఫుడు గొప్పతెగుళ్ళ బాధ కలుగును.

    షరా:- ఈ 5 సంగతులు మిషగా పెట్టుకొన్న వారికి ఈ పుస్తకము చదువుట కిష్టముండదు.

  3. ఈ పుస్తకము చదువుట కెవరి కిష్టము.
    • దైవభక్తి విషయములో మహోన్నత స్థితి పొంది వారిని యేసుక్రీస్తు ప్రభువు అతి శీఘ్రకాలములోనే ప్రాణముతో మోక్షలోకములోని ఉన్నతస్థితికి తీసికొనిపోవును 1థెస 4:16, 17; 1కొరి. 15:51,52.
    • పిమ్మట భూమిమీద శేషించినవారికి 7 యేండ్లు శ్రమకలిగిన సమయమందు కోట్లకొలది ప్రజలు క్రీస్తు ప్రభువు తట్టు తిరుగుదురు. ప్రక. 7:1-9
    • ఆ పిమ్మట క్రీస్తు ప్రభువును, ఇక్కడనుండి వెళ్ళినవారును భూలోకమునకు వచ్చి వెయ్యియేండ్లు రాజ్యము చేయుచు దైవవాక్యము బోధింతురు ప్రక 20:4-6.
    • అప్పుడు కూడ కోట్లకొలది ప్రజలు క్రీస్తుతట్టు తిరుగుదురు. జెక. 2:10-13; 8:3-9.
Home

ప్రకటన గ్రంథము యొక్క ప్రకటన

  • ప్రకటన పుస్తకము మనము చదువుట మహిమోన్నత లోకము నుండి వాయు మండలములోనికి పడద్రోయబడినవారికి ఇష్టముండదు. అతనికే సైతాను అను పేరు వచ్చెను. ఇది మన సృష్టికి పూర్వము జరిగిన చరిత్ర, యెషయా 14:12. యెహెజ్కేలు 28:12-19. విలాప 4:6,7.
  • సైతాను మిక్కిలి త్వరలోనే భూమి మీదికి త్రోసివేయబడును. ప్రక 12:9,10.
  • తర్వాత వెంటనే పాతాళములోనికి త్రోసివేయ బడును. అక్కడ వెయ్యియేండ్లు ఖైదీగా నుండవలసి వచ్చును. ప్రకటన 20:1-3.
  • అటు తరవాత నరకములో వేయబడును ప్రక 20:10.
  • సైతాను తన దూతలచేతను క్రీస్తు విరోధిచేతను, క్రీస్తు విరోధియొక్క సహాయ కుడైన మాయ ప్రవక్త చేతను మానవుల నాశనార్ధమై చేయు పని తుదకు నాశనమై పోవును ప్రక.19:19.20.
  • సైతానువల్ల మనుష్యులలో ప్రవేశించిన పాపములను, వాటిని బట్టి వచ్చిన కష్టములను, కీడును తుదకు అంతార్ధానమగును. మీకా. 4:2

    1. ఆ వెయ్యి యేండ్లలో పాపములు గాని, వ్యాధులుగాని, కరువులుగాని, కలహాలుగాని, యుద్ధములుగాని విషపురుగులుగాని, ముండ్లుగాని, మరణములుగాని, నరులకు హానిచేయునవి మరేవుయుగాని ఉండవు. మీకా.4:3. యెష 65:19,20 యెష.11:6-9.
    1. ఆ వెయ్యి యేండ్లలో భూమి యావత్తు మహాశుభ్రముగా నుండును.
    2. నీళ్ళు నిష్కళ్మషముగా నుండును.
    3. వృక్షములు పుష్కలముగా పండ్లు కాయును.
    4. పంటలు విస్తరించును.
    5. జీవరాసులు నరులు కలిసి యుందురు.
    షరా:- ఈ 6 సంతోషకరమైన సంగతులు నమ్మువారికి ఈ పుస్తకము పదే పదే చదువుట కిష్టముండును.

  1. యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులలో నొకరైన యోహాను, ఈ పుస్తకమును వ్రాసిరి. ఈయన యేసుప్రభుని గూర్చినబోధ ప్రజలకు వినిపించుచున్నందువల్ల దేశాధికారి యీయనను మధ్యధరా సముద్రములోని పద్మసు లంకలోకి ఖైదీగా పంపెను. అప్పటికాయన వృద్ధుడై ఇకను తిరిగి పనిచేయలేని స్థితియందుండెను. అంతలో యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షము కాగా ఈ పుస్తకములోని వృత్తాతము లన్నియు దర్శనములో కనబ్డెను. అప్పుడు ఆయన అవన్నియు వ్రాసిపెట్టి ఉంచెను. నరుని తలంపొకటి పరాత్పరుని తలంపొకటి.

  2. క్రీస్తుశకము మొదటి శతాబ్ధము చివర ఈ పుస్తకము వ్రాయబడెను. బైబిలులోని 65 పుస్తకముల తర్వాత చిట్టచివరను చేర్చబడెను. లోకచరిత్ర యొక్క అంత్యకాలములో నొక కాలమగు మన కాలములోని చివరి కాలములో అనగా క్రీస్తు ప్రభువు వచ్చి తన సంఘమును తీసికొనివెళ్ళనై యున్నకాలములో ఈ పుస్తకము చదువని యెడల మరెప్పుడు చదువగలరు? క్రీస్తు చరిత్ర పూర్తిగా తెలిసికొన గోరువారు మత్తయి మార్కు, లూకా, యోహాను అను సువార్త పుస్తకములేగాక ఈ ప్రకటన పుస్తకమును చదివి తీరవలెను. రాబోవు సంగతులు చెప్పగల జ్యోతిష్కులు ఈ ప్రకటన పుస్తకము చదివిన యెడల జరుగనైయున్న గొప్ప మహిమ విషయములు కూడ ప్రవచించింప గలరు. బేధములున్నను స్వాభిప్రాయమేర్పడుటకు వ్వాఖానములు చదువ వలసినదే. తక్కిన పుస్తకములోని సంగతులన్నియు దీనిలో ముగింపునకు వచ్చెను.

మన ముగింపు శుభకరమైన ముగింపుగా నుండగోరు వారలారా! ఈ ప్రకటన మీకు ప్రకటిత మగునుగాక!

Home