దా.కీర్త. 60:6; మార్కు 11:19-23; హెబ్రీ. 6:13-15.
" తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు" కీర్త. 60:6
మోక్షానంద ప్రియులారా! ఈ వాక్యములో దేవుడు తన పరిశుద్ధతతోడని మాట ఇచ్చియున్నాడు. అనగా నా పరిశుద్ధతతోడు, నేను మనుష్యులను రక్షించుదునని ప్రమాణము చేసెను. మీకు అర్ధమగుటకు ఈ వాక్యమును కొద్దిగా మార్చిచెప్పితిని. ఇది భయంకరమైన ప్రమాణము. ఈ మాట యొక్క మూల అర్ధము. మానవులను రక్షించని యెడల దేవుని స్వీయ ప్రత్యక్షత, పరిశుద్ధత పోయినట్లు, మరియు ఆయనే పోనట్లు దీని అర్ధము . కొంతమంది ప్రమాణము చేసేటప్పుడు మా అమ్మతోడు ( మా అమ్మమీద ఒట్టు), మా నాయన తోడు ( మా నాయనమీద ఒట్టు) అంటారు. అంటే వారి మాటకు నిదర్శనము వారు పోయినట్లే. అట్టి ప్రమాణములు ( ఒట్టులు) చేయకూడదు. దేవుడు మనిషిని రక్షించుటకు అట్టి ప్రమాణములు చేసెను గనుక ప్రతి వానిని రక్షించుటకు రక్షకుని ఏర్పాటుచేసెను. ఆ ఏర్పాటే అందరును ఒప్పుకొనవలెను. ఆ ఏర్పాటులో నిదర్శనము ఏదనగా భూలోకములోని పాపులైన, మనుష్యులను రక్షించుటకు దేవుడే యేసుక్రీస్తుగా, శరీర ధారిగా వచ్చెనను సంగతి. ఆయనను విశ్వసించితే రక్షణ, మోక్షమే గాని నరకములేదు. కానీ మనుష్యుడు దేవుని ఒప్పుకొనడు గనుక దేవుని ప్రమాణము నెరవేరదు. విశ్వాసులారా! మీరు ఇక్కడకు రావడముద్వారా మీ విశ్వాసము బైలుపర్చిన విశ్వాసులారా! మీలో కొద్ది పాటి విశ్వాసము ఉన్నప్పటికిని, అదికూడ సంతుష్టిగా లేకపోయినప్పటికిని, మిమ్మును విశ్వాసులుగా సంబోధించు చున్నాను. ఉదా:- గ్లాసులో నిండుగా నీళ్ళున్నా, సగము ఉన్నా ఒక చుక్క నీరు ఉన్నా, గ్లాసులో నీళ్లు ఉన్నట్టేగదా! అలాగే మీ అంతరంగములో ఏమూల కొద్దిపాటి విశ్వాసమున్నను విశ్వాసులే. ఇక్కడ కూర్చున్నవారు తమ హృదయములు పరీక్షించుకుంటే కొంతలో కొంతయైన విశ్వాసము ఉండకపోదు. కాబట్టి మీరు విశ్వాసులే. మీలో పాపమున్నప్పటికిని విశ్వాసులే. మీరు తగినవారే. ఎందుకంటే కొద్దిపాటి విశ్వాసమున్నది. అందుచేత ఇప్పుడు మీరు కలిగియుండవలసిన విశ్వాసములు ఏవనగా:
- 1. శ్రద్ధగా వినుట : శ్రద్దగావింటే సత్యము తెలుస్తుంది, నమ్మకము కుదురుతుంది అది ఒక విశ్వాసము.
- 2. ఇక్కడ వినుచున్న సువార్తవల్ల నాకు మేలు కలుగక మానదు అని నమ్మడము, లేక ఏదో ఒక మేలు కలుగకమానదు అని నమ్ముట మరియొక రకమైన విశ్వాసము.
- 3. ఇక్కడ విన్న సువార్తవల్ల అదివరకు మీకున్న ఆత్మీయ జీవనము తప్పకుండా వృద్ధిపొందును, అనే నమ్మకము ఉండుట మూడవ విశ్వాసము.
- 4. నన్ను ఇక్కడికి తేసికొని వచ్చుటలో దేవునికి నాయెడల ఏదో ఒక మంచి అభిప్రాయము ఉన్నది అని నమ్మడము నాలుగవ విశ్వాసము.
- 5. దా. కీర్తన. 60వ అధ్యాయములో దేవుడు చేసిన ప్రమాణము అద్భుతమైన ప్రమాణము 'నా పరిశుద్ధత తోడు ' అని ప్రమాణము చేసిన ప్రమాణము నాలోకూడా తప్పకుండా నెరవేర్చెను. నాలో కొండంత బలహీనత ఉన్నప్పటికిని ఆయన వాగ్ధానము, ప్రమాణము ఎప్పటికైనను నెరవేర్చుతారు అని నమ్మడము, అయిదవ విశ్వాసము .
-
6. భూలోకములో ఉన్న ఉన్న విశ్వాసుల అందరియొక్క హృదయముల లోపల
ఉన్నంత విశ్వాసము నాలో లేకపోయినప్పటికిని నా హృదయము పట్టగలిగినంత స్వల్ప విశ్వాసము
ఉండక మానదు. ఉదా:- గ్లాసు పట్టినంత నీరు ముంచుదుము గాని, గ్లాసు పట్టనంత నీరు ముంచము కదా!
అలాగే నా హృదయము పట్టగలిగినంత విశ్వాసము నాలో పట్టకమానదు.
ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టంబు - ఆశీస్సుపొందుట నా శక్తి యిష్టము | | యేసు ప్రభువా | |
దీనినిబట్టి ప్రభువు తప్పకుండ రక్షించును అని నమ్ముట మరియొక విశ్వాసము. - 7.దృష్టాంత విశ్వాసము :- దీనిలో బైబిలులోని ఒక కథ ఉన్నది.
ఆ కథ ఏమంటే ప్రభువుయొద్దకు ఇద్దరు గ్రుడ్డివారు వచ్చినపుడు ఆయన ఒక ప్రశ్నవేసెను. మీ కండ్లను బాగుచేయుదునను నమ్మకము మీకు ఉన్నదా? అని అడిగినారు. వారు మాకు నమ్మకమున్నది. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక! అని చెప్పిన ప్రభువు మాటలో, 'చొప్పునా అనే దానిలో కొలత ఉన్నది. ఆ జవాబులో ప్రభువు చెప్పినది మీ విశ్వాసము చొప్పున మీకు కలుగుగాక! అని అర్ధము. అనగా వారి నమ్మకము సొలడో, శేరో, కుంచమో! ఎంత ఉంటే అంత. ఎంతోకొంత నమ్మకము ఉన్నది. అందుకే ప్రభువువారు మీ నమ్మికచొప్పున మీకు కలుగునుగాక! అని చెప్పినారు. ఈ ఒక్కమాటలో దీవెన ఉన్నది, నిర్ధారణ ఉన్నది. అనగా వారి విశ్వాసముమీద ప్రభువు ముద్రవేసినారు. ఈ ముద్ర తేసివేయుటకు వీలులేదు. కాబట్టి నమ్ముకున్నంత విశ్వాసము వారికి ఉన్నది గనుక దానినిబట్టి వారికి అనుగ్రహిపబడెను.
దేవుని రాజ్యమునకు ప్రవక్తలు, భక్తులు, విశ్వాసులు అవసరమే. ఎవరి పని వారే చేస్తారు. ఈ భూలోక గవర్నమెంటులోని రాజు దేశము మధ్య ఉంటే ఇతర మంత్రులు, అధికారులైనవారి డిపార్టుమెంటులు రాజుచుట్టు ఉండి పనిచేస్తారు. అలాగే పరలోకములోను ఉంటుంది. ఈ చాయ ఆ చాయయే. విశ్వాసి ప్రార్ధిస్తే పరలోకపు తండ్రి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని చేత ఆజ్ఞాపింపబడిన దూతలు ఆ విశ్వాసికి సహాయముచేసి, తిరిగి దేవునికి రిపోర్టు చెస్తారు. ప్రకటన 4వ అధ్యాయములో మనలనుగూర్చి దూతలు ఎల్లప్పుడు ప్రార్ధిస్తారు. దేవునికి రిపోర్టుచేస్తారు అని ఉన్నది. అట్లే విశ్వాసులకు కూడ వారు సహాయకులైయుండి ఎన్నో సహాయములు చేస్తారు.
దేవదూతల పని భూమిమీది పైరుకోయుటయే. వారు భూమిమీద ఒక ప్రక్క పైరు కోస్తూనే ఉంటారు, మరియొక ప్రక్క పంటపండుతూనే ఉంటుంది. దేవుడు ఒక ప్రక్క ప్రతిదినము విశ్వాసులను తయారుచేస్తున్నారు. అలాగే మరియొక ప్రక్క ప్రతిదినము దుష్టులను శిక్షించుచున్నాడు. క్రీస్తుప్రభువు పరలోకమునకు వెళ్ళకముందు అనిన మాట ఒకటి ఉన్నది. 'యుగసమాప్తీ ఆ యుగసమాప్తికి ముందు జరుగవలసిన సూచనలన్నియు ప్రభువు ఇక్కడ ముందే తెలియజేసారు. మత్త :24లో ఉన్న సూచనలన్నియు ఇప్పుడు భూమిమీద జరుచున్నవి. మత్తయి 24:4,5లో ప్రభువు తెలిపినట్లు యూదా ప్రాంతమునుండి 'నేనే క్రీస్తునూ అనువారు అనువారు 40మంది లేచారు. చాలామంది వారు ప్రభువే అనుకొని వారికి నమస్కరించారు. కొంతమంది వీరిని నమ్మలేదు. అంజూరపుచెట్టు చిగురించినది అనునదికూడా రాకడ గుర్తే. యూదులైనవారు అనేకదేశములలో చెదిరిపోయారు. చెదిరిపోనవారంతా ఇప్పుడు తిరిగివచ్చారు. తిరిగివచ్చిన వీరు ఈ ప్రాంతములో అప్పుడు రాకడ సమీపము.
మార్కు 11:12-14 ఈ వాక్యభాగములో ప్రభువు అంజూరపు చెట్టును సమీపించినారు, దానిపై ఆకులు బాగున్నవి అనగా ఆచారములు బాగున్నాయి గాని పండ్లులేవు అనగా ఆత్మీయ ఫలములు లేవు గనుక ప్రభువు అంగీకరించలేదు. ఈ యుదులే ఆ అంజూరపు చెట్టు. వారు ఫలించలేదు గనుక గనుక చెదరిపొయారు. అయితే ఇప్పుడు యూదులు అన్ని దేశములలోనుండి వచ్చి, పాలస్తీనాలో గవర్నమెంటు ఏర్పాటుచేసికొనిరి. అదే చిగుర్చుట, వారి స్వభాషలలోనికి అక్షరములు, పుస్తకములు, పాత నిబంధన అంతా మళ్ళి వ్రాయుటకు మొదలుపెట్టినారు. వీరికి యుద్ధములో దొరికిన వారిని ఆ పని చేయుటకు కూలేలుగా పెట్టుకున్నారు. వీటన్నిటినిబట్టి యుగసమాప్తి జరుగుచున్నదని రుజువగుచున్నది. ప్రభువు ప్రవచనములు నేరవేరుచున్నవి గనుక ప్రభువు త్వరగా వస్తారు అన్నమాట నిశ్చయము. ఆ దివ్య భాగ్యము త్రిత్వ తండ్రి మనకు దయచేయునుగాక!
ప్రభువైన యేసూ త్వరగా రమ్ము! ఆమేన్
మరనాత.