(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
గురుతుల కథ
యేసుక్రీస్తువారు రెండవసారి వస్తానన్నారు అని చెప్పినారుకదా ఆయన రాకడకు ముందు లోకములో కొన్ని గురుతులు జరుగుతాయి అని బైబిలులో నున్నది. ఆ గురుతులు వినండి.
ఎవరైతే నరరూపిగా నున్న యేసుక్రీస్తును చంపినారో ఆ యూదులయొక్క సంతతి వారు దేశదేశములు చెదరిపోయి రెండవ రాకడకు ముందు తమ సొంత దేశము అనగా పాలస్తీనా దేశము చేరుకొందురు అని ఉన్నది. ఇది మన కాలములోనే నెరవేరుచున్నది. వార్తా పత్రికలు చదివిన యూదుల సంగతి బాగుగా తెలియవస్తుంది.
లోకమంతా చాలా గంధరగోళముగా ఉండునని బైబిలులో నున్నది. మన కాలములో ఈ విధముగా ఉన్నది కదా తరచుగా యుద్ధ వదంతులు వినుచున్నాము. పాపము ఎక్కువైపోయినది. పోట్లాటలు, నరహత్యలు, దొంగతనాలు బహు విపరీతముగా జరుగుచున్నవి. కరువులు, భూకంపములు, వరదలు వీటివల్ల ఎందరో నశించిపోతున్నారు. ఒక మతమునకును, ఇంకొక మతమునకును వివాధము కలుగుచున్నది. మతస్థులలో మతస్థులకే తర్కము, ఒక రాజ్యమునకు, మరొక రాజ్యమునకు పొత్తు కుదరటములేదు. ఒక రాజ్యములోనున్న ప్రజలకు కలహములు కలుగుచున్నవి. లోక చరిత్ర అంతా తరిస్తే ఎవరికిని మనస్సులో నెమ్మదిలేదు. ఈ ప్రకారముగా జరుగునని బైబిలులో వ్రాయబడియున్నది. మన కండ్ల ఎదుట ఇవన్నీ జరుగుచున్నవికదా కాబట్టి యేసు ప్రభురాకడ దగ్గర పడినది అని మనమందరము సిద్ధముగా నుండవలసినదే.
ఇంకొక గుర్తు చెబుతాను వినండి. ఇది అందరికి తెలియదు. యేసుక్రీస్తు వారు నరావతార మెత్తక మునుపే ఒక భక్తుడు దేవ దర్శనములో చూసి వ్రాసినారు. అదేమంటే ఆఖరు రోజులలో దేవుడు అన్ని దేశాలలో ఉండే భక్తులమీదను అడిగే వారందరిమీదను తన ఆత్మను ధారబోయుదునని వాగ్ధానము ఇచ్చినారు. ఆ వాగ్ధానము యూదుల మతము గతించిపోయే ఆఖరు రోజులలో నెరవేర్పులోనికి వచ్చినది. దేవుడు చాలామందికి దైవాత్మను ధారపోసినాడు. ఈ ధారబోయడమునకే పరిశుద్ధాత్మ బాప్తీస్మము అని అంటారు. మన రోజులుకూడ ఆఖరి రోజులే ఎందుకంటే క్రైస్తవమతస్తులలో అనేకమంది పరలోకమునకు వెళ్ళిపోదురు. యేసుక్రీస్తువారు మేఘములమీద తీసికొని వెళ్ళిపోదురు. కాబట్టి ఈ దినములలో చాలామందిపై దేవుడు తన పరిశుద్ధ ఆత్మను ధారపోయుచున్నాడు. మీరు క్రైస్తవుల దగ్గరకు వెళ్ళి కనుగొనుడి. దేవుడు దైవాత్మను ధారబోయడము, ఒక్క క్రైస్తవులకే కాదు కోరిన వారందరికిని తన ఆత్మను కుమ్మరించును. చావులెకుండ చేసికొని మేఘము ఎక్కి మోక్షమునకు వెళ్ళగోరు వారందరికి ఈ మాటలు తెలియజేయు చున్నాము. కోరుకొని ప్రార్ధించండి.