(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

అంత్య తీర్పు కథ



ఆ అగ్నిగుండములో అదివరకే అంతెక్రీస్తు, అబద్ధప్రవక్త, దురాత్మలు ఉండటము వెయ్యేండ్ల కాలములో కూడ అక్కడే ఉండడము జరిగినది. వారితో ఇప్పుడు వారి అధిపతియైన సైతానుకూడ చేరినాడు.


ఇప్పుడు భూమి పుట్టినది మొదలుకొని ఆ నిమిషము వరకు సమాధిలో ఉన్న మారని వారందరిని క్రీస్తుప్రభువు లేపి వారందరిని ఒకచోట పోగుచేయును. సమాధిలోనున్న వారందరూ క్రీస్తుప్రభుని పిలుపును వినగలరు. ధూళిలో, నీళ్ళలో కలిసిపోయిన వారందరును తిరిగిలేచెదరు.


వారితో ప్రభువు మాట్లాడి వారి క్రియలనుబట్టి వారికి తీర్పు విధించెదరు. ఇదే ఆఖరి తీర్పు. బ్రతికి వచ్చిన వారిలో కొందరు క్రీస్తుప్రభువును ఏమి అడుగుదురో వినండి.


అయ్యా! నీ పేరుమీద గొప్ప గొప్ప పనులు చేసితిమి, మీ పేరుమీద అనేకులను స్వస్థపరచితిమి, మీ పేరుమీద దయ్యములను వెళ్ళగొట్టితిమి అని ఆయన ఎదుట అందురు. ఈ విధముగా జరుగనైయున్నది. ఈ ప్రశ్న అడిగే వారు ఎవరంటే ఒకప్పుడు వారు బోధకులై ఉండాలి. ఒకప్పుడు యేసు నామమున గొప్ప పనులు చేసియుండాలి. ఒకప్పుడు యేసునామమున అద్భుతాలు చేసి ఉండాలి. గాని తరువాత సాతాను ప్రేరేపణనుబట్టి లోకములో పడిపోయి చెడిపోయి ఉంటారు.


చూచినారా! ఒకప్పుడు బాగుగా బ్రతికితే మాత్రము చివరకు చెడిపోతే లాభమేమి? గనుక మనమందరము జాగ్రత్తగా చివరివరకు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి.