ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

విశ్వాస క్రియ = రక్షణ

ప్రసంగ తేది: 14-11-1955
రెవ. డా॥ జె. జాన్ సెల్వరాజ్ గారి పుస్తకము నెం.4,5. ఆదివారము



ధ్యానవాక్యము:- హబక్కూకు 2:4


బైబిలులో ఇద్దరు భక్తులున్నారు. ఒకాయన పేరు పౌలు, ఇంకొకాయన పేరు యాకోబు అనగా పత్రికలు వ్రాసిన యాకోబు. పౌలు ఒక అంశము ఎత్తుకున్నాడు. దానికి సంబంధించిన ఒక అంశమును యాకోబు ఎత్తుకున్నాడు. బాగుగా చదివితే దానికది దీనికిది వేర్వేరుగా నున్నది. ఇంకా బాగా పరీక్షించితే, రెండు ఒకటిగానే ఉన్నది.


ఆయన సిద్ధాంతము, ఈయన సిద్ధాంతము విశ్వాసులందరు నేర్చుకొనవలసినదే. పౌలు ఏమని చెప్పుచున్నాడంటే విశ్వాసము వలన రక్షణ అని ఆయన. యాకోబు క్రియల రక్షణ అని చెప్పుచున్నారు. ఏది నమ్మగలము? విశ్వాసము వలననగా దేవుడు ఏమి చెప్పునో అది నమ్ముట. విశ్వాసులు పాతనిబంధనలో ఆదికాండములో అబ్రాహాము, దేవుడు చెప్పిన మాట వెంటనే ఆయన నమ్మెనని ఉన్నది. నమ్ముటే విశ్వాసము. అక్కడ క్రియలేదు. నమ్మినాడు. అంతే. అలాగు వెంటనే నమ్మినందున నీతిపరుడను బిరుదు వచ్చెను. మరొకటి విశ్వాసులకు తండ్రి అనే రెండు బిరుదులు.

ఇది అబ్రాహామునకు బిరుదులు. అబ్రాహాము నమ్మెను ఆయనకు విశ్వాసముండెను. విశ్వాసమున్నను ఏ క్రియ చేయలేదు. క్రియలేకపోయిన నీతిపరుడని ఎంచబడెను. గనుక క్రియల కంటే మొదట విశ్వాసమే ముఖ్యము. అవసరమని అబ్రాహాము చరిత్రవలన తెలియబడుచున్నది. అబ్రాహాము అప్పుడు క్రియ చేయలేదు గాని తర్వాత చేసెను.


ఒక కథ:- వృద్ధాప్యమందు నీకు కుమారుని ఇచ్చెదను. అతని సంతానము ఆకాశ నక్షత్రములంత అగుననెను. వృద్దాప్యములో బిడ్డలు కలుగుటకు ఆస్పదము లేదుగాని ప్రశ్నవేయక వెంటనే నమ్మెను. మనమైతే అనేక ప్రశ్నలు వేస్తాము. ప్రశ్నలు వేసేది వేదాంతులే. బైబిలు బాగా వచ్చి వృద్ధికి వచ్చినవారేగాని అబ్రాహాము వెంటనే నమ్మెను అది గొప్ప విశ్వాసము.


పౌలు విశ్వాసముంటేనే గాని రక్షణలేదు, నీతిపరుడుగాడు. అయితే అబ్రాహాము అనేక వందల సంవత్సరములకు హబక్కూకు వచ్చెను. ఆయన “నీతిమంతుడు విశ్వాసము వలననే జీవించునని చెప్పెను” ఈ ప్రవక్తయు క్రియను గూర్చి ఏమియు చెప్పలేదు. అయితే విశ్వాసము వలన నీతిపరుడైనాడని చెప్పి అబ్రాహామును గూర్చి మాట్లాడుచున్నాము.


ఈ హబక్కూకు చెప్పినది ఒక మనిషి విశ్వాసము సంపాదించును. నీతిపరుడనును. విశ్వాసము వలన జీవించునని చెప్పెను.

సంపాదించుట విశ్వాసమే. బ్రతుకుట విశ్వాసమే. అనీతిపరులను గూర్చి కాదు. నీతిపరులను, భక్తులనుగూర్చియే అవిశ్వాసులను గూర్చేమియు చెప్పలేదు.


పౌలు ఏమన్నాడనగా ఎన్ని క్రియలున్నా విశ్వాసములేని యెడల అంతా సున్నే అని చెప్పెను. అయితే విశ్వాసము గొప్పదిగదా, క్రియలు మాత్రము ఉండవద్దా? ఈ క్రియలు లేకపోతే విశ్వాసమేలాగు? పౌలు చెప్పెను, క్రియలున్నా విశ్వాసము లేకపోతే లాభము లేదంటాడు. యాకోబు నీకు విశ్వాసమున్నను క్రియలు లేకపోతే ఏలాగు?


దృష్టాంతము:- బీదలకు నీవు సహాయము చేయవు. అనగా బీదలకు సహాయము చేసే క్రియలేదు. ఐతే దేవునియందు నీకు విశ్వాసమున్నది. ఐతే బీదలను కనికరించే క్రియలేదు. నీతిపరుడవే, విశ్వాసివే, అని పలుకుచున్నాడు. ఇక్కడ గొప్ప తర్కమున్నది. రెండు కలిపివేయాలి. మనిషికి విశ్వాసం, క్రియ ఉండాలి. క్రియ లేకపోతే విశ్వాసము సున్న, విశ్వాసము లేనియెడల క్రియ సున్న పూర్వకాలమందు డాక్టర్ మార్టిన్ లూథరు బైబిలంతా చదివి హబక్కూకు వ్రాసిన 2:4 గట్టిగా పట్టుకొని ఇదె నాకు కావాలి. ఇదే బోధిస్తానని బోధించెను. ఏమి చెప్పెననగా నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును గాని క్రియల వలన కాదని చెప్పెను. విశ్వాసము గొప్ప అవసరమని చెప్పెను. పూర్వకాలమందలి బోధ పూసలు లెక్కించి ప్రార్థించినా మోక్షానికి వెళ్లుదురని బోధించిరి. ఆచార క్రియే గొప్పదని బోధించిరి. పరమునకు వెళ్లిన భక్తుల ఆచార క్రియల వలన మోక్షము బోధించిరి. అందుచేత మార్టిన్ లూథరును ఆలాగుచేసిరి.


రోమ్ పట్టణము వెళ్తేనే మోక్షమని బోధించి చేసి చూచెను గాని ఆత్మకు తృప్తిలేదు. ఆ కాలపు బోధకులింకా ఏమి బోధించినారనగా ప్రాణం పోవునప్పుడు చందాపెట్టెలో ఎక్కువ గళ్లుమని చందావేస్తే మోక్షమని, ఆచార క్రియలు చేస్తే మోక్షమని బోధించిరి. ఆచార క్రియలు చూచి, చేసిన మార్టిన్ లూథరు ఆచార క్రియలవలన మోక్షముకాదు. గాని విశ్వాసము వలన నీతిమంతుడు జీవించును, మోక్షమని బోధించెను. ఇదే నేటివరకేర్పడినది. సం॥రానికి ఒక దినము ఈ వాక్యము మీద బోధిస్తారు. బైబిలులో వేలకొలది వాక్యాలుండగా ఆత్మ ఆ వాక్యము మీదకు ఆయనను నడిపించెను.


ఆ వాక్యము చదివిన మార్టిన్ లూథరు పౌలు, యాకోబులు వ్రాసిన రెండు చదివిరి. వీరిద్దరు మార్టిన్ లూథరు కంటే ముందటి వారే. లూథరు ఇది చదివేటప్పటికి 14 సంల వారు. దేవుడు మార్టిన్ లూథరుకు బైబిలు కంటబడేటట్లు చేసి హబక్కూకు 2:4 కంటబడగా బోధించెను. గనుక ఈ దినము నేర్చుకోవలసినది, పట్టుకోవలసినది. పౌలు పక్షంగా విశ్వాసమునూ, యాకోబు పక్షంగా క్రియలునూ కలిగి ఉండాలి. ముఖ్యముగా నేర్చుకోవలసినది ఏ మతమువారైనా వారు మంచివారా? లేదా? వారిలో మంచి ఉన్నదా? లేదా? వారు మంచి క్రియలు చేస్తున్నారా? లేదా? అయితే వారెంత మంచివారైనా క్రీస్తులోనికి రాకపోతే మోక్షము లేదని బోధించెను. వారు మంచివారు గనుక మంచితనమున్నది గాని, దేవునియందలి విశ్వాసములేదు గాని మంచితనమందే విశ్వాసముంచాలని బోధించెను. నేనింత మంచి దానిని, ధర్మము చేస్తాను, నాకు మోక్షమున్నదనుకొనేవారికి మోక్షములేదు. దేవునియందు విశ్వాససముంచుటే మోక్షమని వ్రాసెను. దేవునియందు విశ్వాసముంచుట తెలియకపోతే సరిగాని ఇవన్నీ తెలిసి పై క్రియలు కలిగి విశ్వాసము లేకపోతే లాభములేదు.


అబ్రాహాము తన విశ్వాసము లోకానికి బైలుపర్చుటకుగాను కుమారుడు పుడతాడంటే ఎట్లు నమ్మెనో బలి ఇవ్వమంటేకూడ కత్తి ఎత్తెను. అబ్రాహాము ఒక సంగతి అడుగుట న్యాయం కుమారుని ఇస్తానని ఇచ్చావు. యుక్తవయస్సు వచ్చింది, వివాహము చేయాలిగదా? ఆకాశ నక్షత్రాలంత విస్తారమన్నానే అని అడుగవలసింది. అడిగి విశ్వాసమును బలహీనపర్చుకొనక ప్రశ్నవేయక, బూడిదలోనుండి కుమారుని తెచ్చి ఆకాశ నక్షత్రములంత చేస్తాడని నమ్మి ఇస్తాననుకొనెను. అటు దేవుడు చెప్పలేదు. గాని అబ్రాహాము నమ్మెను. విశ్వాసమును వృద్ధిచేసికొనును. అదే గొప్ప విశ్వాసము. మొదటిది విశ్వాసము రెండవది విశ్వాసపు క్రియ. క్రియా విశ్వాసములు 3వది విశ్వాసము యొక్క విశ్వాసము.


కుమారుని సంతానాన్ని నక్షత్రాలంత చేయుట అట్లుంచండి గాని అది రాకముందే విశ్వాసానికి విశ్వాసులు పుట్టి శరీర సంతానముకంటే విశ్వాస సంతానము గొప్పదైనది. అట్టి విశ్వాసము ఇప్పుడును కలిగియున్న యెడల కుమారుడు కలిగిన తండ్రి అగుటకంటే విశ్వాసము కలిగి గొప్ప తండ్రియైనాడు. పౌలు విశ్వాసానికి, విశ్వాసముండాలని వ్రాసెను. శిష్యులును వృద్ధిచేయుమని ప్రార్థించిరి. పాఠములో విన్నట్లు మీయందరి విశ్వాసము, క్రియలు వృద్ధియైన యెడల మోక్షము, రాకడ భాగ్యము లభించును. ఈ కొద్దిమాటలు మీ ఆత్మకు దీవెన కార్యమునకును, విశ్వాసమునకును, అభివృద్ధికరముగాను ఉండునుగాక! ఆమేన్.