దా. కీర్తనలు 50: 16-22; యోహా. 1:21-35; 1తిమో. 4:11-16
" అర్ధరాత్రివేళ- ఇదిగో, పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబ్డెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని... " మత్త. 25: 6,7.
కీర్తన: షారోను మైదానముతో -సమమైన మైదానంబు = ఏరాజ్యమందు లేదు - ఎంచి చూడగా ||షారోను||
ప్రియ విశ్వాసులారా! ఇది రాకడ కాలము గనుక రాకడ విశ్వాసులైన మీకు రాకడ ఆనందము గలదు. ఆ రాకడ ఆనందమే రాకడ పండుగ. నా ప్రభువు త్వరలో వచ్చును. నేను చావనే చావను. ఆకాశము వీధులలోనికి నా ప్రియుడు నేడే వచ్చును. నన్ను ఎత్తుకొనిపోవును. నేను ఆయన కలసి మెలసి విందులో ఉందుము. నేను అందులోనుందును. ఆయన విందులోను ఉందును. ఆయనతో సదాకాలము ఉందును. రాజునై ఏలుచుందును అని నీవెంత మురుచుకొనుచున్నావో అదియే హృదయానందము. దానిని కన్నులారా చూతుము. ఆ కళలే పాటలతో, ప్రార్ధనలతో, ప్రసంగములతో , సంఘములతో కన్నులారా చూచుచుంటిమి. గనుక అది కన్నులపండుగ. ఇన్ని పండుగలతో కూడినదే రాకడ పండుగ. ఎత్తబడిన తరువాత ఏడేండ్ల శ్రమలలో ఎవరైన లేతురా? గనుక ఇది మన రాకడ పండుగ. ఈ పండుగ కన్నుల పండుగకాకుండ ( అనగా నామకార్ధముగాకాక) సంఘములతో ఏదైన భంగము కలిగించునది కలదేమో అని దానిని చక్కపరచుకొనవలెను. రాకడ కేక వినగానే కన్యలందరు రాకడ ఆనందముతో తమ్మునుతాము చక్కపరచుకొనిరి; దీనిపేరే దిద్దుబాటు. వారు అది ఆనందముతో చేసిరి. గనుక అదే దిద్దుబాటు పండుగ. ఒకప్పుడు మనపెద్దలు దిద్దునప్పుడు మనకెంతో బాధ కలిగినది. ఏడ్పులతోనే ఇష్టము లేకపోయినా కష్టమైన తప్పనిసరిగా దిద్దుకొంటిమి. అది దిద్దుబాటుగాని, దిద్దుబాటు పండుగకాదు. ఇప్పుడు తప్పు ఉంటే చెప్పండి. సంతోషముతో దిద్దుకొంటాను అని అంటునావు. దిద్దుకొనే ఆనందము నీకు గలదు. గనుకనే ఇది దిద్దుబాటు పండుగ. పెద్దల గద్దింపులు తైలాభిషేకము ( ఆశీర్వాదము ) లనుకొన్నావు. బుద్ధి చెప్పేవాడు గ్రుద్దితేమిరా(గద్ధిస్తే ఏమిఏ ) అనుకున్నావు. అప్పుడే నీ మూర్ఖత వదిలి ఇంకా జ్ఞాన వివేకాదులను సంపాదించుకొన్నావు. ఈ రాకడ కేకలు విని కన్యకలవలె ఉషారుగా లేచి చక్కపర్చుకోదలచుకొన్నావు. గనుక ఇది నీకు రాకడ కేకలు విని కన్యకలవలె ఉషారుగా లేచి చక్కపర్చుకోదలచుకొన్నావు. గనుక ఇది నీకు రాకడ దిద్దుబాటు పండుగేగదా!
సాతను ఉపదేశమును అంగీకరించి మారుమనస్సు పొందిన దావీదువలె, పందులమధ్య పరుండిన కుమారునికి బుద్ధి వచ్చినట్లే, నీవును తండియొద్ధకురాగా తప్పిపోయిన ఆ కుమారునికి ఎంత దిద్దుబాటు విందు జరిగినదో అట్లే ఈ దిద్దుబాటు పండుగ నీకెంతో ఆనందము.
క్రైస్తవ సంఘమునకు అక్టోబరు 31వ తేదిన దిద్దుబాటు పండుగ జరిగినది. ఆ రోజున మహా సంస్కరణ జరిగినది. ఆ రోజున మహా సంస్క్రణకర్త లూథరు నిలువబడి సంఘ దిద్దుబాటు జరిగించినాడు. మనకు కూడ అక్టోబరు 31వ తేదీన సంస్కరణ జరిగినది ( 1946సం| | ము) అప్పటినుండి ఏడు సంవత్సరములు రాజమండ్రిలో జరిగించితిమి, నేటికి మిషను వృద్ధి అయినది గనుక ప్రతివారు తమ స్వంత సంఘములలో ఈ రాక కాలంలో దిద్దుకొనుటకు రాకడ విశ్వాసులమైన మనకిది రాకడ దిద్దుబాటు పండుగ.
దేవుడు, దిద్దుకొనుటకు సౌలుకు 38సం | | లు ఇచ్చినను దిద్దుకొనక నశించి సింహాసనము, రాజ్యము, మేడలు పరులకు అప్పగించెను. దేవుడు అడిగినను ఆదాము చెడుగును తీసివేసికొనలేదు. పాపమును దాచుకొనెను. గనుక తాను దేవుని సన్నిధినుండి తీసివేయబడెను. కయీనుకూడ చెడుగును తీసివేసికొనలేదు. గనుక తాను దేవుని సన్నిధినుండి తీసివేయబడెను. యెహోషువ అడిగినను ఆకాను ఒప్పుకొనలేదు గనుక సమాజములోనుండి తీసివేయబడెను. ఎలీషా అడిగినను గెహాజీ దాచుకొన్నాడు. ఒప్పుకొనలేదు. గనుక శిక్ష తెచ్చుకొనెను. యేసుప్రభువు స్వయముగా గద్దించినను యూదా మనస్సు మార్చుకొనలేదు. గనుక సింహాసనాధికారము పోగొట్టుకొనెను. సంఘకాలములో పరిశుద్ధాత్మ పూర్ణుడైన పేతురు గద్దింపును లెక్కచేయని అననీయ సప్పీరాలు నశించిరి.
ఈ రాకడ దిద్దుబాటు పండుగ తరుణములో సంఘములన్నియు దిద్దుకొని కన్యలవలె చక్కపర్చుకొని, పెండ్లికుమారునితోపాటు మనమును పెండ్లి విందులోనివి కలిగియుందము గాక! ప్రభువు తన ఆశీర్వాదము రాకడ ఆనందము మీకు అనుగ్రహిచును గాక! ఆమేన్.
" నానా వర్ణాల పువ్వుల్ నరదృష్టి నాకర్షించును - మానవ శుద్ధి ప్రభుని మది నాకర్షించున్ | | షారోను | |