రెండవ దానస్వస్థి (1950)

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)



వినండి, పరీక్షించండి సరియని తోచిన అవలంబింతురు గదా! భేదాభి ప్రాయములున్నను ద్వేషము, కలహము కూడదు.


చదువరులారా! వినువారలారా! సర్వలోక సృష్టికర్తయైన దేవుని నామమునుబట్టి మీకు శుభము కలుగునుగాక! అనారోగ్యవంతుల అనారోగ్య నిమిత్తమై గుంటూరు సమాపమున నున్న కాకాని స్వస్థిశాలలో ప్రతి సోమవారమున 1949వ సం॥ము నుండి బోధలు, దైవ ప్రార్ధనలు జరుగుచున్నవి. వందలాది ప్రజలు స్వస్థత పొందినట్లు ఇచ్చట సాక్ష్యమిచ్చిరి. కొందరు వెంటనే, కొందరు ఇంటివద్ద, కొందరు కొన్ని పర్యాయములు శాలకు వచ్చిన తర్వాత బాగగుచున్నారు. దేవుడు నరుల రక్షణార్థమై యేసుక్రీస్తుగా వచ్చిన లోకరక్షకుడగు వ్యక్తినిగూర్చిన విషయములు ప్రజలు విని నమ్మిక కలిగి ఆనందపడుచున్నారు. బోధవలన ఆత్మీయ జీవనమునకు పాప పరిహారమును, శరీరమునకు ఆరోగ్యమును కలుగును. దేవుడు తన వాక్కును పంపి ప్రజలను బాగుచేసెనని బైబిలులో నున్నది. కీర్తన 107:20.


బోధించుట క్రైస్తవ బోధకుల పని, శ్రద్దగా విని నమ్ముట అనారోగ్యవంతుల పని, మోక్ష ప్రవేశార్థమై పాపపరిహారమును, వ్యాధి పరిహారమును జరిగించుట యేసుక్రీస్తు ప్రభువుయొక్క పని. బోధకులు జబ్బులు బాగుచేయువారని ఎవరును తలంపరాదు. క్రీస్తు ప్రభువే బాగుచేయువాడని వారు కేవలము ప్రకటించువారై యున్నారు. బోధ విను వారందరు క్రైస్తవ మతస్థులగుదురా? అట్లే స్వస్థిశాలకు వచ్చు వారందరును ఆరోగ్యవంతులగుదురా? కొందరు బాగగుటలేదు ఎందుచేత?

వ్యాధిగ్రస్తుల విషయమై ఇక్కడ జరుగుపని ఏదనగా:
కీర్తనలు నేర్పించుట, బోధ వినిపించుట, దైవప్రార్థనలు చేయుట బాగైనవారిచేత సాక్ష్యములిప్పించుట, తైలాభిషేకము చేయుట; ఇది మతిహీనత, గుడ్డితనము, చెవుడు, నత్తి, కుంటితనము, జ్వరము, పక్షవాతము, కుష్టు, సుఖవ్యాధులు ఈ మొదలైనవి నివారణయైనవి. సంతానము లేనివారికి సంతానము కలుగుచున్నది. భూతపీడితులు విముక్తులగుచున్నారు. పశువుల రోగములుకూడ బాగైనవి. ముఖ్యముగా అనేకులకు ఆత్మశాంతి కలుగుచున్నది. దేవునికి వందనములు. బాగైనవారి సాక్ష్యములు ఈ పుస్తకమునందు చదువవచ్చును.


మా బోధ:
మనము జన్మింపకముందే మన ఉపయోగార్ధమైన సహాయ కారులుగా దేవదూతలను, వెలుగు, నీళ్ళు, గాలి, జీవము, ఆకాశము, భూమి, సముద్రము జీవరాసులు, వృక్షములు వెండి బంగారములు ఈ మొదలగు వాటిని కలుగజేసిన దేవునికి మన జబ్బులు బాగుచేయుటకు ఇష్టములేదా? ఇంత గొప్ప భూమిని, అంత విశాలమైన ఆకాశమును కలుగజేయగలగిన కర్తకు మనలను బాగుచేయుటకు శక్తి లేదా? నిరాకారుడైన దేవుడు నరులకు కనిపించుటకును, వారితో మాటలాడుటకును, రక్షణ మార్గోపదేశము చేయుటకును, వారియొద్ద నివసించుటకును, వారు అవలంభింపవలసిన మాదిరి చూపించుటకును, మేలు చేయుటకును, తాను దేవుడనని రుజువు పరచుకొనుటకును యేసుక్రీస్తుగా వెలసియున్నాడు.


ఆ ప్రభువు తన ప్రభావముచేత పాపులను క్షమించి, రోగులను ఔషధము లేకుండా బాగుచేసి బ్రతికించి సర్వలోక పాపపరిహారార్థమై యజ్ఞముగా ఇష్టముతో హతుడై మూడవనాడు బ్రతికివచ్చి విశ్వాసులకు కనబడి, మహిమ రూపముతో మోక్షమునకు వెళ్ళెను. తన బోధలు నమ్మి, బాప్తిస్మము పొందువారికి రక్షణ భాగ్యము కలదని ఆయన చెప్పినమాట పట్టుకొని, ఆయన నామధారులగు క్రైస్తవులు అన్ని దేశములకు వెళ్ళి ఒక 1800ల భాషలలో బోధ చేయుచున్నారు. నేను మరలవచ్చి విశ్వాసులను మోక్షమునకు తీసికొని వెళ్ళుదును అని ఆయన చెప్పిన మాటకూడ వారు ప్రకటించుచున్నారు. నేడు యేసుప్రభువు రాకడ మిక్షిలి సమిపముగానున్నది. ప్రార్థన పూర్వకముగా సిద్ధపడండి.


ఆయన వచ్చి, సిద్ధపడినవారికి మరణము లేకుండజేసి, వారిని తన యొద్దకు తీసికొని వెళ్ళును. మిగతావారికి ఏడేండ్లు గొప్పగొప్ప శ్రమలు కలుగును. ఆ శ్రమలలో అనేకులు ఆయన నామస్మరణ చేయుదురు. తరువాత ఆయన భూమిమీదకు వచ్చి వెయ్యి సంవత్సరములు శాంతి పరిపాలన చేయును. ఆ వెయ్యేండ్లు సాతాను చెరసాలలో ఉండి, తరువాత విడుదల పొంది, దేవునితో యుద్ధముచేసి ఓడిపోవును. ఆ తరువాత మృతులలోను, సజీవులలోను ఉన్న అవిశ్వాసులకు క్రీస్తుప్రభువు నరకము నియమించును. దానిలోనే పాపకారకుడగు సాతానును, అతని సహకారులును ఉందురు. ఈ సంగతులన్నియు బైబిలను దైవ గ్రంధములో గలవు.


యేసుక్రీస్తు అనగా నియమిత రక్షకుడని అర్ధము. ఈ పేరు మోక్షలోకమునుండి వచ్చినపేరు గనుక మోక్షము కావలసినవారు ఈ నామస్మరణ చేయవచ్చును. ప్రయత్నించి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు గనుకను, ఈయన మన మానవుల నిమిత్తమై మానవుడై యున్నాడు గనుకను, ఈయన సర్వలోకోపకారి గనుకను, ఈయన ప్రత్యేక రక్షకుడైయున్నాడు. "మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము". అని బైబిలు (అపో.కార్య. 4:12)లో ఉన్నది.


మూలికాదులను కలుగజేసి వాటిద్వారా ఔషదములను చేయు జ్ఞానమును నరులకు దయచేసిన దేవునికి స్తోత్రము. అగత్యమని తోచునపుడు ముందుగా దైవ ప్రార్ధన చేసికొని ఔషదములు వేసికొనవచ్చును. దేవుడు వాటిని దీవించును. స్వస్థిశాలలో ఔషదములు వేయము. పరుండునప్పుడు, సౌఖ్యకాలమపుడు, మరణ సమయమప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తలంపుతో నుండువారు ధన్యులు, మహాధన్యులు. ఎన్ని పనులున్నను మంచి సమయము, వీలు చూచుకొని ప్రతివారును రోజుకు అధమ పక్షము ఒక గంటయైనను, దైవధ్యానములో ఉన్నయెడల గొప్పమేలు కలుగును. చేసిచూడండి.