9. పాపముల జాబితా
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
- 1) దేవుడుండగా ఆయన కలుగజేసిన సూర్యునికి, చంద్రునికి, భూమికి అందులోని మన్ను కర్ర, రాయి, వెండి, బంగారము మొదలగు వాటితో చేసిన బొమ్మలకు, వృక్షములకు, జీవరాసులకు, మనుష్యులకు, దయ్యములకు మ్రొక్కుట - ఇవన్నియు పాపములే. వీటికి, ఏ వంకమీద మ్రొక్కినను పాపమే.
- 2) దేవుని పేరు ఎత్తి అసత్య ప్రమాణము చేయుట. దేవుడే పాపమునకు, పాపఫలమునకు మూలకర్త అనుకొని ఆయనమీద విసుగుకొని దూషించుట పాపమే.
- 3) దైవారాధనను, దైవబోధను నిర్లక్ష్యము చేయుట, ఆయన ఉపకారములను తలంచి ఆయనకు వందనములు ఆచరింపక పోవుట ఇవన్నియు పాపములే.
- 4) తల్లిదండ్రుల మాట, పెద్దల మాట, అధికారుల మాట వినకపోవుట ఇవన్నియు పాపములే. (వారిమాట దేవునిమాటకు వేరుగా తోచిన యెడల, దేవుని మాట మాత్రమే వినవలెను).
- 5) ఒకరిని కష్టపెట్టుట, ధర్మము చేయకపోవుట, కష్టస్థితిలోనున్న వారికి సహాయము చేయకపోవుట, కొట్టుట, చంపుట ఇవన్నియు పాపములే. జీవరాసులను బాగుగా చూడకుండుట, హింసించుట ఇవి పాపములే.
- 6) వ్యభిచరించుట, భార్యభర్తలలో ఐకమత్యతలేకుండుట, వేరైపోవుట ఇవన్నియు పాపములే.
- 7) దొంగిలించుట, అన్యాయ వర్తకము చేయుట, తప్పు లెక్కలు చూపించుట ఇవియు పాపములే. దేవుడు మనకిచ్చిన సొమ్మును సామానులను సరిగా వాడకపోవుట పాపమే. దేవుని పనికి ధారాళముగ చందాలియ్యక పోవుట పాపమే.
- 8) ఒకరిమీద చెడ్డ సంగతులు కల్పించుట, మంచి పేరు చెడగొట్టుట, చాడీలు చెప్పుట, న్యాయసభలలో అబద్ధ సాక్ష్యమిచ్చుట, రహస్యముగా ఉంచవలసిన సంగతులు వెల్లడిచేయుట ఇవన్నియు పాపములే.
- 9) ఇతరులకు కలిగియున్నది ఆశించుట, అది తన వశము చేసికొన ప్రయత్నించుట ఇవికూడ పాపములే.
- 10) చెడుగు తలంచినను, మాటలాడినను, చేసినను, చేయజూచినను పాపమే. చెడుగు చేయుట మాత్రమే పాపము కాదు, మంచి చేయకుండుటకూడ పాపమే.
అన్నింటిలోకెల్ల ఏది గొప్ప పాపమో? దేవుని నమ్మకపోవుటే గొప్ప
పాపము అని నేననుకొనుచున్నాను. దేవుని నమ్ముటవలన అన్ని భాగ్యములు సంపాదించగలము. నమ్మకపోవుట వలన అన్ని భాగ్యములు
పోగొట్టుకొందుము. నమ్మని వారికి నరకము, నమ్మినవారికి మోక్షము. ఆమేన్.
నరకము తప్పించి మోక్షము అనుగ్రహించుటకై,
దేవుడు
పనిగట్టుకొని ఈ భూమిమీదకు వచ్చి, మన శరీరము ధరించుకొని, యేసుక్రీస్తు అను నామమున వెలసిన సంగతిని నమ్మనియెడల, మంచి
సంగతులెన్ని నమ్మినను ప్రయోజనమేమి? ఆ ఇతర వృత్తాంతములు కావు మనలను రక్షించునవి. ఈ యొక్క వృత్తాంతమే మనలను రక్షించునది.
దేవుడే మీకు నచ్చచెప్పును గాక!