మోషే సుఖోపవాస ధ్యానములు -నిర్గమ 1
ప్రార్థన: ప్రభువా! మేము ఏ కష్ట స్థితిలో ఉన్నను, మీ వాగ్ధానమును బట్టి నిత్యము మమ్మును బలపరచి, స్థిరపర్చమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.
పరిచయము
దేవుడు సృష్టించిన భూమ్యాకాశములకు స్వాతంత్ర్యము లేదు, ఆయన చెప్పినట్లు ఇప్పటికీ నడుచుకొనుచున్నవి. దేవుడు మనుష్యుని తన స్వరూపమందు నిర్మించి స్వతంత్రతనిచ్చెను, అయితే దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుస్తూ జనాంగములు దేవుని విడిచి చెడుకార్యములు అభ్యసించుటవలన, జనుల పాపము అధికమగుటవలన ఆయాజనాంగములు కొట్టివేయబడెను. హాము సంతానమైన అమోరీయుల పాపము అధికమాయెను గనుక షేము సంతానమైన ఇశ్రాయెలీయుల చేతికి కానానును అప్పగించు సమయము ఆసన్నమైనది. సృష్టికంటే ఒక జనాంగమును నిర్మించు పని గొప్ప భారమైనది. ప్రభువు వాగ్ధానము(ఆది 9:25-29; 15:16-21) చేసిన జనాంగము ఐగుప్తులో నిర్మించబడి, ఫలించి, అభివృద్ధి పొందినది.కరువువల్ల మొత్తం ఐగుప్తు నాశనమైపోబోతున్న సమయములో దేవుడు యోసేపు ద్వారా ఐగుప్తును రక్షించడమే కాకుండ ప్రపంచం ఎదుర్కొనబోవు కరువు కలిగిన దేశములకు తిను ధాన్యములు సరఫరా చేయగలినంత సమృద్ధిని యోసేపు ఫరో రాజ్యమునకు కల్పించెను. ఐగుప్తు రాజు మరియు దేశప్రజలు విస్తారముగా భోగైశ్వర్యములను పొందిరి కాని యోసేపు తరము గడచిన తర్వాత కనీస కృతజ్ఞత లేకుండా ఇశ్రాయేలు పట్ల కౄరముగా ప్రవర్తించిరి.
అయితే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తునకు భయము కలుగునంతగా ఆశీర్వదించెను. దైవజనుడైన ఒక్క యోసేపు ఐగుప్తును కాపాడడమే కాకుండా ప్రపంచ దేశములు మహా కరువునుండి రక్షింపబడుటకు కారణమైతే అంతమంది దేవుని పిల్లలు ఉండగా మరి దేనికిని భయపడనవసరము లేదు. కాని ఆ ఫరోకు, అతని జనులకు ఒక భయము పట్టినది. ప్రపంచమునకు తలమానికములైన కట్టడములను నిర్మించి ఐగుప్తునకు పేరు తీసుకొనివస్తున్న హెబ్రీయులు దేశము విడిచి పోవుదురేమో అనే అంధోళన రోజురోజుకు ఎక్కువైనది. చివరకు వారి అభివృద్ధిని నాశనము చేయలేక సంతానమును చంపబూనుకొనిరి. ఐగుప్తు ప్రజలు తమకు కలిగిన ఐశ్వర్యముతో ఆనందింపక, ఆంధోళనలో చిక్కుకొనిరి. (వాస్తవానికి ఆనంద సమయములో అనవసర కల్పిత అంధోళన ).
జీవమైయున్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త ఎక్కడకు వ్యాపించినదో అక్కడి జనులు బహుగా ఫలించి, విస్తరించి అభివృద్ధి పొందిరి. ప్రపంచ దేశములలో ప్రభువు శిష్యులు తమ సేవలను అందించి, అనేక జబ్బులను, జాడ్యములను, అంతర్యుద్ధములను నివారించుట ద్వారా ఆయా దేశ జనాభా 15 నుండి 20 రెట్లు అధికమాయెను.
ప్రస్తుతమున్న ప్రపంచమును క్రైస్తవ సంఘము నిర్మించినది. జనులు అధికముగా ఆశీర్వదించబడి అన్నపానములకు కొదువ లేకయున్నది. త్యాగము చేసిన క్రైస్తవ తరము అంతరించి నూతన తరము వచ్చినది. లోకములో కూడ క్రైస్తవ క్రియలను కళ్ళారా చూసినవారు అంతరించి స్వకీయ దురాశల తరము వచ్చినది. దేవునినెరుగని వారు దేవుడిచ్చిన స్వాతంత్య్రమును హరించి సంఘమును పాడుచేయుటకు ప్రయత్నించుచున్నందున లోకము గొప్ప అపాయములో చిక్కుకొనుచున్నది.
సంఘమును నాశనం చేయుట సాతానుకు అసాధ్యమైనది. ప్రతీ విశ్వాసిని దేవుడు సమృద్ధిగా సంరక్షించును. లోకము అంధకారములో ఉన్నను విశ్వాసికి ప్రభువు గొప్ప ఆధరణ దయచేయునని ఈ నిర్గమకాండము వలన తెలియుచున్నది.
సత్యము, ప్రేమ, జీవముల ఉనికిపట్టు ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము, శాంతి, సమాధానములుండును.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +