నిర్గమకాండము 12 - పస్కా పండుగ స్థాపన


ప్రార్థన: అనాది నుండి అనంతము వరకు సర్వవ్యాప్తివైయున్న దేవా! మీకు వందనములు. నిత్యము మీ సంఘము మీరిచ్చిన గొప్ప విడుదలను మీ రాకడవరకు అనుభవించుచు, మిమ్ములను ఆరాధించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నము తండ్రీ! ఆమేన్.



పస్కాపండుగ ఒక నిత్యమైన కట్టడ.


హెబ్రీయులకు ఇంకను విడుదల కలగక ముందే దేవుడు వారికి పస్కాను బైలు పర్చెను. ఇదే విశ్వాసకార్యము. దేవుడు విశ్వాసమును నాటినపుడు, "జయము రాక పూర్వమే జయమును స్మరించి స్తుతించు జనులకు జయమౌను" అనునది ఇక్కడ చూడగలం.

మొదటినెల 14వ దినము ఇశ్రాయేలీయులకు స్వాతంత్ర్యదినములాంటిది. అది విడుదల దినము, విమోచన దినము, విజయ దినము. ఆజ్ఞ లేకుండా స్వాతంత్ర్యము లేదు. మొదట ఆదామునకు తినవద్దని ఆజ్ఞనిచ్చి స్వాతంత్ర్యమునిచ్చెను. అయితే ఇక్కడ ఇంకను ఆజ్ఞలు ఇవ్వలేదుగాని ఒక కట్టడకు(అభ్యాసము) స్థాపన చేసెను. ప్రధానమైనవి 1. దైవశక్తికి కృతాజ్ఞతాస్తుతిగా పండుగగా ఆచరింపవలెను 2. దైవకాల జ్ఞానము కలిగి జీవించుటకు ప్రతీ యేడాది మొదట నెలలో పస్కాను ఆచరింపవలెను.

ప్రభువే పస్కాగా వచ్చెను కావున యేసుక్రీస్తు నందు చేరి జీవించు ప్రతి విశ్వాసి ప్రభువునందుగల ప్రేమను గుర్తుచేసుకొని, హృదయ శుద్ధి, కంటి శుద్ధి, వంటి శుద్ధి, ఇంటి శుద్ధి కలిగి దైవ తలంపులతో హాయిగా జీవింపవలెను.

పస్కా పండుగ అనాలోచితముగా ఆచరించకూడనిది. దానికి ప్రత్యేకమైన నియమములు గలవు. ఇది కొందరి పండుగ. ప్రభువైన యేసుక్రీస్తు పస్కా బలిగా అర్పించబడినప్పుడు ఇది విశ్వాసుల అందరి పండుగ అయినది.

పస్కా పండుగ ఒకవైపు దైవజనుల రక్షణకు; మరొకవైపు అక్రమము చేయు జ్యేష్టుల దండనకు గుర్తు. అక్రమము చేయువారికి పస్కా గురించి తెలియదు కాని రక్షణలోనికి వచ్చిన వారికి పస్కా నియమములు కలవు.



పస్కా నియమములకు ఈ అద్యాయమును జాగ్రత్తగా ధ్యానించవలసియున్నది.

దేవుని కృప నిరంతరం మనకందరికి తోడై ఉండును గాక! ఆమేన్.



పస్కా నియమముల క్షుప్త వివరణ క్రింద ఇవ్వబడినది. ఆశక్తి గలవారు ధ్యానించండి.

పస్కా నియమములు

ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమును ప్రతిదినము పస్కాగా భుజింపవలెను. వాక్యాధార ఆద్యాత్మిక సృహ కలిగియుండవలెను.
1. నియమిత కాలమున ముందుగా సిద్ధపర్చవలెను = విశ్వాసులు దైవకాల జ్ఞానము కలిగి సంపూర్ణ సమర్పణ కలిగియుండవలెను. శ్రమలో నిలిచి ఉన్నపుడే లోతుగా వాక్యమును హత్తుకొని నింపుకొనవలెను. బుద్ధిగల కన్యకల సిద్దెలలో నూనె సిద్ధపర్చినట్లు, విశ్వాససిద్దె కలిగి ఉండవలెను.
2. ఒకటికి సరిపడు కుటుంబము/సంఘమునకు కూర్చుట = ఒక దైవవాగ్ధాన ఫలమును అనుభవించుటకు తమ కుటుంబసభ్యులను/స్నేహ సమూహమును/సంఘమును సమకూర్చవలెను. దేవునిలోనికి మొదట వచ్చిన వ్యక్తికి(క్రైస్తవ కుటుంబ స్థాపకులు లేదా సంఘ వ్యవస్థాపకులు) వారి తరతరములకు ఒక వాగ్ధానమిచ్చును. తరములు ఆ రక్షణలోనికి వచ్చుటకు కుటుంబములు/సంఘములు సక్యత కలిగి పండుగగా జీవించవలెను
3. నిర్దోషమైనది = విశ్వాస సహిత కార్యములు గాని, భౌతిక ఆశీర్వాదములుగాని దేవుని మహిమార్థమై ఉండవలెను.
4. సాయంకాలమున దానిని చేయవలెను = చీకటి పడకమునుపు, మన జీవితము అంధకారములో కూరుకొనక ముందు, దేవుడు మనకిచ్చిన వాగ్ధానమును పట్టుకొనవలెను
5. పస్కా పశువును చంపి దాని రక్తమును ద్వారబంధముపై హిస్సొపుతో గుర్తుగా వుంచవలెను = ప్రభువు సిలువపై మనకొరకు బలియై అందించిన సత్య వాక్యమును స్వస్థబుద్ధితో తాజాగా తినుటకు ఆయత్తపడవలెను. దేవుడు మన జ్యేష్ట పితరునికి ఇచ్చిన వాగ్ధానములోని జీవమును వెలికితీసి దాని ఫలములు అనుభవించుటకు దానిలో ప్రవేశించుచున్న సహోదరులకు కనపర్చవలెను.
6. ఆ రాత్రియే అగ్నిచేత కాల్చబడిన పొంగని రొట్టెలు తినవలెను = దేవుడు మన అవివేకమును బట్టి అంధకారమునకు అధికారమిచ్చును. అయితే వెలుగులో సిద్ధపర్చిన దానిని వెంటనే భుజింపవలెను. దేవుని వాగ్ధానము లోనికి లోతుగా వెళ్ళగా పరిశుద్ధాత్మ వెలిగింపుతో వచ్చు విశ్వాసమును వెంటనే గట్టిగా పట్టుకొని పులియక ముందే ( దానికి సాతాను ఏ మసాలా కలపకముందే) తినివేయవలెను.
7. తల, కాళ్ళు, ఆంత్రములను ముందుగా అగ్నితో కాల్చివేయవలెను = పరిశుద్ధాత్మ నూతన వెలిగింపును ఇచ్చుచుండగా మునుపున్న ఆలోచనలను, మార్గములను వాటి ఉనికిని తీసిపారవేయవలెను.
8. మిగల్చకుండా తినవలెను = వాగ్ధానమును సంపూర్ణముగా ధ్యానించి పనికి పూనుకొనవలయును, లేదా వదిలివేసినది కాల్చివేయవలెను. అసంపూర్తి పండుగ కాదు.
9. ఒక్క ఇంటిలోనే తినవలెను = మీ ముత్యములను పందుల యెదుట వేయకుడి అని ప్రభువు చెప్పెను. సంఘకార్యములు సంఘములో జరుగుట క్షేమము.

ఇంకను పనికి సిద్ధమైన సైనికునివలే దైవకార్యమును చేయవలెను అనగా మనకు బలమును, సంతోషమును, విడుదలను కలుగజేయు కార్యమును దేవుడు మనకు విశదపర్చినపుడు వెంటనే సంపూర్ణముగా చేయవలెను.

విశ్వాస జీవితమునకు గొప్ప సూత్రమేమనగా, దేవుని ఆనుకొని జీవితమును కొనసాగించుచున్న వారికి ఆయన వాగ్ధాన సహిత కట్టడ(క్రమశిక్షణ)ను తెలియజేయును. "నిత్యమైన" అనునది సంఘములోని విశ్వాసి ఆనందమునకు(పండుగకు) అంతము లేదు అను వాగ్ధానసహితమైనది. అంతమైపోవుచున్నామనుకున్న ఇశ్రాయేలీయులకు ఇది గొప్ప సంతోషకరమైన వార్త. అది ఇప్పుడే ప్రారంబమగుట వారికి నిరీక్షణాధార ఫలము.

ఈ అద్యాయమును సంపూర్ణముగా ధ్యానించుటవలన దేవుడు కలుగజేయు ఆకస్మిక విడుదలకు కావలసిన సిద్ధబాటు మనకు కలుగును. రోటిలో పిండి ఇంక సగము రుబ్బబడకమునుపు తానితోనే ఇశ్రాయేలీయులు బయలుదేరినట్లు దేవుని పిలుపునకు లోబడు మనసు మనకు దయచేయును గాక!

Note: దేవుడు దేవదాసు అయ్యగారికి బైబిలుమిషను కొరకు అతి ప్రాముఖ్యమైన వాగ్ధానములను దయచేసిరి. బైబిలుమిషను మొదటి తరములు అనేక త్యాగములతో విత్తిన ఫలములే నేటి సంఘములు. ఈ కష్ట సమయములో ప్రతీ విశ్వాసి ప్రభువు మనకు సిద్ధపర్చిన "విడుదల"కు సూచనగా పస్కా(హృదయ శుద్ధి కలుగజేయు వాక్య మర్మములు) ధ్యానించి రాబోవు అంధకారకాలములో వెలుగుగా ప్రకాశించుటకు తప్పక సిద్ధపడవలసిన సమయము వచ్చినది.


inner-outer
పైన చూపినట్లు, దేవుడు గాఢాందకార అంతరంగంలో జీవపు వెలుగును విత్తును. తగిన సమయమున ఆ వెలుగు బహిరంగమై చీకటిని తొలగించును.
1. లోక పాపాంధకారమునకు ప్రధాన కేంద్రం ఐగుప్తు, వారిమద్య హెబ్రీయులను ఉంచి వారి అంతరంగములో విడుదలను విత్తెను
2. హెబ్రీయులకు బహిరంగ విడుదల కలిగి ఇశ్రాయేలైనపుడు, వారి అంతరంగములో ప్రభువును స్థాపించెను.
3. ప్రభువు ప్రత్యక్షమై లోకములో ఉన్నపుడు సంఘ వాగ్ధానము అంతరంగములో నున్నది.
4. నేడు లోకములో అంధకారమున్నను, వారిమద్య సంఘమున్నది. సంఘ సత్క్రియలు లోకములో బహిరంగముగా కనబడుచున్నవి.
5. సంఘముయొక్క అంతరంగములో రాకడ విశ్వాసమున్నది. రాకడ విశ్వాసమును బహిరంగముగా కనపర్చుటకు బైబిలుమిషను పాటుపడవలసిన అవసరమున్నది.


శ్రమల మద్య ప్రభువు గొప్ప బహుమానమును దాచి ఉంచును కావున విశ్వాసి ప్రభువును హత్తుకొనవలెను.



జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 12 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter