(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
రాకడ కథ
క్రీస్తు ప్రభువు రాకడ మహా వినోదముగా ఉంటుంది. క్రీస్తు ప్రభువు మేఘముమీద మధ్య ఆకాశముమీదకి వచ్చును. ఇది వినోదము కాదా! ఇది అందరికి తెలియును ఇది వినోదముకాదా! అంతలో రెండు జట్లు ఆ మేఘములోనికి వెళ్ళుదురు. ఆ మేఘము ఆకాశములో మనకు కనబడే మేఘము వంటిదికాదు. మోక్షపులోకములోనుండి వచ్చే తేజో మయమైన మేఘము. ఇది వరకు క్రీస్తును ఎవరు నమ్మి చనిపోయిరో! వారు ఒక జట్టు, క్రీస్తు వచ్చే దినమందు ఎవరైతే ఆయన రాకడ కొరకు భూమిమీద సిద్ధపడి ఉందురో వారు ఒక జట్టు. అనగా మృతులు ఒక జట్టు, సజీవులు ఒక జట్టు. ఈ రెండు జట్టుల వారు మేఘములో కలిసికొందురు. బ్రతికి ఉన్న జట్టులోని వారికి మరణము కలుగదు వారికి క్రొత్త శరీరము అనగా మహిమ శరీరము వచ్చును. అట్టి మహిమ శరీరముతో గాలిలో ఎగిరి మేఘములోనికి వెళ్ళుదురు. ఒక రెప్పపాటు సమయములోనే ఈ పని అంతయు కూడ జరిగిపోతుంది. ఎటువంటివారు ఎగిరివెళ్ళగలరూ? మనలో ఎవరు రాకడను గూర్చిన సంగతి నేర్చుకుంటారో అలాగు నేర్చుకొని ఆయన ఇప్పుడే వస్తారని నమ్ముదురో, నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచెదరో నడుచుచు ఆయన రాకడ ఎప్పుడు అని కలవరించెదరో, ఓ దేవా సిద్ధమయ్యేటందుకు నాకు దైవాత్మ బాప్తీస్మము ఇమ్మని ప్రార్ధనచేసికొందురో రాకడకు సిద్ధపర్చుమని బ్రతిమలాడుకొందురో ఈ రీతిగా ఎవరైతే సిద్ధపడగలరో అట్టివారు సజీవుల జట్టులో గూడి మేఘ మెక్కుదురు. ఈ రెండు జట్టుల వారికి పెండ్లికుమార్తె సంఘమని పేరు ఉన్నది. ఇది ఒక చిత్రమైన పేరు. పెండ్లికుమార్తె సంఘమని పేరు ఉన్నది. ఇది ఒక చిత్రమైన పేరు. పెండ్లికుమార్తె అనే ఈ పేరు లోకములో మనము చూస్తు వింటు ఉన్న పెండ్లికుమార్తె మాత్రముకాదు. వీరిని యేసుక్రీస్తు వారు పరలోకములోని మహా ఉన్నతమైన నూతన యెరూషలేమునకు తీసికొని వెళ్ళుదురు. మీకుకూడ వెళ్ళాలని ఉంటే సిద్ధపడండి. యేసుప్రభువు మన కాలములోనే వచ్చును అని అనుకొనుటకు వీలు ఉన్నది. ఎందుకంటే ప్రస్తుత కాలములో అటువంటి సంగతులు జరుగుచు ఉన్నవి. ఈ దినములలో క్రైస్తవులకు సహితము విశ్వాసము తగ్గిపోవుచున్నది. రాకడ త్వరలో వచ్చుచున్నదని నమ్మని క్రైస్తవులు లోకమంతట అనేకులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పనే చెప్పారు. ఆఖరి రోజులలో అనేకులకు క్రీస్తురాకడను గూర్చి నమ్మిక ఉండదని తెలియజేసారు. గనుక మనము జాగ్రత్తగా నుండవలెను. గ్రంథమునందు ఏమి ఉన్నదో అదియు నమ్మి ఉండవలెను. ఆ ఘడియ, ఆ దినము ఎవరికి తెలియదని క్రీస్తువారు తెలియజేసిరి. ఇప్పుడే అన్నట్లు ఎట్లు చెప్పగలరు అని కొందరు అడుగుచున్నారు. సంవత్సరాలు తెలియవని చెప్పలేదు. ఆ దినము, ఆ ఘడియ తెలియదన్నాడు కాలము అయిపోయినది గనుక ఆయన రాకడ సమీపముగా నున్నదని ఊహించవచ్చును. రావడము ఆయన పని. సిద్ధపడడము మన పని. ఆయన ఎప్పుడుబడితే అప్పుడు వచ్చెదరు గనుక మనము కూడ ఎప్పుడు బడితే అప్పుడే సిద్ధపడవలెను.
కీర్తన:- (చాయ: యేసుని - సేవింప)
స్తోత్రము చేయుము సృష్టికర్తకు - ఓ దేవనరుడా - స్తోత్రము చేయుము సృష్టికర్తకు - స్తోత్రము చేయుము శుభకర - మతితో = ధాత్రికి గడువిడు దయగల తండ్రికి ॥ స్తోత్రము ॥
1. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై - ఆపదవేళల - కడ్డము బెట్టక - ఆపదమ్రొక్కులు - అవిగైచేయక = నీపై సత్ కృప - జూపెడు తండ్రికి ॥ స్తోత్రము ॥
2. యేసుప్రభువుతో నెగిరిపోవ భూ - వాసులు సిద్ధపడు నిమిత్తమై - ఈ సమయంబున - ఎంతయు ఆత్మను = పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి ॥ స్తోత్రము ॥
ఆయన రెండవమారు వచ్చుట నిశ్చయము మీరు సిద్ధముగా నుండుట నిశ్చయమేనా? యేసుప్రభువు మధ్యాకాశములోనికి రెండవసారి వస్తే మొదటిసారి ఎగిరి వెళ్లేవారి కథ ఇప్పుడు మీరు విన్నారు.