దా| | కీర్తనలు 19:1-4; మత్త 24:29-33; హెబ్రీ. 4:1-3
"ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు; మాటలు లేవు. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి యందంతట వ్యాపించియున్నది." దా||కీర్త. 19:1-4.
దైవవాక్యములో ఉన్నట్లుగా దేవుడు కలుగజేసిన సృష్టిలోని ఈ గ్రహవస్తు సముదాయమునకు భాష లేదు. వీటికి మాటలేదు కాని మాటలు గల వారు, భాష ఉన్నవారు సంగతులు తెలియజేస్తున్నట్లు , అవి తెలియచేసేటట్లు ఈ లోకములో ఉన్న మన కొరకు అమర్చియున్నాడు. వీటికి మాటలేదు, అయినను అవి మాటలాడినట్టే; భాషలేకపోయినను భాష ఉన్నట్టే. వీటికి స్వరములేదు, అయినను స్వరమున్నట్టే. అవి మాటలాడినట్టే.
లోకములోని కొన్ని స్వర వాయిద్యములు ఉన్నవి. అవి ఏవనగా బూర, ఫిడేలు , సంగీతోపకరణములు. వీటికి స్వరములున్నవి. అయితే దేవుడు స్వరములు లేనివాటిని మనకొరకు ఉంచియున్నాడు. మానవులమైన మనకు స్వరమున్నది. మన స్వంతభాష అయిన తెలుగు భాషలో మాట్లాడకపోయినప్పటికి ని, ప్రసంగ పూర్వకముగా చెప్పకపోయినప్పటికిని స్వరముద్వారా యితరులకు సంగతులు చెప్పగలము. కేకలు వేసినగాని, చప్పట్లు కొట్టినగాని వాటి స్వరము ద్వారా యితరులకు సంగతులుచెప్పగలము. అయితే నరులుకూడా స్వరము లేనివాటిని( అనగా రైలు , విమానము, బస్సు, విద్యుత్, టెలిఫోను మొదలైనవి ) ఏర్పరిచియున్నారు. ఆకాశములో ఉన్న సూర్య, చంద్ర , నక్షత్రములకు స్వరముగాని , మాటగాని, భాష గాని , లేకపోయినను మనకు గొప్ప సంగతులు చెప్పుచున్నవి. వాటియొక్క కాంతి, కొలనూలు భూదిగంతములవరకు వ్యాపించుచున్నది. సూర్య, చంద్ర, నక్షత్రములు భాష, మాట, స్వరము లేకుండ ఉన్నప్పటికిని, అవి దేవుని విషయములు భొదించుచున్నవి మరియు సువార్త ప్రకటించు చున్నవి.
క్రీస్తుప్రభువు తన శిష్యులతో ఒక మాట చెప్పియున్నారు. 'మీరు భూదిగంతములవరకు నాకు సాక్ష్యులైయున్నారు; దాని అర్దము 'నా విషయమైన సంగతులు భుఊదిగంతముల వరకు ప్రకటింపవలెను; ఈ శిష్యులు భూమిమీదికి రాకపూర్వము, ఆదికాండములోనే ఈ అధికారమును అనగా భూదిగంతముల వరకు దేవుని విషయములు ప్రకటించుటకే దేవుడు ఖగోళమును ఏర్పాటు చేసియున్నాడు.
క్రీస్తు ప్రభువు ఆనాటికాల జనుల భాష మాట్లాడగల వారిని మరియు తమ స్వరము యితరులకు వినిపించగలవారిని తన శిష్యులనుగా ఏర్పర్చియున్నాడు. క్రీస్తు యేసు ప్రభువు, దేవమానవునిగా భూమిమీదికి రాకముందు, శిష్యులు పుట్టకముందు, ఆదాము హవ్వలను సృజించక ముందు, దేవుడు తన విషయములముందు ప్రకటింపకముందే, సూర్య, చంద్ర, నక్షత్రములను నేర్పరిచియున్నాడు. అప్పటినుండి అవి అనేకవేల సంవత్సరములుగా అనగా అవి సృజింపబడినప్పటినుండి యిప్పటి వరకు ప్రకటిస్తునే ఉన్నవి. క్రీస్తు శిష్యులు ప్రకటించుచున్నది రెండువేల సంవత్సరముల నుండియే. ఇందులో ఎవరు గొప్పవారు ? భాష గలవారు గొప్పవారా ? భాష లేని ఖగోలము గొప్పదా ? భాషలేనివే గొప్పవి. ఎవరి పని మొదట ఆరంభమాయెను. జ్యోతులయొక్క పనియా ? శిష్యులయొక్క పనియా ? జ్యొతులయొక్క పనియే.
బైబిలులో వ్రాయబడినట్లు దేవుని పని చేసిన శిష్యులు, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, మరియు మోషే, యెహూషువ మొదలైన వారి పని మొదటిదికాదు. అబ్రాహాము , ఇస్సాకు, యాకోబుల పని మొదటిదికాదు, వారికి పూర్వమందున్న హనోకు, మెతూషెల, నోవాహు పని మొదటిదికాదు. మొట్టమొదట సువార్త ప్రారంభించిన వారు సూర్య, చంద్ర నక్షత్రాదులే. సృస్టిపని మొదటనుండి సువార్త పనియే.
యేసుప్రభువు ప్రారంభించిన సువార్తపని పూర్వము నుండి ఉన్నది. ఈ పని కడవరకు సాగును. పెండ్లికుమార్తె సంఘము వెళ్ళిన తరువాత , 7సంవత్సరముల శ్రమ గతించిన తరువాత, వెయ్యేండ్ల పరిపాలనతరువాత సజీవులతీర్పు, ఆ పిదప అంత్య తీర్పు ఉన్నది. అప్పుడు అనేకమంది సింహాసనముల ఎదుట నిలువబడుదురు. దేవుడు సువార్త ఎవరికి పంపలేదో వారక్కడ ఉండరు. దేవుడు లోకములో పుట్టిన ప్రతివారికి ఏదో ఒక సమయములో, ఏదో ఒక రీతిని సువార్త ప్రకటించిరి, ప్రకటిస్తున్నారు, ప్రకటిస్తారు, ప్రకటింపజేస్తారు. ఎవరైన అంత్యతీర్పునందు నిలువబడి ఉన్నారు అంటే వారు ఎవరు? సువార్త అందినవారా? అందనివారా? అందినప్పటికిని అందుకొననివారా? అందుకొన్నవారా? మానవులందరిలోని ఒక తరగతి వారిలో ఒక కృత్రిమ ప్రశ్న ఉన్నది. అది ఏమనగా 'దేవా! నీ సంగతులు మాకు తెలిపియుంటే మేము నమ్మియుందుమనీ దేవుని మీద 'నేరము మోపుదురు. గాని ఆ విధముగా మాట్లాడుటకు సందులేదు. ఎందుకనగా ఆ సంగతులు ఎరిగిన సాక్షులున్నారు.
అవి సూర్య చంద్ర నక్షత్రములు. వీటికి మాట లేకపోయినను. క్రియ ఉన్నది. ఎక్కడో అనేక కోట్ల మైళ్ళదూరములోఅవి ఉన్నవి. వాటికి దేవుడిచ్చిన సహజ క్రియ ద్వారా వెలుతురు ఇస్తున్నాయి. అవి ఏమి చెప్పుచున్నవి? మనిషి వాటిని చూడగానే ఏమనుకుంటాడు? ఉదాహరణకు;- ఒక గోడమీద పువ్వులచెట్ల బొమ్మ వేసియుంటే, బాటసారి దీనిచూచి ఏమనుకుంటాడు ? అడవిలో ఉన్న పూలచెట్టువలె ఈ బొమ్మ ఉన్నది. ఈ పువ్వ్యుల బొమ్మ ఎవరువేసి ఉంటారు? అని తన మనస్సులో అనుకుంటాడు. ఎవ్వరు లేకుండ ఈ చెట్టు బొమ్మ ఇక్కడికి రాలేదు. ఎవరో ఒకరు చక్కగా గీసిపెట్టి ఉంటారు. అతడు గొప్పవాడు! అని మెచ్చుకుంటాడు. అనగా ఆ చెట్టు నిజరూపముగల చెట్టువలె చిత్రించిన వ్యక్తి కనబడకపోయినను, అతని క్రియ కనబడగా తప్పక మెచ్చుకుంటాడు. వీటికి స్వరము, భాష మాట లేదు. అయినను అవి మాట్లాడుచున్నవి." " మమ్మును కలుగజేసిన దేవుడు ఎంత కాంతి గలవాడు? ఎంత శక్తిగలవాడు? ఎంత జ్ఞానవంతుడు" అని అంటున్నవి. ఆ మాటకు భాషలేదు, స్వరములేదు. ఏలాగనగా గోడమీద వేయబడిన పువ్యుల చెట్టు బొమ్మ 'ఓ బాటసారి నన్ను చేసిన వారిని మెచ్చుకో!' అని అన్నదా! అనలేదు. అయితే ఆ బాటసారి ఆ బొమ్మను గీసిన మనిషిని చూడకపోయిననూ, బొమ్మనుచూచి, గీసిన వానిని మెచ్చుకుంటాడు. అలాగు జ్యోతులు చేసిన వానిని నరుడు మెచ్చుకొనవలెను. ఆయననే పెద్దలు 'దేవుడూ అని అంటారు. దేవుడు చేసిన వాటిని బట్టి నరులు దేవునిని మెచ్చుకుంటున్నారు. అలాగే ఈ క్రియనుబట్టి ఎవ్వరు దేవునిని మెచ్చుకొనరో, వారే అంత్యతీర్పులోనికి వెళ్ళుదురు. మీకు సంగతి తెలిసేటట్లు; మీలో నిలువ ఉండే సంగతి, మీ జ్ఞప్తిలో ఉండే సంగతి చెప్పుచున్నాను
ఇందులో
- 1 . దేవుడు - స్వయముగా మాట్లాడుట, ఇది మొదటి సంగతి.
- 2. దేవుడు దర్శనములో కనబడుట మరియు మాట్లాడుట, తన సంగతులు బయలుపర్చుట ఇది రెండవ సంగతి.
- 3. సృస్టిద్వారా తన ఉనికిని తన సంగతులను తెలియచేసికొనుట.