ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను (దా.కీర్త. 107:20).
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు 1937వ సంవత్సరము)
(మందులు లేకుండా దైవ విశ్వాసమువల్ల జబ్బులు బాగుచేసికొను పద్ధతులు)
ప్రియులారా! సర్వ జనులను సృజించిన తండ్రియగు దేవునిబట్టి ప్రియులైయున్న వారలారా! అనాది దైవనామమున మీకు శుభము కలుగును గాక!
మరనాత.
వ్యాధిగ్రస్థులైన వారికి చేయు విన్నపము:
ఈ పుస్తకములోని సంగతులు బాగుగ చదువుకొని, ఆలోచించి,
దేవుని
ప్రార్థించి, వ్యాధినిబట్టి కలుగు భీతినుండి విముక్తులై, మన సృష్టికర్తను స్తుతించుడి. ఆపత్కాలమందు తల్లిదండ్రులు
జ్ఞప్తికి
వచ్చుట సహజము. మన తల్లిదండ్రులకును మనకును, సర్వజనులకును, సర్వసృష్టికిని తండ్రి దేవుడే గనుక ఆయన అందరికంటె గొప్పవాడు.
ప్రతి
విషయములోను, వ్యాధిస్థితిలోను మొట్టమొదట ఆయనను తలంచుకొనుటయు, ఆయన సహాయము కోరుటయు, యుక్తమై యున్నది. కాబట్టి ఆయనను గురించి
వివరించు కొన్ని ఉపదేశములను ఇందులో మిగుల క్లుప్తముగా పొందుపరచుచున్నాము.
1. ఆదిలేని కాలము (అనాది)
లోకములు కలుగకముందును, కాలము అనునది లేకముందును, మనమెరిగినది ఏదియు లేకముందును దేవుడొక్కడేయుండెను. మనకు కావలసిన సమస్తమును, తనలోని సద్గుణముల అనుభవమును మనకు ధారపోయుటకై, తుదకు మనలను కలుగజేయవలెనని ఆయన ఆదియందే (దేవుడు) తలంచుకొను చుండెను. పాపివైనను నీ మేలు గురించి దేవుడానాడే ఆలోచించుకొనెను. ఎంత ప్రేమ! ఎఫెసీ. 1:6.
2. దైవ లక్షణములు
1) దేవుడు ప్రేమ గలవాడు. మనము పాపమువలన చెడిపోయినను, మనమీద ఆయనకు ప్రేమ. పాపములు పరిహరించుటకై ఆయన మనలను ప్రేమించుచున్నాడు. మనము అజాగ్రత్త వలన జబ్బుపడియున్నను, ఆయనకు మనమీద ప్రేమ గనుక బాగుచేయుటకై, ఆయన మనలను ప్రేమించుచున్నాడు. మనము తెలివి తక్కువవలన ఎన్నో కష్టములలో చిక్కుకొనియున్నను మనమీద ఆయనకు ప్రేమ గనుక ఆ చిక్కులను విడదీయుటకై ఆయన మనలను ప్రేమించుచున్నాడు. వైద్యునికి ఆయన ప్రేమను దయచేయని యెడల రోగి జబ్బు పోవునా? పోదు. ఇంకా ఎక్కువగును గదా? అప్పుడు వైద్యునికి ప్రేమలేదని చెప్పవచ్చునా? అట్లే దేవుడు తన ప్రేమను దయచేయని యెడల మన కీడు తొలగునా? ఎక్కువగునుగదా? అప్పుడు దేవునికి ప్రేమలేదని చెప్పవచ్చునా? దేవుడు ప్రేమయైయున్నాడు. ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమగలవానిగా మార్చగలదు.
2) దేవుడు పరిశుద్దుడు గనుక ఆయనవలన పాపము రాలేదు. ఏ చెడుగును రాలేదు. అన్నిటిని ఆయన కలుగజేసెను గాని పాపమును కలుగజేయలేదు. పరిశుద్దుడు ఎట్లు పాపమును కలుగజేసెనని మీరనుకొందురు? పరిశుద్ద దేవుడు మిమ్మును పరిశుద్దులనుగా జేయగలడు.
3) దేవుడు శక్తిమంతుడు, ఇంత పెద్దలోకమును అంతపెద్ద ఆకాశమును చేసినవాడు గనుక ఎంత గొప్ప శక్తిమంతుడో ఆలోచించుకొనుడి. మనకు ఏదిబడితే అది చేసిపెట్టగలడు. శక్తిగల దేవుడు మిమ్ములను శక్తిమంతులనుగ చేయగలడు.
4) ఆయన జ్ఞాని గనుక ఆయనకు మన కష్టములు అక్కరలు ముందే తెలియును. గనుక మన విన్నపములు గ్రహింపగలడు.
5) దేవుడు న్యాయవంతుడు గనుక ఎవరికి ఏ మంచిస్థితి అనుగ్రహింపవలెనో వారికి ఆ మంచిస్థితి అనుగ్రహించును.
6) దేవుడు సర్వవ్యాపి అనగా అన్ని స్థలములలో నుండువాడు గనుక మనము కొండలలోనున్నను, సముద్రములోనున్నను, శత్రువుల దగ్గరనున్నను, ఎవరు లేనిచోట ఉన్నను భయపడనక్కరలేదు.
7) ఆయనలోని ఈ మంచితనములకు ఆదిలేదు అంతములేదు. ఇట్టి దేవుని నమ్ముకొని యుండుట ఎంత ధన్యత!
3. దూతల సృష్టి
దేవదూతలు పరిశుద్ధులు, ఆత్మ స్వరూపులు: వారికి మనకున్నట్లు శరీరములేదు. గనుక మన కంటికి కనబడరు. ఒక నిమిషములో ఎన్నివేల మైళ్ళ దూరమైనను ప్రయాణము చేయగలరు. మహా బలిష్టులు, ఎంత గొప్ప పనియైనను నెరవేర్చగలరు. వారికి మనమీద ఎంతో అభిమానము. దైవాజ్ఞనుబట్టి మనకు అన్నిటిలో సహాయము చేయగలరు. వారు మన మిత్రులు. ఇది నమ్మువారు ఎంత క్షేమప్రాప్తులు!
4. సాతాను (లూసీఫర్)
పరిశుద్ధ దూతలలో ఒక ప్రధానదూత దేవునిమీద ఎదురు తిరిగి, తనతో అనేకమంది దూతలను జట్టు చేసికొనెను. నేను దేవునికంటే ఎందుకు గొప్పగా ఉండకూడదు! అని అనుకొని చాల గర్వించెను. అందుచేత తానును, తనవారును దేవుని వెలుగులో ఉండ వీలులేకపోయెను. వారందరు కలిసి యొక చీకటి రాజ్యముగా ఏర్పడిరి. దేవుడు చేయు ప్రతి పనిని చెడగొట్ట జూచుటే వారి పని. ముఖ్యముగా మనుష్యులను చెడగొట్టుటయే వారి ముఖ్యోద్దేశము. వారు మానవులకు దేవునియందు అభిమానము లేకుండ చేయుచున్నారు. దేవుడు ప్రేమయై యుండగా, దేవునిలో ప్రేమలేదను తలంపు నరుల హృదయములో వారు కలిగించుచుందురు. మనుష్యులు చేయు చెడు పనులన్నియు, వారి ప్రేరేపణవల్ల జరుగుచున్న పనులే. (కావున ఆ దూతకు "సాతాను" అను పేరు వచ్చినది. అతని జట్టు వారికి పిశాచములని పేరు వచ్చినది).
5. లోకముల సృష్టి
మనకొక గొప్ప ఇల్లు ఉన్నది - అది ఈ భూమి: దానికొక కప్పుకలదు - అది ఆకాశము. మన ఇంటికి దీపాలు ఉన్నవి - అవి సూర్య చంద్ర నక్షత్రములు. భూమిమీద ఒక మంచి మెత్తని తివాచి పరచబడినది - అది గడ్డి: మనకు దాహశాంతిని, శుద్ధిని కలిగించు సాధనములు కూడ అందులో ఉన్నవి - వాన, నదులు. ఈ భూమి అందించు మధురాహారము - వృక్ష ఫలములు మనమాడుకొను ఆట వస్తువులుకూడ ఇందులో ఉన్నవి - అవి జంతువులు, పక్షులు, చేపలు. మనకు ప్రాణాధారము - గాలి. మనకు మందునకు ఔషదములు కావలెనని ఆయన మూలికలను, ధనము కావలెనని బంగారము, వెండి, మొదలగు లోహములను అమర్చి పెట్టియుంచెను. అన్నియు సిద్ధముచేసి అప్పుడు నరులను చేసెను. (సృష్టిలో నరుడు ఎంత కడవరి వాడైనను, దేవుని దృష్టిలో మాత్రము అతడు మొదటివాడైనట్టు కనబడుచున్నది) దేవుడెంత జ్ఞాని! నమ్మితే నరుడెంత ఐశ్వర్యవంతుడు! ఎంత ధనికుడు! ఎంత ధన్యుడు!
6. నరుల సృష్టి
దేవుడు నరుని సృజించినప్పుడు తనలోని గుణములనుపెట్టి సృజించెను. అందుచేతనే మనుష్యునిలోగూడ ప్రేమ, శక్తి, జ్ఞానము, మంచి తనము, న్యాయము మొదలైన సుగుణములున్నవి. కాబట్టి మానవుడు కేవలము దేవుని పోలికే అని చెప్పుకొను చున్నాము. ఆదిలో దేవుడును, నరుడును కలిసి మెలిసి యుండువారు. దేవుడు అతనికి కనబడి మాటలాడెను. నరుడును దేవునితో చనువుగ మాటలాడెను. దేవుని సహవాస భాగ్యమతనికి కలిగియుండెను. ఆకాశముకంటెను, భూమికంటెను, వాటిలోనున్న వాటికంటెను మనుష్యుడే గొప్పవాడు. మనుష్యుడే సమస్తమునకు అధికారి గనుక అతడు సృష్టికి మ్రొక్కుటకు వీలులేదు. అతడు వాటిని కలుగజేసిన దేవునికి మ్రొక్కవలెను. నరునిది ఎంత గొప్పస్థితి! ఎంత గొప్ప అంతస్థు!
7. నరులు పాపములో పడినకాలము
దేవుడు మొదట కలుగజేసిన నరులు ఇద్దరు. పురుషుని పేరు ఆదాము. స్త్రీ పేరు హవ్వ. అప్పుడు సర్వసృష్టి మహా శృంగారముగా నుండెను. వీరును మహా శృంగారవంతులై యుండిరి. వీరిలోఉన్న శుభలక్షణములు ఉపయోగపరచు కొనుటకై దేవుడు వారికొక ఆజ్ఞనిచ్చి చూచెను. గాని వారు దైవాజ్ఞకు భిన్నముగా సాతాను పలికిన వాక్కును వినినందున పాపములో పడిపోయిరి. అప్పటినుండి వారి సద్గుణములన్నింటికి లోపము కలుగనారంభించెను. అదివరకు వారితో జతగానున్న జీవరాసులు, వారిమీద తిరగబడినవి. సృష్టి యావత్తును వారికి వ్యతిరేకమాయెను. భూమిమీద ముండ్లతుప్పలు మొలిసినవి. వారు దేవునినుండి వేరైపోవలసి వచ్చెను గాని దేవుడు వారిని విడిచి పెట్టక, లోక రక్షకుని పంపెదనని వాగ్ధాన మొకటి సెలవిచ్చెను. అది వారికి గొప్ప ఆదరణ కలిగించెను. వారిపాపము, వారి సంతానములో కూడ చొరబడెను. కాలక్రమమున జనసంఖ్య వృద్ధిపొందు చుండగా, పాపమును వృద్ధిపొందెను. ఇది ఎంత దుఃఖకరమైన సంగతి! దేవుని మాట వినిన యెడల ఇంతమట్టుకు రాకపోవునుగదా!
8. నిరీక్షణ కాలము
రక్షకుని రాకడకు పూర్వమందున్న భక్తులు, ఆయన రాకడ వాగ్ధానమును నమ్ముచు ఎదురుచూచిన కారణము చేతనే మోక్ష వాసులైరి. భూమి మీద జరుగనైయున్న రక్షకుని చరిత్రాంశములన్నియు, క్రమేణ వారికి ముందుగనే తెలిసినవి.