(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
చివర ఉండిపోయేవారి కథ
భూమిమీద కొందరు భక్తులు ఇంకా మిగిలిపోదురు గాని వారు భూమిమీదనే ఉందురు గాని పరలోకమునకు వెళ్ళరు. ఈ భూలోకమే అప్పుడు పరలోకములో ఒక భాగమగును. నా ప్రసంగము కథ అయ్యిపోయినట్లే.
- 1. మొదటిసారి క్రీస్తు రాకడ కాలములో క్రీస్తుతో వెళ్ళినవారు మహా మహిమ కలిగిన మహాకాంతిగల స్థలములో నూతన యెరూషలేమను స్థలములో ఉందురు.
- 2. రాకడ పిమ్మట ఏదేండ్ల మహాశ్రమలో మారినవారు మోక్షములో ఇంకొక స్థలములో ఉందురు.
- 3. ఆఖరి తీర్పు అయిన పిమ్మట భూమిమీద ఉండిపోయే భక్తులు శాశ్వతకాలము భూమిమీదనే ఉందురు. ఎందుకంటే భూమికూడ అప్పటికి మోక్షములో ఒక భాగమైపోవును.
క్రీస్తుప్రభువు ఈ లోకమును పరిశుద్ధపరచి నూతన భూమిగా మార్చును. ఈ మూడు పరిశుద్ధ లోకములలో ప్రభువు ఉందురు. ప్రతివారియొక్క దైవభక్తిని బట్టి వారు నరలోకములో సంపాదించుకొన్న మహిమకాంతిని బట్టి అంతస్థునుబట్టి ప్రభువు వారిని అనంతకాలము ప్రత్యక్షమగుచు ఉందురు. మీరు ఏ లోకములోనికి తయారగుచున్నారో, ఏ లోకములోనికి చేరుకొందురో ఇప్పుడే నిర్ణయించుకొనవలెను.
ఇప్పటి వరకు అనాది కాలమునుండి అనంతకాలము వరకు ఉన్న కథలన్నీ చదివియున్నారు. గనుక మీకు ఒక ప్రశ్నవేయుటకు నాకు హక్కు ఉన్నది. అదేమంటే ఇవన్నీ తెలిసికొన్న మీరు ఏమి తీర్మానము చేసికొందురు? ఇదే నా ప్రశ్న తరువాత తీర్మానము చేసికొందును అని అంటే అదియు మనకు వల్లబడదు. తరువాత అని అంటే ఇంకొక తరువాత రాక తప్పదు. ఆ తరువాత మరియొక తరువాత వచ్చును. బ్రతికినంత కాలమంతయు తరువాత అనే మాటతోనే నరిపోవును. ఈ తరువాతలన్ని మీరు ఏర్పరచుకొను తీర్మానాలన్నింటికి అడ్డము వచ్చే తరువాతలే గనుక మీ మనస్సులో ఇప్పుడే తీర్మానము చేసికొని ఆ తీర్మానమును ఇప్పుడే దేవునికి చెప్పివేయండి.
మీ తీర్మాన ప్రకారము గడిచేటట్లు దేవుని సహాయము కోరుకొనండి. ఆయన తప్పకుండా మీకు బలమును, శక్తిని దయచేయును. ప్రభువు మీ ప్రార్ధన వినకపోతే యేసుక్రీస్తే మన నరలోకానికి వచ్చినారనునది బూడిదలో పోసిన పన్నీరు అగును. గనుక తప్పకుండగ మీ తీర్మానము ఆయన చిత్త ప్రకారము ఉన్నయెడల అంతా సఫలము చేయును.