ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
బ్యాటరీల పాఠము
ప్రసంగ తేది: 30-1-1956, కాకాని స్వస్థిశాల
ప్రార్ధన:- పరిశుద్ధాత్ముడవైన దేవా! ఇక్కడ ఉన్న మాలో ప్రతివారితో మాటలాడుము ఆమేన్.
- సజ్జనులారా! ఆశగలిగి ఉన్నందువలన సజ్జనులని పేరుపొందిన వారలారా! మీలో ఆశ ఉన్నది గనుక మీరు సజ్జనులే. ఎందుచేత? దుర్జనులైనను మీరు సజ్జనులే. ఎందుకంటే ఆశ మీలో ఉన్నది గనుక.
- ఇంకా ఎందుకు సజ్జనులంటే ప్రయాసపడి ఇంతదూరము వచ్చినారు గనుక సజ్జనులే.
- ఇంకా ఎందుకనగా అల్లరి చేయక, పరాకుగా ఉండకుండ ఉంటారు గనుక సజ్జనులే.
- వినుటే కాదు గాని, విన్నదానిని నమ్మి తలంచుకొంటారు గనుక సజ్జనులే.
- మీలోని కష్టాలు, నష్టాలు, చిక్కులు పోగొట్టుకొనుటకు వచ్చినారు గనుక సజ్జనులే.
- ఈ జీవాంతమందు ఆయన మోక్షానికి మిమ్మును చేర్చుకుంటారని నమ్మి వచ్చినారు గనుక సజ్జనులే.
-
మేము దేవుని బిడ్డలమే గాని దయ్యము బిడ్డలము కాదని
అనుకుంటున్నారు గనుక సజ్జనులే ఇన్ని కారణములున్నవి
గనుక ఇక
- (1) పాపులు కాదు,
- (2) రోగులు కాదు,
- (3) బీదలు కాదు,
- (4) అజ్ఞానులు కాదు. జ్ఞానులే.
ఎందుకనగా మమ్మునుబట్టికాక క్రీస్తునుబట్టే. మమ్మును బట్టి, మిమ్మునుబట్టి కాదు గాని క్రీస్తునుబట్టి పరిశుద్ధులము.
బ్యాటరీ అనగా ఏమిటంటే అది నొక్కితే వెలుతురు వచ్చును. ఇది రాత్రికాదు గనుక ఆ బ్యాటరీని గురించి అక్కడ పెట్టివేయండి. ఆసుపత్రినుండి వచ్చిన వారెవరైనా ఉన్నారా? వారికి తెలుసు. వాతము నొప్పులు గలవారికి బ్యాటరీ పెట్టించిన (ఎక్కించిన) వాతమును హరించును. దానిలోని కరెంటు శక్తి శరీరములోనికి వెళ్ళి శరీరములోని వాతమును బైటికి లాగివేయును. ఎప్పుడైనా విన్నారా? బ్యాటరీలో కరెంటు ఉండి శరీరములోనికి వెళ్ళి పనిచేయును.
50 సం॥రాల క్రితము రాజమండ్రిలో మిషనెరీలు బ్యాటరీని చూపించిరి. అప్పుడు 10 మంది పిల్లలను వరుసగా నిలువబెట్టి మొదటి కుర్రవానికి ఆ బ్యాటరీ అంటించగా, చివరి కుర్రవాడు అబ్బా! అన్నాడు. ఎందుకనగా ఒకరికొకరు అంటుకొనియున్నారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని యున్నారు గనుక మొదటి వానినుండి చివరి వానిలోనికి కరెంటు వచ్చినది. అనగా వెళ్ళినది. మనిషిలో చెముడు, మూగ, కడుపు నొప్పి, చర్మవ్యాధి, జ్వరం, గాలి (దయ్యము), కన్ను నొప్పి, పన్నునొప్పి మొదలైనవన్నీ మనిషి శరీరములో అలుముకొని ఉన్నవి. కాబట్టి దేవుడు మనకొక బ్యాటరీ ఇచ్చాడు. ఆ బ్యాటరీని నొక్కితే ఒంటిలో ఉన్న ఈ జబ్బులన్నీ బైటికిపోవును. ఆ కరెంటు అన్నిటికి వెళ్లును. ఇందాక ఆ 10 మందిలోనికి కరెంటు వెళ్ళినట్లు అన్ని జబ్బులలోనికి వెళ్ళును.
ఆ బేటరీ బైబిలులోని దేవుని వాక్యమే. దీనిలో ఎవరికి తగిన వాక్యాలు వారికి ఉన్నవి.
I. 1యోహాను 1:7లో యేసురక్తము ప్రతిపాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును అని ఉన్నది. ఒకప్పుడు ఒక ముసలాయన చావ సిద్ధముగా నుండి మంచము పట్టి బైబిలైనను చదువ శక్తిలేక, మనుమరాలిని పిలిచి, కూర్చొనమని బైబిలు చేతికిచ్చి చదవమన్నాడు. యోహాను 1:7 చదివెను. బైబిలంతా ఒక బేటరీ. ఈ ఒక్క వాక్యమే ఒక బ్యాటరీ. ఇది పాపాత్ముల బేటరీ. ఒకవేళ ఇక్కడ పాపముగలవారు లేకపోయినా, పాపమువలన వచ్చిన బాధగలవారికి కూడ ఈ వాక్యమే బేటరీ. ఇందాక బేటరీ వాతము గలవారికి; ఈ బేటరీ పాపముగలవారికి, పాపఫలితములు గలవారికిని. ఈ బేటరీతో పాపము పోతుంది. ఈ రెండు బేటరీలలో రెండవ బేటరీ గొప్పది. ఇది పాపాన్ని పాప ఫలితాన్ని పోగొడుతుంది. దీనిలో బేటరీ శక్తి రక్తమే. ఆ రక్తము యేసుప్రభువు జీవము. మన శరీరము తెగితే రక్తము వచ్చును. యేసురక్తము అట్టి మన రక్తము వంటిదికాదు. ప్రభువు రక్తమునదే జీవము. ఆ జీవము రక్తమునుబట్టి వస్తుంది.
మంచముమీద తాత మనుమరాలితో - "పాపము పోవునని ఉన్నదిగదా"? అలాగైతే ఆ వాక్యం మరలా చదువుమనగా చదివెను. ఓహో, పాపము పోవునని ఉన్నది గనుక నా వ్రేలు రక్తము అని ఉన్న ఆ వాక్యముమీద పెట్టుమనగా పెట్టెను. నా వ్రేలు అక్కడపెట్టి మరలా చదువుమనగా చదివెను. అప్పుడు తాత అన్నాడు "ఓహో! నా వ్రేలులోనుండి జల్ జల్ మంటు ఏమిటో లోపలికి వెళ్లుచున్నదన్నాడు" అదే రక్తము యొక్కయు, వాక్యము యొక్కయు కరెంటు. మరలా చదివించెను. తాతగారు సంతోషించి దాని పవర్ నాలోనికి వెళ్ళిందనెను. హా! నా పాపాలన్నీ పోయినవనెను. ఇక సుఖంగా నిద్రపోతానని కండ్లు మూసికొని పరలోకానికి వెళ్లెను.
పాపాలు పోయెను గాన మోక్షానికి వెళ్లెను గనుక మీరును మీ ఇంటికి వెళ్లి పాపము కనబడితే ఈ వాక్యము తీసి దానిమీద మీ వ్రేలు పెట్టి చదివించి, యేసుప్రభువా! ఈ వాక్యము లోని కరెంటు నాలో వ్యాపింపజేయుమని ప్రార్థించిన ఆయన రక్తములోని జీవము కరెంటువలె లోనికి వచ్చివేయును.
II. నిర్గమ. 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా అనగా దేవుడు. ఆయన చెప్పినది మిమ్మును అని అనలేదుగాని "నిన్ను" స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను అనగా ఒక్కొక్కనిని అన్నమాట. కాబట్టి మీలో ఎవరికైనా జబ్బు చేసినా, అనారోగ్యం ఉన్నా ఈ వాక్యంపై మీ వ్రేలు పెట్టండి. ఇక్కడ పాపమున్నవారు కాదు. జబ్బుగా నున్నవారు, వ్రేలు పెట్టాలి. అప్పుడు వాక్య కరెంటు శరీరములోని జబ్బులోనికి వెళ్ళును. నీ శరీరములో ఎన్ని జబ్బులున్నా అన్ని జబ్బులలోనికి ఈ కరెంటు వెళ్లుచున్నది. జబ్బులో ఈ వాక్యము చదవండి. మీరేకాదు, ఎవరైనా జబ్బుగలవారు వచ్చి అడిగిన వారి వేలుపెట్టి చదవండి, చదివించండి.
III. మత్తయి 6:25-34 బీదల కొరకు. బీదలకొరకు; ఇంకా ఉప్పు, నీళ్ళు, దొరకని ఇబ్బందిపరులకొరకు; ఇట్టి వారందరి కొరకు ఇంకొక బ్యాటరీ ఏమి తిందుమో అని విచారించకండి. ఏమి త్రాగుదుమో అని విచారించకండి. ఏమి ధరించుకొందుమో అని విచారించకండి, చింతింపకండి.
- 1) తినుట,
- 2) త్రాగుట,
- 3) ధరించుకొనుటనుగూర్చి చింతించవద్దు. ఆహారమున్నది, నీరున్నది, వస్త్రములున్నవి.
పరలోకమునుండి ప్రభువు సప్లె అందిస్తున్నారు. ఇబ్బందిలో ఇది చదివి, చదివించుకొనండి. వ్రేలు దీనిపైపెట్టి చదివిన వాక్య కరెంటు శరీరములోని
- (1) ఇబ్బందిలోనికి వెళ్ళుచున్నది,
- (2) కొదువలోనికి
- (3) పేదరికములోనికి
- (4) కరువులోనికి వెళ్ళుచున్నది.
ఈ నాల్గింటిలోనికి ఈ కరెంటు వెళ్ళిన, కొదువలు తీర, భాగ్యవంతులకంటే భాగ్యవంతులగుదురు. బ్యాంకులో సొమ్ము లేకపోయినా, మత్తయి 6:25-34 వాక్యంలోని భూలోక బ్యాంకులో దొరుకును. ఆలాగు చేసి చూడండి. మూడు రకాలు చెప్పినాను అట్టి స్థితిలో వారున్నారు గనుక అవి వారికి అవసరము.
IV. యాకోబు 4:7 అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. అపవాది అనగా
- (1) దయ్యమును,
- (2) సాతానును ఎదిరించుడి. అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
- (3) గాలిని ఎదిరించుడి,
- (4) భూతమును ఎదిరించుడి,
- (5) పిశాచిని ఎదిరించుడి,
- (6) అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
ఇప్పుడు ఇక్కడ ఉన్నవారిలో ఎవరిలోనైనా పైవన్నీ ఉన్నా వాటిలో ఒకటియైనా ఉన్నా ఈ వాక్యం పై వేలుపెట్టి చదివి, చదివించాలి. అప్పుడు వాడు పారిపోవును. వాక్యంలోని కరెంటు వానిలోనికి, వాటిలోనికి వెళ్ళును. అప్పుడు అపవాది పారిపోవును. ఈ వాక్యాన్నిబట్టి వాడు పిరికివాడే. దయ్యానికి ఈ వాక్యం అన్నా అదురు, బెదురు, భయము, దుడుకు.
V. యోహాను 14:14 నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును. “ఏమి” అనగా ఏమి అడిగినా సరే. ఇందులో పాపాన్ని, జబ్బులనుగూర్చి, పేదరికము, దయ్యాల్నిగూర్చికాదు. ఇవన్నీ ఇంకా ఏమైనా ఉంటే అవికూడా కలిపిన వాటినిగూర్చికూడ అని ఉన్నది. “ఏమి” అనేదానిలో కరెంటు ఉన్నది. ఇందాక చెప్పిన జబ్బులు, పాపాలు, అవస్థలు, ఇంకా ఏమైనా ఉంటే అవి కలిపినవి. ఈ 5 బేటరీలలో ఏది గొప్పదనగా: “ఏమి” అని ఉన్నదే, అదే గొప్పది. దానిలో అన్నీ ఉన్నవి. మీరు తెలివిగలవారైన, మీ బైబిలు అట్టమీద యోహాను 14:14లోని వాక్యము వ్రాసికొనండి. అనగా మొదటి ఆకు మొదలు చివరి ఆకు వరకు మనిషికి కావలసినవి:
- 1) విశ్వాసము,
- 2) పరిశుద్ధత,
- 3) పాడే శక్తి
- 4) చదివే శక్తి
- 5) మోక్షానికి వెళ్తాననే ధైర్యము,
- 6) ప్రార్థనలన్నీ నెరవేర్చుననే నమ్మిక,
- 7) నాకు కావలసినవి, అడుగనివి, తెలియనివి, అన్నీ ఇస్తారు;
- 8) మంచి సంగతులు బోధపడే శక్తి
- 9) అన్ని భాగ్యాలు,
- 10) అన్ని అవస్థల నివారణ; ఈ బేటరీలో ఉన్నవి.
ఏమి అనే దానిలో బైబిలులోని 365 బేటరీలు ఉన్నవి.
ఒక సంవత్సరమునకు 365 రోజులు. రోజుకు ఒక బేటరీ వాడుకొనండి. సంవత్సరానికి చాలును. మీరెంత భాగ్యవంతులు! ఈ బైబిలు గ్రంథమున్నవారు ఆ కరెంటు ఉపయోగించిన ధనికులు, జ్ఞానులు, శక్తిగలవారగుదురు. ఇది (బైబిలు) లేనియెడల అది (బేటరీ) మీకుండదు. ఈ సంగతులను మర్చిపోక అందరికి చెప్పండి.
ఆశీర్వాదము కూడా 365 బేటరీలలో ఒక బేటరీ. ఈ దీవెన చెప్పుచుండగా మీదృష్టి దానిపై ఉంచండి. ఇది నా దీవెన కాదు. యేసుప్రభువు దీవెన.
ప్రార్ధన:- ఓ యేసుప్రభువా! ఈ తైలమును దీవించుము. ఈ తైలమును ఎవరు వ్రాసికొందురో వారిని దీవించుము. ఈ తైలములోనుంచి, దీవెనలోనుంచి కరెంటు ప్రతివారిలోనికి వెళ్ళునట్లు దీవించుము. ఆమేన్.
బేటరీ అబ్బాయి చేతికి అంటించినప్పుడు కదలవద్దు, మెదలవద్దు, జాగ్రత్త అంటారు. దీవెన తలంచండి, వేరే తలంపు అక్కరలేదు. ఆమేన్.