10. అవిశ్వాసి ప్రశ్నలు

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)



ఇకను ప్రార్ధన చేయను, ఏమి చేయను. దేవునికి ఇష్టమున్నయెడల బాగుచేయును. లేనియెడల నా పనిఇంతే. ఇట్టి తలంపులు రోగి మనస్సులో పుట్టుచుండును. వాటిని రానీయకూడదు. ఇది జబ్బుకంటె జబ్బు. వీటన్నిటికి విరుగుడు, యేసుక్రీస్తు తలంపే.



11. పాప ఫలితములు



సాతానువలన పాపము ప్రవేశించినది. ఆ పాపము నరులలోనికి జేరినది. దానివలన అవిశ్వాసము, భయము, చింత, అజ్ఞానము. అజాగ్రత్త, అనిశ్చయము, లోపము ఇవి కలుగుచున్నవి. పాపమువలననే వ్యాధులు వచ్చినవి, ఆ వ్యాదుల వలన బాధలేచినది, తుదకు మరణము కలిగినది. విరోధుల వలనను, కరవు వలనను, వరదల వలనను, భూకంపము వలనను, గాడ్పుల వలనను, మంచు వలనను, గాలివానల వలనను, పిడుగుల వలనను, వడగండ్ల వలనను, అడవి మృగముల వలనను, పురుగుల వలనను, ముండ్ల వలనను, చెడు తిండివలనను, కానిమందు వలనను, క్రమములేని వాడుకల వలనను, మరణము కలుగుచున్నది. దాని తర్వాత నిత్య నరకము. ఆ నరకములో అంతములేని బాధ, వేదన. అనగా నేను దేవునిలోనుండి వేరైపోతినిగదా! అను వేదన. నేను దేవుని నమ్మలేదుగదా అను మరొక వేదన. చదువరులారా! ఈ అంశములోని చెడుగును, వానిని దేవుడు కల్పింపలేదు. ఇది బాగుగ జ్ఞాపకముంచుకొనండి. (విలాప 3:33).