14. యేసుక్రీస్తు

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)



దేవుడే రూపము కలిగియుండును? ఎట్టి స్వభాము కలిగియుండును? ఏమేమి పనులు చేయును? పాపులమైన మన విషయములో ఎట్లు ప్రవర్తించును? మనలనెట్లు చూచును? సర్వలోకములకును ఆయనకును ఏమైన సంబంధమున్నదా? ఆయన మన కష్టములను తొలగించునా? మనకు సదుపాయములు చేయునా? దేవుడు అను ఆయన ఒకడున్నాడా? ఉన్నయెడల మానవులు ఇన్ని చిక్కులు పడుచుండుట చూచి ఎందుకు ఊరుకొనుచున్నాడు? తుదకు మనలను లోకములను ఏమిచేయదలచుకొన్నాడు? ఈ బ్రతుకైన పిమ్మట వేరొక మేలైన బ్రతుకున్నదా? అపవిత్ర జీవనమును పూర్తిగ విసర్జించుట మనకేనాటికైన వీలుపడునా? పవిత్ర జీవనమున స్థిరపడుట మనకేనాటికైన సాధ్యమగునా? మనము నిత్యమూ ఆ లోకమున దేవునితో నుండగలమా? ఇట్టి ప్రశ్నలు అనేకములు నరహృదయములో పుట్టుచున్నవి.

వీటన్నిటికిని దేవుడు ఉత్తరము చెప్పుటకు, ఆయనే ఒక మారైనను భూలోకమునకు రావలెను. లోక ప్రతినిధులకైనను కనబడవలెను. తన ముఖబింబమును, మాటలను, కార్యములను, ప్రవర్తననుచూచి, ఈయన వస్త్రధారణకు శరీరియైనను, తత్వమునకు దేవుడని మానవులు స్వయముగా అర్ధము చేసికొనగలుగునట్లు దేవుడందరిలోను మెలగవలెను. భూలోకమునకు మధ్యనున్న పాలెస్తీనా దేశమున దేవుడు ఇట్లు ప్రత్యక్షమాయెను. నరుడుగానున్నందున, ఏదోయొక పేరు పెట్టుకొనని యెడల అందరు ఆయనను ఏమని పిలుతురు? అందుచేత ఆయన యేసుక్రీస్తు అను నామమున ప్రసిద్ధికెక్కెను. నరులను రక్షించునట్టి పనికి ఏర్పడిన రక్షకుడను భావము ఈ నామములోనున్నది. నరులు పెట్టుకొన్న నామమువలన ముక్తి కలుగదు. ఇది దేవుడు పెట్టుకొన్న నామము గనుక ఈ నామములోనే దేవుడు జైలుపడినాడు గనుకను, ఈ నామ వృత్తాంతమే మన బ్రతుకు తెరువగుకథ నడిపిన పవిత్ర చరిత్ర గనుకను, ఏ శ్రేష్టనర నామ చరిత్రకైనను, ఏ దేవదూత నామ చరిత్రకైనను లేని కళ ఈ యేసుక్రీస్తు నామ చరిత్రకే యున్నది గనుకను, ఈ నామము మూలముగానే దేవుడు ముక్తిని ప్రకటించినాడు గనుకను ఈ నామస్మరణవలననే విముక్తి లభించును. ఆయన పరిహరింపలేని పాపములేదు, బాగుచేయలేని వ్యాధిలేదు, తొలగింపలేని చిక్కులేదు, ఇయ్యలేని దానములేదు. ఆయనను స్తుతింపగా అన్ని విషయములందును శాంతి సమకూడును.