నిర్గమకాండము 8 - దేవుని వ్రేలు - దైవశక్తి
ప్రార్థన: మహా పరిశుద్ధుడవైన ప్రభువా! మీ రాజ్యములో నివసించుచున్న మేము మీ శక్తిని తెలిసికొను వెలిగింపును దయచేయుము. మాలో నెలకొన్న నైజవిగ్రహములను తొలగించుమని, మీ శక్తితో మమ్మును వేరుపర్చి తెగుళ్ళనుండి రక్షించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
1. ఉపోద్ఘాతము
మోషే పుట్టిన కాలములో ఐగుప్తులో కేవలము "హెబ్రీయులు దేశము విడిచి పోవుదురేమో" అనే భయము మాత్రమే ఉండేది. మోషే తిరిగి ఐగుప్తుకు వచ్చిన సమయానికి ఐగుప్తు పరిస్థితి ఇంకా మారిపోయినది. హెబ్రీయుల అధిక సంపద, సంతానాభివృద్ధిని చూచి, వారి దేవునికి పోటీగా ఐగుప్తీయులలో మూఢభక్తి పెచ్చు పెరిగినది. ఐగుప్తీయులలో సంతానాభివృద్ధి కలుగజేసుకొనుటకు సర్పాకార సూర్యభగవానుడైన సర్పాకారములో ఉండే "వాద్జెత్" మరియు సంతానభివృద్ధి దేవత కప్ప ఆకారములో ఉండే "హెకెత్" లను నైలు నదీ తీరములో విరివిగా కొలిచెడివారు. వాద్జెత్ రాజముద్ర అయితే హెకెత్(కప్ప) సంతాన మాత. ఐగుప్తీయుల అమిత భక్తికి కారణము కేవలము మూఢభక్తి మాత్రమే కాదు గాని, శకునగాండ్రు అవసరమైనపుడు ఆ దేవ(సర్పము) దేవతలను(కప్ప) మంత్రించి సృష్టించి ఇచ్చెడివారు. నైలు నదిలో అద్భుతములు చేయుట ఐగుప్తు శకునగాండ్రకు అలవాటు. అయితే ఆ శకునగాండ్రు భ్రమ/మాయ కల్పితములతో కాక నిజముగా వాటిని దైవశక్తి కాని వేరే దేవతాశక్తితో చేయుచుండెడి వారు.
2. చరిత్ర
అప్పుడున్న ఫరోకు పూర్వం 400 వందల సం.ల క్రితము అబ్రహాము ఐగుప్తునకు వచ్చినపుడు రాజులు దేవునియందు భయముతో అబ్రహామును, శారాను సత్కరించిరి. యోసేపు కాలమువరకు దైవ భయము కలదు కాని ఒక్క జనరేషన్ మారే సరికి "రాజే దేవుడు", మాంత్రికులే దేవతామూర్తులుగా మారిపోయెను. ఫరో అహంకారము "యెహోవా యెవడు"? అనే అంధకార స్థితికి చేరిపోయినది.3. దైవశక్తి
దేవుడు తన మహత్కార్యములను ఐగుప్తీయుల పూజ్యనీయమైన(అనగా సర్పదర్శనం, కప్పదర్శనం) వాటితో ప్రారంభించెను. మొదట ఐగుప్తు మగదేవతయైన వాద్జెత్ ను అహరోను కర్ర మింగివేసినది. పూజ్యనీయమైన కప్పలు విస్తరించుట మొదట వారికి సంతోషకరమైనను చివరికి వాటి విస్తరణ ప్రత్యక్ష తెగులుగా మారినందున ఐగుప్తీయుల చంపకూడని హెకెత్ దేవతామూర్తియైన కప్పలను చంపవలసి వచ్చినది. ఇది దేవుని వ్రేలు అనగా దైవశక్తి అని శకునగాండ్రు ఫరోకు విన్నవించుకొనిరి. దేవుడు తన దైవశక్తిని(దేవుని వ్రేలు) ప్రత్యక్షపరచుట మొదలుపెట్టెను. మోషే ముందు శకునగాండ్రు ఓడిపోయిరి. దేవుడు తన మహిమను కనబరుచుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తు తెగుళ్ళ నుండి వేరుపర్చెను. ఇప్పటి కాలములో లోకము నందు మనము తిరస్కరింపబడిన వారము. కాని, దేవునియందు మనము ప్రత్యేకింపబడిన వారము.దేవతా భక్తుడైన ఫరోకు మోషే అహరోనులు తమ "మాంత్రికులంతటి" వారు అనే నమ్మకము కలిగినది కానీ యెహోవా మీద ఇంకను నమ్మిక ఏర్పడలేదు. అయినను నా కొరకు యెహోవాను వేడుకొనుము అని నామకార్థముగా పలికెను. దేవుని సాక్ష్యము మనమద్య లేదా సంఘములో బలముగా ఉన్నపుడు నామకార్థముగా కాక నిజముగా ధ్యానించి దేవుని హత్తుకొనుట వల్ల దేవుని శక్తి మన జీవితములో పనిచేయును.
మొదట మోషే, ఫరో యెదుట విన్నవించుకొనెను. ఇప్పుడు ఫరో, మోషేను బ్రతిమలాడు స్థితికి చేరెను. రాజులు మాటకు కట్టుబడి జీవించుట రాజనీతి. ఫరో మాటి మాటికి మాట తప్పి రాజహోదాను కోల్పోయెను. మోషే మాట తిరుగులేనిదై దేవుని ప్రణాళికను నెరవేర్చుచున్నది.
బైబిలు శక్తి
1938లో దేవుని వ్రేలుతో గాలిలో "బైబిలు మిషను" అని సువర్ణాక్షరాలతో వ్రాయబడి దేవదాసు అయ్యగారికి ప్రత్యక్షపరచబడెను. బైబిలులో ఉన్న దేవుని శక్తిని చూపించు ప్రత్యేక పనే(mission) - బైబిలుమిషను.దైవకార్యములకు మనుజ శక్తి చాలనపుడు దేవుని శక్తి పనిచేయును.
ఉదాహరణకి, దానియేలు 5:5 లో - మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద వ్రాసిన తర్వాత అహంకారియైన బెల్షస్సరు కొట్టివేయబడెను.
మార్కు 7:33 లో - యేసుక్రీస్తు ప్రభువు పుట్టు చెవిటి, మూగవానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి స్వస్థ పరిచెను.
నీ బలహీనత తట్టు చూడకు - నా బలము తట్టిదిగో చూడుము = నీ బలమునకు మించిన పనులు - నా బలమే గద చేయవలసెను || మనోవిచారము కూడదు నీకు - మహిమ తలంపులె కావలెను||
దేవుడు తన సర్వశక్తితో మనజీవితములో గొప్ప కార్యములు జరిగించును గాక! ఆమేన్.
దేవుడు మనలను ఆయన రాకడ వరకు భద్రపరుచును గాక! ఆమేన్.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +