నిర్గమకాండము 6 - హద్దు, హామీ - లేమి, లెక్క



ప్రార్థన: సర్వశక్తివైయున్న దేవా! మీకు స్తోత్రములు. మీ అనాది సంకల్పములో ప్రణాళికను సిద్ధము చేసిన దేవా! మీకు వందనములు. మీరు ముందుగా సిద్ధపర్చిన వాటిని మా కాలములో మేము అందుకొను కృపను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ఈ అద్యాయంలో

మోషే తన పరిచర్య పరిధికి, తనకు తాను పెట్టుకొనుచున్న "హద్దులు",
దేవుడు మోషేకు ఇచ్చిన "హామీలు",
హెబ్రీయుల శ్రమల వలన, మనోవ్యాకులంచేత కలిగిన "విశ్వాస లేమి",
దేవుని ప్రణాళిక, పరిచర్య కొరకు నిలబడిన విశ్వాసుల "లెక్క" కనబడుచున్నవి.

1. హద్దు: మోషే కొన్ని హద్దులు పెట్టుకొని ఆ పరిధిలో దైవ కార్యము జరుగ వలెనని ఆకాంక్షించు చుండెను. దేవుని మాట యొక్క విలువ మోషేకు తెలిసి వినినట్లుగా, ప్రజలు "మోషే మాటను వినాలి" అనుకోవడం ఒక హద్దు. "మాట మాంద్యము" అనే మరో హద్దు. మోషే తక్షణ క్రియలను కోరుకొనుచుండెను. ఉదా: ఫరోతో మోషే మాట్లాడితే విడుదల కలుగును అనుకొనుట. కాని, ప్రభువు తన దీర్ఘకాల ప్రణాళికను అమలుపరచుచుండెను. ఇక్కడ చూపిన విధముగా మోషే అనేక గుమ్మములను దాటి అనగా, మోషే పలుమార్లు దేవునితోను, ఫరోతోను, హెబ్రీయులను ముఖాముఖిగా కలిసి చర్చించి... రాజులను, ప్రధానులను, అధికారులను, ప్రజలను, అందరిని దైవప్రణాళిక లోనికి నడిపించు బాధ్యత ద్వారా "అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్ధానం" నెరవేరనైయున్నది.
Jocob's ladder
కాబట్టి, సర్వశక్తిమంతుడైన మన ప్రభువునందు మన విశ్వాసమునకు "హద్దులు పెట్టుకొనుట" దేవుని చిత్తము కాదని తెలియుచున్నది. ఓక్కోసారి మనం ఈ జీవన మార్గములో అత్యంత పరాజయం/శ్రమ/నిరాశ గుండా వెళ్ళల్సివచ్చినా గాని, దేవుని హస్తం మనకు తోడుగా ఉండును. దేవుని ప్రణాళికలో మనం ఉన్నంత వరకు చివరికి విజయం మనదే.

2. హామీ: మోషే పెట్టుకున్న హద్ధులను చెరిపివేయుటకు దేవుడు మోషేకు ఒక హామీని దయచేసెను. ఈ వాక్యంలో ఆ హామీని చూడగలం:

"అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను"

నేడు, ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వార మనకు అనేక హామీలు గలవు. కాబట్టి విశ్వాసి నిరీక్షణ కోల్పోరాదు.

3. లేమి: ఇశ్రాయేలీయులు తమకు కలిగిన శ్రమను చూచి మనోవ్యాకులము కలిగి విశ్వాస లేమిలో చిక్కుకొనిరి. ఇశ్రాయేలీయులు దేవునికి బహుగా మొరపెట్టిరి. తీరా దేవుడు తన కార్యమును మొదలుపెట్టిన సమయానికి వారు నిరాశలోనికి వెళ్ళిపోయిరి. ఇది ఒక దురవస్థ. దేవుడు వారి మొరను, శ్రమను లక్ష్యపెట్టెను. తనబలమైన హస్తముతో వారిని విడిపించుటకు పూనుకొనెను. వారి విడుదల భూలోకములో ప్రపంచ రాజ్యములకు ధర్మశాస్త్రములను అందించగల ఘనచరిత్రగా నిలుచునట్లును, ఫరో బలమైన హస్తముతో పంపించు విధముగా దేవుడు మోషేకు హామీని ఇచ్చెను.

ప్రతీ విశ్వాసి తన కష్ట కాలంలో దేవుడు దర్శించు సమయమును గుర్తించు మెళకువ, ఉత్సాహం కలిగి ఉండుట అరోగ్యకరమైన ఐశ్వర్యము.

4. లెక్క: ఇశ్రాయేలీయులలో దేవుని మాట నమ్మి నిలబడినవారు కొందరు మిగిలిరి. వారి లెక్క పేర్లు, వంశములులతోసహా జీవగ్రంధమందు వ్రాయబడినవి. వారికి కలిగిన శ్రమనుబట్టి విచారముగా ఉన్నను, ప్రభువును దర్శించి విన్నవించుట మానుకొనలేదు. ఒక్క మోషేకు ఇప్పుడు అహరోనుతో పాటు అనేక పెద్దలు తోడయిరి. ఇది గొప్ప విజయము.

సంఘము యొక్క కష్టకాలములో విశ్వాసి దైర్యముగా నిలబడిన యెడల, వారి పేర్లు జీవగ్రంధమందు వ్రాయబడును. విశ్వాసి పెండ్లి కుమార్తె లెక్కలోనికి వచ్చును.

విశ్వాసి శ్రమలయందు ఉండవలసిన లక్షణములను ఈ చరణములలో చూడగలం:

ఏకాంత స్థలము కోరుము అను పాటలో

భక్తిపరుల శ్రమలు చూచి - భక్తిహీనులని యనవద్దు = భక్తుల శ్రమలకు ముందు - బహుమానంబు దొరుక గలదు ||ఏకాంత||

"మనోవిచారము కూడదు నీకు.." అను పాటలో

విచారమునకు సబబుగా నుండు - వేర్వేరు కారణములు గలవు = విచారణ చేయుచు నను చూచి - విదిల్చి వేసి సంతోషించుము || మనో ||

మనో నిధానము కలిగి యుండిన - మనవులు సిద్ధముగా సిద్ధించు = మనో విచారము వలన మనవులు - మంటను కలిసి నశియించు || మనో ||

దేవుడు మనకు తోడై ఉండెనను విశ్వాసముతో మహిమతలంపులు గలిగి మనోనిదానముతో ముందుకుసాగు కృప దేవుడు మనకు దయచేయునుగాక! ఆమేన్.




Note: జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 6 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +