(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
రక్షణ వాణి
రక్షణ మహా సంకల్పన యం. దేవదాసు అయ్యగారు అనేక రూపములలో వ్రాసిరి. బూరలో చెప్పుటకు “రక్షణవాణి” అను రూపములో ఈ కధలు కొన్ని వ్రాయబడియున్నవి.
పుణ్యకథలు ఆలకించుడి
పుణ్యకథలు ఆలకించండి - దేశీయులారా - పుణ్యకథలు ఆలకించండి = పుణ్యకథలు విన్నయెడల - పోవును మీ పాపరాశి - నాణ్యమైన దేవవాక్కు నరులను రక్షించువాక్కు
1. ఆలకించు చెవులనిచ్చెను - దేవాది దేవుడు ఆలకించు శక్తినిచ్చెను - ఆలకించు తెలివిగలిగి అన్నియు పరీక్షచేయు = వాలు తెలిసి - దైవసత్వము బైలుపడును పూర్తిగాను ॥
2. ఆలకించుచున్న వారిని - పగవాడుచూచి ఆలకింపకుండ జేయును మేలు మాటలాలకించి = మిగతమాట లాలకింప జాలకండి నట్టి తెల్వి - జన్మమందె దేవుడిచ్చె ॥
రక్షణ సంకల్పన ఒక వలవంటిది. ఇది సువార్తవల. గాలము కాదు గాలమునకు ఒక్కచేప మాత్రము పడును. గాలము చేపకు హాని చేయును. వల చేపకు హాని చేయదు. చేపలు వలను తప్పించుకొనలేవు. వలమీద పడిన చేపలు వలలోనే ఉండును. సువార్త వల జాలరుల వలకంటె పెద్దది. అది అన్ని దేశములలో అన్ని కాలములలో ఒక్కొక్కరిమీద వేయబడుచున్నది. రక్షణ సంకల్పన వల వేయబడిన దాని వర్తమానము దాటి వెళ్ళిపోలేరు. ఇది భూలోకమంతటిమీద పరచిన ఇంకా పరచబడుచున్న వల. ఇది పాతాళమంత లోతుగా దిగే వల, అన్ని కాలాల వల. అన్నిస్థలాల వల. అందరి వల. ఈ రక్షణ సంకల్పన వార్త విన్న ఆత్మ మానవాత్మ ఒక మిష చెప్పి తీర్పు తప్పించుకొనగలదా? విన్న తర్వాత నమ్మగలిగితే రక్షణ తప్పించుకోగలదా? అందరు రక్షణ తెలిసికొనుటకే ఈ వల అల్లబడియున్నది.
రక్షణ బల్ల :- శరీరాత్మల రక్షణ బల్ల. ఈ బల్లమీద దేవుడు అమర్చి పెట్టి మానవులందరికి చూపించు వస్తు సముదాయము ఏదనగా: పరలోకము, దేవదూతల సమూహము, ఆకాశలోకము, భూలోకము, బైబిలు, బైబిలులో బోధించు మతసంఘము, లేక భక్తుల సంఘము, కుమార స్వరూపము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. సన్నిధిని ప్రశ్నించి దేవునిని అడిగి తెలిసికొనవలసిన సన్నిధి పరిచయము, రాబోవు కాలమందు కలుగబోవు సౌఖ్యములు మొదలగునవి.
“సమస్తము సిద్ధముగా నున్నది రండి” అనునది దేవుని పిలుపైయున్నది.
ఎగిరి తప్పించుకొనవలెనని ప్రయత్నించు చేపలు వలలోనే పడును. వలకు చినుగు ఉంటే తప్పించుకొనిపోవును. అలాగే రక్షణ వలను తప్పించుకొనిపోలేరు. బోధకుల బోధలో లోటులున్న, సరిగా లేకపోయిన తప్పించుకొని పోవుదురు.
ఉపోద్ఘాతము: (బూర ప్రసంగ ధోరణి) భయపడరాదు. మేము చెప్పునది సంతోషకరమైన వార్త, ఈ మరధ్వని విని భయపడకండి. ఎక్కడి వారక్కడే ఉండి వినండి. అందరికి వినబడునది. అరుగుల మీదనున్నా, వాకిట్లో ఉన్నా, వీధిలో ఉన్నా పొలాలువెళ్లు దారిలోనున్నా నూతివద్ద ఉన్నా బడిలో ఉన్నా సందులో ఉన్నా ఇంటిలో తలుపులు వేసికొని కిటికీలు తీసికొన్నా వినబడును. వినండి వినండి వినండి. పనిచేసుకొంటున్నా వినబడును. దీక్షమాత్రము దీనిమీద ఉన్న చాలును. ఏవిధముచేతనైన వినబడుతుంది. సప్పిడిచేయకుండ వినిన వినబడును. ఒకరికి చెవులు మూసికొన్న వినబడిందట. మా మరమీద దేవుని దీవెన ఉన్నది.
పాట: భయపడరాదు - జనాంగమ - భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు = దయతో దీనిని విని - దలంచుకొనండి ॥భయ॥
బ్రతుకుదెరువైనట్టి - పాటలు మాటలు - మతికివినోదమైన - కధను ఆలించండి ॥భయ॥
అదరిపోరాదు మరియు - బెదరిపోరాదు = పదిలముగా విని - మదిని ధ్యానించుడి ॥భయ॥
దేవునికి ప్రార్థన చేయుచున్నాము, వినండి ఓ దేవా! సర్వ లోకములను మా కోరకు సృజించిన దేవా నీకు స్తోత్రము. మమ్ములను నీకొరకు కలుగజేసికొన్న దేవ! తండ్రీ! నీకనేక వందనములు. పాపులమైన మా మేలు ఆలోచించి మహారక్షణ సంకల్పనను మాకొక నూతన సృష్టి దానముగ అమర్చినందుకు నీకు అనంతస్తుతులు సమర్పిస్తున్నాము. ఈ గొప్ప విషయము సర్వలోకమునకు ప్రకటించవలసినదని నీవు మాకు సెలవియ్యడములో నీవు మాయెడల గౌరవము కనబరచుచున్నందున నీకు కృతజ్ఞలమైయున్నాము. ఎన్నడును పాపము చేయని దేవదూతలు చేయవలసిన ఈ రక్షణబోధ, సేవ, మాకు అప్పగించినందులకు మాకెంతో ఆశ్చర్యముగానున్నది. గనుక నీకెన్నో నమస్కారములు. ఈ సేవ మేము నీ ముఖముచూచి సర్వజనుల రక్షణ ఆలోచించుకొని మహా వినయముతోను, సేవ వర్ధిల్లునను గొప్ప నిరీక్షణతోను సాగించుటకు కృప దయచేయుమని ప్రభు యేసుద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
దేశీయులారా - మీ దేశస్తులమైన మేము చెప్పుచున్న మాటలు వినండి. మేమనుభవించిన సంగతులు మీ ఉపయోగార్థమై చెప్పవచ్చినాము వినండి. సహమానవులారా - మన మానవుల నీమిత్తము దేవుడు సంకల్పించిన కథ వినిపింతుము వినండి. ఇది వుణ్యకథ. దేవుని వాక్యములు వినవలసిన బాలులారా వినండి. మేము మీకీవేళ పరిశుద్ధమైన ఒక కథ చెప్పెదము. ఈ కథ వినువారు మహాధన్యులౌదురు. మహా మహా ధన్యులౌదురు.
వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనే వెగ పడక - వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడేపో నీతిపరుడు - మహిలోసుమతీ ॥
ఎవ్వరుచెప్పిన మొదట వినవలెను తరువాత పరీక్షింపవలెను. ఆ తరువాత మంచిదని తోచిన చేయవలెను. విననిదే వద్దువద్దు అని అనకూడదు. వద్దు అనునది, కావలసినది వినకముందు ఎట్లు తెలియును. ఈ కథ అదివరలో మీరువిన్న నేను చెప్పుట వినలేదుగదా? గనుక వినండి ఈ కథ లోకములు పుట్టకమునుపే మొదలు పెట్టినది. ఇప్పుడింకా జరుగుచునేయున్నది. ఇప్పుడున్న లోకము అంతమయ్యేవరకు జరుగుచునే యుండును. అంత పెద్దకధ ఇది. కథ పూర్తిగా వినేవారి పాపములన్ని పరిహారమైపోవును. మోక్షభాగ్యములన్ని కలుగును. ఇది ఉపోద్ఘాత కథ.