(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

సలాము కథ



సలాము అంటే సమాధానము, శాంతి, క్షేమము అని అర్ధము. సలాము అని అంటే మీకు క్షేమము కలుగునుగాక అని మర్యాద చేసేమాట. దేవుడే యేసుక్రీస్తై భూమిమీద వెలసినాడు. యేసుక్రీస్తు భూలోకములోనికి వచ్చి అనేక బోధలుచేసేనాడు. సిలువమ్రానుమీద మన పాపభారమంతయు ఎత్తుకున్నాడు. సమాధిలోనుండి బ్రతికి తిరిగి లేచినాడు. దేవుడు యేసుక్రీస్తైయుండి మోక్షలోవకములోనికి వెళ్ళినాడు. దేవుడే యేసుక్రీస్తుగా నుండి, సర్వలోకములో తన మతము అనగా క్రైస్తవమతము వ్యాపింపచేసెను. దేవుడే యేసుక్రీస్తుగా వచ్చి భక్తులను మోక్షమునకు తీసికొనివెళ్ళును. దేవుడే యేసుక్రీస్తుగా వచ్చి నరులను పాపములో పడవేసిన సైతానును, దయ్యములను నరకాగ్నిలో పడవేయును. నమ్మనివారిని గూడ అందులో పడవేయును. దేవుడే యేసుక్రీస్తుగా వచ్చి, మారిన భూమిమీద వెయ్యేండ్లు శాంతిపాలన చేయును. దేవుడే యేసుక్రీస్తుగావచ్చి ఈ లోకములో, పరలోకములో ఏక రక్షకుడుగా తన్నుతాను బాగుగా బయలుపరచుకొనును. ఈ కథ అంతయు ఇప్పుడు నేను మీకు చెప్పకపోతే రేపు ప్రొద్దుట మీరు మమ్ములను ఏమంటారో? ఎందుకు మీరు మాకు చెప్పలేదని అంటారు. గనుక ఇప్పుడే ఈ కథ అంతయు చెప్పివేసినాను. ఇది నిజమో కాదో మీరు మీ ఇంటిలో మోకాళ్ళు ఊని దేవునిని ప్రార్థించి తెలుసుకొనండి. దేవుని ప్రార్ధించి తెలిసికొనకుండగా ఈ బోధ తప్పు అని మీరు అంటే ఆ పూచీమీదే. దేవుని ఎదుట మీరే జవాబుదారులు అగుదురు.


సీ॥ మనకు సర్వంబు చేసిన తండ్రి ప్రతిరోజు ఏమి కావలసిన ఇచ్చుగాక - నరులను రక్షింప - నరుడైవచ్చిన క్రీస్తుదేవుండు రక్షించుగాక - దైవ కథలకు నర్ధమునేర్పు దైవాత్మచిక్కు మర్మాలు విడచెప్పుగాక మనకు కావలియుండు తనగోరు దూతలెవ్వరు గండము తప్పించు గాక - తోడినరుల స్నేహము - సమకూడు గాక - పనులలో పశువులతోడు - వనరు గాక - అన్నిటికి అన్ని సమయాన - కమరు గాక - ఎల్లవేళల బ్రతుకు వర్ధిల్లుగాక.


(చాయ: మంగళమే - యేసునకు)


మంగళ స్తోత్రార్పణలు - మహనీయ దేవునికి - అంగున్న లేకున్న అంతములేని స్తుతులు మంగళార్చ ॥మంగళ॥


1. ఎట్టివారినైన - ఏ స్థలమునందైన - పట్టి రక్షించుటకై - పాట్లొందు తండ్రికి మంగళార్చ ॥మంగళ॥


2. యేసుక్రీస్తైవచ్చి - యిల మానవుల మధ్య - వాసంబుజేసిన పరమ దేవునికి మంగళార్చ ॥మంగళ॥


3. నరులకు తండ్రిగా - వరరక్షపుత్రుడుగా - పరిశుద్దాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ ॥మంగళ॥


ఓ ప్రియులారా! పుణ్యకథలు విన్న స్నేహితులారా! మిమ్ములను, మీ పిల్లలను, మీ స్వజనులను యేసుక్రీస్తువారు దీవించునుగాక! మీరందరు శుభోజయముగా వర్ధిల్లుదురుగాక! మీకందరకు పాడిపంటలు లభించునుగాక! సుఖము, సత్యము అనుగ్రహించే జ్ఞానము, దైవశక్తి, తుదకు మోక్షము లభించునుగాక! మీకందరకు మా హృదయపూర్వక వందనాలు, మీకందరకు మా ప్రేమ సలాములు.