22. ఒక మందలింపు

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)



“నేను నీకు శిక్షవిధింపను. నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుము” అని క్రీస్తుప్రభువు నొకప్పుడొక స్త్రీకి చెప్పిన మాటయొక్క భావము తెలిసికొనుడి. మరియు ఆయన స్వస్థత నొందిన ఒకనిని చూచి, “ఇదిగో నీవు స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము” అని మెళకువ చెప్పెను. ఈ మాటల అర్ధముగూడ గ్రహించుకొనండి.


23. అనుకరణము


అనుకరణము అనగా ఒకరు చేసినట్లు చేయ యత్నించుట. ఒకరు బోధించి ప్రార్ధింపగా, రోగులు బాగగుచున్నారని అట్లే చేయ జూచినయెడల స్వస్థత కలుగదు, రాదు. అందువలన దేవునికి అపకీర్తి కలుగును. రోగులు బాగగు వరము కావలసినవారు ఏమిచేయవలెనో వినుడి. మొదట పాపములు ఒప్పుకొనవలెను. ఆ తర్వాత ఇకమీదట పాపమును అనగా దుష్కార్యములను విసర్జింతునని తీర్మానించుకొనవలెను. పిమ్మట దైవచిత్తానుసారముగా సత్కార్యములు చేయుచు బ్రతుకుదును అని నిర్ణయించు కొనవలెను. అటు పిమ్మట దేవునికి సంపూర్తిగా సమర్పించుకొనవలెను. దేవుని వాక్య గ్రంథమగు బైబిలు బాగుగ నేర్చుకొనవలెను. ఇందువలన విశ్వాసము కలుగును. ఇది రోగులను బాగుచేయు విద్య బైబిలులోనున్నది. ఇది బాగుగ నేర్చుకొనవలెను. ఇది గొప్ప వరము. దేవుని ప్రార్ధించుకొని, ఆయన సమ్మతిని పొంది, సువార్త ప్రకటించు పనిమీద ఉండి, రోగుల నిమిత్తమై బోధయును, ప్రార్ధనయును చేయవలెను. దేవుడు తప్పకుండ రోగులను బాగుచేయునని నమ్మవలెను. ఇతరులను నమ్మింపవలెను. అప్పుడు రోగులు బాగుపడుదురు. ఇట్లు చేయక, అట్లు చేసిన యెడల దేవుని వాక్యమును, ఆయన సేవకులను వెక్కిరించినట్లుండును. గనుక గొప్ప హాని కలుగును. ఇది బాగుగా గ్రహించుకొనవలెను.