(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
దేవదూషణ కూడదు
-
1) దేశీయులారా! మహా ముఖ్యమైన విషయమొకటి జ్ఞాపకము చేయుచున్నాము. అదేమనగా దేవునియొక్క లక్షణములను గురించి అనగా ఆయన
స్వభావమును
గురించి మనకు దురభిప్రాయముండకూడదు. ఒక తల్లికి ఒకే కుమారుడు, అతనికి యుక్తవయస్సు వచ్చునప్పటికి ఏదో ఒక జబ్బువలన
మరణించెను.
అప్పుడా తల్లి నాకు కుమారుడు ఉండుట చూచి దేవుడు ఓర్వలేక చంపివేసినాడు అని ఏడ్చెను. దేవుడు ఓర్చలేనివాడా? ఆయనకు ఓర్చలేని
గుణముండునా? తల్లి అలాగు అనుకొనవచ్చునా? అట్లు అనుకొనుటయే దేవదూషణ కుమారుని ఇచ్చిన దేవునికి అసూయ, కిట్టని తనము ఉండునా?
మనమెప్పుడును దేవుని గురించి చెడు అభిప్రాయము కలిగియుండకూడదు. ఇది గొప్ప పాపమని చాలమందికి తెలియదు. ఆ కొడుకు పొరపాటులో
పడి
జబ్బువలన చనిపోయెను. దేవుడు చంపినాడని ఎందుకు నింద మోపవలెను. తన కుమారునిపై నేరము వేయాలిగాని ఒకరు నేరముచేసిన మరొకరిమీద
మోపుట నేరముకాదా? నేరము లేని దేవునిమీద మోపుట మరీ నేరము కాదా? అట్లుచేయుట తప్పు అని మనిషికి తెలియుటలేదు.
-
2) మరియొక సంగతి, మనుష్యులు ఒకరినొకరు కొట్టుకొని చంపుకొనుచున్నారు, కొట్టుకొనువారి దేవుడు ఆపుచేయకూడదా? మనిషిని
దేవుడే పుట్టించెనుకదా? మనిషి దేవునికి కుమారుడుగదా? ఆలాగు చంపుచున్నప్పుడు దేవుడు ఎందుకు ఊరుకొంటున్నాడు, దేవునికి
మనిషి
అన్న లెక్కలేదు అని కొందరు దేవుని దూషించుచున్నారు. దేవుడు ఊరుకొనక ఏమిచేయవలెను. కొట్టవచ్చిన మనిషిని చంపవలెనా? దేవుడు
న్యాయస్థుడు, ఆ చంపిన మనిషిని శిక్షించును, అధికారులచేత శిక్ష వేయించును. ఆ నరహంతకుని సంగతి ఒకవేళ అధికారులకు తెలియని
యెడల
దేవుడతనిని ఏదో విధముగ శిక్షించును. అతడు జబ్బువలన ఘోరముగా చనిపోవచ్చును. అతడు దగ్గరనున్న వారికి నేను ఫలాని మనిషిని
చంపినాను, అందుకే ఈ శిక్ష అని చెప్పి విలపించుచూ చనిపోవును, గనుక దేవుడు ఊరుకొన్నాడు అని మనము తలంచకూడదు. ఆ నరహంతకునికి
ఈ
లోకములో శిక్ష లేకపోయిన నరకలోకములోనైనను శిక్ష వచ్చును. ఆ నరహంతకునికి ఆ మనిషిని చంపిన తర్వాత అతని మనసులో గొప్ప
నరకముండును.
ఎక్కడనులేని మనో వేదనతో బ్రతికినంత కాలము పీడింపబడును. ఇది శిక్షకాదా? ఆ మనిషిని చంపినప్పుడు దేవుడు ఎందుకూరుకొన్నాడని
ప్రశ్నించిన, దేవుడు అన్యాయస్థుడని దేవుని దూషించినట్టే. దేవుడు న్యాయ స్వభావముగలవాడు, ఆయన అన్యాయ మెప్పుడును చేయడు.
మనము
ఆయనను గ్రహించలేక అన్యాయస్థుడని చెడు కార్యములు జరుగుచున్నపుడు ఊరుకొనుచున్నాడని అందుము. దేవుడు దయగలవాడు గనుక మనిషి తన
దుర్గుణము తనంతట తాను తెలిసికొనుటకు ఎక్కువ సమయమిచ్చును.
-
3) ఇంకొక సంగతి- కొందరు దేవునిని మరొక విధముగా దూషించుచున్నారు. మనిషిని పుట్టించుట, తర్వాత అనేక కష్టముల పాలుచేయుట
తుదకు
చంపివేయుట. ఇదంతా ఒక తంతులాగ ఉన్నది. ఎందుకు పుట్టించుట, మనిషి పాపము చేయుచుండగా ఎందుకు ఊరుకుండుట అనుచున్నారు. ఇదికూడ
దేవదూషణయే. ఎందుకనగా ఎందుకు పుట్టించవలెనో, ఎందుకు ఊరుకొనవలెనో ఎందుకు చావనివ్వవలెనో మనకేమి తెలియును? ఆయన జ్ఞానముకన్న
మన
జ్ఞానము మహా ఎక్కువా ఏమిటి?
జ్ఞానము గలవానికి ఒక క్రమమున్నదని మనకు తెలియును, జ్ఞానముగల మనిషి ఒక క్రమము ననుసరించి
పనులుచేయునని మనకు తెలియును. జ్ఞానముగలవాడు ఏదిబడితే అది చేయడు, ఎప్పుడుబడితే అప్పుడు చేయడు, ఎక్కడబడితే అక్కడ చేయడు.
అతడు
చేయు ప్రతి పనికి క్రమముండును. దేవునికి క్రమముండదా? ఆయనకే ఎక్కువ క్రమము. గనుక ఆయన చేయుచున్నవని చూచి మనము
ఆక్షేపించకూడదు.
అయినా కష్టాలపాలుచేయుట, జబ్బులు పంపుట, చంపుట అవి దేవుని పనులా? అవి దేవుడు చేయుచున్నాడా? అయ్యో! అలాగనుట ఎంతపాపము, మీ
బిడ్డలమీదికి మీరు జబ్బు పంపుదురా? మీ బిడ్డలను మీరు చంపుదురా? మనమందరము దేవుని బిడ్డలముగదా, ఆయన మన తండ్రిగదా, ఆయన
మనలను
చంపునా? అలాగు అనకూడదు. ఆదిలో దేవుడు మనిషిని కలుగజేసినప్పుడు కష్టాలు కలుగజేసినాడనుకొనుచున్నారా? జబ్బును కలుగజేసినాడా?
లేదు లేదు చావు కలుగజేసినాడా? లేదు. ఇవన్నీ సైతానువల్ల వచ్చినవే. సైతానుమీద నేరము మోపండి, దేవునిమీద నేరము మోపవద్దు,
సైతాను
మాటవిని మనిషి చిక్కులోపడుచున్నాడు, మనిషిని అనండి, దేవునిని అనవద్దు
-
4) ఇంకా కొందరు ఇంకొక ప్రశ్నవేయుచున్నారు - ఆ సైతానుకు
దేవుడు ఆ దుర్భుద్ది పుట్టకుండ చేయలేకపోయినాడా? అని దేవునిని దూషించుచున్నారు. మనిషి పాపము చేయునప్పుడు దేవుడు వచ్చి
ఆపుచేసిన మనిషి పాపము మానివేయును. పాపము మానివేయడము దేవుడు ఆపుచేసినాడు గనుక పాపము మానివేయును లేక పోయినా మానునా? దేవుడు
ఏమికోరుచున్నాడు. దేవుడు ఆపుచేయకుండ మనిషి తనంతట తాను పాపము మానివేయవలెనని దేవుడు కోరుచున్నాడు. మనిషి తన స్వంత ఇష్ట
ప్రకారము దేవునిని పూజించవలెను. ఇదే దేవునికోరిక. పాపము మానుము, నామాట వినుము, నన్ను పూజించుము అని దేవుడన్న మనిషి
చేయునా?
ఒకవేళ చేసినను అది బలవంతపు సేవగాని ఇష్టానుసారమైన సేవకాదుగదా! బలవంతముగా దేవుడు ఇది ఆపుచేయలేడు అది ఆపుచేయలేదు అని మనము
దేవునిమీద నేరములెంచకూడదు.
-
5) మరికొందరు ఈలాగనుచున్నారు.
త్రవ్వనేల పూడ్చనేల, దేవుడు మనిషిని ఎందుకు
కలుగజేయవలెను, ఆ మనిషిని రక్షించుటకు తానెందుకు మనిషిగా జన్మింపవలెను. సిలువ మ్రానుమీద ఎందుకు చావవలెను. ఎందుకు వచ్చిన
తిప్పలు ఇవన్ని అసలు మనిషిని పుట్టించకుండ ఉండలేకపోయినాడా అని కొందరు ఆయన పనిని ఆక్షేపిస్తున్నారు.
దేవుడు జీవమైయున్నాడు.
జీవముగలవాడు ఏ పని చేయకుండ, ఆలోచించకుండ, కదలకుండ, మెదలకుండ ఉండగలడా? ఆ పని ఈ పని చేయకుండ నుండగలడా? దేవుడు జీవము గలవాడు
గనుక మనకు తోడుగా నుండుటకు దేవదూతలను చేసెను. మనము నివసించుటకు భూమిని చేసెను. మనకు దీపములుగానుండు సూర్యచంద్ర
నక్షత్రములను
చేసెను. తుదకు మనుష్యులను చేసెను. ఎందుకు చేసినాడు, జీవము గలవాడు గనుక. తాను చేసిన మనిషి చెడిపోయినాడు. గనుక అప్పుడేమి
చేయవలెను. బాగుచేయుటకు తానే మనిషిగా వచ్చెను. రక్షించుటకు రావద్దు అంటారా? దేవుడు జీవము గలవాడు గనుక రెండు పనులు చేసెను.
సమస్తమును మనలను కలుగజేయుట మొదటిపని, మరియు మనమును సమస్తమును చెడిపోయినందున బాగుచేయుటకు ఆయనే వచ్చినాడు. ఇది రెండవపని.
నేటివరకు ఈ రెండు పనులు చేయుచునేయున్నాడు. ఇంకను చేయుచుండును. అందుచేత ఆయనను పూజించవలెనుగాని, దూషింపకూడదు. దేవునిలో
తప్పులు
పట్టుటకు ఆయన జ్ఞానమెక్కడ మన జ్ఞానమెక్కడ. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనలోను తప్పులుండవు. ఆయన పనులలోను తప్పులుండవు. దేవుడు
పరిశుద్దుడు, దేవుడు పరిశుద్దుడు, దేవుడు పరిశుద్దుడు. కాబట్టి ఆయనను ఏమియు అనకూడదు. అంటే మనకే నష్టము. ఏమి నష్టమంటారా?
ఆయన
చెంత చేరలేము. చేరకపోయిన ఇటువంటి మాటలనిపించు సైతాను చెంతచేరి ఉందుము. ఇది నష్టముకాదా? అతనితోపాటు నరకమునకు పోవుట నష్టము
కాదా?
-
6) ఇంకా కొందరేమనుచున్నారు. దేవుడు పాపము చేయించుచున్నాడు అంటున్నారు. అయ్యో ఈలాగనుట ఎంతపాపము. దేవుడు పాపము చేయించు
వాడైన పాపాత్ములందరికన్న దయ్యాలన్నిటికన్న దేవుడే గొప్ప పాపి. ఆలాగనుట వలన మనము దేవునిని గొప్ప పాపాత్మునిగా
చేయుచున్నాము
ఎంత గొప్ప దోషము. ఒకటి జ్ఞాపకముంచుకొనండి. దేవుడు మంచివాడు ఆయన ఆలోచనలు మంచివి. ఆయన పనులు మంచివి. ఈ మాటలు నమ్మిన
మనముకూడ మంచివారము కాగలము. తుదకు ఆయనలో చేరగలము, సుఖింతుము. నిత్యము జీవింతుము దేవుని దూషించినందున ఎప్పుడో నరకములో
మాత్రమే
కాక ఈ లోకములో కూడ బాధలు అనుభవింతుము. అలాగే దేవుని మెచ్చుకొన్నందువలన ఎప్పుడో మోక్షములో మాత్రము కాదు ఈ లోకములోకూడ
సంతోషము
అనుభవింతుము. దేవునిని, ఆయన పనిని చూచి ఆనందించు మనసు కలుగునుగాక.
-
7) మరికొందరు ఇంకొక ప్రశ్న వేయుచున్నారు. దేవుడు ఒకరిని
భాగ్యవంతులనుగా చేయుచున్నాడు, ఒకరిని బీదవానిగా చేయుచున్నాడు, ఎందుచేత? ఎందుకో మనము అంత బాగుగా చెప్పలేము గాని దేవుడు
న్యాయస్థుడు అనుమాట మనము జ్ఞాపకముంచుకొనిన యెడల ఆయన పక్షపాతి అనియు అన్యాయము చేయువాడనియు అనుటకు మనకు నోరురాదు. ఈ
ప్రశ్నకు
కొంతవరకు జవాబు చెప్పవలెను. జవాబు కనుక్కొనవలెను. దేవుడు అన్యాయస్థుడైన, పక్షపాతి. ఆయన దేవుడేలాగు అగును. అటువంటి వాడని
మనము
తీరా అనివేసిన యెడల తుదకు మనమే తీర్పునాడు సిగ్గుపడవలసి వచ్చును గనుకనే తెలియకపోయిన ఊరుకొనవలెను గాని మన ఇష్టము
వచ్చినట్లు
అనుకొనరాదు మరి ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానము కష్టపడి పనిచేసుకొనేవారు ధనికులగుదురు. పని అంటే బద్దకించువారు బీదలగుదురు.
కష్టపడి సొమ్ము సంపాదించినను కొందరు సొమ్ము దుబారాగా వాడుకొన్నందువల్ల పేదవారగుదురు. దానికి దేవునిని ఏమనగలము. మనకు
కావలసినవన్ని దేవుడు భూలోకములో అమర్చి ఉంచెను. మనము బీదవారము కావలసిన పనిలేదు. మన తండ్రి భాగ్యవంతుడు మన తండ్రి
కలుగజేసినదంతా భాగ్యమే. మనము బీదవారమగుటకు ఆయన ఏమియు చేయడములేదు. మనము భాగ్యవంతులము కావలెననియు ఆయన కోరుచున్నాడు. దేవుడు
నా
కాపరి నాకు లేమి కలుగదు అని ఒక కవీశ్వరుడు చెప్పినమాట బైబిలులోనున్నది. సమస్తమును మీవి అనికూడ ఉన్నది. మనకు కావలసినవి
సమృద్ధిగా దొరకకపోయిన మన లోపమే కాని దేవుని లోపము కాదు. లోకము పాపము చేసినందువలన పేదరికము, వ్యాధి, మరణము ఇవి
లభించుచున్నవి.
లోకములోనికి పాపమే రాకపోతే నరులు పాపము చేసియుండకపోతే ఈ బాధలే మనకు లేకపోవును. మనము బాధలు తెచ్చుకొనడమేమిటి? దేవునిమీద
పెట్టడమేమిటి? మనము దేవునిమీద మోపు నేరములు చాలగలవు. మోపినకొలది మన నేరముల మోపు ఎక్కువగుచున్నది. గనుక దేవుడు న్వయముగా
చేయు
వనులను చూచి మనము సంతోషించవలసినదే గాని మనకు అర్ధమగుటలేదని చెప్పి ఆయన పనులలో తప్పులుపట్టకూడదు. కీడు జరుగుచున్నప్పుడు
ఆయన
ఊరుకొనుచున్నందుకు మనము తప్పులు మోపకుండ ఊరుకొనవలసినదే. ఆయనపై తప్పులు మోపుట మనకు న్యాయముకాదు. శుభముకాదు. మనలో ఉన్న
మంచితనమును వృద్ధిచేయుటకు దేవుడొకానొకప్పుడు కష్టములు రానిచ్చును. గనుక ఆనందించవలెను. అట్లు ఆనందించు శక్తి మీకు
కలుగునుగాక.
-
8) పాపము మానివేయవలెనని ఉన్న దేవుని ప్రార్ధించండి. అప్పుడు మానివేయుటకు శక్తి కలుగును. పాపము మానివేయగలరు. దేవుని
పూజించవలెనని ఉంటే దేవుని ప్రార్ధించండి. అప్పుడు పూజించు శక్తి కలుగును. పూజించగలరు. ఏమి కోరిన ఇవ్వగలిగిన దేవుడు, మన
ప్రార్థనలను వినుట ఆయనకెంతో ఇష్టము. గాలి, నీరు, భూమి, చెట్లు, ఎండ, వెన్నెల ఇవ్వన్ని మనము అడగకముందె, పుట్టకముందె
కలుగజేసినాడుగదా! మనలను కష్టాల పాలు చేయునా? మనకు ఉపకారము చేసిన దేవునిని అపకారిగా భావించవచ్చునా? ఈ ఉపకారములు
మాత్రమేనా?
ఇంకా ఎన్నో ఉపకారములు చేసెను. ఆయన మనలను పాపములనుండి, కష్టములనుండి రక్షించి మోక్షములో చేరుటకు ఈ లోకములో జన్మించెను.
ఆయనే
త్వరలో వచ్చి నమ్మిన వారిని బ్రతికి ఉండగానే మోక్షమునకు తీసికొని వెళ్లును. ఇంతకంటే గొప్ప ఉపకారము ఏమున్నది. దేవుడు
చేయునవి
తెలియకపోయిన మాట్లాడక ఊరుకొనవలెనుగాని దేవుడు చేయునవి బాగుగా లేవని అనవద్దు అందువలన మనకు హాని. దేవునియెడల మీకు మంచి
అభిప్రాయము కలుగునుగాక!