నోవహు నావ - క్రీస్తు రక్షణ ఓడ

(1940వ సం| | లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

దా. కీర్త. 103:14 - 18; యోహా. 2:25; అపొ |కార్య. 27:20 - 24
"దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్ళు తగ్గిపోయెను." ( ఆది. 8:1 ).

నోవాహు కాలములోని జలప్రళయము అనంతరము దేవుడు నోవాహును జ్ఞాపకముచేసికొనెను. నోవాహు 150 దినములు అనగా 5 నెలలు ఓడలో మూయబడి యుండుట ఒక విధముగా భయంకరమైనది. అయినప్పటికిని సంతోషమే.

ఉదా:- గాలితుఫాను వచ్చిన సమయమునందు మనము ఇంటిలో తలుపువేసికొని ఉంటాము. ఇల్లు చాలా బలమైనది. ఇంటి వెలుపల భయంకరమైన గాలి, శబ్ధము మొదలగునవన్నియు నుండును. లోపలనున్నవారు అనుకొనునది ఒకటి. అదేమనగా నేను బలమైన ఇంటిలోనున్నాను. నాకేమి పర్వాలేదు అని అనుకొనును. గాలి తుఫాను ఒక దినము. రెండవ దినము, మూడవ దినము ఇంకా ఎక్కువ దినములున్నయెడల ఇంటిలోకూడ భయము కలుగును. విసుగుపుట్టును. ఎందుకనగా ఎక్కువ కాలము తుఫాను ఉండుటనుబట్టికాదు గాలి వీచుచుచున్నదనికాదు దెబ్బతగులుననికాదు,ఇంటిలో సరుకులు లేవని కాదు.అన్ని ఉన్నను విచ్చలవిడిగా తిరుగుటకు వీలులేదు గనుక విసుగుదల పుట్టును. ఆలాగే నోవహు ఓడలో అన్ని ఉన్నవిగాని విచ్చలవిడిగా తిరుగుటకు వీలులేదు. ఎంత సౌఖ్యమున్నను ఒక విధముగా భయముండును. మేమెప్పుడు బయటికి వెళ్ళుదుమా! ఎప్పుడు మైదానము మీద సంచరింతుమా! ఎప్పుడు సూర్యుని చుచెదమా! ఎటు చూచిన నీళ్ళేయని తలంపులు వచ్చును. మనలను ఒక అడవిలో విడిచిపెట్టిన ఎట్టి తలంపులు వచ్చునో గ్రహింపగలము. వారికి మరియొక తలంపు పుట్టవలసినది కాని పుట్టలేదు. ఓడకు రంద్రముబడిన దానిలోనికి నీరు వచ్చునని, దేవుడు నోవాహును లోపలికి రమ్మని తలుపుమూసెను. "లోపలికి రమ్మన్న దేవుడు బయటికి రమ్మనుట మరచిపోయినాడా?" అని నోవహు భార్య బిడ్డలు అనుకొనవలసినది, కాని వారట్లు అనుకొనలేదు. దేవుడు అయిదు నెలలు అయిన తర్వాత వారిని జ్ఞాపకము తెచ్చుకొనెను. ఇన్నాళ్ళు వారిని మరచిపోయినాడని కాదు, జ్ఞాపకము తెచ్చుకొనుచునే యుండును. అనగా ఇన్నాళ్ళు వారు ఓడలో ఉన్నారు. ఈ దినము వారిని బయటికి తెచ్చెదనని చెప్పినట్లున్నది.

ఉదా : - ఒక తల్లి బిడ్డను ఇంటిలోపెట్టి తలుపు మూయును.. అయితే, ఆ బిడ్డ మాత్రము మా అమ్మ కొంత సేపటికి తలుపు తీయునుగదా అని అనుకొనును. కాని తల్లి ఎంతసేపటికి తలుపు తీయదు. ఇంక పిల్లకెవ్వున ఏడ్చుటకు సిద్ధముగానుండు సమయములో తల్లి తలుపు తీసినది. ఆలాగుననే నోవహు స్థితి కూడ యున్నది. పై ఉదాహరణలో బిడ్డకు గాని, నోవాహునకు శిక్ష కాదు. ఇంకా దేవుడు తలుపు తీయకుండ నున్నట్లయిన వారు దేవుని దూషితురు, విసుగుకొందురు. వారు దూషింపకపోయిననూ, విసుగు కొనకపోయిననూ ఏదో ఒక ఆయాసము కలుగును. ఇది జరుగుటకు ముందే ఆయన తలుపు తీసెను. దీనినిబట్టి మనము నేర్చుకొనవలసినది ఏమనగా, దేవుడు మనలను విడిపించును. ఇది విశ్వాసుల స్థితి.

నోవాహు ఓడలోనుండి కాకిని బయటికి పంపించినప్పుడు, "నేను కాకిని విడిచిపెట్టిన రీతిగా దేవుడు నన్ను ఓడలో నుండి విడిచిపెట్టునని" తలంచవలెను. దేవుడు నోవహును జ్ఞాపకము చేసికొనెను. అనగా నోవహు యేసు ప్రభువునకు ముంగుర్తు గనుక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా యున్న వారిని జ్ఞాపకము చేసికొనక తప్పదు. నోవహు ఓడలో ఉండి కొండ ఎక్కెను. ఆలాగుననే యేసుప్రభువు చివరకు గొల్కొతాకొండ ఎక్కెను. సముద్రములో ఓడ మునిగిపోవునప్పుడు, ఓడలోని వారు ఆ సంగతి కాగితముల మీద వ్రాసి సీసాలోపెట్టి సముద్రములో విడిచెదరు. కెరటములు వాటిని ఒడ్డునకు చేర్చును. సముద్రము దేనిని తనలో నుంచుకొనదు.ఆలాగే కష్టములు వచ్చీప్పుడు అవి మనలను దేవుని దగ్గరకు నడిపించునుగాని అధోగతికి నడిపించవు. విశ్వాసుల విషయములో ఆలాగు జరుగును. కాని అవిశ్వాసుల విషయములో అధోగతే. దేవుడు నోవహును జ్ఞాపకము చేసికొనెను.

యేసుప్రభువు పోలిక నోవహులో నుండెను. ఎవరైన తమ బిడ్డల పోలికగల ఇతరులను చూచిన వారి యందు ఇష్టము కలిగి ప్రేమింతురు. తమ బిడ్డలు చనిపోయినయెడల, వారి పోలికగల వారిని ఇండ్లకు పిలిచి సత్కరింతురు. ఆలగుననే మనలో క్రీస్తుప్రభువు పోలిక ఏదైన ఉన్నయెడల, అనగా "ఆయనవలె శ్రమలు సహించుట, తండ్రి చిత్తము నెరవేర్చుటా మొదలగు గుణములున్న యెడల దేవుడు తప్పక మనలను జ్ఞాపకముంచుకొనును. క్రీస్తు ప్రభువు శ్రమలను సహించెను, నీచత్వము అనుభవించెను. తండ్రియొక్క చిత్తము తప్పక నెరవేర్తునని ప్రతిజ్ఞచేసెను. మనకు ఇట్టి లక్షణములుగలవో లేదో, చూచుకొనవలెను. నోవహు ఓడ కట్టించెను. ఓడ చివరకు కొండ ఎక్కెను. ఆలాగే క్రీస్తుప్రభువు సంఘమనే ఓడను కట్టుననియు, అది లోకమనే సముద్రమును దాటి రెండవ రాకడప్పుడు పరలోకమను కొండకు వచ్చుననియు దేవునికి ముందుగానే తెలియును. ఇది నోవహునకును క్రీస్తునకును గల మరియొక పోలిక. తుఫాను అయిన తర్వాత ఎండను చూడగానే మనుష్యులకు సంతోషము కలుగును. సూర్యుడు తన కిరణములు భూమి మీదికి రానిచ్చినట్లు దేవుడు తన మహిమ కిరణములను విశ్వాసుల మీదికి కష్టముల తర్వాత రానిచ్చును. నిజ విశ్వాసులే రక్షణ ఓడ కథ ఎరిగినవారై, క్రీస్తుప్రభువునందలి విశ్వాసముతో ఆయన రాకకు సిద్ధపడుదురు గాక! ఆమెన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद