దా. కీర్త. 71:14; లూకా. 2:28-32; 1పేతు. 2:9-10.
"నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును" దా.కీర్తన. 71:14.
రక్షణాపేక్ష ప్రియులారా! "మరి యెక్కువ" అనేమాట సామాన్యముగా చెప్పే "ఎక్కువ" అనేమాటకంటె అధికమై యున్నది. భక్తులలో సామాన్యమైన స్తుతిచేసేవారు కలరు. భక్తులలో సామాన్యమైన స్తుతుకి మించిన స్తుతిచేసేవారు కలరు భక్తులలో సామాన్యమైన స్తుతికి మించిన స్తుతిచెసేవారు కలరు. వీరే ప్రత్యేక జనాంగము. "నా గొప్పతనమును వృద్ధి చేయుము" అని దావీదు ప్రార్ధించెను. గొప్పతనమనునది సామాన్యమైన స్థితి. ఈ కవి అది అనుభవించి తృప్తిపడి, ఇంకా ఎక్కువ గొప్పతనమును కోరుచున్నాడు. ఈయన సామాన్య జనులతో కూర్చుండి గొప్పతనము సంపాదించెను. అది చాలక వృద్ధి కోరుకొనుచున్నాడు. గనుక ఇతడు ప్రత్యేకమైన ఏర్పాటులో ఉన్న వ్యక్తి, ఏర్పాటులో ఉన్నవారుకాక, ప్రత్యేకమైన ఏర్పాటులో ఉండగోరువారు ఎక్కువగా స్తుతింతురు, గొప్ప తనముయొక్క వృద్ధిని కోరుకొందురు.
క్రీస్తుప్రభువు రాకముందు ఆయన వస్తాడని పాతనిబంధనలో వ్రాయబడియున్నది. అప్పటికి భూలోక భక్తులు ఉన్నారు. ఆయా ఉద్యోగములకు ఏర్పర్చబడినవారు ఉన్నారు. ప్రజలను తాత్కాలిక విపత్తులనుండి తప్పించిన రక్షకులున్నారు. హతసాక్షియైన హేబెలు ఉండగా, ఆరోహణమైన హనోకు ఉండగా, జలప్రళయమునుండి రక్షించిన నోవాహు ఉండగా, ఏర్పాటు జనము వచ్చేటందుకు షేము ఉండగా, విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము ఉండగా, దహనబలికి ఒప్పుకున్న ఇస్సాకు ఉండగా, అన్ని ప్రక్కలనుండి అరిసెలు అందుకొన్న పిల్లవానివలె, అన్ని ప్రక్కలనుండి ఆశీర్వాదములు అందుకున్న యాకోబు ఉండగా, యూదుల మతము ఉద్భవించుటకు కారుకుడైన యూదా ఉండగా, యూదులయొక్కమత సిద్ధాంతములు వ్రాసిన మోషే ఉండగా, భూలోకములోని దైవరాజ్యము ఏలుటకు యెహోషువ, న్యాధిపతులు, రాజులు ఉండగా ఉజ్జీవ కూటములు ఆరంబించిన సమూయేలు ఉండగా, రాబోయే సంగతులు చెప్పుచు, దేవునియొక్క సన్నిధిలో ఆ వాక్కులు వినే ప్రవక్తలు ఉండగా క్రీస్తు ఎందుకు? క్రీస్తు అవసరమేమున్నది? అని కొందరందురు.
అయితే, వారందరు రక్షకులేగాని సంపూర్ణ రక్షకులుకారు. ఓబద్యా గ్రంధము చివరి వచనము "మరియు ఏసావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోనుకొండమీదమీద రక్షకులు పుట్టుదురు అని ఉన్నది. అప్పుడు రాజ్యము యెహొవాది అగును." ఓబద్యా 21వ వచనము. దీనినిబట్టి చూడగా, గర్వించి జ్యేష్టత్వమును త్రుణీకరించి, తమ్మునియొక్క దీవెనను అపహరింపగోరిన ఏశావుయొక్క సంతానము శేయీరు దేశములో బాగుగా విస్తరించెను. విస్తరింపు అనగా కొండ ఎక్కుట. వారు కొండ ఎక్కిరి గనుక వారు ఎక్కిన కొండ దిగరు అనగా గర్వించెదరు. మేమే గొప్పవారము, మా తమ్ముని సంతానముకంటె మేమే గొప్పవారమని; మా తండ్రి, తమ్మునియొక్క గొప్పతనములకంటే మేమే గొప్పవాళ్లమని అతిశయించిరి. కాని యేసుక్రీస్తు ఎప్పుడును అతిశయించలేదు. ఏశావుయొక్క సంతానమువారు ఎప్పుడును ఇశ్రాయేలీయులయొక్క నాశనమును కోరుకున్నారు. పాలస్తీనాలో సీయోను కొండ ఉన్నది. అది యోకోబుయొక్క ఆశ్రయస్థానము. అక్కడ నుండి న్యాయకర్తలైనవారు, రక్షకులైన వారు లేవవలెను. వారు ఏశావునకు తీర్పు విధిస్తారు వారిలో ఎవరైనా మార్పు చెందినవారుంటే వారు న్యాయకర్తలు, రక్షకులగుదురు. ఈ పాటము ఓబద్యా గ్రంధములో మాత్రమేకాదు తక్కిన గ్రంధములలోకూడా మర్మముగా ఉన్నది.
ఓబద్యా 21వ వచనములో ఉన్నట్లు ఆకాలమునకు వారు తగిన రక్షకులే గాని క్రీస్తువలె సంపూర్ణ రక్షకులుకారు. క్రీస్తుకు ముంగుర్తైన రక్షకులు. ఆ రక్షకులు ప్రత్యేకమైన రక్షకులు. ఆలాగే యూదులు దేవుని ఏర్పాటు ప్రకారము ప్రత్యేకమైన జనాంగము. క్రీస్తు ప్రభువు ఆ వరుసనుబట్టి ప్రత్యేకమైన రక్షకుడు. లోకములోని ఆయా జనాంగములు, ఆయా మతములు తమ స్వంత రక్షకులను ఏర్పర్చుకున్నారు కాని క్రీస్తుప్రభువును అన్ని అన్ని జనాంగముల కొరకు ప్రత్యేకమైన రక్షకునిగా దేవుడు ఏర్పరచిరి. ఆలాగే క్రీస్తు నామమును ధరించిన క్రైస్తవ సంఘము లోకములో ఉన్న అన్ని మత సంఘములలో ప్రత్యేక సంఘము. ఇప్పుడు ఈ సంఘములో రాకడకొరకు కనిపెట్టుచున్న సంఘము ప్రత్యేక సంఘము. ఆ ప్రత్యేక రాకడ సంఘమందు స్థిరపర్చబడుటకు, సిద్ధపడుటకు; పూర్వకాలమందు ఉన్న యెషయా మొదలగు ప్రవక్తలు దైవ సన్నిధిలో ఉండి, దేవునియొద్దనుండి జవాబులు ఎట్లు పొందినారో, అట్లే జవాబులు పొందుటకు ఈ కడవరి కాలములో భూలోకమందంతట సన్నిధి కూటములు ఏర్పాటు చేయబడవలెను. ఇది సన్నిధి కూటముల ఆరంభకాలము గనుక మన కూటముల ఎన్నో కోట్ల పత్రికలు ముద్రించి, పంచివేస్తే, ఆ పత్రికలు వెళ్ళే ప్రతి స్థలములో సన్నిధి కూటములు ఏర్పడగలవు. సన్నిధి కూటములు ప్రత్యేకకూటములు గనుక ఏడుగురు ప్రత్యేక కూటస్థులతో అనగా సన్నిధి అభ్యాసమున్నవారితో ఏర్పాటు చేయవలెనని గ్రహించుకొనవలెను. వాటిని విరివిగా ఏర్పాటు చేసుకొనవలెను.
హేబేలు మొదలు యూదుల వరకు ఏర్పాటు జనమైయున్నారు. ఈ ఏర్పాటు జనములో నుండి క్రీస్తుప్రభువు ప్రత్యేకరక్షకుడు అనగా ఆరోహణమైన ఏర్పాటు రక్షకుడు ఆయననుండి సంఘము, ఆ సంఘమునుండి ప్రత్యేకసంఘము, ఆ ప్రత్యేకసంఘమునుండి రాకడసంఘము ఏర్పడెను. ఈ రాకడ సంఘము తయారగుటకు సన్నిధి కూటములు అవసరము. రక్షణ యావత్తు సన్నిధి కూటముల మీద ఆధారపడియున్నది. మనము లోకమునుండి, లోక ఆకర్షణ, లోక పద్ధతులనుండి ప్రత్యేకింపబడితేనేగాని రాకడకు వెళ్ళలేము. ప్రత్యేకింప బడుటకు సన్నిధి కూటములు ప్రత్యేకింపబడవలెను.
ప్రార్ధన: - తండ్రీ! ప్రతి జనాంగములోనుండి నీ ప్రత్యేక జనాంగమైన సంఘములోనికి ఈ ప్రత్యేక జనాంగములాగుకొని వస్తున్నది. ఇట్టి ప్రత్యేకశక్తి సంఘమునకు ఇచ్చినందుకు వందనములు. ఈ క్రొత్త వర్తమానము కొరకు వందనములు. మేమందరము ప్రత్యేకించుకొన్న వ్యక్తులమై ఉండునట్లు శక్తి దయచేయుము. ఈ వర్తమానము మా మీటింగులకు అందించుమని వేడుకొంటున్నాము. ఆమేన్.