(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
హర్మగెద్దోను కథ
ఇంకొక కథ చెపుతాను వినండి. ఇది హర్మగెద్దోనుయుద్ధము గురించిన కథ. ఏడేండ్ల మహాశ్రమ అయిపోయిన పిమ్మట అంతెక్రీస్తు. యేసుక్రీస్తుతో యుద్ధము చేయుటకు భూమి అన్ని ప్రక్కలనుండి ఒక పటాలమును పోగుచేయును. ఆ పోగైన పటాలాలన్నీ పాలస్తీనా దేశము వెళ్ళును. ఆ దేశములో యెరూషలేమునకు ఉత్తరమున మెగిద్దో అను ఒక స్థలమున్నది. అక్కడ ఈ యుద్ధము జరుగును. ఆ హర్మగెద్దోను గూర్చి ఒక విచిత్రము ఏమిటంటే ఇప్పటికి అది ఖాళీగానే కనబడుచున్నది. మీరు వెళ్ళి చూసిన మీకు తెలియును. ఆ స్థలముచుట్టూ పొలములు చేసేవారు, తోటలు వేసికొనేవారు ఉన్నారు. ఆ స్థలముచుట్టూ, చుట్టూ ఉంటున్నారు గాని ఆ స్థలములోనికి వెళ్ళడములేదు. ఆ స్థలములో యుద్ధము జరుగును గనుక దేవుడే ఆ స్థములోనికి ఎవరిని వెళ్ళనివ్వడములేదు. ఈ సంగతి అక్కడ ఉన్న నివాసులకు తెలియదు. ఇప్పుడు మనము అనుకొంటూ ఉన్నది ప్రపంచ యుద్దముకాదు.
నేటి దినాలలో ఒకవేళ ప్రపంచ యుద్ధమే అయితే రాజులకు, రాజులకును; దేశ, దేశములకు జరుగును గాని హర్మగెద్దోను యుద్ధము క్రీస్తుకును, అంతెక్రీస్తునకును జరిగే యుద్ధమైయున్నది. ఆ దేశములో భక్తులు ఉందురు. వారు చాలా భయపడిపోదురు. క్రీస్తుప్రభువును ప్రార్ధించెదరు. అప్పుడు గొప్ప భూకంపము కలుగును. ఆ భూకంపమునకు ఒక పెద్ద స్థలము ఖాళీ అగును. ఆ భక్తులు ఆ ఖాళీ స్థలములోనికి పారిపోదురు. వారిని తరుముకొని అంతెక్రీస్తునకు సంబంధించిన వారు వెళ్ళుదురు. వెంటనే యేసుక్రీస్తువారు పరలోక పటాలముతో దిగి వచ్చెదరు. ఆ పటాలమును చూడగానే భూలోక పటాలములు గజ, గజ వణకిపోవును. యేసుక్రీస్తువారు వారి నోటిమాటయొక్క ప్రభావవాక్కు భూలోక పటాలములన్నింటిని నశింపచేయును. అప్పుడు యేసుక్రీస్తువారు అంతెక్రీస్తును, అతని సహాయకుడైన అబద్ధ ప్రవక్తను, దయ్యాలన్నింటిని పట్టుకొని నరకాగ్ని గుండములో పడవేయును గాని వారి అధికారియగు సాతానును పట్టుకొని పాతాళ లోకములోని చెరసాలలో బంధించివేయును. దానినే మట్టులేని గొయ్యి అని అందురు. సైతాను అక్కడ వెయ్యేండ్లు ఉంటాడు. హర్మగెద్దోను కథ అయిపోయినది. ఇన్నాళ్ళకు భూమి పరిశుభ్రమౌతుంది, పాపము చేయించేవారు ఎవ్వరునులేరు. అందుచేత భూమి శుభ్రముగాను, హాయిగాను ఉండును.