16. స్వస్థత
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
స్వస్థత విషయము అనగా ఔషదములేకుండనే జబ్బులు పోగొట్టుకొను పద్ధతి: మందులు
లేకుండ దేవుడు జబ్బులు పోగొట్టడు అను తలంపు నీలోనుండి తీసివేసికొనుము. దేవునివల్ల సృజింపబడిన మూలికలు, వ్యాధులను
పోగొట్టు
చుండగా దేవుడు పోగొట్టలేడా? నీలో ఏదైన లోపమున్న యెడల మొదట అది పరిహరించు కొనుము. జబ్బు తీసివేయుమని ఒకసారి పూర్తిగా
ప్రార్థించిన చాలును. ఆలాగు ప్రార్ధించుము గాని ఒకమారు జబ్బు పోకపోవచ్చును. అయినను పోయినట్టే అని నమ్ముము. అప్పుడు
అదిపోవును. ఇది క్రీస్తు బోధలోని సారము (మార్కు 11:24).
మొదట మీరు ప్రార్థించిన, తరువాత స్వస్థత కనబడువరకు ఏమి చేయుదురు?
స్తుతించుము. అనగా తండ్రీ! ఇది తీసివేసినావు అని చెప్పుచు స్తుతించుము, నమ్ముచు స్తుతించుము. అనారోగ్య కరమైన
స్థితిలోనున్నను
సంతోషము కలుగువరకు స్తుతించుము. బాగైనది అను సంతోషము కలుగువరకు ఆనందించుము. ఈలాగు చేయుదువా? లేక విసుగుకొని మానుదువా?
17. కృతజ్ఞత
కృతజ్ఞత అనగా ఒకరు మనకు చేసినమేలు మరువకుండుట. కృతజ్ఞత చూపుటెట్లు? మన ఉపకారులయొద్దకు వెళ్లి వందనములు చేయుట వలనను, బహుమానము లిచ్చుటవలనను, ఆ ఉపకారి గురించి ఇతరులకు చెప్పుట వలనను, మనస్సులో అభిమానము కలిగియుండుట వలనను కృతజ్ఞత చూపగలము. యేసుక్రీస్తు ప్రభువువలన పాప విముక్తిని, స్వస్థతను పొందినవారుకూడ అట్లే చేయవలెను. స్వస్థి కూటములో వెంటనే బాగైనవారు, వెంటనే అందరిమధ్యనే తమ స్వస్థతను గురించి చెప్పవలెను. సిగ్గుపడరాదు. మరునాటి కూటములోనైన చెప్పవలెను, పూర్వము క్రీస్తుప్రభువు నొద్దకు పదిమంది కుష్టురోగులు వచ్చి, దారిలో బాగైరి గాని ఒక్కడే ఆయనయొద్దకు తిరిగివచ్చి నమస్కరించెను. ఆ రోగి దేవుని మెప్పు పొందెను. తక్కిన తొమ్మండుగురికి ఆ మెప్పు లేదు. వారివలె మీరు చేయకుడి.
18. జబ్బు తిరుగబెట్టుట
దైవ స్వస్థికూటములో జబ్బు కుదిరిన తర్వాత ఎప్పటికైన అది మరల వచ్చునా? రాదు, రాదు. క్రీస్తు బాగుచేసెను గనుక రానేరాదు. గాని మరల రోగి పాపముచేసి జబ్బు తెచ్చుకొన్న యెడల రాదా ఏమి? చెట్టెక్కిపడి కాలు విరుగగొట్టుకున్న పిల్లవానిని వైద్యుడు బాగుచేయగా, మరునాడు మరల చెట్టెక్కి పడిన యెడల కూడ కాలు మరల విరగదా ఏమి? విశ్వాసమువలన అది తిరిగిరాదా? విశ్వాసమువలన పేతురు అను శిష్యుడు క్రీస్తుతో నీళ్ళమీద నడిచి నడిచి, సందేహపడగా మునిగిపోవ నారంభించెను. అవిశ్వాసీ ఎందుకు సందేహపడితివి? అని ఆయన అతనిని గద్దించెను. జాగ్రత్త! నీలోనికి అనుమానమును రానీయకుము.