(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సైతాను విడుదల కథ
ఆ తరువాత యేసుక్రీస్తువారు చెరసాల తాళముతీసి సాతానును వదలిపెట్టును. అప్పుడు వాడు రౌద్రాకారముతో భూమిమీదకు వచ్చి దేవునితో యుద్ధము చేయవలెనని పటాలమును పోగుచేయును. వెయ్యేండ్ల పరిపాలనా కాలములో ఎంత బోధ విన్నను వారిలో కొందరు మారకుండగనే యుందురు. పాపముచేయించే వారు లేకపోయినను హృదయములో పాపనైజము ఉండును. ఆ నైజము తీసివేసికొంటేనే తప్ప మనిషి దేవునివైపు తిరుగడు. అటువంటి వారినందరిని సాతానుడు తన పటాలములో చేర్చుకుంటాడు. సాతాను పక్షముగా ఇటువంటివారు కొందరు ఉన్నారు. గనుక భూమిమీదకు వచ్చుటకు సాతానునకు దేవుడు సెలవిచ్చెను. లేనియెడల సెలవు ఇవ్వనే ఇవ్వరు. భూమి పుట్టిన 40 వందల ఏండ్లకు రక్షకుడైన ప్రభువు వచ్చెను. ఆయన వచ్చి మన కాలము నాటికి 20 వందల ఏండ్లు అయినది. మొత్తము ప్రభువునకు ముందుగాని, ప్రభువునకు వెనుకగాని అరవైవందల ఏండ్లు అయినది. ఇన్నాళ్ళు సైతానుడు మనుష్యులను మోసముచేయుచునే వచ్చెను. ఆ మోసము చాలక మనుష్యులు ఉన్న భూమిమీదకు దేవుడు వానిని విడచివచ్చెను.
వెయ్యేండ్ల బోధయొక్క కాంతిని, యెరూషలేములోని దైవారాదన కాంతిని, కొందరు చూడలేక మూలమూలకు వెళ్ళుదురు. వారు చీకటి సంబంధులు, సాతాను స్వాధీనమందు ఉన్నవారు గనుక వారికి మార్పురాదు. వారినిబట్టి దేవుడు సైతానునకు భూమిమీదకు వచ్చుటకు సెలవు ఇవ్వవలసి వచ్చినది. భూమిమీద అనగా లోకమంతటిలో ఉన్న మనుష్యులందరు సైతానును అతని జట్టులో ఉన్న దయ్యములను అన్నింటిని బంధించి వేయుమని పట్టుదలగల ప్రార్ధన చేసిన దేవుడు వానిని, వాని సైన్యమును ఒక్క నిమిషములోనే బంధించి వేయును. గాని మనుష్యులు అట్లు ప్రార్ధనచేయగలరా? దేవుని పూజించవద్దు, పెద్దలకు లోబడవద్దు, మీ పగవాళ్ళను చంపండి, వ్యభిచార క్రియలు చేయండి, వారిమీద, వీరిమీద లేనిపోనివి కల్పించండి, అబద్ధసాక్ష్యములు పలుకండి అని ఇలాంటి తలంపులు సైతానుడు పుట్టించుటనుబట్టి వాటిని అంగీకరించు చున్నారు. ఆ ప్రకారముగా చేయుచున్నారు. వారు సాతానును కొట్టులో పెట్టి బంధించమని దేవునిని ఎట్లు ప్రార్ధించగలరు? సైతాను మాట విన్నందువల్ల లోకములోనికి పాపము వచ్చినది.
పాపమువల్ల ముళ్ళు, కుట్రలు, నష్టములు, కరువులు, కాటకాలు, విషపురుగులు, జబ్బులు, భూకంపములు ఇతర పాపాలు వచ్చినవి. నరుడు దేవునికి ప్రార్ధన చేసికొని పాపాలు లేకుండ చేసికొనవలసినది గాని లేకుండ చేసికొన్నాడా? ఉన్నకొలది పాపములు ఇంకా వృద్ధి అగుచునే ఉన్నవి.
పాపమువల్లనేకదా నరకము, పాపమువల్లనేకదా మరణము, వీటన్నిటికి మూల కారణము సాతానుడేకదా. సైతానుడి మాటలు మనిషి ఎందుకు వినాలి చెప్పండి? సైతాను వెయ్యేండ్లు ఖైదులో ఉన్నాడు కదా మారినాడా? మారలేదు. మారియుంటే దేవునితో యుద్ధము చేయుటకు పటాలమును ఎందుకు పోగుచేస్తాడు? దేవుని చూసి మహాప్రభూ! లోకానికి నేను తెచ్చిపెట్టిన కుమ్మరమే ఇది అంతా, నన్ను క్షమించండి అని అడిగితే దేవుడు క్షమించడా? ఆయన క్షమించగలడు.
దేవుడు ప్రేమాస్వరూపి, జాలిగలవాడు, ఎవరును నశించుటకు ఆయనకు ఇష్టములేదు సాతానుడు ప్రార్థించడు, అతనికి మారుమనస్సురాదు, వెయ్యేండ్ల పిమ్మట విడుదల చేసిన తరువాత యుద్ధములో ఓడిపోవును. అతని పటాలాన్ని అగ్ని దహించివేయును. అతనిని, అతని సైన్యమును యేసుప్రభువు అగ్ని గుండములో పడవేయును. అంతటితో అతని కథ సమాప్తి.