15. క్రీస్తు ఘనవైద్యుడు
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
యేసుక్రీస్తు ప్రభువు దైవారాధన మందిరములో ప్రవేశించి బోధించుచు,
దైవ రాజ్య విశేషములు ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ దేశమందంతట సంచరించెను. ఆయన కీర్తి
సిరియా దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను, పీడింపబడిన వ్యాధిగ్రస్థుల నందరిని, దయ్యములు
పట్టినవారి నందరిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారాయనయొద్దకు తీసికొనిరాగా, ఆయన వారిని స్వస్థపరచెను.
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశములనుండియు యొర్దాను నది కవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. అని
బైబిలులో నున్నది. (మత్తయి 4:23-25).
పాపములనుండి నరుల ఆత్మలను రక్షించుటకు మాత్రమేకాక; వారి శరీరములను వ్యాధులనుండి
రక్షించుటకు కూడ దేవునియొక్క నరావతారమైన యేసుప్రభువు, తాను భూమిమీద నున్నప్పుడు తనయొద్దకు వచ్చిన ప్రతిరోగిని, తన వాక్యము
వలనను, స్పర్శవలనను ఆరోగ్యవంతులనుగా జేసెను. ఆయన బాగుచేసిన వ్యాధులివి:
- 1. పిచ్చితనము: దిగంబరియగు మతిహీనుడు ఒకడు ఆయనకు నమస్కరింపగా, ఆయన అతనిలోని దయ్యములను వెళ్ళగొట్టి నిర్మలమతిని గలిగించెను. వెంటనే అతడు స్వజన బోధకుడాయెను. నమస్కరించుటలో నమ్మికగలదు.
- 2. గ్రుడ్డితనము: నమ్ముచున్నారా! అని ఆయన ఇద్దరు గ్రుడ్డివారిని అడిగెను. వారు నమ్ముచున్నామనగానే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక! అని వారికి దృష్టిననుగ్రహించెను. నమ్ముచున్నామనుటలో నమ్మికగలదు.
- 3. చెవుడు, నత్తి: ప్రజలొక చెవిటి నత్తివానిని ఆయనయొద్దకు తీసికొనిరాగా, ఆయన వాటిని విడిపొమ్మని చెప్పెను. అప్పుడు వానిలోని చెవుడు నత్తిపోయెను. ఆయనయొద్దకు వచ్చుటలో వాని నమ్మికగలదు.
- 4. ఎండిన చేయి: ఎండిన చెయ్యిగల ఒకరితో ఆయన చేయి చాపుమనగా, అతను చాపెను. అప్పుడే అది బాగాయెను. చాపుటలో నమ్మికగలదు.
- 5. కుంటితనము: 38 ఏండ్లనుండి పడియున్న వానిని నడువుమనగానే వాడు నడిచెను. వెంటనే వాని జబ్బుపోయినది. నడవ యత్నించుటలో నమ్మికగలదు.
- 6. జలోదరము: జలోదర రోగిని ఆయన చేరదీసి, నీరు పోగొట్టెను. చేరుటలో నమ్మిక గలదు.
- 7. జ్వరము: దూరముననున్న కుమారుని జ్వరము పోయినదని ప్రభువు తెలియజేయగా, తండ్రి అది నమ్మి వెళ్ళిపోయెను. జ్వరము వానిని విడిచినది. స్వస్థత చూడకున్నను వెళ్ళుటలో నమ్మిక గలదు.
- 8. కుష్టు: పూజారికి కనబడుడి అని ఆయన చెప్పినంత మాత్రమున పదిమంది కుష్టురోగులు వెళ్ళుచుండగా, దారిలోనే స్వస్థత నొందిరి. రుగ్మత ఉన్నను వెళ్ళుటలో నమ్మికగలదు.
- 9. పక్షవాయువు: నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని, లేవలేనియొక పక్షవాత రోగితో ఆయన అనగా అతడట్లు చేసెను. చెప్పినట్లు చేయుటలో నమ్మికగలదు.
- 10. రక్త స్రావము: 12 ఏండ్లనుండి ఈ వ్యాధిగల యొక స్త్రీ ఆయన పైవస్త్రము మాత్రమే ముట్టిన బాగుపడుదునని తనలో తాననుకొని ముట్టుకొనగా ధారకట్టెను. అనుకొనుటలో నమ్మికగలదు.
- 11. నిస్సత్తువ: నీ బలహీనతనుండి విడుదల పొందియున్నావని నీరసించి, నడుము వంగిపోయిన ఒక స్త్రీతో ఆయనచెప్పి, ఆమెమీద చేతులుంచినపుడు, ఆమె చక్కగా నిలువబడెను. విడుదల రాక పూర్వమే వాక్యమును, స్పర్శను అనుకొనుటలో నమ్మికగలదు.
- 12. గాయము: ఒకడొక చెవి నరకగా ఆయనముట్టి బాగుచేసెను. చేయనిచ్చుటలో నమ్మికగలదు.
ఇవి బైబిలులో ఎక్కడున్నవి?
చదువరులారా! రెండు సంగతులును గుర్తించండి.
- 1) ఆశ్రయించిన అందరిని ఆయన స్వస్థపరచెను,
- 2) అన్ని వ్యాధులను పోగొట్టెను.
ఇంతేగాక దయ్యములను వెళ్ళగొట్టెను, మృతులను లేపెను, పాపములు పరిహరించెను. క్రీస్తుప్రభువు బాగుచేయగలడని నమ్మి ఊరకుండుట చాలదు, లేచి తిరుగలాడవలెను, సంతోషముగా నుండవలెను. పాపములనుగాని, జబ్బులనుగాని తల పెట్టనేకూడదు (తలంచకూడదు) ఈ చర్యలులేని నమ్మిక నమ్మికకాదు. నమ్మికలేని యెడల నమ్మిక కలిగించుమని ఆయనను ప్రార్ధించుడి.