(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
మహాశ్రమకాల కథ
మొదటిసారి కొందరు వెళ్ళిపోయినారు, రెండవసారి మరికొందరు వెళ్ళిపోయినారు. ఇంకా భూమిమీద మిగిలి ఉన్నవారిలో మిగిలిపోయినవారు ఉందురు. వారు క్రీస్తును నమ్మనివారు. అంతలో అంతెక్రీస్తు అని పేరుగల క్రీస్తువిరోధి భూమిమీద ఏలుబడి ఆరంభించును. క్రీస్తును నమ్ముచున్న వారిని చాలామందిని హింసించును. అటువంటి హింస లోకములో ఎప్పుడులేదు. ఒక హింస తరువాత ఒక హింస, తుదకు కొందరు హింసలకు ఓర్వలేక చావు కోరుకొందురు. కోరుకొన్నను చావురాదు. హింసయే కాని చావు కనబడదు. అంతెక్రీస్తు సైతానుయొక్క లక్షణములను, చాకచక్యమును, శక్తులను, అధికారమును కలిగియున్నది. సర్వవిద్యలు ఎరిగినవాడు, జనవశీకరము చేసికొనగల రూపవాక్కులు గలవాడు, భూలోక రాజ్యముల మీదను, వర్తక వ్యాపారముల మీదను, ధనాగారములమీదను స్వతంత్రాధికారము గలవాడు. ఇతడు తనను విశ్వసించి వెంబడించు వారిమీద ముద్రవేయును. అట్టి ముద్రగలవారు ఎక్కడైన సరుకులు కొనుక్కొనవచ్చును. ఎవరికైన సరుకు అమ్ముకొనవచ్చును. క్రీస్తును నమ్మిన క్రైస్తవులకు ఆ ముద్ర ఉండదు. గనుక వారు కొనలేరు, అమ్మలేరు ఎంత కరువో చూడండి.
అయినప్పటికిని దేవుని పక్షముగా నుండే ప్రజలు గనుక దేవుడే వారిని నడిపించును. అంతెక్రీస్తు పక్షమున నుండినవారు బాగుగానే తింటారు. సుఖముగానే బ్రతుకుతారు. తుదకు అంతెక్రీస్తుతోపాటు నరకములోనికి వెళ్ళవలసి వస్తుంది. ఏమి లాభము? అంతెక్రీస్తు ప్రజలను ఎంతగానో హింసిస్తాడు. దేవునితట్టు తిరుగకుండుగా చేయుటకు వారిని హింసించును. అంతెక్రీస్తు సైతానుయొక్క పెద్ద నాయకుడు. సైతానుకు బదులు అతడు భూలోక రాజ్యములన్నింటిని ఏలును. అతనికి ఉన్న తెలివి ఇంకొకరికి ఉండదు. కావలసినంత ధనము ఉండును. అతడు మహా ఆరోగ్యమంతుడు, సౌందర్యవంతుడు మొదటి సంఘమైన పెండ్లికుమార్తెయు పైకెత్తబడిన తరువాత వస్తారు. అంతెక్రీస్తునకు సహాయము చేయుటకు అబద్ధప్రవక్త అనే పేరుగల వాడు ఒకడు వచ్చును. అంతెక్రీస్తు లోకరక్షకుడు, ఆయనకే మ్రొక్కండి అని లోకప్రజలకు నచ్చేటట్లు చెప్పును. అనేకమంది అతని మాటలలో పడి మోసపోవుదురు. వీరిద్దరితో కలిసి సహాయము చేయుటకు మూడు కప్పలు వచ్చును. ఇవి సాతానుయొక్క దురాత్మలు. విగ్రహములలో దురాత్మలు దూరి మాట్లాడితే వినేవారు విగ్రహములు మాట్లాడుచున్నది అనుకొని ఆ విగ్రహమే దేవుడని నమ్మి ఆ విగ్రహమునకు పూజిస్తారు.
అయితే ఈ సందర్భములో ఇంకొక సంగతి కూడ చెప్పవలసి వస్తుంది. నరుడు దేవుని విరోధించినందున తన ఇష్టము వచ్చిన పాపములు చేయుట వల్ల తనమీదికి ముప్పు తెచ్చుకున్నాడు. సృష్టిమీదకు అనగా సూర్య, చంద్రాదుల మీదికి, మేఘములమీదికి, జంతువులమీదికి, భూమిమీదికి, ముప్పు తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కారణముచేత లోకములో అధికమైన ఎండకాయును. ఆ ఎండకు వంటినిండ పెద్ద పెద్ద పొక్కులు వచ్చును. పెద్ద పెద్ద వడగండ్లుపడి చాలామంది చనిపోతారు. అప్పుడప్పుడు భూకంపములు కలుగును. చాలామంది భూమి నెఱ్ఱలలోపడి చనిపోవుదురు. అడవి జంతువులు గుంపులు, గుంపులుగా ఊళ్ళలోనికివచ్చి నిరాటంకముగా మనుష్యులను తినివేయును. భయంకరమైన కరువు వచ్చును. ఇవన్నియు అంతెక్రీస్తు మూలముగారావు కాని సృష్టిమూలముగా వచ్చును.
ఇవన్నియు మనిషి చేసిన పాపములనుబట్టి వచ్చును. దేవుడు అడ్డము పెట్టడు. ఈ కష్టాలలోనైనను నరుడు దేవుని తట్టు తిరుగవలెనన్నది దేవుని ఉద్దేశ్యము. ఈ కష్టాలను అనుభవించిన నరునికి బాధ రానిచ్చి నరకము తప్పించాలన్నది దేవుని ఏర్పాటు. ఈ శ్రమకాలములో కోటానుకోట్ల మంది తమ తప్పును తెలిసికొని దేవుని తట్టు తిరుగుదురు. అలాగే దేవుని ప్రజలైన యూదా ప్రజలలో 144 వేలమంది దేవుని తట్టు తిరుగుదురు. దేవుడు శ్రమలను పంపించుటనుబట్టి ఎంతమంది దేవుని తట్టు తిరిగి బాగుపడినారో చూచినారా! అంతెక్రీస్తు కాలములో క్రీస్తును నమ్మినవారు మొదటిసారే సిద్ధముగా నుంటే అప్పుడు ఎగిరి వెళ్ళిన రెండు జట్టుల వారితో కలిసి వెళ్ళియుందురు, గాని సిద్ధపడలేదు గనుక ఆగిపోయినారు. లోకవాసులను అంతెక్రీస్తు తట్టు తిప్పుటకు ఒక సమాజము ఏర్పడును. దానికే స్త్రీ అను బిరుదుకలదు. స్త్రీ సాంగత్యము చేయని 144 వేలమంది యూదులు క్రీస్తుప్రభువే తమ మెస్సియ్యా అని అంగీకరించి రక్షింపబడుదురు.