19. ప్రార్థన సంగతి
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
నీకేదైనా కావలసినప్పుడు దేవుని ప్రార్ధించుము. అడిగినది దొరకకపోయినను, దొరికినట్లే భావించుకొనుము. నీ ప్రార్ధన ముగింపులో ఆమేన్ అనవలెను.
20. విశ్వాసుల వ్యాధి
కొందరు క్రీస్తును నమ్ముకొన్నను జబ్బుగానే ఉందురు. ఎందుచేత? ఈ జబ్బు స్థితిలో విశ్వాసులు దేవుని స్తుతించుట వలన ఆయనకు కీర్తి కలుగును. అవిశ్వాసులు స్తుతింపలేరు. ఎన్ని కష్టములున్నను, దేవుడు ప్రార్ధన నాలకింపక వాటిని తొలగింపకున్నను, భక్తులు దేవుని మెచ్చుకొనుచునే యుందురు. ఇందువలన సాతానుకు పరాభవము కలుగును, దేవునికి ఘనత కలుగును. యోబు అనునొక భక్తుడు కలడు. సాతాను దేవుని యొద్ద సెలవు పొంది అతనిని చాల హింసించెను: యోబు యొక్క బిడ్డలు చనిపోయిరి, చాలమంది సేవకులు హతులైరి, పరజనులు వేలకొలది పశ్వాదులను తోలుకొనిపోయిరి, అతనికి ఒంటినిండ కురుపులు లేచినవి. అయితే ఆయన "దేవుడిచ్చెను దేవుడు తీసికొనెను, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక!" అని పలికెను. "దేవుని దూషించి మరణము కమ్మని" అతని భార్య దూషించెను. నీవు మూర్కురాలు మాటలాడునట్లు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలునే అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా! అని యోబు ఉత్తరమిచ్చెను. సుఖములోచేయు స్తుతికంటే, దుఃఖములో చేయుస్తుతి ఎంతో మెచ్చుకొన తగినది, స్తుతి చేయు భక్తుల కష్టముల మూలమున దైవరాజ్యమందు ఎన్ని నీతి పాఠములో ఎన్నో మహోపకారములు. ఈలాగు ఎన్ని దైవ కార్యములు బయలు వెడలునో ఎవరు చెప్పగలరు? మనము జీవించినను దేవునివారమే, చనిపోయినను దేవుని వారమే దేవుని వారమైయుండు భాగ్యము మాత్రము మనకు తప్పదు. విశ్వాసులకు గతింపని కష్టమున్న యెడల, క్రైస్తవులు దానిని శరీరములోని ముల్లు అని అందురు. పూర్వము పౌలు అను పేరుగల ఒక మత ప్రచారకుడుండెను. తన కష్టమును తొలగించుమని దేవుని ప్రార్థింపగా, "నా కృప నీకు చాలును" అని దేవుడు ఉత్తరమిచ్చెనే గాని దానిని తొలగింపలేదు.
21. ప్రార్ధన సంగతి
నీకు ఏదైన కావలసినప్పుడు దేవుని ప్రార్ధించుము. అడిగినది దొరుకకపోయినను దొరికినట్లే భావించుకొనుము. ఎందుకనగా ప్రార్ధనలు ఆలకింతునని దేవుడు వాగ్ధానమిచ్చియున్నాడు. దేవుడు నమ్మతగినవాడు. ఆ ప్రార్ధన విధమేమనగా:
- 1. మొదట నీ గదిలో మోకాళ్ళూని నీ యెదుట దేవుడున్నాడని నమ్ముము.
- 2. తర్వాత నీ పాపములన్నియు ఒప్పుకొనుము.
- 3. అటు తరువాత ఇకమీదట పాపము చేయకుండ నడచుకొనుటకు నా శక్తి కొలది నాకు తెలిసినంత మట్టుకు ప్రయత్నింతును అని ప్రమాణము చేయుము.
- 4. పిమ్మట నీ ప్రార్ధనలు దేవుడు విన్నాడని పూర్తిగా నమ్మి ఆయనను స్తుతించుము. దేవుడు నీ కొరకు నరజన్మమెత్తిన గడ్డైన పనికంటే, నీ మనవి ఆలకించు పని అంత గడ్డైనదా ఏమి?