దైవిక స్వస్థత
(అపో.కార్య. 3:16)
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
1. ప్రశ్న: దైవిక స్వస్థత అనగానేమి?
జవాబు: వ్యాధిని బాగుచేయుటకు వైద్యునకు ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వగా ఆయన ఔషధము వేయకుండ తన ప్రభావమువల్ల రోగిని బాగుచేయును. దీనినే దైవికస్వస్థత అని అందురు.
2. ప్రశ్న: దేవుడు దేనిచేత బాగుచేయును?
జవాబు: కొందరు బైబిలు చదువుకొనుటవల్ల బాగుపడుదురు. కొందరు స్తుతి చేయుటవల్ల బాగుపడుదురు. కొందరు “ప్రభు యేసు రక్తమునకు జయమని” చెప్పుటవల్ల బాగుపడుదురు. కొందరు - దేవుడు నా జబ్బు బాగుచేసినాడని నమ్మి, రోగమును మరచివెళ్ళుటవల్ల బాగుపడుదురు కొందరు ప్రభుయేసు పేరు ఉచ్చరించుట వల్ల బాగుపడుదురు. (అనగా యేసు నామమువల్లనే రక్షణ) ఈ నామమువల్లనే రోగ నివారణ అని పలుకుటవల్ల బాగుపడుదురు. కొందరు ప్రభువు భోజనము పుచ్చుకొనుటవల్ల బాగుపడుదురు. కొందరు వ్యాధి ఉన్నను, పక్షవాయువు రోగివలె నడచుటవల్ల బాగుపడుదురు. కొందరు ప్రార్థనలో కనిపెట్టుటవల్ల బాగుపడుదురు. కొందరు నమ్మి బాగుగా నిద్రపోవుటవల్ల బాగుపడుదురు. కొందరు దేవునిమీద ఆనుకొని, ఆయన దీవెనకోరి ఔషదము వేసికొని బాగుపడుదురు.
"ఓ వ్యాధీ! పిశాచీ! క్రీస్తుప్రభువు నిన్ను వెళ్లగొట్టుటకు మాకు అధికారము ఇచ్చినాడు” అని పలుకుటవల్ల బాగుపడుదురు. కొందరు విశ్వాసముతో పత్యపుకూరలు మాని, సామాన్యాహారము సంతోషముతో భుజించుటవల్ల బాగుపడుదురు. కొందరు స్తుతి కీర్తనలు పాడుటవలన బాగుపడుదురు. కొందరు విశ్వాసులను పిలిచి, ప్రార్ధనను పెట్టుకొనుట ద్వారా బాగుపడుదురు. కొందరు ప్రభువును అడిగి స్వప్నములోనో, దర్శనములోనో తెలియబడిన మందులువేసికొని బాగుపడుదురు. కొందరు బైబిలులోని స్వస్థత వాక్యములన్నియు చదువుట వల్ల బాగుపడుదురు. కొందరు ప్రభువు దర్శనములో ముట్టుకొన్నట్టు చూచి బాగుపడుదురు. కొందరు ప్రభువు యొక్క సన్నిధి నాయొద్దగలదు అని స్పర్శజ్ఞానమువల్ల తెలిసికొని బాగుపడుదురు. ఒకరికి తీవ్రమైన జ్వరమువచ్చినప్పుడు - "ఓ పిశాచీ! నీవు నన్ను గెలువవలెనని వచ్చినావా? నేను గెలువలేననుకొన్నావా? ప్రభువే నా వైద్యుడు పో!" అని పలుమార్లు మంచము మీద ఇటు అటు దొర్లుచు బాగుపడిరి. ఒక రోగికి ప్రభు ప్రార్ధనచెప్పి, చేయించగా బాగుపడిరి. ఒకరు ప్రభు యేసునందు నీకిచ్చుచున్న ఈ నీళ్ళు త్రాగుమని చెవ్పగా త్రాగి బాగువడెను. ఒకరు మిక్కిలి జబ్బుగానున్నప్పుడు, ఒక విశ్వాసికి కబురు పంపిరి. ఆయన ఇంకను దారిలో యుండగానే వ్యాధి తగ్గనారంభించెను.
షరా: సమస్తమును విశ్వాసమునుబట్టియు, ప్రభువు నామ స్మరణనుబట్టియు నుండును. ఒకరు ప్రభువు నామమున స్నానముచేసి బాగుపడిరి. కొందరు బాప్తిస్మము పొంది బాగుపడిరి. కొందరు ఉపవాస ప్రార్ధనలో బాగుపడిరి. ఇవి అనుభవ చరిత్రలు. విశ్వాసీ! నీ అనుభవము ఎట్లున్నదో చూచుకొనుము.
3. ప్రశ్న: కొందరు, ఎన్ని ప్రార్ధనలు చేసినను, జబ్బులు పోవుటలేదు, ఎందుకో?
జవాబు: ఆత్మీయ జీవితములో ఏదోయొక బలహీనతయుండుట ఒక కారణము. గత కాలమందు ఒకరికి విరోధముగా చేసిననేరము, వారియొద్దకు వెళ్ళి ఒప్పుకొనకపోవుట ఒక కారణము. ప్రభువును పూర్తిగా నమ్మకపోవుట ఒక గొప్ప కారణము. ప్రార్ధన చాలకపోవుట ఒక కారణము. వ్యాధికాలమున - ప్రభువు ఆదుకొనే సమయమైయున్నది గనుక ఆ సమయము అయిన తరువాత స్వస్థత కలుగును. శ్రమలు మానవుని ఉపయోగార్థమై, దేవుడు వాడుకొను సాధనములై యున్నవని విశ్వాసి మరువరాదు. వ్యాధి సమయము దేవుడు మాట్లాడే సమయము, దిద్దుబాటు సమయము. శిక్ష రక్షణను అందించే సమయము, జ్ఞానోపదేశ సమయము, విశ్రాంతి సమయము, ఇతరుల పరిచర్య లక్షణము వెల్లడియగు సమయము, ప్రార్ధన స్తుతుల సమయము, ఇంత విలువైన సమయమును, అపవాది విసుగుదల సమయముగా వాడుకొనును. కనుక మెళకువగా నుండండి. "ఇంకను జబ్బు ఎందుకు పోలేదు?" దేవునికి నామీద దయలేదు. ఇంతమంది ప్రార్ధనలు ఏ నీట కలిసిపోవుచున్నవో? ప్రార్ధన మానివేస్తే బాగుండును అని ఇటువంటి మాటలు అనుకొనుటవల్ల జబ్బుపోదు. జబ్బుకాలము పరలోకముయొక్క మహిమకును సిద్దపడేకాలము.
4. ప్రశ్న: జబ్బు బాగుచేయుట ప్రభువుకు ఇష్టమో, కాదో మాకెట్లు తెలియును?
జవాబు: ఇష్టముకలదనియు, శక్తికలదనియు మత్తయి 8వ అధ్యాయమువల్ల తెలిసికొనవచ్చును. ఇది విశ్వాసికి ఆదరణగా ఇవ్వబడిన అధ్యాయమని చెప్పుదురు. నరుడు జన్మింపకముందే, భూమ్యాకాశములు అతని సదుపాయము నిమిత్తమై కలుగజేసిన దేవుని ప్రేమకు, ఇష్టము ఉండదా? ఇంత పెద్దలోకమును కలుగజేసిన దేవుని శక్తికి, శక్తి యుండదా?
5. ప్రశ్న: జబ్బును బాగుచేయుట బైబిలులో నున్నది. కాని అది పూర్వకాల అద్భుతముగాని నవీన కాలాద్భుతము గాదు. ఇది నిజమా?
జవాబు: బైబిలు అన్ని కాలములకు వ్రాయబడియున్నది. అవుననే వారికి అవును, కాదనేవారికి కాదు! క్రీస్తు ప్రభువు అన్ని కాలములకు రక్షకుడైయున్నాడు. శరీరాత్మల వైద్యుడై యున్నాడు.
6. ప్రశ్న: ఒకరు అన్ని షరతుల ప్రకారము చేసినను బాగుకాలేదేమి?
జవాబు: గడిచిన కాలమందు దేవుడు చేసిన మేళ్ళు తలంచుకొని కృతజ్ఞత కనబరచినాడా? లేదు. దైవలక్షణములను కొనియాడినాడా? వాక్యమును, కుమారుని యాత్మను ఇచ్చినావు తండ్రీ! నీకు స్తోత్రములు అని చెప్పినాడా? లేదు. అందుచేతనే పోలేదు.
7. ప్రశ్న: ఇవన్నియు చేసినను, ఒకరికి పోలేదు ఎందుకు?
జవాబు: "ప్రభువా! నీ ప్రేమనుబట్టి జబ్బు రానిచ్చినావు" అని స్తుతించలేదు అందుచేతనే పోలేదు.
8. ప్రశ్న: జబ్బులు బాగుచేయించుకొనగోరువారు ఏమిచేయవలెను?
జవాబు: మిత్ర, స్వస్థి పత్రిక, సదర్ధము, ప్రార్ధనమెట్లు, వారబోధిని, దైవసన్నిధి, రాకడ ధ్వని, ప్రకటన వివరము, పరమగీత వివరము, విమలాత్మ ప్రోక్షణము, ఆరాధన క్రమము, తెలుగు క్రైస్తవ కీర్తనలు, ఇవన్నియు బైబిలు మిషనుయొక్క వ్రాతలై యున్నవి. ఇవి చదువుట మంచిది.
9. ప్రశ్న: దేవుడే జబ్బును పంపుచున్నాడనుచున్నారు, ఇది నిజమా?
జవాబు: దేవుడే జబ్బులు పంపితే వ్యాధులు బాగుచేసికొను మూలికలు ఎందుకు సృజించెను? వాగ్ధానములు, స్వస్థత చరిత్రలు, బైబిలులో ఎందుకు వ్రాయించెను? ప్రభువు సిలువ మ్రానుమీద మన వ్యాధులను ఎందుకు భరించెను? (యెషయా 53, మత్తయి 8) వ్యాధి ఆయనే పంపితే, మనిషి పూర్తిగా నశించును. దేవుడు తన సృష్టికి హాని చేయునా? తండ్రి, తన బిడ్డలను నాశనము చేయగలడా? రోగులను బాగుచేసెనను బైబిలు కథలు, దయ్యములు వెళ్ళగొట్టెనను బైబిలు కథలు చదువువారు, దేవుడు వ్యాధులకు కారకుడని చెప్పలేరు.
10. ప్రశ్న: విశ్వాసము లేకపోతే జబ్బు పోదా?
జవాబు: పోదు.
11. ప్రశ్న: అట్లయితే క్రీస్తుకంటే విశ్వాసము గొప్పదా?
జవాబు: విశ్వాసము, క్రీస్తు ప్రభువు అనుగ్రహించునట్టి స్వస్థతను అందుకొనే హస్తమై యున్నది.
12. ప్రశ్న: వ్యాధికి కారకుడెవరు?
జవాబు: సాతానులో నుండి పాపము వచ్చినది. ఆ పాపమువల్ల వ్యాధి, ఇబ్బంది, నష్టము, హాని, మరణము, తుదకు నరకము ఇవన్నియు వచ్చెను. పాపమువల్లనే అజాగ్రత్త, అశుభ్రత, అనాగరికత, అనాచారము, అజ్ఞానము ఈ మొదలైనవి వచ్చెను.
13. ప్రశ్న: ముల్లు గ్రుచ్చుకొనుట, పడిశము పట్టుట, వేడిచేయుట, ఇవికూడ పాపపలితములేనా?
జవాబు: పాపఫలితములగు అజాగ్రత్తలు వీటికి కారణములు.
14. ప్రశ్న: రాజైన ఆసా మందు వేసికొనుటవల్ల శిక్షనొందెననుట నిజమా?
జవాబు: దేవునిని ఆశ్రయింపక, వైద్యులను ఆశ్రయించుటవల్ల శిక్ష కలిగెను. “నాకు వేరుగానుండి మీరేమియు చేయలేరు” అని ప్రభువు చెప్పినమాట జ్ఞాపకముంచు కొనవలెను.
15. ప్రశ్న: మార్కు 5:27,28 ప్రకారము వస్త్రము ముట్టుకొనుట వల్లను, అపో.కార్య. 5:15, 16లో ఉన్నట్లు విశ్వాసుల నీడపడుట వలనను రోగులు బాగైనారనుట నిజమా?
జవాబు: ప్రభువుయొక్క అంగీ ముట్టుకొనుట వల్ల ఒక రోగి యొక్క వ్యాధి అంతరించెను. ఇది విశ్వాసమునుబట్టి కలిగెను (లూకా. 8:44).
16. ప్రశ్న: ప్రభువు బాగుచేసినట్లు విశ్వాసులు ఇప్పుడు బాగుచేయకూడదా?
జవాబు: ఇది ఇప్పుడును కొందరిద్వారా జరుగుచున్నది. పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవరిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను, పరుపులమీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణపు జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని వచ్చిరి. "వారందరు స్వస్థత పొందిరి" అని అపో.కార్య. 5:15,16లో చూడగా నేటి విశ్వాసులకు కూడ అట్టి స్వస్థత కూటములు పెట్టవలయునను ప్రేరేపణ కలుగక మానదు.
17. ప్రశ్న: ఇది స్వస్థతవరము పొందినవారివలననే గాక మరి ఎవరివల నైనను జరుగదా?
జవాబు: విశ్వాసుల అందరివల్ల జరుగునుగాని కొందరు వరము నిమిత్తమై ప్రయత్నము చేస్తే బాగుండును. అట్టివారు స్వస్థతను గూర్చిన పుస్తకములు చదువవలెను. రక్షణ సంకల్పన, ప్రార్థనమెట్లు, స్వస్థి పత్రిక, ఈ మూడు చదివినవారు ఈ పని చేయగలరు.
18. ప్రశ్న: విశ్వాసమువల్ల పూర్ణ ఆరోగ్యము కలుగునా?
జవాబు: ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. పక్షిరాజు యౌవనమువలె నీ యౌవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు (కీర్తన. 103:1-5).
19. ప్రశ్న: ప్రభువువద్దకు వచ్చువారందరు బాగుపడిరా?
జవాబు: "ఈ జబ్బు బాగుచేయుట నావల్లకాదు. నిన్ను బాగుచేయుట నా కిష్టములేదు" అని ఆయన ఎవరితోను అనలేదు.
20. ప్రశ్న: విశ్వాసము లేనివారినెవరినైన బాగుచేసేనా?
జవాబు: తాను దేవుడైయున్నాడని కనబరచునట్లు ఒకరిని బాగుచేయడము ఇది బహు ఆశ్చర్యకరమైన కథ. పేతురుచే నరుకబడిన మల్కు చెవిని ప్రభువు వెంటనే బాగుచేసెను.
21. ప్రశ్న: ప్రభువు బాగుచేసిన వారందరిలో విశ్వాసముండెనా?
జవాబు:
- 1) పిచ్చివాడు నమస్కరించెను. అదే విశ్వాసము.
- 2) గ్రుడ్డివారు నమ్ముచున్నామనిరి. అదే విశ్వాసము.
- 3) చెవిటి నత్తివాడు, వచ్చెను. ఇదే విశ్వాసము.
- 4) ఎండిన చెయ్యిగలవాడు ఊచచెయ్యి చాచెను. ఇదే విశ్వాసము.
- 5) కుంటివానిని నడువుమని చెప్పగా నడిచెను. ఇదే విశ్వాసము.
- 6) జలోదర రోగిని ఆయన చేరదీయగా చేరెను. ఇదే విశ్వాసము.
- 7) జ్వరము వచ్చిన నీ కుమారుడు బాగాయెనని ప్రభువు చెప్పెను. తండ్రి నమ్మెను. వెళ్ళిపోయెను. ఇదే విశ్వాసము.
- 8) కుష్టురోగులు ప్రభువు ఆజ్జచొప్పున వెళ్ళిపోయిరి. అదే విశ్వాసము.
- 9) పక్షవాత రోగితో ప్రభువు పరుపెత్తుకొని నడువుమని చెప్పగా నడిచెను. చెప్పినట్లు చేయుట విశ్వాసము.
- 10) రక్తస్రావరోగి వస్త్రము ముట్టుకొంటే బాగుపడుదుననుకొనెను. ఇదే విశ్వాసము.
- 11) బలహీనురాలిని ప్రభువు లేవనెత్తెను, విడుదల రాకముందే ఆమె నమ్మెను. ఇదే విశ్వాసము.
- 12) మల్కు చెవిని ప్రభువు బాగుచేసెను. అది నరుకబడిన చెవి అయినను, ఆయనను చేయనిచ్చుటే విశ్వాసము.
22. ప్రశ్న: ప్రభువే వైద్యుడని ఎక్కడైనా నున్నదా?
జవాబు: ఆయన సమస్త రోగములను, దయ్యములను పట్టిన వారిని బాగుచేసెను (మత్తయి 4:24).
23. ప్రశ్న: విశ్వాసము లేకుండా ప్రయత్నిస్తే జబ్బుపోదా?
జవాబు: పోదు. నమ్మిన ఇశ్రాయేలీయులు పాయలోబడి వెళ్ళుటచూచి, ఐగుప్తీయులును వెళ్ళిరిగాని మునిగిపోయిరి. వారికి దేవునియందు విశ్వాసములేదు గాని, నీటి గోడలమీద విశ్వాసము గలదు.
24. ప్రశ్న: ఒకానొకప్పుడు ప్రార్ధించిన కొలది వ్యాధి ఎక్కువగును. ఎందుచేత?
జవాబు: దయ్యమునకు కోపము గనుక. నీయొక్క విశ్వాసమును పరీక్ష స్తుతియొక్క పురి ఎక్కించుచునే యుండును.
25. ప్రశ్న: ఒక స్త్రీ ఇట్లనెను. వ్యాధి పోలేదని నా శరీరము చెప్పుచున్నది. వ్యాధి పోయినదని వాక్యము చెప్పుచున్నది. ఏది నిజము? అని ఇట్లు చెప్పుచు లేచి నడిచినది. కొన్ని మార్లు పడినదిగాని తుదకు జబ్బు పోయినది. ఈ కథ ఒక బోధకుడు చెప్పినాడు. ఇది జరిగినకథ అంటారా?
జవాబు: అవును, అందుకు సందేహమేమి? వాక్యమే నిజము. గనుక ఆలాగు జరిగి తీరుతుంది.