(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

అనాది



శ్రీమంతుడైన దేవుడు అనాదిలో ఒంటరిగానే ఉండెను. అప్పటికి కాలమనునది లేదు. ఎండకాలము, వర్షాకాలము, శీతాకాలము అను కాలములు లేవు అలాగే వర్షబుతువు, శరద్రబుతువు, హేమంత బుతువు, శిశిర బుతువు, వసంత బుతువు, గ్రీష్మబుతువు అను బుతువులు లేవు అలాగే కృత యుగము, త్రేతయుగము, ద్వాపర యుగము, కలియుగము అనునవి కలిగియుండలేదు. మరియు లోకములు గాని, నరులుగాని లేరు. మరియు దేవదూతలు లేక ముందు మనలను పాపములో పడవేయు సాతానుడు వాని అనుచరులు లేకముందు అనాది కాలము, నరులమైన మనకు జీవనాధారమైన గాలి, ఆకాశము, సూర్య చంద్ర, నక్షత్రములు లేకముందు ఎగురుచు ఉన్న పలువిధములైన పక్షులు, భూమిమీద సంచరించు పాపిని మృగములు జలములలో సంచరించు జలచరములు లేకముందు, చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును తినకూడదని దేవుని మూలముగా చెప్పబడిన కీడు, మేలు తెలియజేయు వృక్షములు లేక మునుపు మన ఊహలోనికి రాగలిగినది ఏదియు లేకముందు, దేవుడు ఒంటరిగానే ప్రకాశించుచుండెను.


సర్వలోకమును కలుగజేయవలెనన్న ఆలోచన దేవునికి అనాదిలోనే ఉన్నది. ఆ అనాదిలోనే నిన్ను, నన్ను కలుగజేయవలెనన్న తలంపు ఆ దేవునికి ఉన్నది ఆ దేవునికి ఎంతగొప్ప జ్ఞానము, ఎంత గొప్ప ప్రేమ, నరుని కలుగజేయక మునుపు నరులకు ఉపయోగార్ధమైన భూలోకమును అందలి సృష్టినంతటిని కలుగజేయవలెనని దేవుడు యోచించియున్నాడు, నరునిమీద దేవునికి ఉన్న ప్రేమ ఇప్పటికికాదు గాని అనాది నుండి వచ్చిన ప్రేమయై యున్నది.


జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పర్చుకొనెను. ఎఫెసె. 1:6.


సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలుపబడియున్నది. రోమా. 16:25.


అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. సామె. 8:23.


దేవునికి ఆది లేదు ఎప్పటినుండి ఉన్నాడనునది ఆలోచించుటవలన మన మనస్సునకు అనర్ధము, ఈ మాట విన్నవారందరు మనస్సులో ఆయనకు నమస్కరింతురుగాక!