(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
నిశ్శబ్దకాల కథ
నరులు పాపములో పడిపోగ ఏదెను వనమునందు ఆదాము, అవ్వలను సమకూర్చిన దేవుడు రక్షకుని పంపి నరులను రక్షించెదను అను వాగ్ధానము నెరవేర్చుటకై ఒక ప్రత్యేకమైన జనాంగమును ఏర్పాటుచేసికొనెను. ఆ జనాంగమునకే యూదా జనాంగమనె పేరు వచ్చినది. అట్టి జనాంగముతో దేవుడు రక్షకునియొక్క రాకడనుగూర్చి ప్రవక్తల ద్వారా తెలియజేయుచు వచ్చెను. యూదులకు నేర్పవలసినవన్నియు నేర్పి వారిచేత చేయింపవలసినవన్నియు చేయించెను. ఆదినుండి నరులకు చెప్పవలసినవన్నియు చెప్పి పాతనిబంధన గ్రంథములో వ్రాయించెను.
రక్షకుని జన్మమును గూర్చిన వార్త దేవుడు చెప్పవలసినది ఇంకలేదు గనుక ఆయన మాట్లాడుట మానివేసెను. అందుచేతనే ఈ కాలమునకు నిశ్శబ్దకాలమని పేరు వచ్చెను. సుమారు 400 వందల నంవత్సరములు దేవుడు మాట్లాడుట మానివేసెను. ఈ నిశ్శబ్ద కాలమందు స్వభావ సిద్ధముగా నిరాశ ప్రవేశించును. అయినను యూదులలో దైవవాగ్ధాన వాక్యముల యెడలగల నిరీక్షణ మరింత వృద్ధికావలసియున్నది. దేవుడు మాట్లాడకపోయినను విశ్వాసము పెరగవలెను. దేవుడు కనబడక పోవుట, మాట్లాడకపోవుట అను దానినిబట్టి కనబడుచున్న వాటిని పూజించే అవకాశము నరులకు ఉన్నది. అయినను యూదులలో అట్టిది ప్రవేశించలేదు.
ఇది నిశ్శబ్ద కాలోపదేశమని గ్రహించిరి. దేవుని మాటలు, పెద్దల మాటలు, యూదల చరిత్ర, రక్షకుని రాకడ ప్రవచనములు, సర్వ అవస్థలయందు జ్ఞానోదయమును, ఆదరణను కలిగించు వాగ్ధానములు గల పాత నిబంధన గ్రంథము వారికి ఉండగా నిరీక్షణను క్షీణింపచేసికొనుట ఎట్లు?