12. అవతార కథ
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
పాపమువలన నరుడు, దేవునిలోనుండి విడిపోయెను. అప్పటినుండి దేవుని చూడవలెనను ఆశ నరునిలో
నుండెను. అందుచేత దేవుడే నరుడుగా వచ్చునని, నాలుగువేల సం॥ల వరకు దేవుడు తన భక్తుల మూలముగా లోకమునకు తెలియపరచుచు, ఈ
రీతిగా ప్రజల హృదయములందున్న ఆశను వృద్ధిచేసెను. ఈ ఆశ తీర్చుటకు దేవుడు నరుడాయెను. దేవుడు దేవుడుగావచ్చిన యెడల, నరుడు ఆయనను
చూడలేడు గదా! నరరూపములో కనబడినయెడల దేవుని చూడగలడు. అప్పుడు దేవుడు నరునితో కలిసిమెలిసి యుండగలడు, బోధింపగలడు, నరుడు
చూచుచుండగనే అన్ని విధములగు సహాయములు చేయగలడు. ఆ అవతార పురుషుడు దైవ ప్రభావమువలన ఒక కన్యక గర్భమున జన్మించెను. ఆ కన్యక
పేరు
మరియమ్మ. ఆ అవతార పురుషుని పేరు యేసుక్రీస్తు, ఈయన లోకమునకు పాపము తెచ్చిన సాతానును, దయ్యములను, పాపములను, వ్యాధులను,
శ్రమలను, మరణమును, నరకమును గెల్చెను. మానవులు తెలిసికొనవలసిన మంచి చెడ్డలను తన బోధలో విశదపరచెను. భూలోకమునకు రక్షకుడుగా
వచ్చునని పూర్వకాల భక్తులు ప్రవచించి చెప్పిన గుర్తులన్నియు, ఈయనలో కనబడినవి. అయితే, దేవుడే పాపము చేయించు చున్నాడనియు,
శిక్షించు చున్నాడనియు, నరులెన్ని కష్టములను అనుభవించుచున్నను నాకేమని ఊరుకొనుచున్నాడనియు, ఆయన ఎవ్వరును సమిపింప వీలుగాని
భయంకరుడనియు ప్రజలు తలంచుచుండిరి. దేవుడు సర్వజనులకు తండ్రియనియు, లోకమునుప్రేమించువాడనియు, కనికరము గలవాడనియు,
క్షమించువాడనియు, ప్రార్ధన ఆలకించువాడనియు, కృతజ్ఞతలేని వారియెడలను, దుష్టుల యెడలను ఉపకారియైయున్నాడనియు ఈయన బోధించి
చూపించెను. ఇది క్రొత్త బోధ. (మార్కు 1:27) దేవుని యెడల మనకుగల దురభిప్రాయములన్నియు కొట్టివేయు క్రొత్తబోధ.
దేవునికిని
మనకునుగల తండ్రి బిడ్డల వరుస, ఈయన బోధలో తేలినది. దేవుడు నా తండ్రియనియు, నేను ఆయన బిడ్దననియు సంతోషముతో గంతులువేయించు బోధ
ఇది.
ఎవ్వరును ఈ బోధ చేయలేదు. మరో సంగతి వినండి. తన యొద్దకు వచ్చిన పాపులను క్రీస్తు ప్రభువు క్షమించెను. రోగులను
కనికరించి, ఔషద సహాయములేకనే తన మాటవలననే బాగుచేసెను. దేవుడు భయంకరుడైన యెడల ఇట్లు చేయునా?
ఆయన వ్యాధి
గ్రస్తులలోని
దయ్యములను, సర్వాధికారముతో వెళ్ళగొట్టెను. మృతులను బ్రతికించెను. దేవుడు భయంకరుడైన యెడల ఇట్టి పనులు చేయునా? క్రీస్తు
ప్రభువు తన మాటవలనను, అద్భుత క్రియలవలనను, తాను దేవుడైనట్లు కనబరచెను. చూపులకు, మనుష్యుడే. ఆయన కేవలము మనుష్యుడేగాని
నిజమునకు ఆయన దేవుడు. దేవుడెట్లు మనుష్యుడాయెను? ఎందుకాయెను? దేవుడు, దేవుడుగానే యుండి మనలను రక్షింపరాదా? అని
కొందరడుగుచున్నారు. దేవుడు దేవుడుగానే వచ్చినయెడల ఆయన తేజస్సునకు నరలోకమంతయు భస్మమైపోవును. దేవతగా వచ్చినయెడల మనుష్యులు
భయపడి పారిపోవుదురు. జంతురూపమున వచ్చిన యెడల కొట్టుదురు, చంపివేయుదురు. మనుష్యునిగా వచ్చిన యెడల దగ్గరకు చేర్చుకొందురు.
అందుచేత దేవుడు నరరూపముతో వచ్చెను. దుష్టులు ఆయనను గ్రహింపలేక, ఆయనను పట్టుకొని బంధించి, మేకులతోకొట్టి, కొరతవేసి కొట్టి
చంపివేసిరి. ఇన్ని బాధలు పెట్టుచున్నను, ఆయన వారిమీద కోపపడక ఓర్చుకొనెను. శిక్షించుటకు ఆయన ఈ లోకమునకు రాలేదు. రక్షించుటకు
వచ్చెను. ఆయన వట్టి మనుష్యుడే అయిన యెడల కొంచెమైనను కోపపడి యుండును. సిలువమీద అనగా కొరతమీద ఉండి ఆయన అగుపరచిన ప్రేమ,
మనుష్యులు అగుపరుప గలరా! అది ప్రేమ కాదు. కేవలము దేవుడగుపరుపగల ప్రేమ. ఆయన దేవుడని అదివరకు గ్రహించి యుండనివారు, అట్టి
ప్రేమను చూచియైనను గ్రహించియుండిన యెడల ఎంత బాగుగ నుండును. అయ్యో! పాపమువలన మానవులెంతగా చెడిపోయిరి. తుదకు జరిగిన కథ
వినుడి:
ఆయన భూస్థాపనయై మూడవ దినమున ప్రాణముతో బయటకు వచ్చి, విశ్వాసులకు కనబడి, నలువది దినములు వారితో నుండెను. సిలువమీద ఆయనవుండి
మన
పాపములను, మన వ్యాధులను, మన శిక్షను తనమీద వేసికొన్నందున మనకు మహోపకారము చేసెను. ఇది, కీడు తొలగించిన ఉపకారము.
బ్రతికి వచ్చుట వలన మనకు జయము, అనంతజీవము, నిత్యానందము, దైవ సహవాసము మొదలగు పరమ భాగ్యములు తెచ్చిపెట్టెను. ఇది
మరొక
ఉపకారము. ఆయన మనుష్యుడు గనుక మరణింప గలిగెను. దేవుడు గనుక మరణమును ఓడగొట్టి, బ్రతికి రాగలిగెను. అందుచేత ఆయన
ఒక్కడే
మన దేవుడును, రక్షకుడునై యున్నాడు. ఆయన కడకు తన శిష్యులను చేరపిలిచి, మీరు సర్వలోకమునకు వెళ్ళి నా సంగతులు అందరికి
బోధించుడి
అనియు, నమ్మి స్నానము పొందువారికి రక్షణయనియు, నమ్మనివారికి శిక్షయనియు చెప్పి, మహిమ శరీరముతోనే పరలోకమునకు వెళ్ళెను.
అందుచేతనే ఆయన శిష్యులు సర్వత్ర సంచరించుచు, ఆయన బోధ వినిపించుచున్నారు.
ఇదివరకు చెప్పవలసిన ఇంకొక సంగతి వినుడి:
నేను పరలోకమునకు వెళ్ళి మరల వచ్చెదను అని ఆయన వారికి చెప్పియుండెను. ఆ కారణము చేత, ఆయన భక్తులు ఆయన రెండవ రాకడ కొరకు
కనిపెట్టుచున్నారు. ఆయనవచ్చి ఇదివరలో చనిపోయియున్న భక్తులను బ్రతికించి, అప్పటివరకు బ్రతికియున్న భక్తులను అనగా మనలను, ఒక
క్షణములోనే మహిమ శరీర ధారులనుగామార్చి మరణము లేకుండజేసి పరలోకమునకు కొనిపోవును. ఆయనవచ్చు గడియ తెలియదు గనుక ప్రతి దినము
సిద్ధపడి యుండుట క్షేమము. భక్తులు వెళ్ళిపోయిన తరువాత మిగిలిన వారికి లోకమెన్నడును ఎరుగని బాధలు కలుగును. అటుతరువాత ఆయన ఈ
భూమిమీద నీతి పరిపాలన చేయును. తుదకు సాతానును, అతని సంబంధికులు అందరును, ఆయన తీర్పు విధించినవారును, అంత్యదినమున నిత్య
నరకాగ్ని గుండములో పడవలసి వచ్చును.