(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
లోక రక్షకుని కథ
ఏదెను వనమునందు ఆదాము అవ్వలకు దేవుడు చేసిన వాగ్ధానము నెరవేర్చుటకై ఒక ప్రత్యేకమైన జనాంగమును దేవుడు ఏర్పాటుచేసికొనెను. ఆ జనాంగమునకే యూదా జనాంగమని పేరు. యూదులు దైవమతభక్తి కలవారు. కొన్నాళ్ళు రాజ్యముకూడ ఏలినవారైయున్నారు. రక్షకుడైన యేసు పాలస్తీనా దేశములో బెత్లేహేము అను గ్రామమునందు యూదులలో ఒక కన్యక గర్భమునందు జన్మించినాడు. తుదకు ఎలాగైతేనేమి ఆ లోకరక్షకుడు భూమి మీద వెలసినాడు. యూదులైనవారు అప్పుడప్పుడు భక్తిలో తప్పిపోవుచున్న వారైయున్నారు. అయినను లోక రక్షకుడు పుట్టగానే ఈ కబురు యూదులలో కొందరికి దేవదూత తెలుపుట వలన తెలిసినది. ఆ కొందరు లోకరక్షకుని దర్శనము చేసికొన్నారు. లోకరక్షకుడు జన్మించినాడన్న వార్త కనబడిన వారికెల్లా ప్రకటించినారు. ఆ లోకరక్షకుడు ఎదిగి మన పిల్లలవలె పెరిగి పెద్దవాడాయెను. బాల్యమునందు తల్లిదండ్రులకు లోబడియుండెను. ఈ లోకరక్షకుడు పెరిగి పెద్దవాడై యవ్వన దశయందు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యమునందు 40 దినములు ఉపవాసము చేసెను. లోకమునకు పాపము తెచ్చిపెట్టిన సైతానును మాయలను గెలువవలెను. ఉపవాసమైన పిమ్మట సాతానుడు ఎదురుపడి శోధించెను. (క్రీస్తుప్రభువు) రక్షకుడైన ఆయన సాతాను మాయలో పడకుండా మొట్ట మొదట సైతానును గెలిచినాడు. సైతానును ఎదిరించి గెలిస్తే అందరిని, అన్నిటిని గెలిచినట్లే. సాతాను మాయలో పడకుండా అతని చేతిలోనుండి మొదట తనను రక్షించుకొంటేనే తప్ప రేపు లోకాన్ని సైతాను చేతిలో నుండి ఎట్లు రక్షించగలడు? అందుచేత అతనిని గెలవడానిని కంటపడ్డాడు.
ఆ లోకరక్షకుడు చేసిన పనులు కొన్ని చెప్పుతాను వినండి. దేవుడు, నరుల తండ్రి. తండ్రి గనుక పాపాత్ములైన నరులు వస్తే చేర్చుకుంటారు. మనిషి తప్పులకుప్ప గనుక దేవుడంటే భయము. లోకమునకు వచ్చిన రక్షకుడు ఆ భయమును తీసివేసాడు. తండ్రి అని చెప్పడంవల్ల ఆ రక్షకుడు, (నరుడు) నరులకు సోదరుడని కూడ బోధించినాడు. ఆ రక్షకుడు పాపాత్ములయొక్క పాపములను క్షమించాడు తన నోటిమాటతో నరులను పీడించు దయ్యాలను వెళ్ళగొట్టినాడు. తన మాటతో జబ్బులను బాగుచేసినాడు. తన మాటతోనే బ్రతుకు చాలించుకొన్న కొందరిని తిరిగి బ్రతికించాడు. తన బోధ వినవచ్చిన ఐదువేల మందికి 5 రొట్టెలు 2 చేపలతో వచ్చిన వారందరికి సరిపడ్డ ఆహారము పెట్టినాడు. తన మాటతో గాలి తుఫానును అణచి వేసినాడు. దోనెలోని శిష్యులు నశించుచున్నామని భయపడి కేకలు వేయగ వారి భయమును తీర్చినాడు. ఆయన మనస్సులోనైన, మాటలోనైన, క్రియలోనైన, కళంకము లేకుండా నడచి చూపించినాడు. మనిషి దేవుడిచ్చిన ఆజ్ఞలు ప్రకారము నడువలేడని మనిషి అంతరంగమందు ఉన్నది. రక్షకుడు ఎంత దేవుడైన ఆయన అచ్చము మనిషిగా జన్మించినాడు గనుక ఆయన మనుష్యుడేగాని దేవుడుకాదు, నడువలేము అనుకున్న మనిషికి ఆజ్ఞల ప్రకారము నడువగలమని నడచి చూపించినాడు. రక్షకుడు మంచితనము కనబరచి ఎంతోమందికి ఉపకారము చేసినాడు. వింతైన పనులు చేసినాడు. ఇట్టి పనులన్నింటిని తిలకించుచున్న యూదులలోని కొందరు నాయకులకు రక్షకునిపై అసూయ కలిగినది. వారు యూదా మతస్థులు గనుక రక్షకుని బోధకును, వారి బోధకును వేర్పాటు కనబడినది. సాధారణ ఎన్నికలేని జనాంగము ఉపకారముల నిమిత్తమై ఆయనను వెంబడించుచుండగా, వేల సంవత్సరముల తరబడి వచ్చుచున్న యూదా మతము అంతరించిపోవునేమో అని యూదా మత ప్రధానులకు ఆందోళన కలిగెను.
యూదా మతాధికారులు ఏదో రీతిగా రక్షకునిపై నేరముమోపి చంపవలెనను పన్నాగము పన్నిరి. అందుచేత ఆయనను గ్రహింపలేని కొందరు దుర్జనులు ఆయనను పట్టుకొని సిలువ కొయ్యకు మేకులతో అంటకొట్టి చంపివేసినారు. చంపిన వారిని ఆయన చంపలేడా? ఆయన దేవుడు, రక్షకుడుగా వచ్చిన దేవుడు మనిషిని చంపుతాడా? సిలువకొయ్యమీద రక్షకుడు మూడు బరువులను మోసినాడు.
- 1. మన పాపముల బరువు
- 2. మన జబ్బుల బరువు.
- 3. మన శిక్షల బరువు.
ఈ మూడింటిని ఆయన సిలువమీద మోసెను గనుక ఇవి మనమీద ఇకలేవు. మనము నమ్మితే ఈ భారములు ఇకమీదట మనమీద ఉండవు. వీటినిబట్టి రానైయున్న ఆ కీడు ఆయనమీదకే వెళ్ళిపోయినది. ఆ కీడు మనమీదనున్న మనము సహించలేము. రక్షకుడు గనుక ఆయన సహించినాడు. ఆయన మనకు రావలసిన కీడు తనమీదనే వేసికొన్నాడు గనుక మనము వాటిని తలంచుకొనడము ఎందుకు? తలంచుకొంటే అవి మనమీదకు వచ్చును. అందువల్ల అవి పోయినవి అని మరచిపోవాలి, మురిసిపోవాలి. ఇందువల్లనే క్రైస్తవులకు సిలువను తలంచుకొనుట ఇష్టము. మన కీడంతయు సిలువమీద వేలాడిన రక్షకునిమీదికి కొట్టుకొనిపోయినదని సంతోషముతో సిలువ కధ తలంచుకొంటారు. విశ్వాసులు క్రైస్తవుల దేవాలయములమీద, సమాధులమీద సిలువగుర్తు వేస్తారు. కొందరు సిలువను మెడలో కట్టుకుంటారు. రాగి సిలువలు, వెండి సిలువలు, బంగారు సిలువలు మెడపై ధరించుకుంటారు. ఇవి చూడగానే ఏమి జ్ఞాపకము వస్తుంది? మనమీద ఉన్న ప్రేమచేత రక్షకుడు ఆ సిలువమీద ఎంత బాధ సహించియున్నాడో జ్ఞాపకమునకు వచ్చును. మనకు రావలసిన కీడు అంతా సిలువమీదనే కొట్టుకొనిపోయినదనే సంగతికూడ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. సిలువమీద వ్రేలాడుచున్న రక్షకుడు ఎంతో బాధపడుచున్నప్పటికిని అక్కడ బాధపడుచున్న ఒక నేరస్తునిచూచి అతనిని రక్షించినాడు. నీ రాజ్యములో నన్న జ్ఞాపకము చేసికొనుమని ప్రార్థించగా ఆ నేరస్థుని తనతో కూడ మోక్షమునకు తీసికొని వెళ్ళెను. శ్రమనొందిన రక్షకుడు సిలువమీద చనిపోగా ఆయన శిష్యులు ఆయనను సిలువమీదనుండి దించి ఆయనను సమాధి చేసినారు. ఆయన చనిపోవుట ఎవరి నిమిత్తము? అందరి నిమిత్తమే. మనమీద నున్న శిక్షభారము తీసివేసే నిమిత్తమే. ఆయన భూమిమీద జన్మించడము ఎవరి నిమిత్తము, బోధచేయడము ఎవరి నిమిత్తము, అద్భుతములు చేయడము ఎవరి నిమిత్తము, పగవారివద్ద నిందలు పాలుకావడము ఎవరి నిమిత్తము, సిలువమీదబాధపడడము ఎవరి నిమిత్తము, చావుకు సమ్మతించడము ఎవరి నిమిత్తము, దిక్కులేనిచావు చావడము ఎవరి నిమిత్తము, భూస్థాపన కావడము ఎవరి నిమిత్తము ఇవన్నియు మన నిమిత్తమే. మన మూలముననే గనుక మనము ఆ రక్షకునికి దండము పెట్టవలెను. మా కీడంతా నీవే మోసుకొన్నావు తండ్రీ అని కీర్తన పాడవలెను. ఇంత ప్రేమ చూపిన ఆయనకు ఏమి పేరు పెట్టుదము. రక్షకుడనే పేరు పెడతాము అదే ఆయనకు తగిన పేరు. మనలను రక్షించే పనిమీద ఏర్పాటై వచ్చి ఇంతగొప్ప పని చేసినాడు గనుక రక్షకుడని పేరుతో పిలవడము బాగుగా ఉంటుంది. గనుక రక్షకుని కథ గ్రీకు భాషలో వ్రాసిన వారు యేసుక్రీస్తు అను పేరును వాడినాడు. వారి భాషలో యేసుక్రీస్తు అనగా నియమిత రక్షకుడని అర్ధము. నియమిత రక్షకుడు అనగా రక్షించుటకు ఉన్న రక్షకుడని అర్ధము. ఈయన ఒక్కడే ఈయన దేవుడే మన నిమిత్తమై నరుడైనాడు. ఆయన కధనుబట్టి ఈ విషయమును తెలిసికొనవచ్చును.
పల్లవి : రక్షకా నా వందనాలు - శ్రీ రక్షకా నా వందనాలు
1. పాప భారమెల్లమోసి - బరువు దించివేసినావు ॥రక్షకా॥
2. వ్యాధి భారమెల్లమోసి - వ్యాధి దించివేసినావు ॥రక్షకా॥
3. శిక్షభారమెల్లమోసి - శిక్షదించి వేసినావు ॥రక్షకా॥
4. మరణ మొంది మరణభీతి - మరలకుండ జేసినావు ॥రక్షకా॥
5. నరకము తప్పించి మోక్ష-పురము సిద్ధపరచినావు ॥రక్షకా॥
6. నేను చేయలేని వన్ని - నీవె చేసి పెట్టినావు ॥రక్షకా॥
7. యేసుక్రీస్తు ప్రభువ నిన్ను-యేమని స్తుతింపగలను ॥రక్షకా॥
ఇంకా ఈయన కధ వినండి. ఆయన చనిపోయినాడు గాని ఆయన చనిపోలేదు. మూడవ దినమందు ఆయన సమాధినుండి బయటకు వచ్చివేసినాడు. సమాధిపై పెద్దరాయి దొర్లించి ముద్రవేసినను ఆ ముద్ర ఆయనను ఏమియు చేయలేదు. సాతానుడు లేవకుండ సమాధికి ముద్రవేసిన ఆయన లేచి బయటకు వచ్చినాడు. ఆనాడు నాలుగువేల సంవత్సరాల క్రిందట ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు పండు తినిపించి పాపములో పడవేసిన సాతానుడు రెండవ ఆదాము అయిన రక్షకుని చంపినాడు. కాని మరల తిరిగి బ్రతకకుండ చేయ కలిగినాడా? తాను పాపములో పడవేసిన లోకాన్ని రక్షించడానికి వచ్చినాడనే పగచేత రక్షకుని చంపించినాడుగాని, బ్రతికి రాకుండ చేయగలిగినాడా? దయ్యాలగుంపు రక్షకుని ఏమియు చేయలేకపోయినది. సమాధి దగ్గర కాపు కాసిన బంట్రౌతులు రక్షకుని బయటకు రాకుండా ఆపుచేయ గలిగినారా? సమాధి ఆయనను అణచి వేసిందా మరణము మ్రింగి వేసిందా, మ్రింగి వేయలేదు మూడు రోజులు సమాధిలో నున్న శరీరము కుళ్ళు పట్టిందా ఆది నుండి ఆయనను కుమ్మరములోనికి దింపవలెనని వెంటాడిన పాపములు తరుముకొని వెళ్ళినావా? కుట్ర ఆలోచన చేసిన పగవారు పారిపోతున్నావని అడ్డుతగిలినారా? పాతాళలోకము ఆయనను పోనీయ్యకుము అని అన్నదా? ఇన్ని ఏండ్లనుండి ఆయనమీదకి ఎదురు తిరిగిన చీకటి రాజ్యము ఆయనను ఏమైన చేయకల్గినదా? క్రీస్తే భూలోక శత్రువులను, భూగర్భ సమాధి పాతాళలోకమును, దయ్యాలను, జబ్బులను, అన్నింటిని గెలిచినాడు. గనుక ఈయన మనలను రక్షించగలడు. బ్రతికించగలడు. తరువాత ఏమి జరిగినదో వినండి.
జయము కీర్తనలు - జయ శబ్దముతో రయముగ పాడండి - జయము జయమాయెనులెండి - జయమే క్రీస్తుని చరిత్ర యంతట - జయమే మరణమున - గూడ జయమే నిత్యమును సద్విలాస్ ॥జయము॥
1. యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన యెల్ల వారికౌను - వేడిన యెల్లవారికౌను - నమ్మిన యెల్ల వారికౌను = యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము - జయమని వ్రాసికొన్న జయము సద్విలాస్ ॥జయము॥
2. జయము రాకపూర్వంబే - జయమను జనులకు జయమౌను - స్తుతించు జనులకు జయమౌను - స్మరించు జనులకు జయమౌను - ప్రకటించు జనులకు జయమౌను - జయము జయమని - కలవరించిన జయమే బ్రతుకెల్ల ఇక నప జయ పదమేకల్ల సద్విలాస్ ॥జయము॥
రక్షకుడు మరణమొంది తిరిగి లేచిన పిమ్మట ఈ భూమిమీద నలుబది దినములు ఉండి శిష్యులైన వారికి కనబడి వారికి చెప్పవలసిన మాటలన్నియు చెప్పి వారిని ధైర్యపరచి పరలోకమునకు వెళ్ళినాడు. ఆయన ఈ భూమిమీద ఉన్నప్పుడు మూడు మాటలు చెప్పినాడు. ఆ మాటలుకూడ వినండి.
మొదటి మాట:- శిష్యులను ఉద్దేశించి సర్వసృష్టికి సర్వలోకమంతా తిరిగి నా సంగతులు అందరికి చెప్పమని నన్ను నమ్మినవారికి బాప్తీస్మము ఇచ్చి నా శిష్యులనుగా చేయండి. నమ్మనివారికి శిక్షవిధింపబడును. బాప్తీస్మము పొందడము అనగా రక్షకునికి శిష్యులు కావడము. ఆయన మతములోనికి రావడము.
రెండవ మాట:- అయితే నేను వెళ్ళి తండ్రి వాగ్ధానము చేసిన ప్రకారము పరిశుద్దాత్మను మీ మీదకు పంపించెదను. అంతవరకు యెరూషలేములో నిలిచియుండి కనిపెట్టండి అని చెప్పెను.
మూడవ మాట:- నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేనియెడల చెప్పుదును. నేను ఉండులాగున మీరును ఉండునట్లు మిమ్మును మరలావచ్చి తీసికొని వెళ్ళుదును. ఈ మూడు మాటలు రక్షకుడు తెలియపరచెను.