(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
మోక్షలోకము
ప్రియ చదువరులారా! రక్షణ మహాసంకల్పన కథలు అనుపేరున ఏడు రకముల చరిత్రను మీరు చదివియున్నారు. ఏడవ చరిత్ర సాతానును గురించినది. ఇంతవరకు రక్షణ మహాసంకల్పనలోని (Plan of Salvation) దేవుని గూర్చియు, ఆయన లక్షణములను గురించియు, దేవదూతలను గురించియు, అనాదిని గురించియు, దేవదూషణ నిషేధమును గురించియు మొ॥ విషయములు చదివియున్నారు. భూలోకచరిత్రలో జరిగిన రక్షణను గురించి ఆదినుండి ఇకముందుకు జరుగనైయున్న రక్షణకార్యక్రమ సమాప్తివరకు నున్న కథలు వివరించక ముందులోకముల చరిత్రకూడ చదువరులు తెలిసికొనవలసియున్నది.
-
1. మోక్షలోకములు :
- 1) దేవలోకము - ఇది అన్ని లోకములకుపైన మన ఊహకు అందనిచోట నున్నది. అది దేవుని సింహాసన స్థలము (యెష 66:1) మరియు యెషయా దర్శనములో అత్యున్నతమైన సింహాసమునందు ప్రభువు ఆసీనుడై యుండుట చూచెను. దేవుని మహిమతో నిండియుండును. ఈ మహిమను పరిశుద్ధులైన దూతలు చూడలేక తమ ముఖములను రెక్కలతో కప్పుకొందురు యాకోబు 1:7లో కూడ దేవుని గురించి కలదు.
- 2) స్తోత్రసమాజము - ప్రకటన (4:6-11) ఇక్కడ నలుగురు పెద్దలు దేవుని సింహాసనము ఎదుట లోక విమోచన కొరకు దేవుని స్తుతింతురు. ఈ సమాజమును గురించి ప్రకటన గ్రంథముయొక్క వివరములలో తెలిసికొనవచ్చును.
- 3) దేవదూతల లోకము - దేవుడు వీరిని మొదట కలుగజేసెను. వీరిసంఖ్య కోటానుకోట్లు. వీరు దేవుని ఆజ్ఞనుబట్టి మనకెట్టి సహాయమైనను చేయగలరు.
- 4) నూతన యెరూషలేము - ఇక్కడ పెండ్లికుమార్తె సంఘము ఉండును. అనగా ప్రభువుయొక్క రెండవ రాకడలో ఎత్తబడు వారుండు స్థలము. అనగా ఆరోహణ సంఘము భూమిమీదనున్న యెరూషలేముయొక్క పేరు దీనికి ఇయ్యబడెను. ఇది మహామహోన్నతుని నివాసము. ప్రక. 21:2 9-21.
- 5) రక్షితుల మోక్షము - రక్షింపబడినవారుండు స్థలము. రాకడ తర్వాత ఏడేండ్ల శ్రమలలో రక్షింపబడినవారు కూడ ఇక్కడ నుందురు. 1కొరింథి. 3:15; ప్రక. 7:4,9; 12:14 14:1
- 6) పరదైసు - మారుమనసుపొంది మృతులైనవారియొక్క ఆత్మలు ఉండు స్థలము. లూకా. 23:43; ప్రకటన 2:7.
- 7) అబ్రాహాము రొమ్ము (లూకా. 16:23) నీతిమంతుడైన లాజరు చనిపోయిన తర్వాత అబ్రాహాము రొమ్మున ఆనుకొనియుండెనని ప్రభువు చెప్పెను.
- 2. వాయుమండల లోకము:- సాతాను, లోకము, దేవుని విరోధించిన సైతానుగా మారినందున తన జట్టులతోబాటు ఇక్కడకు వచ్చివేయవలసి వచ్చెను. సాతానును, అతని దూతలును ఇక్కడ నుందురు. ఎఫెసె. 6:12,13; ప్రక. 12:10.
- 3. భూలోకము:- మనమున్నలోకము మానవుని రక్షణకొరకై “రక్షణ మహాసంకల్పన” దేవుడేర్చరచెను. మానవుని రక్షణకొరకు దేవుడు ఏమిచేసినది వరుసగా తర్వాత చదువగలరు.
-
4. పాతాళలోకము:-
- 1) హేడెస్సు, భూలోకములో మారుమనస్సు లేకుండ చనిపోయినవారు ఇక్కడ కడవరి తీర్పువరకు ఉందురు. కడవరి తీర్పు కాకముందు ఎవరును నరకములోనికి వెళ్ళరు. మారుటకై ప్రతివారికిని ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు ఏవిధముగానే ఒకవిధముగా దేవుడు సమయమిచ్చును. నశించినదానిని రక్షింపవచ్చిన క్రీస్తు వీరికి గడువియ్యక విడిచిపెట్టునా? 1సమూ. 2:6; 1పేతురు 4:6; కీర్తన 139:8; ఫిలిప్పీ. 2:11.
- 2) చెర : ఇక్కడ సైతాను వెయ్యేండ్లు ఉండును. ప్రక. 21:1-3.
- 3) నరకము : ఇది కడవరి తీర్పు కాలమున కనబడును.