13. బైబిలు గ్రంథము

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)


ఇది దైవభక్తులు దైవాత్మ ప్రేరేపణ చేత వ్రాసిన గ్రంథము. దేవుడు మనకు చెప్పవలసిన మాటలన్నియు దీనిలోనున్నవి. దేవుడు సర్వలోకములను ఎంత పరిశుద్ధముగా సృజించెనో, నరులు ఎట్లు పాపములో పడిపోయిరో, ఏది చేసిన పాపమో, ఏది మానిన పాపమో, ఏది చేసిన మంచిదో, ఈ గ్రంథము తెలియజేయును. రక్షకుని పంపించెదను అని దేవుడు వాగ్ధానములు చేయుచు, ప్రజలలో ఆశనెట్లు వృద్ధిచేసెనో, చివరకు దేవుడు నరావతారమెత్తి యేసుక్రీస్తు అను నామమున ఎట్లు ప్రత్యక్షమాయెనో, ఆ నామమున క్రైస్తవమతమెట్లు స్థాపన యాయెనో, క్రీస్తు ప్రభువు మరలవచ్చి విశ్వాసులను మాత్రమే మహిమ శరీరముతో మోక్షమునకెట్లు తీసుకొని వెళ్ళునో, సర్వజనులకు క్రీస్తు సువార్త మరల మహా తీవ్రముగా ఎట్లు ప్రకటనయగునో, అవిశ్వాసులకెట్లు తీర్చుకలుగునో, ఇట్టివన్నియు ఈ గ్రంథములోనున్నవి. ఇది అనుదినము చదువుచున్న యెడల దేవుడు మనతో మాటలాడుచున్నట్లుగానే యుండును. ఇకముందుకు ఇవి జరుగును అని చెప్పిన సంగతులు, ఆయాకాలములలో జరిగినవి. ఇప్పుడు మన కాలములోను జరుగుచున్నవి. త్వరలో లోకమందంతటను జరుగవలసిన మార్పులు బైబిలులోని చివర పుస్తకములో వివరముగా నున్నవి. అందుచేత 75 రూపాయలు చెల్లించి, బైబిలు కొనుక్కొని అందరు చదువవలసినదే. ఇది దేవుడు మనకు వ్రాసి పంపిన గొప్ప ఉత్తరము. బైబిలును ఇప్పటికి 2000 భాషలలోనికి మార్చినారు. ప్రపంచములోని ఏ గ్రంథము, ఇన్ని భాషలలోనికి రాలేదు. క్రైస్తవమతము సర్వలోక మతము, గనుక ఆ మత గ్రంథమగు బైబిలు సర్వభాషలలోను అచ్చుపడవలెను, సర్వ దేశములలోను ప్రకటన కావలెను. దేవుడొక్కడే గనుక దేవుని గురించి బోధించునట్టి గ్రంథమును ఒకటే. ఆ గ్రంథమును అనుసరించు మతమును ఒకటైయుండుట ధర్మమై యున్నది.