ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
కల్పవృక్షము
ప్రసంగ తేది: 16-8-1959
వాక్యము: యెహెజ్కే 17:24; యోహాను 14:14 రోమా 4:21.
అక్కరలు ఉన్న ప్రియులారా! మీకు సంతుష్టి కలుగునుగాక!
నేటి ప్రసంగముయొక్క అంశము “అక్కరలు గలవారును, అక్కరలు తీర్చే ఆయనయు”. కాబట్టి నేను రెండు వరుసలు పేర్చుచున్నాను.
- 1. ఈ ప్రక్క అనగా కుడిప్రక్క
- 2. ఆ ప్రక్క అనగా ఎడమ ప్రక్క అది ఒక దొంతి. ఇది మరియొక దొంతి.
ఈ ప్రసంగము ఆరంభింపకముందే నేను చెప్పేది ఏమంటే బైబిలులో 66 పుస్తకములు ఉన్నవి. అందులో నాలుగు పుస్తకములు మాత్రమే మీకు ఎత్తి చూపిస్తాను అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు వ్రాసిన పుస్తకములు. ఆ నలుగురు వ్రాసిన పుస్తకములు ఒక్కరీతినే కాదుగాని 4గురు వ్రాసిన పుస్తకములు ఒకరి కథే. యేసుప్రభువు కథే. మరియొక కథ కాదు. ఇప్పుడు నేను చెప్పే పాఠము ఏమనగా లోకములోని ప్రతి మనిషికి కొన్ని అక్కరలున్నవి. అనగా ఇంకా పొందనివి, అనుభవించనివి, కలిగి ఉండనివి కొన్ని కొదువలు ఉన్నాయి. వాటిలో...
1. మొదటి అక్కర నేను దేవునిని చూడాలి: అనే అక్కర మనిషిలో ఉన్నది. ఈ అక్కర ఆదికాలములో లేదు ఇది పాపము తరువాత వచ్చినది. అనగా ఆదికాలములో దేవునిచే సృజింపబడిన మనిషి పాపములో పడిన తరువాత వచ్చినది. ఎందుకంటే ఆదాము, హవ్వలకు ఆదిలో దేవుడు కనబడి మాట్లాడారు. వారు పాపములోపడిన అనంతరమున ఆయన కనబడుట మానివేసినాడు. ఆయన మహిమతో పరలోకమునకు వెళ్ళిపోయాడు... అప్పటినుంచి దేవునిచే మొదట సృజింపబడిన ఆదాములో, మనుష్యులందరిలో ఒక కోరిక పుట్టింది.
పరమునకు వెళ్లిన ఆ దేవుడు మనకు కనబడాలి! మనతో మాట్లాడాలి! మనతో కలిసిమెలసి ఉండాలి! నా కష్టాలు నివారణ చేయాలి! ఈ కోరిక మనుష్యులందరి లోపల ఉన్నది గనుక ఆ పరలోక దేవుడే యేసుప్రభువుగా మనిషియై 2000 సం॥ పూర్వము ఈ లోకమునకు వచ్చి కనబడి మాట్లాడినాడు. ఆయన ఇహలోక మనుష్యులందరితో కలిసిమెలిసి తిరిగినాడు వారి ఇండ్లలో నివసించినాడు. యెరూషలేము గుడిలో కనబడినాడు, బజారులో కనబడినాడు, ప్రయాణాలలో కనబడినాడు, పెండ్లిలో కనబడినాడు, విందులలో కనబడినాడు, కష్టాలలో కనబడినాడు గనుక తనకు దేవుడు ప్రత్యక్షముగా కనబడవలెననే మానవుని కోరిక ఇక్కడ సువార్తలలో నెరవేరినది. దానికి ముంగుర్తుగా నేను ఒకమాట ముందుగా చెప్పవచ్చును. అదేమంటే కల్పవృక్షము. ఈవేళ కల్పవృక్ష ప్రసంగము. సాధారణముగా ఈ మాట హిందువులలో వాడతారు. కల్పవృక్షమంటే “కోరికలు నెరవేర్చే చెట్టు” ఆ వృక్షము యేసుప్రభువే అందరిని కొలిచిన తుదకు వారభిప్రాయమేమో తెలియదుగాని, ఆ కల్పవృక్షము యేసుప్రభువే
2. రెండవ అక్కర: నేటి కాల ప్రజలు ఏమంటున్నారంటే పేతురు, యాకోబు, యోహాను అనేవారి కాలములో క్రీస్తుప్రభువు కనబడినారు గాని మనకాలములో కనబడుచున్నాడా? వారి కోరిక తీర్చాడు గాని, మన కోరిక తీరుస్తాడా? ప్రభువు మన కోరిక తీర్చడములేదు అంటున్నారు. ఇది రెండవ అంశము.
క్రీస్తుప్రభువు వారు మనకుకూడా మనకాలములో కనబడతాడనే దానికి సువార్తలలోనే జవాబు ఉన్నది. ఏలాగంటే ఆయన ఇహలోక జీవిత చరిత్ర సమాధితో అయిపోయింది ఇకలేదు. ఆ తరువాత వచ్చిన 40 దినముల (పునరుత్తాన శరీర) జీవితము మరియొకటి. అదే అక్షయ చరిత్ర. ఆ 40 దినములలోనిది ఈ శరీరముకాదు (మహిమ శరీరము) బహిరంగ శరీర క్రమాలతో దానికి సంబంధములేదు, గనుక మొదటి జీవితముతో లెక్కపెట్టకూడదు.
ఆ 40 అయిపోయిన తరువాత మరియొక 40, మరియొక 40, మరియొక 40, మన వరకు ఎన్ని 40లో అన్ని 40లు ఉన్నా మనుష్యులకు ఆయన కనబడాలి. ఆ కాల మనుష్యులకు కనబడిన ప్రభువు మనకాల మనుష్యులకు కనబడకపోతే పక్షపాతముకాదా? అందుచేత ఈ 40 రోజులతో మనకు సంబంధము ఉన్నది. శిష్యులు తలుపు వేసికొని ఉంటే తలుపులు తీయకుండానే ఆయన లోనికివెళ్లి కనబడ్డాడు. క్రీస్తుప్రభువు 33 1/2సంవత్సరములు అలాగు కనబడలేదు. గనుక మనము కూడా సన్నిధిగదిలో తలుపువేసికొని ఉంటే తలుపు తీయకుండానే ప్రభువు కనబడతాడు, దీవిస్తాడు, పలకరిస్తాడు. ఇప్పుడు ఈ పని ముఖ్యముగా సన్నిధి కూటములలో జరుగుచున్నది.
యేసుప్రభువు ఆ జీవితమును అనగా ఈ భూలోక స్థూలదేహ జీవితము విడిచిపెట్టక ముందు రెండే రెండు మాటలు చెప్పారు.
- 1. ఇద్దరుగాని, ముగ్గురుగాని ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్నాను. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వారి అక్కర తీర్చాడన్నమాటే.
- 2. నేను పరలోకానికి వెళ్లుచున్నాను గాని సదాకాలము మీతోకూడ ఉన్నాను.
ఈ రెండింటినిబట్టి మనకాలములో మనదగ్గర ఆయన ఉంటున్నాడు.
వినండి: ఇది నమ్మకూడనిమాట అని ఎంతమంది అంటున్నారో అంతమంది దగ్గర ప్రభువు నిలబడి ఉన్నారు. నమ్మినవారందరి దగ్గర ప్రభువు ఉన్నారు. నమ్మనివారి దగ్గర ఉన్నాడు. ఈ గొప్ప ధన్యతను నమ్ముకున్నా నమ్మకున్నా ఆయన బుజువు చూపించు ఏమిటంటే ఈ పునరుత్థాన 40 దినములలో లూకా, క్లెయోపా అను ఈ ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్లుచున్నారు. యేసుప్రభువు వారితోకూడా వెళ్లుచున్నారు. ఆయన యేసుప్రభువని వారికి తెలియలేదు. తెలియకపోయినా ఉన్నాడా లేదా? వారితోనే ఉన్నాడు, వారికి తెలియకపోయినాకూడా నడిచాడా లేదా? వారితోనే నడిచాడు కాబట్టి నేడు కూడా “ఎల్లప్పుడు మనతోకూడా ఆయన ఉంటాడు” అని నమ్మువారికి భూలోకములోనే మోక్షము. వారికి తెలియకపోయినా, ఆయన వారింటిలోకి ప్రవేశించాడా? లేదా? వారికి తెలియకపోయినా భోజనము బల్ల దగ్గర కూర్చుండి రొట్టె త్రుంచినాడా? లేదా? వారికి తెలియనే తెలియదు. మనము నమ్మకపోతే, ఆయన మనతో ఉన్నా లాభములేదు. ఇప్పటికి రెండు అక్కరలు చెప్పాను. సువార్తలలో ప్రభువు ఎన్నో అక్కరలు తీర్చినట్టు ఉన్నది. మీరు తరచుగా వాక్యము చదివితే అన్నిటినీ గ్రహించగలరు.
ప్రభువు సువార్తలలో ఎన్నో గంప్పెళ్లు అక్కర్లు తీర్చినట్లున్నది. ఆ నాలుగు సువార్తలు చదివితే వాటి వివరాలు ఎన్నో కన్పించును.
క్రీస్తుప్రభువు లోకానికి కనబడడము: ఆయన శరీరముతో అందరికి కన్పించుట, అనగా మొదట స్థూల శరీరముతో కన్పించుట, రెండవసారి మహిమ శరీరముతో కన్పించుట, ఈ రెండు అక్కర్లు తీర్చెను గనుక ఆయన కల్పవృక్షము.
మూడవ అక్కర:- అదేమనగా, మనిషికి తెలియకుండా మనిషిని బాధ పెట్టేవాడు, పాపములో, చిక్కులలో పడవేసి ఉంచేవాడు, లోకమంతటిని దేవునికి యెడబాపు చేయువాడు ఒకడున్నాడు. అతనే సైతాను. ఈ నాలుగు ఎడబాపుచేసే సాతానును (పూర్వము, ఇప్పుడు) వెళ్ళగొట్టివేస్తే మన అక్కర తీర్చినట్లే. అందుకనే యేసుప్రభువు యుక్త వయస్సు రాగానే ఆయన ఉద్యోగములోనికి వచ్చి, బాప్తిస్మము పొంది, అరణ్యమునకు వెళ్ళి సైతానును గెల్చెను. మనుష్యులందరిని ఓడగొట్టిన సైతానును గెల్చెను. ఆయనకు ఇహలోకములో అప్పగించిన ఉద్యోగములో గెలిస్తేనేగాని ఆ అక్కరతీరదు. అది తీర్చకుండా ఆయన పరలోకమునకు వెళ్లితే, ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా వాడు ప్రజలను బాధించును. పిశాచి మనసులో ఏమున్నదనగా ఒకప్పుడు, ప్రజలందరి పక్షముగా క్రీస్తు నాతో యుద్ధము చేసినప్పుడు, “ఓడిపోయి, సగము చచ్చే ఉన్నానన్న” విచారము అతని మనసులో ఉన్నను, అతని గుణము మాత్రము మారదు.
ఉదా:- త్రాచుపాము తల చితుకగొట్టినా అది తోక ఆడించును. తోక ఆడించుట చూచి పిల్లలు పారిపోతారుగాని పెద్దవారు పారిపోరు. అట్లే సైతాను శోధించే శోధనకు అవిశ్వాసులు నిరాశపడతారు గాని భక్తులు నిరాశపడరు. ప్రభువు సైతానును జయించినాడు గనుక ఆ విషయములో ఆయన మరొక గొప్ప అక్కర తీర్చెను.
4వ అక్కర:- మానవులందరు నేటివరకు పాపస్థితిలో ఉన్నారు. ఆ స్థితిని తీసివేస్తే బాగుండునని మన మనస్సులో ఉన్నది. సువార్తలలో ఏమున్నదనగా - (మత్తయి 9:2) “మీ పాపములు క్షమించానని” ఉన్నది. మనందరి పాపములు ఆయన ముందుగనే పరిహరించినాడు గనుక ఇంకొక అక్కర తీరినది.
5వ అక్కర:- మనుష్యులందరు జబ్బులతో ఉన్నారు, ఆ జబ్బులు తీసివేస్తే బాగుండునని ఉన్నది, గనుకనే ఆ జబ్బులన్నిటినీ మందు, ఖర్చు, ఆయాసము లేకుండనే ప్రభువు (లూకా 6:19) బాగుచేసినాడని సువార్తలలో ఉన్నది. కాబట్టి మన జబ్బులుకూడా బాగుచేయునని ఉన్నది. ఈలాగు ఇంటివద్ద, నాలుగు సువార్తలు బాగా చదివితే - “ఆకలితో ఉన్నవారికి భోజనమిచ్చెను. సముద్రాపదలో ఉన్నవారికి ఆ ఆపద తప్పించెను అని అర్ధము కాగలదు. ఈ ప్రకారము అనేకుల అనేక అక్కర్లు తీర్చినట్లు సువార్తలలో ఉన్నది గనుక మన అక్కర్లుకూడా తీర్చునని నమ్మవచ్చును, నమ్మవలెను. గనుకనే ఆయనకు కల్పవృక్షమని పేరు పెట్టినాము. ఈ కొద్ది మాటలు మీ అక్కర్లు తీరుటకు ఉపయోగకరముగా ఉండునుగాక! ఆమేన్.