(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
నాస్తికుని మార్పు కథ
నాస్తికునికి క్రైస్తవ బోధకునికిని జరిగిన సంభాషణ.
నాస్తికుడు: మీరెప్పుడు దేవుడు దేవుడంటారు, దేవుని చూడనిదానికెందుకనాలి. మీరెప్పుడైనా దేవుని చూచినారా?
బోధకుడు: దేవుడు ఉన్నాడని మేము చెప్పుచుండగా నమ్మని మీరు దేవుని చూచాము అని అంటే మాత్రము నమ్ముతారా ఏమి?
నాస్తి: రుజువుపరిస్తే నమ్మకేమి, చూచాము అని అంటే ఎందుకు నమ్మను?
బోధ: ఇప్పుడే మీకు బోధపరుస్తాను, నేను చెప్పినట్లు చేయండి (ఇద్దరు సరే సరే అనుకున్నారు)
నాస్తి : ఏమి చేయమంటారు?
బోధ: నేను మోకరిస్తాను, మీరుకూడ మోకరించండి,
నాస్తి: ఎవరి ఎదుట మోకరించడము?
బోధ: దేవుని ఎదుట.
నాస్తి: సరి సరిలే, దేవుడనేవాడులేడు అంటూ ఉండగా నన్ను దేవుని ఎదుట మోకరించుమంటారా? మహా బాగా ఉన్నది.
బోధ : మీకు రుజువు కావలెనుగదా, మోకరించకపోతే రుజువు ఎలాగు దొరుకుతుంది (ఏలాగైతేనేమి చెప్పగా చెప్పగా అతడు మోకరించెను)
బోధ: ఇప్పుడు కండ్లుమూసికొనండి.
నాస్తి: ఇది మరీ బాగున్నది. దేవుడున్నాడని నమ్మకములేనిదే కళ్ళు ఎలాగు మూసుకొంటాను, మీ క్రైస్తవులు చేసినట్లు?
బోధ: అయ్యా నేను చెప్పినట్టు చేయండి మీకేమి నష్టములేదుగా, (తుదకు కళ్ళుమూసుకోవడము వరకు వచ్చిది కథ) ఆ తర్వాత ఏమి జరిగిందంటారా?
బోధ: అయ్యా నేను చెప్పే మాటలు మీరుకూడ చెప్పండి.
నాస్తి: ఏమి మాటలేమిటవి?
బోధ: దేవా! పాపినైన నన్ను కరుణించుము (అని నేర్పబోయెను)
నాస్తి : మా బాగా చెప్పినారు. నేను అనను. దేవుడున్నాడని నాకు తోచడములేనిదే దేవా అని ఎలాగంటానయ్యా, బోధ: అయ్యా మీరీమాటలనండి, అంటే మీదేమి పోయింది, హానిలేదుగా దేవుడుంటే తప్పక బయలుపడును, లేకపోతే లేనేలేదు. ఉంటే మీకే స్వయముగా తెలుస్తుంది. లేకపోతే తగాదాలేదు అప్పుడు అనడము మానివేయవచ్చును.
నాస్తి: సరే అంటానులెండి, ఆ మాట తిరిగి చెప్పండి (అప్పుడేమి జరిగిందో వినండి) దేవా పాపినైన నన్ను కనికరించుము అని బోధకుడు అనుచుండగా ఒకదరినుంచి నాస్తికుడు అనుచుండెను, ఆ మాటలే అనగా అనగా ఆ మాటలు నాస్తికుని మనస్సులో నాటుకొనిపోవుచుండెను. ఆ మాటలమీద అతనికి ఇష్టము కలుగుచున్నది. తర్వాత ఏమి జరిగినది? బోధకుడు అనడము అవసరము లేకుండా ఆ నాస్తికుడు స్వయముగా అనడము మొదలుపెట్టెను. తనకు తానే కొంతసేపు అనిన తర్వాత అతనిలో వణుకు పుట్టినది, ఎందుకనగా అప్పటికే దేవుడున్నాడను నమ్మకము అతనిలో పుట్టెను. ఉన్న దేవునిని లేడు లేడు అన్నానుగదా! ఇన్నాళ్ళనుండి అనే విచారముకూడ అతని మనసులో కలిగెను. అప్పుడా నాస్తికుడు దేవా! పాపినైన నన్ను కనికరించుము అని పెద్దకేకవేసెను, ఏడ్చెను, కంట నీరు పెట్టెను, నేలమీద పడినాడు.
చూచినారా! ప్రయత్నము చేయగా నిజము తెలిసినది. ప్రార్ధనచేయగా నిజము బైలుపడినది. ఇష్టములేని ప్రార్ధన చేసిన చివరకు ఇష్టము కలిగినది. శాస్త్రము చదివిన బోధపడని సంగతి ఒకరోజున కొన్ని నిమిషములు ప్రార్ధనచేయగా బోధపడినది.
కాబట్టి ప్రియులారా మీరును అలాగే చేయండి మాబోధ నిజమోకాదో పరీక్షించడానికి ప్రార్ధన చేయండి. ఇదివరకే దైవభక్తి విషయములు మీకు నచ్చియున్న ఆ అంశమును గురించి ప్రార్ధించనక్కరలేదు, గాని దేవుడే మన నిమిత్తము నరుడై యేసుక్రీస్తు అను పేరు పెట్టుకొనెను. ఆయననే పూజించిన మోక్షమని క్రైస్తవులు చెప్పు బోధ మీకు నచ్చకపోతే ప్రార్ధన చేయండి. నిజము మీకు తెలియును. దేవుడైన ఆ క్రీస్తే మరల రెండవ సారి మేఘముమీద వస్తారు. నమ్మిన వారిని మేఘముమీద ఎక్కించుకొని మోక్షలోకమునకు తీసికొని వెళ్ళుదురు. కాబట్టి ఆఖరుమాట - దేవుడనే ఒకాయన ఉన్నాడనియు, ఆ దేవుడు మనలను రక్షించుటకు మనిషై జన్మించినాడనియు, యేసుక్రీస్తు అనుపేరు పెట్టుకొన్నాడనియు ఆయనను నమ్ముకొన్న మోక్షమనియు ఆయనే ఇప్పుడు బహు త్వరలో వచ్చుచున్నాడనియు మీకు అర్ధము కాకపోయిన ప్రార్థించండి, అర్ధమగును, చేస్తారా! నాస్తికుడు చేసినాడుగదా! మీరు చేయలేరా, చేయండి అట్లుచేయగల శక్తి దేవుడు మీకు అనుగ్రహించును గాక!