(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

భూలోకము



ప్రియ చదువరులారా! భూలోక సృష్టియొక్క చరిత్రయును, అది పరిశుద్ధముగా నుండిన చరిత్రయును, మరియు సాతానుడు అపరిశుద్ధ లోకములో పాపము నెట్లు ప్రవేశపెట్టినాడను సంగతియు చదివియున్నారు. పడిపోయిన మనుష్యులకు దేవుడు రక్షణ వాగ్ధానము వినిపించిన చరిత్రయును, పాపవృద్ధి చరిత్రయును, సైతానుచేసిన సృష్టిని గూర్చియు తెలిసికొనవచ్చును.

దేవుడు మనిషిని తన లక్షణములను పెట్టి చేసినాడు. అనగా దేవునిలోనున్న కళంకములేని ప్రేమ మనిషిలో పెట్టినాడు దేవునిలో నున్న శక్తి మనిషిలో పెట్టాడు తనలోని పరిశుద్ధత మనిషిలో పెట్టాడు. తనలోని జ్ఞానమును మనిషిలో పెట్టాడు. ఈ విధముగా తనలోని గుణములన్ని మనిషిలోపెట్టి చేసినాడు. గనుక మనిషి ఎంతగొప్పవాడు అందుకే మనిషి అచ్చా దేవునివలే నున్నాడు అందుకే మనకి దేవునిరూపే అని అంటారు. తండ్రి రూపురేఖలు కుమారునికి వచ్చినట్లే దేవుని రూపురేఖలు మనిషికి వచ్చివేసినవి. మనిషి ఎంత ధన్యుడు! రాతికి దేవుని గుణాలు వచ్చినవా? లేదు. మట్టికి దేవుని గుణాలు వచ్చినవా? కర్రకు దేవుని గుణాలు వచ్చినవా? లేదు మనిషికే వచ్చినవి దేవునికి స్తోత్రము. ఇంకా మనిషి ఎంత గొప్పవాడు. మనిషి కోసమే దేవుడు భూమిని, ఆకాశమును, సూర్యుని, నీళ్ళను, గాలిని, వృక్షములను, జంతువులను ఇవ్వన్ని మనిషికోసమే చేసెను గాని వాటికోసము మనిషిని చేయలేదు. మనిషే వీటికంటే ఎక్కువ. ఇవి మనిషికన్న ఎక్కువకాదు. అయితే గుణము చెడినది గనుక వాటికన్న మనిషి తక్కువైపోయినాడు. అందుకే మనిషి సూరన్నా సూరన్నా అని సూర్యుని మ్రొక్కుచున్నాడు. చంద్రన్నా చంద్రన్నా అని చంద్రున్ని మ్రొక్కుచున్నాడు. భూదేవీ, భూదేవీ అని భూమిని మొైక్కుచున్నాడు, శక్తి పూజచేయువారు దయ్యములను మ్రొక్కుచున్నారు. పాపము తెచ్చిపెట్టినవాడే సైతాను, వానిని మ్రొక్కనా? ఇంకెందుకు మనిషి చెట్టును, పామును, జంతువును, మనిషిని మ్రొక్కుచున్నాడు. దేవునికి మ్రొక్కడము మానివేసినాడు. దేవుడు చేసిన దానికి మ్రొక్కకూడదని మా బైబిలులో నున్నది గనుక చెప్పుచున్నాము. వీటిని పూజిస్తే ఆ పూజ దేవునికి అందదా అని మరి కొందరు మనసు కుదుర్చుకొనే మాటలు చెప్పుచున్నారు. ఒకవేళ నిజముగా దేవునికి బదులుగా ఇంకొకరిని మ్రొక్కడమే న్యాయమైతే ఇవన్నీ నరుని మ్రొక్కాలి గాని నరుడు వీటికి మ్రొక్కునా, చెప్పండి! మ్రొక్కకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఇది మొదటిది.


మరియొక దేవుని ఆజ్ఞ. జబ్బులు, కరువులు, మరణాలు దేవుడు పంపించుచున్నాడని కొందరు దేవునిమీద పెద్ద నేరమొకటి వేయుచు ఆయన మంచిపేరు చెడగొట్టుచున్నారు. దేవుడేమన్నాడు! నా పేరు వృధాగా ఎత్తితే మనిషికి దోషము ఉండకపోదు అని చెప్పినాడు. తండ్రి కుమారునికి కీడుచేయునా? నీవేనా ఇదంతా చేయుచున్నావు అని కొడుకు తండ్రిని అనవచ్చునా? దేవుడు మన తండ్రి అయినను అసలే అనకూడదు గదా! నా పాపము వలన నాకీ కీడు అని మనిషి తనలో తాను క్రుంగి క్రుంగి సిగ్గుపడీ ఊరుకోవలసింది. దేవా తండ్రీ నన్ను క్షమించి ఈ కీడు తొలగించు అని ప్రార్ధిస్తే ఎట్లుంటుంది? నీ మూలన నాకీ కీడు అని నిందవేస్తే ఎట్లుంటుంది? నిందించిన యెడల కీడు ఇంకా ఎక్కువ అవునుగాని తగ్గదు.


దేవుడిచ్చిన మరొక ఆజ్ఞ - వారములో ఒకరోజు దేవుని పూజ రోజుగా ఏర్పరచుకొనవలసిందిగా దైవాజ్ఞ ఆరు రోజులు మనవి. ఒకరోజు ఆయనది, ఎవరి మట్టుకు వారే రోజు దేవుని పూజ పెట్టుకొనవచ్చునుగాని అందరు కలిసి ఏదో ఒక రోజున ఒకచోట గుడిలో పోగై దైవారాధన చేసికొనవలెనని దేవుని కోరిక. ఎంతమంది చేస్తున్నారు క్రైస్తవులు మాత్రము ఆదివారము పెట్టుకుంటున్నారు. వారైన కొందరు ఆ దినముకూడ ఏదో పనిమీద ఎక్కడికైన వెళ్ళిపోవుదురు. లేదా ఇంటివద్ద ఉండిపోవుదురు. దేవుని పూజ తప్ప మరే పని చేసుకొనడము ధర్మము కాదని తెలుసు. వంట వండుకొనడము తప్పదు. అట్టి పనికి దేవుడేమియు అనడు. గనుక ఒక పూజరోజు ఏర్పరచుకొండి.


దేవుడిచ్చిన ఇంకొక ఆజ్ఞ. చేయవద్దని తల్లిదండ్రులు చెప్పిన పిల్లలు అదే చేయుదురు. చేయండి అని చెప్పిన అది చేయరు. దేవుడేమి చెప్పినాడు. తల్లిదండ్రులను సన్మానించండి అని చెప్పెను. పిల్లలు అట్లు చేయుచున్నారా? బాబూ నాయనా అనలేదు, గద్దించినా లేదు, కోపపడ్డా లేదు, కొట్టినా లేదు, ఏమి చెప్పాలి? ఈ కాల మహిమ ఇంట్లోనున్న పెద్దవారిని మత సంఘములో నున్న పెద్దలను, గ్రామములోనున్న పెద్దలను, బడిలోనున్న ఉపాధ్యాయులను, దేశము నేలువారిని మర్యాద చేయడమును వారికి లోబడి ఉండుటయును దేవుని చిత్తమైయున్నది గాని ప్రజలు దేవుని చిత్తమును సరిగా నెరవేర్చుచున్నారా?


దేవుడిచ్చిన ఇంకొక ఆజ్ఞ - నరహత్య చేయవద్దు. ఇది దైవాజ్ఞ. మానినారా? మొదట కోపపడుట. తరువాత బూతులాడుట, ఆ తర్వాత కొట్టుకోవడము, తుదకు చంపుకొనడము ఇట్లున్నది. నరచరిత్ర బ్రతకడానికి దేవుడు పుట్టిస్తే చంపడమా? చంపుకొనడమా? బ్రతకలేక ఎందులోనోపడి చావడమా? ఎవరికి నష్టము. మనిషి ఎంతవరకు దిగిపోయినాడు, ఉయ్యాల తొట్టిలోనుండి గోతిలో కంటా దిగిపోయాడు. అక్కడనుండి ఎక్కడికో తెలుసునా నరకములోనికి. నరకములోనుండి పైకి రావడము ఎప్పుడు? ఇక రావడము రావడమే అక్కడే బ్రతికి ఉండడము. నిత్యమూ బాధపడడము. ఎప్పుడూ బ్రతుకే ఎప్పుడూ బాదే దీనికైనా అంతముందా? లేదు లేదు.


ప్రియ చదువరులారా! రక్షణ మహాసంకల్పన వరుసగా వ్రాయుచు ఇప్పుడు పాపమువలన వచ్చిన శాపమును గురించి కొంతవరకు చదివి యున్నాము.


మిగిలిన కథ కూడ చూడండి: దేవుడిచ్చిన ఇంకొక ఆజ్ఞ వినండి “వ్యభిచరించవద్దు” ఇది దైవాజ్ఞ. ఎంతమంది పడుచువారు ఈ పాపములో పడిపోయి తేలకుండ ఉన్నారు. ఎందరు వ్యాధులు తెచ్చుకొని చిరకాలము బాధపడుచున్నారు. అయినా మానినారా! ఈ పాపము వలన ఎన్ని కుటుంబములు విడిపోవుచున్నవి. దేవుడేమి చెప్పినాడంటే చూస్తేనే, తలస్తేనే, పాపమన్నాడు. ఇవన్నీ నరుడు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసలుకొనవలెను. భార్యభర్తలు ఎంతో ప్రేమగా ఉండవలసినదని దేవుని కోరిక. ఉంటున్నారా మరి? ఇదొక రకమైన వ్యభిచారము.


దేవుడిచ్చిన ఇంకొక ఆజ్ఞ వినండి. దొంగతనము చేయవద్దు. ఇది దైవాజ్ఞ ఒకరోజుకు లోకములో ఎన్నెన్ని దోపుళ్ళు జరుగుచున్నవి. కన్నాలువేసే దొంగతనములుకాక, దారులుకొట్టే దొంగతనాలు కాక ఇతర దొంగతనాలెన్ని! తప్పు పద్దులు వెయ్యడము ఒక దొంగతనమా? ఇంత కుమ్మవలసినది అంత కుమ్మడము ఒక దొంగతనా? దగాతక్కెళ్ళు, పిచ్చిపడులు, తప్పుడు కొలతలు ఇవి ఒక దొంగతనమా? చెట్లు నిండా పండ్లు, పొలమునిండా పంట దేవుడిస్తు ఉంటే మనిషికిదేమి పని? ఓ సహోదరుడా నీ డబ్బెవరిది? దేవునిది నీ పంటెవరిది? దేవునిది. నీ బట్టలెవరివి? దేవునివే. నీ తోటలో పళ్లెవరివి? దేవునివే. నీకున్నవన్ని దేవుడిచ్చినవే. దేవుని సహాయము లేకుండ స్వయముగ నీవు సంపాదించు కొన్నది నీదగ్గరేదిలేదు. పాపము మాత్రమే ఉన్నది. అదొక్కటే నీవు సంపాదించు కొన్నది. తక్కినవన్ని దేవునివే. సొమ్ము దేవునిది గనుక అది నీవొక్కనికోసమే ఇచ్చాడని అనుకొనవద్దు. బీదలకోసము కూడ ఇచ్చాడు. రోగుల కోసము కూడ ఇచ్చాడు. ఇదికూడ జ్ఞాపకముంచుకొనవలెను. గనుక ధర్మము చేయవలెను. నీ సొమ్ము దేవుని ఇష్టప్రకారము ఖర్చుపెట్టవలెను నీవు అనుభవించడమును బీదలకు ధర్మము చేయడమును దేవుని ఇష్టమని గ్రహించుకో! అట్లు చేయకపోవడము కూడ ఒకరకమైన దొంగతనము. దేవుని పని వ్యాపకము చేయడానికి సొమ్ము కావలసిన చందాలు పోగుచేస్తారు. కొంతమంది ఇస్తారు. కొంతమంది పట్టుబడిందికాదుగదా అని ఇవ్వడము మానివేస్తారు. మానివేస్తే దేవునిసొమ్ము అపహరించినట్టే. గనుక సహోదరుడా ఈ పొరపాటులో పడవద్దు దేశోపకారము నిమిత్తము చందాలు ఎత్తినప్పుడు విసుగుకొనవద్దు. మాకు ఒక వేదవాక్యమున్నది. “పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యత” అని నేను బుట్టెడు పళ్ళు పంపాను. బాగా ఉన్నాయా అని ఒకరు ఒకరిని అన్నారు. అయ్యో మూడు తిని తక్కినవి తినడము మరచిపోయాను అని వెళ్ళిచూశాడు. అవి చెడిపోయినవి. ఆయన దేవునిసొమ్ము వాడనందువలన పాడుచేశాడుగదా? గనుక దేవుడిచ్చినవి వాడకపోవడము పాపమే.


ఇంకొక ఆజ్ఞ వినండి. "పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకవద్దు" ఇది దైవాజ్ఞ. ఎంతమంది ఇతరులపేరు చెడగొట్టవలెనని లేనిపోనివి కల్పిస్తున్నారు. కొంచెము ఉంటే గంపంత చేస్తు ఉన్నారు. ఎరగని వారిని తీసికొని వచ్చి కోర్టులో అబద్ధ సాక్ష్యాలు పలికిస్తు ఉన్నారు. ఎంతమంది సత్యము అసత్యమని రుజువు పరచి సత్యవంతులను సిగ్గుపరుస్తుయున్నారు. ఎంతమంది అబద్దాన్ని నిజమని రుజువుపర్చి అబద్దాన్నె నిలువబెట్టుచున్నారు. ఈ అబద్దాలాడటము తుదకు ఎందులోనికి వెళ్తుంది అనుకొంటున్నారు. దేవుడులేడు అని అనుకోవడము లోనికి వెళుతుంది అంటే ఏమన్న మాట? దేవునిని అబద్ధికునిగా చేయడమన్నమాట అనగా ఉన్నా దేవునిని లేదని రుజువుపర్చిన దేవుడవైనవన్నమాట నీకు!


దేవుడిచ్చిన ఇంకొక ఆజ్ఞ వినండి "ఏమీ ఆశించకూడదు" ఇది దైవాజ్ఞ దురాశ దుఃఖమునకు హేతువు. పేరాస పనికిరాదు, నీకున్నదానితో తృప్తిపడి ఉండవలసినదేగాని ఒకరిది ఆశించకూడదు. చాలినంత ఉన్నా ఇంకా కావాలి అని, ఏమీలేదు అని, ఉన్నది చాలదు అని పేద అరుపులు అరువకూడదు. అన్ని ఆజ్ఞలు కలిపి రెండు మాటలలో చెబుతాను, దేవునిని ప్రేమించాలి. మనిషి ప్రేమించాలి, అప్పుడు ఏ పాపము జరుగదు, ఎందుకు ప్రేమించాలంటారా? దేవుడు నీ తండ్రి మనిషి నీ సహోదరుడు దేవునినే పూర్తిగా ప్రేమించావంటే మనిషిని తిట్టవు, కొట్టవు, మనిషీ మనిషి ఇల్లుగాని, డబ్బుగాని, పంటగాని, పశువుగాని, సామానుగాని ముట్టకొనవుగాని కాపాడుదువు. ఆజ్ఞలు ముగించివేసాను. ఆజ్ఞలన్నిటి ప్రకారము చేయుటకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు మీకు బలమిచ్చునుగాక!


ఒక పాదిరిగారు ఒకరి ఇంటికి తరచుగా వెళ్ళువారు. ఆ ఇంటిలో యజమానునికి క్రీస్తుబోధ అంటే ఇష్టములేదు. పాదిరిగారు అంటే ఇష్టమే, ఆయన ఏమిచెప్పిన వినుట ఇష్టమే, కాని క్రీస్తును గురించి చెప్పటము అనేది ఆయనకు ఇష్టములేదు. ఒక దినమందు ఆ ఇంటి యజమానుడు పాదిరిగారితో - పాదిరిగారు! మా ఇంటికి తరచుగా రండి, బోధచేయండి, కాని యేసుక్రీస్తు వారినిగూర్చి మాత్రము చెప్పకండి అని అన్నారు. అందుకు పాదిరిగారు సరేలెండి ఇక చెప్పనని జవాబు ఇచ్చెను. అలాగే పాదిరిగారు తరచుగా వస్తుండేవారు కొన్ని మంచి సంగతులు చెప్పి వెళ్ళిపోయేవారు. క్రీస్తును గురించి చెప్పవద్దు అన్నారు గనుక ఎప్పుడు చెప్పలేదు. అయితే ఏమి జరిగింది? కొన్నాళ్ళకు ఆ ఇంటి ఆయనకు జబ్బు చేసినది, మంచము పట్టినారు పాదిరిగారు యధాప్రకారముగానే పాపములను గూర్చి చెప్పెను. అదిచేస్తే పాపము, ఇది చేస్తే పాపము అని ఈ ప్రకారముగా చెప్పటము ప్రారంభించెను. పాపాలవల్ల జబ్బులు వస్తున్నాయి. పాపాలవల్ల కరువులు వస్తున్నాయి, తుదకు పాపాలవల్లనే మరణము, మరణము పిమ్మట నరకము కూడా వచ్చునని చెప్పెను మా బైబిలులో పది ఆజ్ఞలున్నాయి, ఏది పాపమో అది అద్ధమువలె తెలిసిపోవును అని చెప్పి, పది ఆజ్ఞలను వివరించెను. పాపములు చేసినవారు చనిపోయి తుదకు నరకమునకు వెళ్ళిపోయి శాశ్వతకాలము బహు బాధపడుచూ ఉంటారని నరకమునుగూర్చి బహు భయంకరముగా చెప్పి వెళ్ళిపోయినారు. అప్పటినుండి ఆ రోగియొక్క మనస్సు కలతలోనికి దిగిపోయినది. పగలు, రాత్రులు నిద్రలేదు అసలు జబ్బుకంటే ఈ జబ్బు ఎక్కువైనది మనస్సులో నెమ్మదిలేదు.


ఓపిక ఉంటే ఇంకొక కథ వినండి. ఒకరు జబ్బుపడి ఇంటిలో నున్నారు. ఆ పేటలో నున్న ఒక పాదిరిగారు ఆ రోగిని చూడడానికిని, ఆదరణగల మాటలు చెప్పటానికిని పదేపదే వెళ్ళుచుండెడివాడు. ఒకనాడు ఆ రోగి పాదిరి గారితో ఇట్లు అన్నాడు. అయ్యో! అయ్యో! మీరు మా ఇంటికి రావడము ఇష్టమే. మీ ఆదరణగల మాటలువిన్న ధైర్యముగా ఉంటుంది. మా ఇంటికి మీరు రావద్దు అని అనను. బోధ చేయవద్దని అనను, ఎన్నిచెప్పిన సంతోషముగా విందును. మీరు చెప్పవచ్చును, గాని యేసుక్రీస్తు వారినిగూర్చి మాత్రము చెప్పవద్దు నా కిష్టములేదు అని అన్నారు. ఆ పాదిరిగారు చాలా తెలివిగలవాడు, ఉపాయము గలవాడు, దైవభక్తిగలవాడు. ఆ వ్యాధిగ్రస్తుని చూచిన పాదిరిగారు యేసుక్రీస్తుని వానినిగూర్చి ఏమి చెప్పను లెండి అన్నారు. ఇంటికి వెళ్ళిపోయిన పాదిరిగారు చాలా పట్టుదలగా ప్రార్థన చేసికొన్నాడు, ఏమని? చెప్పవద్దు అని అన్నవాడు ఏనాటికైన చెప్పండి, చెప్పండి అని నన్ను బ్రతిమాలునట్లు చేయము దేవా అని పార్ధించినాడు. కొన్ని రోజులు గడిచిన పిమ్మట పాదిరిగారు ఒక ఉపాయము చేసెను. మన బైబిలులో పది ఆజ్ఞలున్నవి. ఈ ఆజ్ఞల వివరము వినేవారికి తప్పు ఏదో ఒప్పు ఏదో తెలియును పాపమేదో పుణ్యమేదో తెలియును. నరకానికి ఎట్టివారు వెళ్ళుదురో మోక్షానికి ఎట్టివారు వెళ్ళుదురో తెలియును. గనుక మీరు ఆ పది ఆజ్ఞల వివరము తెలిసికొనండి అని ఆ రోగితో చెప్పెను. మా క్రైస్తవులలో ఎవరుబడితే వారు చెప్పగలరు అని ఆ పాదిరిగారు ఒక ఆజ్ఞ తరువాత ఒక ఆజ్ఞ వివరించుకొంటూ వెళ్ళినారు. అన్ని వివరించి వేసిన పిమ్మట ఆ రోగికి దిగులుపట్టుకొన్నది. మనస్సులో కలత పుట్టినది. ఏమిచేయవలెనో తోచలేదు. తన పాపములన్ని ఒకదాని వెంబడి ఒకటి జ్ఞాపకము వచ్చినది. మనస్సులో నెమ్మదిలేదు తుదకు ఆ రోగి పాదిరిగారి ముఖమువైపు తేరిచూచి పాదిరిగారు నా గతి ఇంతేనా? నేను నరకమునకు వెళ్ళిపోవలసినదేనా? మీమాటలనుబట్టి చూడగా పాపాత్ములందరిని దేవుడు నరకములో వేయకమానడు ఎన్ని పాపాలు చేసిన నన్ను నరకములో వేయకమానడు. నా మాట (సంగతి) ఏమిటి మరి? అని అడిగినాడు. అందుకు పాదిరిగారు నేనేమి చేయను పాపాలు ఉంటే నరకము తప్పదు, తప్పించుకొనుటకు వీలులేదు అని జవాబు ఇచ్చెను. అప్పుడు ఆ రోగి అబ్బో బహు భయంకరమైన మాట చెప్పారు ఏమిటి ఈ మాటలు బాధకరమైనవి. నరకయాతన ఒక్కరోజే సహింపలేము. శాశ్వతకాలము ఎట్లు సహింపగలము అని అన్నాడు. అందుకు పాదిరిగారు అయ్యా! నేను ఉన్న సంగతే చెప్పాను దాచుకొనక చెప్పాను ఏ బోధకుడైన ఈ మాటలే చెప్పును. ఎందుకంటే ఈ మాటలు వాక్య గ్రంథములో నున్నవి మీరు స్వయముగా చదువుకొనవచ్చును. అప్పుడు ఆ రోగి పాపములకు విరుగుడు లేదా? నరకము తప్పించుకొనుటకు ఉపాయము లేదా? అని, పాదిరిగారిమీద ఆ రోగి ప్రశ్నవేసినాడు. అప్పుడు ఆ పాదిరిగారు ఆ రోగితో అయ్యా మీరు పెద్దవారు మీరు చెప్పినట్లు చేయాలిగదా! పాపములు పోగొట్టుకొనే విరుగుడు ఉన్నది. నరకము తప్పించుకొనే మార్గమున్నది. అప్పుడు ఆ రోగి ఒకవేళ నేను చనిపోతే నాకు నరకమే గతి గనుక పాపమును పోగొట్టు విరుగుడును, నరకమును తప్పించుకొను మార్గమును, చెప్పండి అని బ్రతిమిలాడుకొనెను. అప్పుడు ఆ పాదిరిగారు అయ్యా! ఈ రెండు మీరు చెప్పవద్దు అన్నారు గనుక చెప్పటము మానివేసినాను అని అనెను. అప్పుడు ఆ రోగి మీకు ఎలాగు వినబడినదోగాని చెప్పవద్దు అని నేను అనలేదే అని అనెను. పాదిరిగారికి ఇప్పుడు మంచి అవకాశము దొరికినది అయ్యా మీరు యేసుక్రీస్తు వారి కథ చెప్పవద్దు అన్నారు కదా అందుకే మానివేసితిననెను. అందుకు ఆ రోగి నిజమే క్రీస్తుమాట చెప్పవద్దు అన్నానుగాని నరకమును తప్పించు మార్గము చెప్పవద్దు అని అనలేదే అని అనెను. అప్పుడు ఆ పాదిరిగారు కుర్చీమీద నుండి లేచి బహు సంతోషముతో పాపములకు విరుగుడును నరకమును తప్పించు మార్గము ఆ యేసు క్రీస్తు వారి కథలోనే యున్నది. లోకములో మరి ఏ కథలోను లేదు. అప్పుడు ఆ రోగి పాదిరిగారి చేయి పట్టుకొని కుర్చీమీద కూర్చుండబెట్టి అయ్యా! ఇంతమట్టుకు నాకు తెలియలేదు. లేకపోతే అనకపోదును నా తప్పు క్షమించండి. ఆ యేసుక్రీస్తు వారి కథకూడ చెప్పివేయండని వేడుకొన్నాడు. చూచారా క్రీస్తునుగూర్చి చెప్పవద్దు అని వ్యతిరేకించినవారు విని క్రీస్తును గురించి చెప్పించుకొని బాగైనాడా లేదా! అతని మనస్సులో గొప్ప సంతోషము కలిగినది. చావు భయము పోయినది పాపమేదో పుణ్యమేదో పది ఆజ్ఞలను బట్టి తేటగా తెలియును. క్రీస్తునుగూర్చి విన్నా పాపభయము పోవును. పది ఆజ్ఞలకు వ్యతిరేక పాపములను భరించుటకు యేసుక్రీస్తు ప్రభువు భూలోకమునకు స్వయముగా వచ్చివేసెను. క్రీస్తును గురించి ఎంత తరచుగా వింటే అంతమంచిది. మొదట వినాలి తరువాత పరీక్షించాలి, తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకొనవలెను. అప్పుడు మీరు శుభోజయముగా వర్ధిల్లెదరు. దేవుడు మిమ్మును దీవించునుగాక!


ప్రియ చదువరులారా! దేవుడు బైబిలులో బైలుపరచిన రక్షణ మహా సంకల్పనలోని ఒక్కొక్క భాగమును ప్రచురించుచున్నాము. గతములో పాపము వలన వచ్చిన శాపము కథ చదివియున్నారు. తర్వాత భాగము


పాపవృద్ధి: మొదటి నరులు ఒక్క పాపమేచేసిరి. తర్వాత వచ్చిన ప్రజలు అనేక పాపములు చేయుచున్నారు. నరులు వృద్ధికాగా పాపమును వృద్ధియైనది. పాపముతోపాటు పాపమువలన వచ్చు కీడును వృద్ధియైనది. ఆది. 6:1-6. ఈలాగున నరులు వృద్ధియైరి. పాపము వృద్ధియైనది. నరులకు దేవుడు కనబడుటలేదు గనుక సృష్టికి మ్రొక్కిరి. ఎందుకనగా సృష్టివలన మేలు కలుగుచున్నది. పాపమువలన దేవునికి మానవునికి ఎడబాపు కలిగినది గనుక ఉపకార కారణములై కంటికి కనబడుచున్న సృష్టిని, అందులోని వస్తువులకు మానవులు మ్రొక్కిరి. పాపము సర్వత్ర వృద్ధియగుచున్న కాలములో దేవుడు భక్తులను, భక్తిహీనులను ఒక మందగా అబ్రాహాము కాలము వరకు నడిపించెను. వాగ్ధాన రక్షకుడు రాకముందు ఆయన రాకకొరకు నిరీక్షించినవారు మోక్షమునకు వెళ్ళగలిగిరి.