(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
వెయ్యేండ్ల పరిపాలన కథ
ఇప్పుడు ఇప్పుడు ఇంకొక కథ చెప్పెదను వినండి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వచ్చినది గనుక క్రొత్త కథ రావద్దా? నేను చెప్పవద్దా? మీరు వినవద్దా? క్రొత్త ఆకాశము అనగా ఇదివరకున్న ఆకాశమే గాని వెయ్యేండ్ల పరిపాలనా కాలమందు మార్పుచెందును.
క్రీస్తు ప్రభువుతో మేఘములో మొదటిసారి వెళ్ళిన విశ్వాసులైన వారు ఈ భూమిమీదకు మరలా తిరిగి వచ్చెదరు. వారు భూలోకమంతటిని పరిపాలించెదరు. లోకమంతటా తిరిగి అన్ని భాషలు మాట్లాడు ప్రజలకు క్రీస్తును గూర్చి బోధించెదరు. మరి ఎక్కడికి వెళ్ళిన ఆ భాషతో నేర్చుకొనకుండనే బోధించెదరు. మహిమ శరీరముతో వచ్చెదరు. గనుక ఎక్కడబడితే అక్కడికి ఎగిరి వెళ్ళగలరు.
మన కాలములో ఉన్న బోధకులు క్రీస్తునుగూర్చి పూర్తిగా నేర్చుకొనలేరు. నేర్చుకొన్నది పూర్తిగా అందరకు చెప్పడములేదు. అందుకొన్నది అందించుట కూడలేదు. యేసుక్రీస్తు వారివలె అద్భుత కార్యములు చేయడములేదు. నేటి క్రైస్తవ బోధకులు చేసేపని అంతయు అసంపూర్ణము. వారు ప్రకటించినది బహు తక్కువే.
అప్పుడైతే పరలోకమునుండి దిగివచ్చినవారు సంపూర్ణ సేవ చేయుదురు. ఇప్పుడు సేవచేయుటకు అన్ని ఆటంకములే. అప్పుడు ఆటంకాలు ఏమియు ఉండవు. ఒకవేళ ఉన్నవారు ఆటంకములన్నింటిని తొలగించుకొందురు.
ఆ కాలమందు ఇంకొక పని జరుగును. అదేమిటంటే దైవారాధన అనగా దేవునిని పూజించుట. అద్భుతకరమైన పూజ. ఈ పూజ చూచుటకు లోకమందు అంతటా ఉన్న అన్ని దేశములలోనివారు ప్రధాన పట్టణమైన యెరూషలేమునకు వెళ్ళుదురు. ప్రయాణ సాధనము వారికి చాలా సుళువు. గాలి ఓడలు ఎక్కకుండానే సుళువుగా యెరూషలేము పట్టణమునకు ఎగిరి వెళ్ళిపోవుదురు మరియు ఆ కాలమందు ఇప్పటివలె పాపము చేయించేవారు ఉండరు, గనుక ఇప్పుడు జరుగుచున్నట్లు పాపక్రియలు జరుగవు.
దెబ్బలాటలు, యుద్దాలు ఉండవు. కత్తులు, తుపాకులు ఉండవు. అందరు సమాధానముగానే ఉందురు. మనుష్యులు వందలాది ఏండ్లు బ్రతుకుదురు. చావులు బహు అరుదు, ప్రజలు విస్తరించిపోదురు. ఇంకను భూమి మహాసమృద్ధిగా పండును. పంటకు పురుగు పట్టదు, అడవి జంతువులు, ప్రజల మధ్య, వీధులలో తిరుగును. భూలోక ప్రజలను ఏమియు చేయవు. మచ్చికగానే యుండును.
భూమిమీద ప్రజలు వెయ్యేండ్లు సుఖముగా జీవించెదరు. ఎందుకంటే ఈ రాజ్యము క్రీస్తుది గనుక అందరు సుఖముగా జీవించెదరు. ఈ కథ ముగిసిపోయినది.