(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

దేవదూతల లోకము



దేవదూతలు: పరిశుద్ధులు, ఆత్మలు గనుక కంటికి కనబడరు. గొప్ప శక్తిగలవారు, దేవుని స్తుతించుట వారి గొప్ప ఉద్దేశ్యము. దైవాజ్ఞ ఏదైనను చేయగలరు, మనకు హానికలుగకుండ కాపాడువారు, మనము భక్తిమార్గమున నిలుచుటకు ఎంత సహాయమైనను చేయగలరు. ఎంత గొప్ప మిత్రులు. హెబ్రీ. 1:13,14. వీరు ఎవరును చేయలేని గొప్ప స్తుతి చేయుదురు. ఒక మనిషికైనా కష్టము రానీయరు, మనకు ఏ కష్టము వచ్చినను వారి సహించలేరు. వారికి గల శోధన ఏమనగా మనిషి తన సహాయమునకు దేవదూతలను రానివ్వరు, మనిషిగాని రానిస్తే ఎంత సహాయమైనా చేతురు. మనిషికి సహాయము చేయుటకు వీరికెప్పుడును సెలవుగలదు గాని మనిషిలో పాపనైజము, సాతాను బుద్ధి ఉన్నందున వారిని రానివ్వడు. మనిషి పాపములో పడునప్పుడు దేవదూత వచ్చి పడకుండ సహాయపడును. మనిషిని పడకుండా చేయుటకు ఎందరి దూతలనైనను దేవుడు పంపును. మనిషిని రక్షించుటకు దేవుడు ఇంత ప్రయాసపడును. మనిషి దేవదూతలకు కృతజ్ఞత చూపవలెను. మన కుడిప్రక్కను ఒక దూత, ఎడమటప్రక్కను ఒక దూత ఉందురు. కుడిప్రక్కనున్నదూత మనము చేయుమంచిని వ్రాయును, ఎడమ వైపునున్న దూత మనము చేయు చెడుగును వ్రాయును. వ్రాయవలసినది రికార్డు గనుక వ్రాయుదురు. తప్పుచేసిన మనిషి మార్పు పొందగానే కొట్టివేయనా అని దేవుని నడిగి కొట్టివేయును. మనిషి మారుమనస్సు పొందునేమో అని వ్రాయకుండ కనిపెట్టి, మనిషి క్షమించు ప్రభువా! అని అనగానే వెంటనే దూత వ్రాయుట మానివేయును. మన తప్పులు వ్రాయుట వారికిష్టములేదు. ఎవరికి గొప్ప కష్టములు, శ్రమలు ఉన్నవో వారికి గొప్ప దేవదూతలున్నారు.


తలుపులకు తాళము వేయుట మరిచితే దేవదూతలు కావలిగా ఉందురు, అంతేకాదు దేవదూతలు మన పిండివంటలమీద సహా ఈగలు పడకుండ కాపాడును. పాపములో పడునప్పుడు పడకుండా దేవదూత వేరే తలంపు పుట్టించి వద్దు, వద్దు అని చెప్పును. మనము చింతపడునప్పుడు, భయపడునప్పుడు, సందేహము ఇదో అదో అనునప్పుడు సైతానుకు సందు. సైతానుకంటే గొప్ప సైతాను చింత. ఎంత గొప్ప చింత అంటే 3 సం॥లు మన ఇంటిముందు పెరిగిన చింతచెట్టు కంటే బలమైన చింత, పెండ్లికుమార్తెకు ఈ మూడు ఉంటే నవ్వురాదు, పెండ్లికుమార్తెకు రెండు గుర్తులు.

  • 1. ఎల్లప్పుడు నవ్వు ముఖముగానే యుందును.

  • 2. అయ్యో! నేను పడిపోయినాను, నాది తప్పు అని అనకూడదు.

ఎవరు ఈ ప్రకారము అనకుండ ఉంటారో వారే పెండ్లికుమార్తె నీవు తప్పుచేసినప్పుడు తప్పుచేస్తిని అయ్యో అన్నప్పుడు పిశాచికి సందు. పెండ్లికుమార్తె అలాగు అనదు. ఇతురులు అంటారు. తప్పుచేసిన వెంటనే, చేసినాను క్షమించుమని వెంటనే లేచినాను. తప్పుచేయుట, క్షమాపణ పొందుట ఒక్కసారే. తప్పుచేయుట, ఒప్పుకొనుట క్షమాపణ పొందుట, ఈ మూడును జరిగినప్పుడు పిశాచికి తెలియకుండవలెను. క్షమాపణ దొరికినదని వెంటనే నమ్మవలెను, గాని రేపు ఉపవాసముండి ప్రభువు దగ్గర ఒప్పుకొంటాను అని రేపటి వరకుండుట అవిశ్వాసమునకు హేతువు. అదే పెండ్లికుమార్తె వరుసకు దూరమగుట. ఇంతగొప్ప గడుసుతనము ఉంటేనేగాని పెండ్లికుమార్తె వరుసలో చేరరు. నా తండ్రి ఉన్నాడు అన్నియు ఆయనే చూచుకొనును అనవలెను.


దేవుడు కోటానుకోట్ల దేవదూతలను కలుగజేసెను, వారు దేవునివలె నిరాకారులు. పరిశుద్ధులు, దేవునియొక్క లక్షణములుగలవారు. దేవుడు వీరిని మొదట కలుగజేసెను. వీరు ఎప్పుడును దేవునిని పూజచేయుచుందురు. దేవుడు ఏ పని చెప్పినను చేయుచుందురు. వీరికి దేహములేదు, ఆత్మరూపులు, మహాశక్తిమంతులు, వీరు ఒక్క నిమిషములో ఎన్నివేల మైళ్ళదూరమైనను ఎగిరివెళ్ళగలరు. వీరు మనలను కాపాడువారు. మనమీద వీరికి ఎంతో ప్రేమ. మనము నమ్మిన యెడల దైవాజ్ఞచొప్పున మనకెంత సహాయమైనను చేయుదురు. మనము దేవుని సహాయము కొరకు ప్రార్ధించునప్పుడు మనకు సహాయము చేయుటకు వీరికి ఎంతో వీలుకలుగును. మనము నిద్రపోవు చున్నప్పుడు మనచెంతనే ఉందురు. దయ్యములను రానివ్వరు. దేవుడు కలుగజేసిన సృష్టిని కాపాడుట వీరిపని. సృష్టికి నష్టము కలిగించు ప్రతిదానిని వీరు తొలగింపగలరు. దైవచిత్తమునకు చిత్తము అనేవారు అనగా సంపూర్ణముగా లోబడువారు ఎంతదూరమైనను క్షణములో వెళ్ళగలరు. మన కంటికి కనబడరు. మన దగ్గరనే ఉందురు. మనలను మిక్కుటముగా ప్రేమించువారు. దేవదూతలు మన ఉపయోగ నిమిత్తము చేయలేని ఒక పని ఉన్నదా? మీకిష్టమైనవారు మీకును కనబడుదురు. వీరు మన స్నేహితులు. మన సహకారులు, మనమీదికి వచ్చు అపాయములను తప్పించి వేయుదురు. దూతలయొక్క పనినిబట్టి వారు కొన్ని రకములుగా నున్నారని తెలియనగును.


మిఖాయేలు మన పక్షముగా యుద్ధము చేయువాడని తెలియుచున్నది. మోషే శరీర విషయములో అపవాదితో తర్కించెను. యూదా. 1:9.


మరియు ఘటసర్పముతో యద్ధము చేయుదురు. ప్రకటన. 12:7 దాని. 10:13; 12:1


గాబ్రియేలు దూత వర్తమానములు వినిపించునని తెలియనగును. దాని. 8:16 9:21


జకర్యాకు వర్తమానము లూకా. 1:19


మరియకు వర్తమానము లూకా. 1:26 దూతలు స్తుతి చేయుట యెషయా 6వ అధ్యాయములో గలదు. భూమికి పునాది వేసినప్పుడు దూతలు పాడిరి యోబు 38:7 ప్రభువు దూత చెరసాల నుండి శిష్యులను విడిపించెను. కార్య. 12:10 యుగ సమాప్తియందు నీతిమంతులను, దుష్టులను వేరుచేయువారు దూతలు. మత్త, 18:49;


మనుష్య కుమారుడు దూతలతో వచ్చును. మత్తయి. 16:27


మనము దూతలవలె నుందుము. మత్త, 22:30;


ప్రభువుయొక్క జన్మచరిత్రలో పునరుత్థాన చరిత్రలో దూతలు పనిచేసిరి మత్తయి 28:2,5. లూకా. 2:9


పాపి మారుమనసు పొందిన దూతలకు సంతోషము లూకా. 15:10


లాజరు, అబ్రాహాము రొమ్మున నుండుటకు దూతలచే కొనిపోబడెను లూకా. 16:22


పాతనిబంధన, క్రొత్తనిబంధనలోను కూడా దేవదూతలపని విస్తారముగ చూడగలము. ప్రకటన గ్రంథములో దూతలయొక్క పని ఇంకా ఎక్కువగలదు.


సైతాను: అనాదిలో ఒంటరిగా నున్న దేవుడు నరులను కలుగ చేయవలెననియు తన పోలిక చొప్పున కలుగజేయవలెననియు ఉద్దేశించెను. నరుల సహాయార్థము దూతలైన వారిని దేవుడు సృజించెను. కోటానుకోట్లదూతలైన వారిలో కొందరిని ప్రధాన దూతలుగా నియమించెను. అట్టివారిలో లూసిఫర్ , మిఖాయేలు గాబ్రియేలు అను వారున్నారు. గాని వారిలో ఒకడైన లూసిఫర్ తేజోనక్షత్రమనియు, వేకువ చుక్కననియు పేర్లు గలిగినవాడై తేజరిల్లెను. ఈ ప్రధానదూత దేవుని కన్న తన సింహాసనమును హెచ్చించుకొనవలెననియు సర్వ సృష్టిని కలుగజేసిన మహోన్నతుడైన దేవునితో సమానముగా తనను తాను హెచ్చించుకొనవలెననియు మనస్సు గలవాడై గర్వించెను. పరిశుద్ధ లోకములో పరిశుద్ధ దూతలతో ఉన్న అటువంటి ఈ ప్రధాన దూతకు ఈ దుర్బుద్ధి ఎలాగు కలిగెనో మన హృదయమునకు గోచరము కాదు మన జ్ఞానమునకు అందదు. ఆలోచించుట వలన మనకు మతి చెడును.


తన ప్రధానత్వము నిలుపుకొనక సహకారులైన దూతలకు ఈ సంగతి తెలుపగా వానితో ఏకీభవించినవారు దయ్యములుగా మారిపోయినందున దేవుడున్న దేవలోకమును విడిచిపెట్టవలసి వచ్చెను. సృష్టికర్తయైన దేవునిని విడిచి పాపకారుడు, శోధకుడు పాప ఫలితమునకు గురియై శాపమును బొంది పైలోకమునుండి పడద్రోయబడి పాపనైజము కలిగియుండుట ఎంత విచారము!


పడద్రోయబడిన సాతాను అను పేరుగల ఈ దుష్టుడు ఆది సర్పము, ఘటసర్పము, అబద్దోను, అపొల్లోను, ద్రాగోను, అపవాది అను నామములు గలిగినవాడై ఈ లోకములో తనకున్న సమయము కొంచెమేనని ఎరిగినవాడై గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని లోకమంతట తిరుగులాడు చున్నాడు. సృష్టికర్తకు విరోధమైన పాపము, సృష్టికి విరోధమైన పాపము, మనుష్యునికి విరోధమైన పాపము, సంఘమునకు విరోధమైన పాపము, తన ప్రేరేపణనుబట్టి నరులైన వారి యెడల చేయించుచున్నాడు. అతని కాలము పరిమితము.


యేసుక్రీస్తు ప్రభువు తన అధికారముతో భూమిమీద పరిపాలన చేయు వెయ్యి ఏండ్లకాలమందు సాతానుడు మట్టిలేని గోతిలో పడవేయబడును. ఆ గోతిలో వెయ్యేండ్లు సాతానుడు దిగిపోవుచునే ఉండును. వెయ్యేండ్లు అయిన పిమ్మట అతనిని విడిపించును. అతడు గోగు, మాగోగు అను సైన్యములను ఏర్పరచుకొని దేవునితో యుద్ధము చేయగా సాతానుకు అంతమువచ్చును.


దేవుడు తన చేతితో తన స్వరూపమునందు మనిషిగా కలుగజేసిన నరుడు నరకములో పడిపోవుట ఎంత విచారము. నరకము అగ్ని నరుల కొరకైనది కాదుగాని సాతానునకును, వాని దూతలకును, అంతెక్రీస్తునకును, అబద్ధ ప్రవక్తకు మాత్రమే మెళుకువ కలిగి దైవసాన్నిధ్యములో మన జీవితము గడిపి పరలోక రాజ్యములో చేరగల ఆనంద భాగ్యము దేవుని కృపవలన పొందుదురు గాక!