(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
యోహాను కాల కథ
ఆదికాండము మొదలు, మలాకీ గ్రంథము వరకు యూదులలోని ప్రవక్తలైన వారందరును “మెస్సీయ” అనగా క్రీస్తువచ్చునని ప్రవచించిరి అయితే క్రీస్తు సమకాలికుడైన స్నానికుడైన యోహాను క్రీస్తు వచ్చినాడని ప్రకటించెను. దేవుడు ఏర్పరచుకొనిన యూదుల మతము క్రీస్తువచ్చును అను అంశమును బోధించుచు వచ్చెను. అయితే క్రైస్తవమతము క్రీస్తు వచ్చినాడను అంశమును బోధించెను. క్రైస్తవమతము యూదా మతముయొక్క నెరవేర్పు. యూదులైనవారు ఎదురు చూచిన మెస్సీయ అను క్రీస్తుప్రభువు వచ్చినాడు. గనుక ఆయనలో చేరండి. ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లయని యోహాను బోధయొక్క ధోరణియైయుండెను. అందుచేతనే యోహాను తన శిష్యులలో ఇద్దరిని మాదిరికి క్రీస్తుయొద్దకు శిష్యులనుగా పంపెను. యోహాను యూదులను తన బోధవలన క్రీస్తును అంగీకరించు స్థితికి తీసికొనివచ్చెను. యూదా మతము కాయ, క్రీస్తుమతము పండు.
దేవుని సముఖమునుండి సందేశము అందుకొనగల మోషే, యెహోషువా, సమూయేలు, దావీదు, యెషయా, యిర్మియా, దానియేలు, యెహెజ్కేలు, హోషెయ, మీకా, జెకర్యా, మలాకీ మున్నగు దైవజ్ఞులైన ప్రవక్తలు గతించిపోయిరి. అయినను వారి సందేశముల వ్రాతల కట్ట మాత్రము గతింపలేదు. లోకరక్షకుని ప్రవేశమును ప్రకటించు మహర్షి రానైయున్నాడోహో, అనునది నిశ్శబ్దకాల ఆరంభమున యూదులకు వినబడిన కడవరి శ్రావణానంద స్వరమైయున్నది. ఆ మనిషి పేరు యోహాను. సూర్యుడు వచ్చుననగా అతని రాకను సూచించు వేగుచుక్కవంటివాడు. ఈ యోహాను ప్రవక్త. మెస్సీయ అనగా క్రీస్తుతట్టు యూదుల దృష్టిని గిర్రున త్రిప్పుటకు పాటుబడిన ప్రవక్త యోహాను. వనవాసియును, నూతన సందేశ వాహినియును, గంభీర స్వరముగల నిర్భయ ప్రసంగియును, ప్రజలు నిరాశ సముద్రమున మునుగుచున్న కాలమున వెలసిన ప్రవక్త యోహాను. ఆహార విషయములోను, వస్త్రధారణ విషయములోను, నివాసస్థల విషయములోను బేధముగా కనిపించు విపరీత యవ్వనుడైన ప్రవక్త. ప్రవక్తలు ఎప్పుడు వత్తురా అని కలవరించుచున్న జనాంగ హృదయములకు కాంతి కలిగించుటకై యుద్ధ సమయమున ప్రత్యక్షమైన హితోపదేశకుడు యోహాను. పాలస్తీనా దేశములోని అన్ని ప్రక్కలలో నుండి వేదాంత పండితులను సామాన్యులను ఆకర్షింపగలిగిన ప్రవక్త యోహాను.