ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
మితవిశ్వాసము-స్తుతిమందు
ప్రసంగ తేది: 25-10-1955
వాక్యము : హెబ్రీ. 11:1-7.
దైవభక్తులైనవారు ప్రార్ధనచేయుదురు గాని ప్రార్ధనను అంతరంగములో కలిగియుందురు. ఒక అధికారియొద్దకు ఒకరు మాట్లాడటందుకు మనవిచేయ వెళ్ళినప్పుడు వారి మనస్సులో మనవి ఉంటుందా? లేక ముందే మాట్లాడుదురా? మనవి ముందు మనస్సులో ఉండును. తరువాత మాట్లాడుదురు. మనవి విన్న తరువాత మాట్లాడుదురు.
నీ మనస్సులో ఉండుట మొదటిది. మట్లాడుట తరువాత. మీరందరు పాతవారే, నేను పాతవాడనే గాని ఇప్పుడు వేసిన ప్రశ్న పాతదా? క్రొత్తదా? క్రొత్తదే. నేను అన్నము తినేటప్పుడు ఒకప్పుడు ప్రార్ధన చేయడము, ఒకప్పుడు సగము తిన్నాక జ్ఞాపకము వచ్చి చేస్తాను. చేసినట్టా? చేయనట్టా?
జవాబు:- ఆశ మనస్సులో ఉన్నది గాని మరచిపోయినారు. గనుక మరచిపోయినను ప్రార్ధన ఉన్నది. గాని చేసినప్పుడే చేసినట్టు. కాబట్టి మీరెప్పుడైనా ఒకప్పుడు ప్రార్ధన లోపలున్నా చేయబోయినప్పుడు రాదు. గనుక దేవుడు లోపలున్నాదే వింటారా? చేస్తేనే వింటారా? గనుక విన్నట్టే.
మనస్సులో:-
- 1) ఆశ
- 2) మనవి.
ఈ రెండును ఉన్నవి గాని చేయుటనేది లేదు. ఆలాగైనా ప్రభువు నెరవేర్చునా? నెరవేర్చడా?
- 1. ఒక ఆయన యొక్కమనస్సు నిండా ప్రార్ధన ఉన్నది. గాని చేయుటకు రాదు. మొదటిది ఉన్నదిగాని చేయుటలేదు.
- 2. ప్రార్ధన ఉన్నది గాని చేయబోతేరాదు. దేవుడు మనిషియొక్క ఈ రెండు రకాల ప్రార్ధనలు అంగీకరించునా? బైబిలులో ఒక వాక్యమున్నది.
నీవనుకున్నది నీ నోటికి రాకముందే నేనెరుగుదును. ముందే దేవునికి తెలియును గాన మొదటి రక ప్రార్ధన, రెండవ రక ప్రార్ధన దేవుడంగీకరించును. దా.కీర్త 37:4,5 ఆయన నీ హృదయ వాంఛను నెరవేర్చును. ఈ వర్తమానము ఎవరికంటే ఎవరి ప్రార్ధన నెరవేరదో వారికి ఈ వర్తమానము. అదివరకు మీరు చేసిన ప్రార్ధనలన్నీ నెరవేరినవా? నెరవేరినా, నెరవేరనిది ఒకటైనా ఉండును. అట్టివారికే ఈ వర్తమానములు ప్రభువు చెప్పినాడు. ప్రార్ధన కలిగియుండుడి అనిగాదు ప్రార్ధన చేయండనెను. ఏలాగు ప్రార్ధన వచ్చునో ఆలాగే చేయుడి. తీరా చేసిన తృప్తితీరదు. ఎందుకనగా హృదయములో విచారమెక్కువుగానున్నందున.
ప్రార్ధన వస్తుంది. గాని బాగారాదు. అట్టిప్రార్ధన ఆయన ఆలకించునా? ఎందుకు ఆలకించును? రోమా 8: పరిశుద్దాత్మ మనకు ప్రార్ధన అందించును. అదే మన ఆధారము. ఆత్మ అందించకపోతే వట్టి జ్ఞానమే. అందించకపోతే గణగణలాడు తాళమైయుండును. అది జ్ఞానము చేయుటేగాని, ఆత్మచేయుట గాదు. గనుక దైవాత్మ
- 1) జ్ఞానానికి
- 2) ఆత్మకు సహాయము చేయుచున్నది.
అప్పుడు ధారవచ్చును. రుచిగా ఉండును. నెరవేరును. అంతవరకు ప్రార్ధనుంటుంది గాని నెరవేరదు. ఆత్మ అందించకపోతే నెరవేరదు.
ఈ వరండా మీదకు రాకముందు ఈ అంశముకాదు గాని అవసరమున్నది గాని ఇక్కడకు వచ్చిన పిదప ఆత్మ అందించినారు.
- 1) లోపల ఉంటే ఆలస్యంగా నెరవేరును.
- 2) ఆ ప్రార్ధన ఆత్మ అందించి బైటికి వస్తే త్వరగా నెరవేరుతుంది.
దృష్టాంతము:- కలెక్టర్ గారికి ఒకరు ఆర్జీ పెట్టుకొంటే వెంటనే జవాబు ఇవ్వక బల్లపై పెట్టి ఎప్పుడో ఒకప్పుడు దానికి ఎండార్స్ మెంటు పంపును. గాని గోజులాడు స్త్రీ వలె మాటిమాటికి వెళ్ళి గోజులాడిన వెంటనే నెరవేరుతుంది. లూకా 18వ అధ్యాయము. ఆ గోజులాడిన స్త్రీవలె మనము గోజులాడాలని మన కొరకు వ్రాయించెను. త్వరగా నెరవేరాలనుకొనువారు గోజులాట ప్రార్ధన చేస్తే నెరవేరును. ఆలాగు గోజులాడి ప్రార్ధంచిన 6 నెలలకు నెరవేరవలసింది. ఇప్పుడు నెరవేరును. అట్లే భక్తులైనవారు ప్రార్ధన మొదట చేయరు. ప్రార్ధన గదిలోకి వెళ్లగానే వెంటనే ప్రార్ధన చేయరు. కలెక్టర్ గారి దగ్గరకు ఆర్జీ తీసికొని వెళ్లిన వాడు ఆర్జీ ఇచ్చునా? సంగతి చెప్పునా? ముందే దండము పెట్టును. ఆలాగే ముందే ప్రభువుకు స్తోత్రములుచేసినా మనస్సులోని ప్రార్ధనలన్నీ నెరవేరును.
నెహెమ్యా 9:5. ఇక్కడ ముందే స్తుతించండని ఉన్నది గాన భక్తులందరు ప్రార్ధనలోనికి వెళ్ళి ముందే స్తుతించుదురు. ఈ చెప్పిందంతా ప్రవేశము. ప్రసంగములోనికి మిమ్మును దింపకముందు ఈ మాటలు ప్రవేశమాటలు. యేసునామ స్మరణ అనగా స్తుతి, ఇంకా ఎక్కువ ధ్యానము.
ఒక్కరూ రావడమే కష్టం. లక్షరూపాయలు ఏలాగు వచ్చును. దేవుడు నీ ప్రార్ధన ఎందుకు వినలేదంటే, ప్రార్ధన చేయకపోవడమే. ఒక భక్తురాలు ప్రార్ధన చేయకపోవడమేమిటి? ఉపవాస ప్రార్ధన చేసినాననెను. స్తుతి ఆఖరున చేస్తాననెను. అయ్యగారన్నారు. మొదటే స్తుతి చేయమనిరి. ఈ మాట ఎవరికి సంతోషమో?
నెహెమ్యాకు సంతోషము. పరలోక సంగతులు చెప్పుమంటే పరలోక వాస్తవ్యుల రాకుందురా? మనము ఆ సంగతులు చేయుట మనకు క్రొత్త అయితే వారికి సంగతి క్రొత్తకాదు. గాని మనము చేయుట వారికి క్రొత్త ఎందుకనిన ఇన్నాళ్లనుండి లేనిది ఇప్పుడు చేయుచున్నారు అని. గనుకనే నెహెమ్యా చెప్పినట్లు అందరును దేవుని స్తుతించండి.
1. దేవునియొక్క లక్షణములున్న:-
- 1) ప్రేమ
- 2) జ్ఞానము
- 3) జీవము
- 4) పరిశుద్ధత
- 5) న్యాయము
- 6) స్వతంత్రత
- 7) సర్వవ్యాపకత్వము
- 8) అనాది
- 9) దేవుడు తనకు తాను ప్రత్యక్షపరచుకొనుట అనేది లేకపోతే ఆకాశము, భూమి ఏమియు చేయడు.
గనుక లక్షణములన్నిటిలో తనను తన పనిని ప్రత్యక్షపరచు కొనుటయే.
2వ గది:- ఆయన సృష్టి అంతా తలంచి స్తుతించుట మంచిదే. ఒక్కొక్కటి ఎత్తి స్తుతించుట మంచిది.
- 1) చెట్లనుగూర్చి స్తుతించినారా?
- 2. ఇసుక రేణువులు దేవుడు మనకొరకు చేసినాడు గాన స్తుతించవద్దా?
- 3) ఇండ్లు కట్టుకొనువారు ఇసుక ఉపయోగింతురు.
- 4) పాత్రలు తోమువారు ఇసుక వాడుదురు.
- 5) కాళ్ళకు బంద అంటుకొనకుండ నీళ్ళ రేవులలో ఇసుక పోయుదురు.
- 6) లంకలలోని ఇసుక డబ్బు ఖర్చులేకుండా గవర్నమెంటువారు ఇస్తున్నారు
- 7) కాలుకాలిన యెడల చీము పట్టకుండ త్వరగా మానుటకు ఇసుక వాడుదురు. ఇసుకతో కట్టుకట్టి నీళ్ళు పోయుదురు. ఇన్ని ఉపయోగములుగల ఇసుక నిమిత్తము స్తుతించాలి.
- 8) అబ్రాహామా నీ సంతానము ఇసుక రేణువులంత విస్తారము చేస్తానన్నాడు.
- 9) ఆకాశ నక్షత్రమువలె విస్తారము చేస్తానన్నాడు. అప్పుడు కాలిక్రింద ఉన్న ఇసుకను ఆకాశములో ఉన్న నక్షత్రములతో సమానము చేసెను. ఇసుకకు అంత గొప్ప ఉండగా దాని నెత్తి ఎందుకు స్తుతించరాదు.
- 10) ఇసుకకు మెరుపున్నది. ఆ కళ మట్టికి లేదు. ఆ కళ సూర్యునిలోనిది. అట్టి కళగల ఇసుకనెత్తి స్తుతించాలి.
- 11) ఒకచోట ఇసుకున్న దేవుడు పెట్టెను. వెయ్యి సం॥ల తర్వాత వెళ్ళి చూస్తే గొప్పరాయి అయినది. పగులగొట్టి చూస్తే ఇసుకే. ఇట్టి ఇసుక నెత్తి స్తుతించవద్దా? రోజుకు ఒకదాని నెత్తి స్తుతించవలెను. దేవుడు మనలను మెచ్చుకొనును. నేను ఇచ్చింది చిన్నదైనా నా బిడ్డలు నన్ను స్తుతించుచున్నాడని తండ్రీ సంతోషించును.
3. నరుల సృష్టి:- కుర్చీ, బల్ల, విమానము, మోటారు, సూది మొ॥నవి దేవునివలె నరులును సృష్టికర్తలే అయినారు. మందులు, బిందెలు, ఇండ్లు ఇట్టివి కల్పించే జ్ఞానము నరులకిచ్చినందుకు స్తోత్రములు అని స్తుతించవలెను.
4. సైతాను సృష్టి:- అతడు తెచ్చిపెట్టిన పాపములవలన ఎడబాటు నరునికి నలుగుడు వచ్చెను. దానిని తిని వేయుటకు దేవుడు చేసిన పని దేవుడు నరుడుగా రావడమే. ఆయన వచ్చి పాపాన్ని పరిహరించి పరిశుద్ధత ఇచ్చెను. గనుక అది క్రీస్తు చేసిన సృష్టి. నెహెమ్యా స్తుతిలో ఈ 5దు ఉన్నవి. ఇప్పుడే స్తుతించండి. ఎందుకనగా ఇదివరకు చేయలేదు గనుక.
స్తుతి ప్రార్ధన:-
- 1) ఓ దేవా! నీవు నిన్ను మాకు బైలుపర్చుకున్నావు గనుక స్తోత్రములు.
- 2) నీవు బైలుపర్చుకున్నావు గనుక స్తోత్రములు.
- 3) నీ లక్షణములు మాకు ఇచ్చినావు గనుక స్తోత్రములు.
- 4) నీ లక్షణములను గురించి నీ వాక్యములో అక్కడక్కడ వ్రాయించినావు గనుక నీకు స్తోత్రములు.
- 5) నీ లక్షణాలను గురించి నీ బోధకులద్వారా వివరించినావు గనుక స్తోత్రములు.
- 6) నీ లక్షణములు మేము వాడుకొనేటందుకు మాకు స్వతంత్రత ఇచ్చినావు గనుక నీకు స్తోత్రములు.
- 7) నీవు అన్ని ఇచ్చి అది ఇవ్వకపోతే అన్ని ఇచ్చిన ప్రయోజనము ఉండదు. ఐతే వాడుకొనే స్వతంత్రత ఇచ్చినావు గనుక స్తోత్రములు.
2వ స్తుతి:- ఓ దేవా! మేము క్రింద ఉన్న నీళ్లలో ఉన్న ఇసుక రేణువులు మొదలుకొని ఎత్తైన కొండల వరకు ఇంకా ఎత్తైన మేఘముల వరకు ఇంకా ఎత్తైన నక్షత్రాల వరకు మా నిమిత్తమై కలుగజేసిన నీకు స్తోత్రములు.
3వ స్తుతి:- విడచిపెట్టుదాము.
4వ స్తుతి:- ఓ దేవా! నీవు సమస్తమును కలుగజేసిన రీతిగా నరుడుకూడా కొన్నింటిని కలుగజేసెను. శక్తిమంతునిగా మార్చినావు కాబట్టి నీకు వందనాలు.
చిన్న సూది మొదలుకొని ఆకాశమందు ఎగిరే విమానము వరకున్నా వాటిని నరుడు కలుగజేసేటందుకు
- 1) జ్ఞానము
- 2) శక్తి కాలక్రమేణ సమయము, అక్కర దయేచసినావు గనుక స్తోత్రము.
5వ స్తుతి:- యేసుక్రీస్తు ప్రభువా సైతానుయొక్క సృష్టిని లయపర్చుటకు వచ్చినావు స్తోత్రము. ఆరంభించినావు. వెయ్యేండ్ల చివరిలో ముగిస్తావు కాబట్టి నీకు వందనములు. ఆది. 3వ అధ్యా॥లో ఆరంభించి ప్రకటన చివరి ముగింపనైయున్న నీ గొప్ప నూతన సృష్టి నిమిత్తము నీకు అనేక వందనాలు. అది మాత్రమే కాకుండా, విశ్వాసులను శుద్ధిచేసి పరలోకమునకు చేర్చుకొందువు. కాబట్టి నీకు స్తోత్రములు. క్రీస్తు యేసునందు మనము నూతనసృష్టి అయనామని పౌలుచేత వ్రాయించినావు కాబట్టి మా విషయములో జరుగవలసిన నూతన సృష్టి కొరకు కనిపెట్టుచున్నాము. అట్లు కనిపెట్టుటకు నీవాక్యము వ్రాయించినావు స్తోత్రము.
ప్రతి సాయంత్రము 5గంలకు పిచ్చుకలకు స్తోత్ర సమాజము జరుగుచున్నది. ఒక గంట చేసి, చేసి ఆగిపోవును. ఉదయం 5 గం॥లకు టైము ప్రకారము వస్తున్నవి. యెషయా 43:20 అడవి జంతువులు, కుక్కలు, నిప్పు కోళ్ళు నిన్ను ఘనపరచును. అరేబియా దేశముయొక్క ఇసక ఎడారిలో గవర్నమెంటువారు నీరులేని చోట కాలువ త్రవ్వించుచున్నారు. నీరు ప్రవహించుచున్నది. వాక్యములోని జంతువులు త్రాగుచున్నవి. క్రీస్తుకు పూర్వము 8 వందల సం॥ల క్రితము వ్రాసిరి. ఆయన వచ్చి 20 వందల ఏండ్లయినది. గనుక 28 వందల ఏండ్లయినది. అప్పుడే ప్రవచనము నెరవేరినది. గనుక నీళ్ళు దొరకక అటు ఇటు తిరుగులాడిన కుక్కలు, నిప్పుకోళ్ళు త్రాగి దేవుని స్తుతించుచున్నవి. వాటికి సమయము లేదు. ఉదయము, సాయంత్రము స్తుతించుచున్నవి. వాటిని స్తుతిచేయుదుము రండని ఎవరు అనుచున్నారు? లోపలనుండే తలంపు గనుక మనుష్యులమైన మనమెంతగా స్తుతించవలెనో ఆలోచించండి.
ఓ ప్రభువా! జీవరాసులులున్నూ మృగములునూ నిన్నింతగా స్తుతించుచుంటే నరులమైన మేము నిన్ను ఎంతగా స్తుతించాలి? గనుక నిన్ను స్తుతించే శక్తి దయచేయుము. ఆమేన్.
ప్రార్ధన:- ఐదు విషయములు జ్ఞాపకము చేసిన ప్రభువా నీకు మా వందనాలు. జీవితకాలమంతయు ఈ స్తుతులు చేసే భక్తి దయచేయుము ఆమేన్.