26. క్రీస్తు శిష్యుల సిలువ
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సిలువ రెండు విధములు.
- 1) కర్ర స్తంభమొక సిలువ,
- 2) బాధ యొక సిలువ.
క్రీస్తునకు ఈ రెండు సిలువలును గలవు. ఆయన శిష్యులకు రెండవ విధమైన సిలువగలదు. మన పాపములు, వ్యాధులు, శిక్షలు క్రీస్తు సిలువ వలన తీరిపోయినను, అవి ఆయన శిష్యులను ఇంకను బాధించుచునేయున్నవి. క్రీస్తునకు సర్వజనుల పాపభారము గలిగినందున, ఆయన సిలువ మహా కఠినమైన సిలువ. విశ్వాసి తన ఒక్కడి పాపభారము మాత్రము కలిగియున్నందున, అతని సిలువ అంత కఠినమైనది కాదు. విశ్వాసి ఇట్లనుకొనును: నా ప్రభువు సిలువయెదుట నా సిలువ ఏ మూల? నా సిలువ వలన రాదగిన కీడు, నా రక్షకుని సిలువవలన హరించి పోయెనుగదా! నా సిలువను సహించుకొనుశక్తి, ప్రభువువలన నాకు కలిగియున్నదిగదా!. క్రీస్తు సిలువ చరిత్ర జరిగిన మూడవనాడు విజయచరిత్ర జరిగినట్లు, నాకును నా సిలువమీద విజయము కలుగునుగదా! నా తండ్రి నా నిమిత్తమై సిలువ మోసెను. ఇప్పుడు నా వంతు. నేను ఆయన నిమిత్తమై సంతోషముతో సిలువను భరింతును. నాకు సిలువలేనియెడల నేను దేవుని చుట్టు తిరుగను విశ్వాసియొక్క సిలువ నాశనకరమైనది కాదుగాని అది విశ్వానిని విశ్వానమందు వృద్ధిచేయునట్టి ఒక సాధనమైయుందును.
27. హతసాక్షుల చరిత్ర
చదువరులారా! హతసాక్షుల చరిత్రలు మిరెప్పుడైన విన్నారా? క్రైస్తవేతరులు క్రైస్తవులను తిట్టి పట్టుకొని కొట్టి, క్రీస్తును విడిచిపెట్టుడని వారు ఎంతగా భయపెట్టినను, క్రూర మరణమునకైన ఒప్పుకొనిరిగాని క్రీస్తు భక్తి విడువరైరి. వారు క్రీస్తు నిమిత్తమై శరీర రక్షణ పోగొట్టుకొని మోక్ష లోకములో ప్రవేశించిరి.
28. ఆది శిష్యులపని
క్రీస్తుబోధించెను గనుక వారును బోధించిరి. క్రీస్తు శత్రువులను క్షమించెను. వారును ఆలాగే క్షమించిరి. క్రీస్తు మందులేకుండా రోగులను బాగుచేసెను. వారును అట్లు చేసిరి. క్రీస్తు దయ్యములను వెళ్ళగొట్టెను. వారును ఆ విధముగనే వెళ్ళగొట్టిరి. క్రీస్తు మృతులను బ్రతికించెను వారును బ్రతికించిరి.
29. నేటి క్రైస్తవమతముయొక్క పని
క్రీస్తు ప్రభువును, శిష్యులును చేసినపనులే నేటిక్రైస్తవ మతము కూడ చేయుచున్నది. గాని పద్ధతులు భేదముగానున్నవి.
30. బోధపని
సర్వ ప్రపంచమునకు క్రైస్తవ మతము మిషనెరీలను పంపుచున్నది. పాఠశాలలలో లౌకిక విద్య నేర్చు సమయముననే, మతబోధకూడ చేయుచున్నది. ఆస్పత్రులలో ఔషధములిచ్చుచు రోగులకు బోధ వినిపించుచున్నది. గ్రంథములు, పత్రికలు అచ్చువేయించి, సువార్త బోధించుచున్నది. సభలుచేసి, ఉపన్యాసముల మూలముగ క్రీస్తును ప్రకటించు చున్నది. ప్రతి గ్రామమునకు వెళ్ళి సువార్తను బోధించి అనేకమందిని దేవునితట్టు త్రిప్పుచు, మత సంఘములను స్థాపించుచున్నది.