24. క్రీస్తు శిష్యులు

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)



మెస్సీయా అన్నను, క్రీస్తు అన్నను, యేసు అన్నను, యేసుక్రీస్తు అన్నను, క్రీస్తుయేసు అన్నను, ఆ ఏక దైవావతార పురుషునకే చెందును. క్రీస్తుప్రభువు ననుసరించిన మొదటి శిష్యులు కొందరు, ఆయన పరలోకమునకు వెళ్ళిన పిమ్మట ఆయన ఆజ్ఞానుసారముగా యెరూషలేము పట్టణమున దైవ ప్రార్ధన దీక్షమీద నుండగా, దైవాత్మ వారి హృదయములను ఆవరించినందున, భాషలవరము పొంది, ప్రార్ధన గదిలో నుండి బైటికి వచ్చిరి. దైవాత్మా వేశము వలన బోధనాశక్తి గలవారై, సర్వ ప్రాంతములనుండి తమ పండుగ పనిమీద అక్కడకు వచ్చియున్న వారికి, వారివారి భాషలలో క్రీస్తుబోధ వినిపింపగా, మూడు వేలమంది ఆ బోధ నంగీకరించి క్రీస్తు మతస్నానము పొందిరి. క్రీస్తును తాము స్వయముగా చూచినట్లు శిష్యులు సాక్ష్యమిచ్చినందున, బోధపని విశ్వాస పాత్రమైన పనిగా వర్ధిల్లినది. తరువాత శిష్యులు దేశదేశములకు వెళ్ళి ఈ రక్షణబోధను వ్యాపింపచేసిరి. ఈ దైవమతకార్యము నేటి వరకును జరుగుచున్నది.


25. క్రీస్తు సిలువ


నిలువుకర్రకు అడ్డముగా దిగగొట్టిన కర్రగల యొక స్తంభమునకు సిలువయని పేరు. దానిమీదనే క్రీస్తును మేకులతో అంటగొట్టి చంపిరి. సిలువవేసి చంపిరి సిలువ అను మాటకు మనవారు కొరతను వేసిచంపిరి అని అందురు. సిలువమీద క్రీస్తు ప్రభువు మన పాపములను భరించెను. మనమీద గల ప్రేమచేత వాటిని సహించెను. మనమీదనున్న పాపములను తనమీద వేసికొనుటవలన, మనమీదనుండి వాటిని తొలగింపవలెననియే; ఆయన సిలువను వ్రేలాడబడుటకు సమ్మతించెను. గనుక సిలువవలన ఆయనకు శ్రమ గలిగెను గాని మనకు విముక్తి కలిగెను. విశ్వాసులందరును సిలువ ధ్యానముచేయుటకు ఇదియే కారణము. సిలువమీద మనకు బదులుగా చనిపోయిన క్రీస్తు, మానవులందరకు ప్రతినిధియగు మానవుడు గనుక సిలువకును, సర్వ ప్రపంచమునకును గొప్ప సంబంధముకలదు. సిలువమిాద నున్న ఆయన దేవుడు గనుక సిలువకును, పరలోకమునకును గొప్ప సంబంధముకలదు. సిలువను గూర్చిన శుభవర్తమానము సర్వలోకమునకును ప్రకటింపవలసిన భారము క్రైస్తవ మతమునకు కలదు. క్రీస్తు సిలువమీద నెరవేర్చినవన్నియు, తన విషయమేయని నమ్మగల విశ్వాసికి; సాతానుయొక్క అధికార విముక్తియు, నరక విముక్తియు గలుగుచున్నది. కనుక ప్రతి విశ్వాసికిని, సిలువకును గొప్ప సంబంధము కలదు. సిలువ జ్ఞప్తికి వచ్చునప్పుడెల్ల నా మీదనుండి కీడు తొలగినదికదా అనికూడ జ్ఞప్తికి వచ్చును.