(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
గడువుల కథ
మనిషి మారుటకు దేవుడిచ్చు గడువులను గూర్చి గూడ తెలిసికొనుట మంచిదే. మనిషి బ్రతికియున్నంతకాలము భూలోకములో దేవుడు కష్టములను రానిచ్చును. కష్టములలో మనిషి మారుటకు దేవుడు అనేక మేళ్ళుచేయును. మనిషి మారుటకు దేవుడు తన స్వంత మనస్సుచేత బోధచేయించును. ఆయావారిచేత బోధ చెప్పించును. చనిపోయే సమయమునకు దేవదూతలచే బోధచేయించును. ఇంకా కొంచెము సమయమునకు మనిషి చనిపోయి నరక మార్గమున వెళ్ళిపోవును అనే సమయమునకు కూడ దేవదూతలచే బోధ చేయించును. చనిపోయిన తరువాత దయ్యములు చీకటి కొట్టులోనికి లాగుకొని పోయిన తరువాత కూడ పరలోక భక్తులను, దూతలను పంపించి బోధ చేయించును. మనిషి ఈ చీకటి కొట్టులోనైన మారుటకు దేవుడు గడువు ఇచ్చెను. అయినా మనిషి మారలేడు. ఈ భూమిమీదే మనిషి మారవలెను గాని తీరా చీకటి బిలములోనికి వెళ్ళిపోయిన తరువాత మారవలెనంటే చాలా కష్టతరము. ఒకవేళ చీకటి బిలములో మారిన యెడల సంతోషమే. క్రీస్తు ప్రభువుకూడ బిలములోనికి వచ్చి బోధచేయును. ఈ సంగతి ఇప్పుడు మీరు చదివియున్నారు. చనిపోయిన తరువాత కూడ గడువు ఉన్నదికదా! అని మీరు అనుకొనవచ్చును. బిలములోనికి వెళ్ళిన తరువాత పాపములు మానివేసి పశ్చాత్తాపపడుదును, తండ్రీ! నా పాపములను క్షమించుమని బ్రతిమాలుకొందును అని అనుకొందురేమో ఈ విధముగా మీరు అనుకొని నిర్లక్ష్యముగా ఉన్న యెడల మీరు పొందిన గడువును మీరే పోగొట్టుకొను వారగుదురు. బిలములోనికి వెళ్ళిన తరువాత వారి మనస్సులు మరి కఠినములై పోవును. భక్తులు, దూతలు వచ్చి మారుమనస్సు నిమిత్తమై బోధచేసిన దయ్యాలే భక్తులవలెను, దూతలవలెను మారువేషములు వేసికొనివచ్చి చెప్పుచున్నాయని అనుకొందురు. దేవునికి నిజముగా మా మీద అంత ప్రేమ ఉన్న యెడల భూలోకములోనే మమ్మును మార్చలేకపోయినాడా అని దేవునిని కూడ నిందించుదురు. కొందరు మారవచ్చును.
ఇంకొక సంగతి తెలిసికొనండి. నరలోకమంతటికి దేవుడు గడువులపై గడువులు ఇచ్చుచునేయున్నారు. క్రీస్తువారు మొదటిసారి తన భక్తులను తీసికొని వెళ్ళిన తరువాత అది చూచి అయినా మారవచ్చును. అది చూచిన కొందరు మారినయెడల క్రీస్తుప్రభువు వారినికూడ తీసికొని వెళ్ళును. వెళ్ళినవారిని చూచి అయినా మారవచ్చును. కాని అప్పుడు మారరు. ఆ తరువాత ఏడేండ్ల శ్రమకాలములో శ్రమను బట్టి ప్రభువును ఆశ్రయించగా వారినికూడ ప్రభువు తీసికొనివెళ్ళును. వెళ్ళిన వారిని చూచినప్పుడైనా మారవచ్చునుగదా! అప్పుడు కూడ మారరు.
హర్మగెద్దోను యుద్ధములో సైతాను, అంతెక్రీస్తు అబద్ధప్రవక్త, దయ్యములు శిక్షింపబడనైయున్నవి అదిచూచి అయినా మారవచ్చునుగదా! వెయ్యేండ్లు శాంతిపరిపాలనలో సువార్త విని మారవచ్చునుగదా? క్రీస్తుప్రభువు అంత్యతీర్పు తీర్చునప్పుడు అది చూచి అయినా మారవచ్చునుగదా? క్రీస్తు ప్రభువు అంత్యతీర్పు కాలములో చనిపోయిన వారినికూడ లేపుదురు అది చూచి అయినా మారవచ్చునుగదా? ఇన్ని గడువులు ఇచ్చే దేవుని మ్రొక్కండి. స్తోత్రమని చెప్పండి. మీతో నేను ఒక వాదము పెట్టుకొనవలయునని ఉన్నది. అది ఏమనగా మనము దేవునిమీద నేరము మోపవచ్చునా? దేవదూత దేవుని ఎదిరించి సైతానైపోవుట దేవుని తప్పేనా? ఆ సైతాను మాట విని నరుడు చెడిపోవుట దేవుని తప్పేనా?
ఉదా:- ఒక కుర్రవాడు చెట్టెక్కి దిక్కులు చూచి తనకాలు విరుగకొట్టుకొనెను. ఆ కుర్రవాని లేవనెత్తుట ఆ కుర్రవాని తండ్రి తప్పేనా? మనిషి పాపములో పడిపోయినాడని చెప్పి దేవుడు యేసుక్రీస్తై వచ్చి పడిపోయిన వానిని రక్షించెదను అని అనకపోతే మన పని ఏమగునో మీరు చూచుకొనండి. దేవుడు పాపము చేయించడు, జబ్బులను పంపడు, కరువులు, భూకంపములు, ఇతర కష్టములు కలుగజేయడు. మరణమును మనమీదకు వదిలిపెట్టడు. మనిషి తన పాపాల వల్ల ఇవన్నియు తెచ్చుకొంటున్నాడు. ఎలాగంటే అజాగ్రత్తగా నుండి ముళ్ళదారిన నడచి, ముళ్ళుగుచ్చుకొనగా ఎంత ప్రయత్నము చేసిన రాలేదు. ఒక నెల దినాలు బాధపెట్టినది. ముళ్ళు గుచ్చుకోవటము, బాధపెట్టటము తండ్రి తప్పేనా? పరలోకమందున్న తండ్రి మన నిమిత్తమై ఆకాశముచేసి సూర్య, చంద్ర, నక్షత్రాదులను ఏర్పరచి, ఇంత భూమిని కలుగజేసి, నీళ్ళు, పాడిపంటలు, ధనము, నగలు, ఇవన్నియు చేసిన దేవుడు కష్టములను పంపునా? మంచి బుద్ధి, జ్ఞానము, విద్య, పరిశుద్ధత, పనిచేసికొనే శక్తి పాటలు పాడే రాగము, వాక్కు చూపు, వినికిడి, ఆరోగ్యము, పండ్లు, పువ్వులు దయచేసిన దేవుడు మనమీదకు కష్టములు పంపునా? దైవభక్తి విశ్వాసము, ప్రార్థించే మనస్సు, మోక్షము మనకు ఇవ్వవలెనని ఉన్న దేవుడు మనమీదకు కష్టములు పంపునా? చదువుకొని బాగుపడండి అని లోకానికి బైబిలు గ్రంథమును పంపిన దేవుడు మనకు కష్టములు పంపునా? మనము బాగుపడవలయునని భూలోకమంతటా తిరిగి బోధించే బోధకులను పంపిన దేవుడు మనకు చిక్కులు పంపునా? పరలోకమందున్న దేవుడు మనందరికి తండ్రియైయున్నాడు. అట్టి తండ్రి మనలను చిక్కుపెట్టి చంపునా? సైతాను యొక్క ఆలోచనలు, పిశాచములయొక్క ఆలోచనలు దయ్యములయొక్క ఆలోచనలు ఆలకించే మనిషియొక్కనైజమునుబట్టి, కష్టములు వచ్చుచున్నవి గాని దేవుని బట్టి గాదు, దూతలనుబట్టి భక్తులనుబట్టి కష్టములు మనకురావు. ఈ మాట నమ్మేవారు ధన్యులు.